రష్యా శాస్తవ్రేత్త, వ్యోమగామి యూరీ గగారిన్ ప్రపంచంలోని విజ్ఞానవేత్తల్లో ప్రసిద్ధుడు. బహుశా చంద్రుడిని అతి దగ్గరగా, భూమిని అత్యంత దూరం నుంచి చూసినటువంటి మొట్టమొదటి వ్యోమగామి ఆయనే. భూమికి తిరిగివచ్చి ఆశ్చర్యంతో యూరీ ఒక ప్రకటన చేశాడు. ఆ క్షణంలో భూమి కొంతభాగం సోవియట్ రష్యాగా, కొంతభాగం అమెరికాగా, కొంతభాగం భారత్‌గా, కొంతభాగం చైనాగా కనిపించడం చూసి ఆశ్చర్యపోయానని అన్నాడు. 

చంద్రుడు భూమిలాగా, భూమి చంద్రునిలాగా వెలిగిపోయే అత్యంత ఆశ్చర్యకరమైన ఖగోళ వింత జరుగుతుందని ఆయనకు కూడా తెలియదు. భూమి చంద్రుడి కన్నా 8 రెట్లు పెద్దది. దాని కాంతి కూడా ఎనిమిది రెట్లు ఎక్కువ. ఇదే విషయాన్ని మాస్కోలో జరిగిన ఓ సమావేశంలో ఆయన వివరిస్తూ ‘చంద్రుడిని చూశాక నా మనసులో కలిగిన మొదటి భావం- నన్ను క్షమించాలి. నేను రష్యన్‌ని అన్న విషయం పూర్తిగా మర్చిపోయాను’ అన్నాడు. ఎత్తుకు ఎదిగేకొద్దీ ప్రాంతాలు, సరిహద్దులు, భాషలు మనం గీసుకున్న గీతలు మర్చిపోతాం అనడానికి ఇదొక ఉదాహరణ. 

ఇవే విషయాలను రాజకీయాలకు వర్తింపజేస్తే నరేంద్ర మోదీ ఇపుడు ఈ దేశానికి ప్రధాని. అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అన్నింటికీ ఆయనే ప్రధాని. ఇటీవల ప్రాంతాల పేరుతో, భాషల పేరుతో, ఆత్మాభిమానం పేరుతో, ఉత్తర దక్షిణ భూభాగాల పేరుతో, ఆర్య ద్రావిడ సిద్ధాంతాల పేరుతో మోదీని ఇరుకున పెట్టాలని చూస్తున్నారు. అందులో భాగంగానే కొద్దిరోజుల క్రితం కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు నేతృత్వంలోని తెదేపా, ఇతర భాజపా వ్యతిరేక పార్టీలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.

కొండకు వెంట్రుక వేసి లాగాలని కాంగ్రెస్ తలచింది. వెంట్రుకగా తెలుగుదేశాన్ని వాడుకుంది. తెదేపా సాధించింది శూన్యం. మోదీని గద్దె దింపడం ఏమోగానీ కాంగ్రెస్, టిడిపి, ఇతర ప్రతిపక్షాల వెన్ను విరిగినంత పనైంది. ఇటీవల మోదీ ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారంతో కేంద్రం ప్రతిష్ఠ కొంత మసకబారింది. ఇదే సమయంలో పరోక్షంగా చంద్రబాబు చేసిన మేలువల్ల మోదీ తన ‘ప్రోగ్రెస్ కార్డు’ను దేశం ముందుంచారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బాల్య చాపల్యం ప్రత్యక్షంగా దేశ ప్రజలు వీక్షించారు. ఆయన ప్రసంగం, మోదీని హత్తుకోవడం చూసి కాంగ్రెస్ వాళ్లు మురిసిపోయారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్ కూడా ఆశ్చర్యపోయారు. 

అంతలోనే రాహుల్ జ్యోతిరాదిత్య సింధియాను చూసి కన్నుకొట్టడంతో ఈ ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. చివరకు స్పీకర్ రాహుల్‌ని మందలించాల్సి వచ్చింది.

నిజానికి రాహుల్ ‘ఆలింగనం’ వెనుక ఇంకో దురుద్దేశం ఉందని భాజపా ఢిల్లీ ప్రతినిధి తేజేందర్ పల్‌సింగ్ బగ్గా ఆరోపించారు. ఓ తాంత్రికుడి సలహా మేరకు ప్రధాని కుర్చీని తాకేందుకే రాహుల్ అలా చేశాడని ఆయన ఆరోపించారు. ‘అనుకున్నది ఒక్కటి- అయినది ఒక్కటి’ అన్నట్లుగా మోదీని దోషిగా నిలబెట్టాలనుకున్న ప్రతిపక్షాలు నోరెళ్లపెట్టాల్సి వచ్చింది. ఒకవేళ మోదీ ప్రభుత్వం పడిపోయినా, రాహుల్ బ్యాటింగ్ బాగా చేసినా తెలుగు చానళ్ల వ్యాఖ్యానం ఇంకో లా ఉండేది. అవిశ్వాసం వీగిన వెంటనే ఓ తెలుగు టీవీ చానల్ మోదీని తెదేపా ఎంపీ కేశినేని నాని పచ్చడి చేసాడని చెప్పడం ఎనిమిదో వింత! మోదీ తన ప్రసంగంలో కాంగ్రెస్‌ను కడిగిపారేసాడు. ఏ లక్ష్యంతోనైతే తెదేపా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిందో, ఆ లక్ష్యం నెరవేరకపోగా మోదీ వ్యూహం ఫలించింది.

తెదేపా నుంచి మాట్లాడిన గల్లా జయదేవ్ మంచి ఆంగ్లంలో ప్రసంగం అనర్గళంగా చేసినా, రామ్మోహన్ నాయుడు హిందీలో గుక్క తిప్పుకోకుండా ప్రసంగించినా, చివరన కేశినేని నాని ‘ఐదవ తరగతి ఆంగ్లం’ అందర్నీ ఆశ్చర్యపరచడమే కాకుండా తెదేపా పరువు తీసింది. ప్రధానిని ‘డ్రామా ఆర్టిస్టు’ అనడం వల్ల తెదేపా ప్రతిష్ఠ గంగలో కలిసింది. ఉత్తర భారతం నుంచి అనర్గళంగా పార్లమెంట్‌లో ప్రసంగించగల వక్తలు ఎందరో ఉన్నారు. మోదీని ఆగర్భ శత్రుత్వంతో వ్యతిరేకించేవాళ్ళు ఉన్నారు. ఎవరూ ఇలాంటి అభాసుపాలు అయ్యే ప్రసంగాలను చేయరు. ఇక్కడ కాంగ్రెస్‌ను తెదేపా వాడుకుందా? తెదేపాను కాంగ్రెస్ వాడుకుందా? అనేది ఇప్పటికీ స్పష్టం కాలేదు. 

రాహుల్ అపరిపక్వ మాటలు, మల్లికార్జున ఖర్గే సీరియస్‌నెస్- మోదీపై యుద్ధానికి వచ్చినట్లే ఉంది కానీ దేశం ముందు ప్రధానిని దోషిగా నిలబెట్టలేకపోయారు. కాంగ్రెస్ దాని తోక పార్టీలు మోదీని వ్యక్తిగతంగా విమర్శించాయి కానీ విధానాలపై స్పష్టత ఇవ్వలేదు.

ఎన్డీఏ ప్రభుత్వంలో జరిగిన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు గురించి రాహుల్ ప్రధానంగా ప్రస్తావిస్తూనే- ఫ్రాన్స్ అధ్యక్షుడిని తాను స్వయంగా కలుసుకున్నట్టు యధాలాపంగానే చెప్పారు. అవిశ్వాసానికి ఉన్న ‘తీవ్రత’ను రాహుల్ చెడగొట్టడంపై ప్రతిపక్షాలు పార్లమెంట్ లోపల, బయటా మాట్లాడుకుంటున్నాయి. 

రాహుల్ మోదీపై వేసిన బురదను కడుక్కునేకన్నా ముందే- ఫ్రాన్స్ అధికార కార్యాలయం నుంచి ప్రకటన వెలువడి రాహుల్ పరువు తీసింది. ప్రతిపక్ష హోదాగల పార్టీ అధ్యక్షుడు, భావి ప్రధాని అభ్యర్థిగా భావిస్తున్న వ్యక్తి ఇలాంటి చౌకబారు, ఆధారాలు లేని ప్రకటన చేయడం హాస్యాస్పదం. 

మోదీని, బిజెపిని టార్గెట్‌గా చేసుకుని కాంగ్రెస్ నేతలు ప్రసంగించగా, మిగతా పార్టీల ఎంపీలు తమ తమ ప్రాంతాల్లోని అనేక విషయాలను ప్రస్తావించారే తప్ప- తెదేపాకు మద్దతుగా మాట్లాడిన దాఖలాలు లేవు. తెలంగాణకు చెందిన టిఆర్‌ఎస్ పార్టీ ప్రత్యేక హోదాను వ్యతిరేకించడమే గాక తెలుగుదేశాన్ని సభలో నిలదీసింది. ప్రొద్దున లేచినప్పటినుండి చంద్రబాబు జపించే ఉత్తర, దక్షిణ వివక్ష ఇక్కడ కనిపించకపోగా తెలుగుదేశానికి ఏ దక్షిణ భారతదేశపు పార్టీ కూడా మద్దతు పలకలేదు. 

తమిళనాడులోని అన్నాడిఎంకె గానీ, కర్ణాటకలోని కాంగ్రె స్-జెడియు ప్రభుత్వం కాని, కేరళ కమ్యూనిస్టులు గాని గట్టిగా మద్దతు తెలపలేదు. గుడ్డిగా తెలుగుదేశాన్ని నమ్మి కాంగ్రెస్ పార్టీ ఏపి గురించి మాట్లాడింది కాని తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడదని ఇపు డు టిఆర్‌ఎస్ కొత్త రాగం ఎత్తుకుంది. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఏపిలో కన్నా తెలంగాణలోనే కొంత పరిస్థితి బాగుంది. ఏపిలో కాంగ్రెస్ స్థానాన్ని వైఎస్సార్సీపి భర్తీ చేసింది. అక్కడ ఇపుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ కోలుకోవడం పగటికలే.

ఏపీలో తెదేపా, వైకాపా, భాజపా, జనసేన పార్టీలను దాటుకొని కాంగ్రెస్ ముందడుగు వేయడం అంత సులభమైన విషయం కాదు. చంద్రబాబు నాయుడి మాటలను పట్టుకుని కాంగ్రెస్ చేస్తున్న రాజకీయం ఆత్మహత్యా సదృశమే. తెలంగాణ రాష్ట్ర ప్రకటన సమయంలోనూ ఇలాంటి స్వార్థబుద్ధి కాంగ్రెస్‌ను సర్వనాశనం చేసింది. రెంటికీ చెడ్డ రేవడి చేసింది. 

తెలంగాణలో కాంగ్రెస్ ఇపుడు కాకున్నా 2024లో అయినా అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా ఇలాంటి తప్పిదాలతో తెలంగాణ ప్రజల మనసుల్లో కాంగ్రెస్ మరింత వెనక్కి వెళ్ళే ప్రమాదం ఉంది. 2014 ముందు మోదీ హవాను చూసి చంద్రబాబు అటువైపుజంప్ అయ్యాడు. దీనికి పవన్ కూడా కొంత తోడుకాగా తెదేపా విజయం సాధించింది. 

జగన్‌కు ఎలాంటి ఎజెండా లేకపోవడంతో ప్రత్యేక హోదా అతనికి బ్రహ్మాస్త్రం అయింది. ఈ విషయంలో రాష్ట్ర భాజపా నాయకులు కూడా ఆ రోజుల్లో సరైన అవగాహన లేక ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇస్తూ వచ్చారు. భాజపా కూడా బాబును గుడ్డిగా నమ్మింది. కెసిఆర్‌లా కేంద్రంతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తూ పనులు చేసుకోకుండా ఒక్కసారిగా యుద్ధం ప్రకటించాడు చంద్రబాబు. చంద్రబాబు ప్రభుత్వం రోజువారీ కార్యక్రమాలను వదిలేసి ఫిబ్రవరి నెల నుంచి మోదీని తిట్టడానికి కాలాన్నంతా వెచ్చించింది. 

భాజపా ఎన్నికల వాగ్దానం చేసిందని మొత్తుకుంటున్న తెదేపా తన ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్ని విషయాలను పూర్తిచేసిందో శే్వతపత్రం విడుదల చేయాలని భాజపా నాయకులు మొత్తుకుంటున్నారు. జగన్ ఇచ్చిన ఏపీ బంద్ పిలుపు సక్సెస్ అయింది. మళ్లీ తెదేపా తీరు కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగా అయ్యింది. రాజ్యసభలో చర్చతో మంట పుట్టించాలని చంద్రబాబు భావించాడు. అక్కడ చైర్మన్ వెంకయ్య నాయుడు వైకాపా, తెదేపా నాటకాలను అడ్డుకునే ప్రయత్నం చేశాడు.
ఇంత పెద్ద దేశంలో కేవలం ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగడం వల్ల రేపు అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలు వస్తే కేంద్రం ఎలా ఎదుర్కొంటుంది? 

ప్రతి రాష్ట్రానికీ ఓ ప్రత్యేక అస్తిత్వం, సెంటిమెంట్ ఉంటాయి. అలా ప్రతి రాష్ట్రం అస్తిత్వం పేరుతో గొంతెమ్మ కోర్కెలు కోరడం- వాటికి నెరవేర్చకపోవడం దేశద్రోహంగా భ్రమింపజేయడం ఎంతవరకు సబబు? ఇపుడు తెలుగు చానళ్లకు ఇది తప్ప ఇంకో పనిలేదు. మేధావుల పేరుతో భుజాలపై కండువాలు వేసుకొని కొందరు, తాతల కాలంనాడు సినిమాల్లో నటించినవాళ్లు కొందరు, కులం గజ్జితో పుట్టిన సైకాలజిస్టులు, విశే్లషకులు ఇంకొదరు కలిసి ప్రజల భావోద్వేగాలను రెట్టింపు చేస్తున్నారు. జీవన ప్రమాణం విషయంలో ఉత్తరాది రాష్ట్రాల కన్నా తెలుగు రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. 

నిజానికి తెలంగాణ కన్నా ఆంధ్రా సుభిక్షంగా ఉంది. తెలంగాణలో ఇప్పుడు కూడా గ్రామాల్లో 2 లక్షలకు ఎకరా భూమి దొరుకుతుంది. అదే ఆంధ్రాలో 2 లక్షలకు ఎకరా భూమి దొరకడం కలలోనైనా ఊహించగలమా? ప్రజల్లో అభద్రతా భావం కలిగించే వ్యక్తులు, శక్తులు, పార్టీలు తెలంగాణ ప్రజలను అనుమానంగా చూశారు. ‘ఆంధ్రా ప్రజలు గో బ్యాక్’ అంటారని దుష్ప్రచారం చేశారు. అందుకు భిన్నంగా ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. హైదరాబాద్ కొన్ని ప్రాంతాల్లో ఆంధ్రా ప్రాంత ప్రజలు రాజకీయ నిర్ణాయక శక్తిగా మారారు. దాదాపు పదేళ్లకుపైగా ఇవే శక్తులు, పార్టీలు తమ రాజకీయ ప్రాబల్యం కోసం ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించాయి. మొన్నటికి మొన్న టి.జి.వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత అపరిపక్వంగా ఉన్నాయి?

చంద్రబాబును వెనకేసుకొస్తున్న కొన్ని మీడియా సంస్థలు ఇపుడు అత్యుత్సాహం వీడి, సంయమనం పాటించకపోతే అది ఆంధ్రా అభివృద్ధికి గొడ్డలిపెట్టు అవుతుంది. కేంద్రంతో చంద్రబాబుకు పొసగకపోతే టిఆర్‌ఎస్, బిజూ జనతాదళ్‌లా తమ హక్కుల ప్రకారం వచ్చే వాటాతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయవచ్చు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన నయా రాయ్‌పూర్‌కు కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చింది? ఛత్తీస్‌గఢ్‌కున్న పొటెన్షియాలిటీ తక్కువైనా అది మిగులు విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు అమ్మే స్థితిలో ఉంది. మోదీని దుమ్మెత్తిపోయడానికే వైకాపా, తెదేపా తమ శక్తియుక్తులను వెచ్చిస్తే- పార్లమెంటులో తాజాగా జరిగిన పరాభవమే పునరావృతమవుతుంది. 

రాజకీయ శత్రుత్వం మంచిదే కానీ వ్యక్తులపై ద్వేషం ప్రజాస్వామ్య లక్షణం కాదు. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన వ్యవస్థలను పట్టించుకోకుండా, గత విభజన సూత్రాలను పాటించకుండా, రాజకీయ ప్రయోజనాలను ఆశించి చెప్పిన కుటిల యత్నం ఇంతదాకా తెచ్చింది. ఆపదమొక్కుల్లాంటి హామీలతో, బాధ్యతారహితమైన స్వప్రయోజనాలతో దేశానికి అరిష్టమే. అనవసర వ్యతిరేకతను ప్రదర్శిస్తూ కాంగ్రెస్ ఆటకు తెదేపా పావుగా మారడం ఆత్మహత్యా సదృశం. మోదీని గద్దె దించితే- ప్రధాని పదవికి ఎవరిని తెస్తారు? రాహుల్‌నా? ఇలా చేయడం- గద్దలకు మాంసం వేయడమే!

**********************************
✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి 
📰 ఆంధ్రభూమి : భాస్కర వాణి📰

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి