లంకలోని అశోకవనంలో ఛింతిస్తూ సీతాదేవి కూర్చుంటే రోజూ ఉదయానే్న రావణుడు తన మందీ మార్బలంతో అక్కడికి వచ్చి- ‘నన్ను పెళ్లిచేసుకో’ అని ఆమెను కోరేవాడు. సీత మాత్రం రావణుని వైపు కనె్నత్తి చూడకుండా గడ్డిపరకను ముందు పెట్టుకొని మాట్లాడేది. దీంతో సీతను లొంగదీసుకోలేకపోయానని రావణుడు ఓ రోజు దీనంగా కూర్చున్నాడు. భార్య మండోదరి రావణుడి వద్దకు వచ్చి తానో ఉపాయం చెప్తానని అన్నది. రావణుడు ఆశగా భార్య వైపు చూశాడు. ‘మీకు టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలు తెలుసుకదా! ఈ మహేంద్రజాలంతో ఆమెను లోబరచుకోవచ్చు కదా!’ అన్నది. అవేవీ సీత దగ్గర పనిచేయట్లేదన్నాడు రావణుడు. ‘రాముడి వేషంలో సీత దగ్గరకు వెళ్లవచ్చు కదా!’ అన్నది మండోదరి. ‘ఆ పని కూడా చేశాను. రాముడుండే దేహంలో కాముడుండడం లేదు’’ అన్నాడు రావణబ్రహ్మ.
ఇదీ ఉత్తర భారతదేశంలో ప్రచారంలో వున్న జానపద రామాయణ గాథ. రామాయణం ఖండ ఖండాంతరాల్లో ఎంత దూరం వ్యాపించిందో చెప్పలేం. బహుశా.. రామాయణంపై వచ్చినన్ని పుస్తకాలు ఏ గ్రంథంపై కూడా రాకపోవచ్చు. రామాయణం ‘కల్పవృక్షం’ అని కొందరు రాస్తే, ‘ విషవృక్షం’ అంటూ మరికొందరు ద్వేషం ప్రదర్శించారు. ఈ రెండూ రాముని చుట్టూ తిరిగినవే. మరి ఇప్పుడైనా రాముని గొప్పతనం అర్థమైందా? కాదు! ఎందుకంటే- రామస్వామి నాయకర్ నుండి కత్తి మహేశ్ వరకు అందరూ రాముణ్ణి నిందించి ప్రసిద్ధులైనవారే. కొందరు రాముణ్ణి ఆరాధించి ప్రసిద్ధులైతే ఇంకొందరు రాముణ్ణి తిట్టి పాపులర్ అవుతుంటారు.
దుష్టుల్ని, శిష్టుల్ని అనుగ్రహించే భావన హిందువుల్లో తప్ప ప్రపంచంలో ఇంకెక్కడా కన్పించదు. అందరూ కాళ్లతో నడవడం సహజం. వాళ్లను ఎవరూ పట్టించుకోరు. అదే హైదరాబాద్ కోఠిలో చేతులతో నడవడం మొదలుపెట్టండి. వెంటనే ఆరా తీస్తారు. అది వార్తగా మారుతుంది. దానిపై వ్యాఖ్యానం జరుగుతుంది. మరికొన్ని ఛానళ్లు చర్చ కూడా పెడతాయి. ఇదీ ఇవాల్టి ప్రసార మాధ్యమాల దుస్థితి.
ప్రతివాడూ హిందూ ధర్మాన్ని తిట్టడం, దానికి కులాలను వాడుకోవడం ఇటీవల తెలుగునాట పరిపాటైపోయింది. హిందూమతంలో కులాల అణచివేత జరిగిందని వాదిస్తున్నవారు వెయ్యేళ్లనుండి హిందువులు బానిసలుగా ఉన్నారన్న విషయం విస్మరిస్తున్నారు. కులపరమైన అణచివేతను సంస్కరించడానికి ఈ దేశంలో ఆదిశంకరుని నుండి అంబేడ్కర్ వరకు ఎందరో కృషి చేశారు. మరి మతపరమైన అణచివేతపై ఎందుకు మాట్లాడరు?
ఇటీవల తిట్టడంలో, వ్యతిరేకించడంలో ప్రసిద్ధుడైన కత్తి మహేశ్ అనే సినీ విమర్శకుడు రాముణ్ణి దగుల్బాజీ అనీ, సీత రావణుడితో వుంటే బాగుంటుందని రెండు దుర్మార్గపు వ్యాఖ్యానాలు చేశాడు. ఈ అపర మేధావిని లోకానికి పరిచయం చేసిన ‘ఎర్ర ఛానళ్లు’ తెల్లారేసరికి ఆయన రాజకీయాల్లోకి వస్తాడని కూడా ప్రచారం మొదలుపెట్టాయి. అంటే ఎవరైనా రాముణ్ణి, దేవీ దేవతలను, హిందూమతాన్ని నిందించండి- మీరు వెంటనే పాపులర్ అయి రాజకీయాల్లో చేరవచ్చు అనే సంకేతాలను ఇస్తున్నాయి.
ఇంత జరుగుతున్నా రామతీర్థంలో శ్రీరామనవమికి మ నవడితో పాటు వెళ్లి రామకల్యాణం జరిపించి వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నోరుమెదపడు! పోనీ భద్రాచలంలో జరిగే కల్యాణానికి తానీషా తరఫున తలంబ్రాలు తరలించే వారు కూడా హైదరాబాద్ నడిగడ్డన తెలంగాణలో కుల కల్లోలాలు రేపే వ్యక్తులపై దృష్టి పెట్టడం లేదన్నదే బాధ.
ఇటీవల సోకాల్డ్ మేధావులంతా తెలంగాణ ప్రాంతంలోని ప్రశాంతతను ఓర్వలేక రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. ఒక్కసారి కేసీఆర్ కన్ను తెరిచి ఆగ్రహిస్తే ఈ విపరీత శక్తులకు నూకలు చెల్లినట్లే. అయినా- ఇది కత్తి మహేశ్ వ్యాఖ్యపై చర్చగాదు. హిందూ విశ్వాసాలపై కులం ముసుగులో చేస్తున్న దాడిపైనే చర్చ.
రామాయణాల్లో అన్నింటికీ మూలమైనది వాల్మీకి రామాయణం. ఇది ఎన్ని వంకర్లు తిరిగిందో అన్నట్లుగా పిల్ల రామాయణాలు పుట్టుకొచ్చాయి. ఒక్క తెలుగులోనే భాస్కర, నిర్వచనోత్తర, రంగనాథ, మొల్ల, ఆధ్యాత్మ, ఆనంద, గోపీనాథ, శేష, ఉత్తర, కూచకొండ, సత్యపురి రామాయణాలు ప్రసిద్ధం. పద్యగేయాల్లో, వచనంలో ఎన్ని పిల్ల రామాయణాలు పుట్టుకొచ్చాయో లెక్కపెట్టలేం. వీటిల్లో ఎన్నో కట్టుకథలు, పిట్టకథలు పుట్టుకొచ్చాయి. మూల వాల్మీకి రామాయణంలో లేని ఎన్నో పిట్టకథలు కల్పించబడ్డాయి. అందులో కొన్ని భక్తితో చేరితే మరికొన్ని జానపద శైలిలో ప్రవేశించాయి. వీటి ప్రామాణికతపై తలాతోక లేని వాళ్లంతా విమర్శలు చేస్తున్నారు. రామునిపై ప్రవచనాలు చేసే మహనీయులు ఇలాంటి చర్చలోకి రారు!
దేశంలోని అన్ని భాషల్లో రామాయణాలు ఇలాగే విస్తరించబడ్డాయి. ప్రసిద్ధ భాషలన్నింటిలో అనేక రామాయణాలు కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చాయి. కాలక్రమంలో ఎన్నో అవాల్మీకాలు ఇందులో చేరాయి. అవాల్మీకి రామాయణ అంశాలు విపరీతంగా ప్రచారంలోకి వచ్చి ఇవే రామాయణం అన్నంతగా విస్తరించాయి. కొన్ని అవాల్మీకమైన అంశాలను ప్రస్తావిద్దాం.
గౌతముడి నుండి అహల్యను వేరుచేయడానికి ఇంద్రుడు కోడై కూయడం, అహల్య రాయిగా మారడం, శబరి ఎంగిలిపండ్లను రాముడు తినడం, బాల్యంలో తన కాలు విరిచాడన్న కోపంతో మందర శ్రీరాముడిని వనవాసానికి పంపడం, జంబుమాలి వృత్తాంతం, సులోచన సహగమనం, శంభూక వధ, కాలనేమి కథ, సీతాదేవి ఎత్తిపొడుపులు భరించలేక లక్ష్మణుడు అన్నను వెదకడానికి వెళ్లడం, రావణుడు విభీషణుడిని తన్ని వెళ్లగొట్టడం, లక్ష్మణ దేవర నవ్వు, ఉడతాభక్తి, రావణుడి ముందు హనుమంతుడు తోక పెంచడం, విభీషణుడు రావణగర్భంలోని అమృతభాండం పగులగొట్టడం.. ఇలాంటివి ఎన్నో వాల్మీకి చెప్పనివి లోకంలో ప్రచారానికి వచ్చాయి. వీటిని పట్టుకొని రామాయణం తెలియని వాళ్లంతా కువ్యాఖ్యానం చేయడం, దానిపై టీవీల టీఆర్పీ రేటింగ్‌లు పెంచుకోవడం ఓ సిగ్గుమాలిన చర్య. నిజానికి రామునిపై బాబు గోగినేని అనే హేతువాది తీవ్ర వ్యాఖ్యలు చేసాడు. అతడు అగ్రకులస్థుడు కాబట్టి అతణ్ణి తెలివిగా దీని నుండి తప్పించేందుకు కత్తిని ఓ ఛానల్ ఇరికించింది. దీంతో గోగినేని బాబు సేఫ్ అయి, కత్తి మహేశ్ కథలోకి వచ్చాడు.
రామాయణం ఈ దేశ ప్రజల గుండె చప్పుడు. దీనిని రచించిన వాల్మీకి మహర్షి ఒకప్పుడు వేటగాడు. అంటే ఈనాటి పరిభాషలో అనుసూచిత జాతికి చెందినవాడు. రామాయణం ఆరుకాండల్లో లేని ‘శంభూక వధ’ను పదే పదే ప్రస్తావించేవారు గుహుడు, హనుమ, శబరి, నలుడు, వానరులు, నీలుడు, విభీషణుడు, సుగ్రీవ, జటాయువు, సంపాతి, జాంబవంతుడు మొదలైన వారితో శ్రీరాముని సంబంధాలను గురించి ఎవరూ నోరు మెదపరు.
వీళ్లంతా బ్రాహ్మణులా! ఈనాటి అగ్రకులస్థులా! రాముడు వీళ్లను గొప్పగా ప్రేమించాడు కదా! రాముణ్ణి తిట్టడానికి రామాయణాన్ని ఉపయోగించుకొనే ఈ స్వయం ప్రకటిత మేధావులు పాఠ్యపుస్తకాల్లో రామాయణం పెడితే అది మత గ్రంథం అని వాదిస్తారు. పోనీ రావణుడిని గొప్పగా చెప్తున్నారు కదా! మరి అతడు పూజించిన ఈశ్వరుణ్ణి మీరు ఆరాధిస్తారా? రావణుడు తిరుగుబాటుదారులకు నాయకుడని వాదిస్తున్న కుహనా మేధావులు అతనిలా విభూతి ధరిస్తారా? లింగపూజ చేస్తారా? రావణకృతమైన శివతాండవ స్తోత్రం చదువుతారా? పరధనాపహరణం, పరరాజ్యాపహరణం, పరధారాపహరణం (ఇతరుల భార్యలను ఎత్తుకెళ్లడం) నా ధర్మాలని చెప్పిన రావణుడు మీకు ఆదర్శమా? అసలు రావణుడు ద్రావిడరాజు అని ఎక్కడ రాసి వుంది. రావణుడు నోయిడాలో జన్మిస్తే, మండోదరి మీరట్‌లో పుట్టింది.
కొంతకాలంగా విలన్లను గొప్పవాళ్లుగా చూపే కథలు, నవలలు, సినిమాలు రావడం మన సమాజ వికృత పోకడలకు అద్దం పడుతుంది. మేధావులుగా చలామణి అవుతున్న కొందరు రావణుడు, నరకాసురుడు మా దగ్గరి బంధువులని బీరాలు పలుకుతున్నారు. వీళ్లు మరోవైపు బ్రాహ్మణవాద సిద్ధాంతం వ్యతిరేకిస్తాం అంటారు. మరి రావణుడు బ్రాహ్మణుడు కాదా? ఆయన పేరే రావణబ్రహ్మ. పులస్త్యబ్రహ్మ వంశస్థుడు. బ్రహ్మ-పులస్త్యబ్రహ్మ- విశ్రవసు - రావణబ్రహ్మ ఇదీ వరుస. మరి బ్రహ్మకులంలో పుట్టిన బ్రాహ్మణుడికి ‘ద్రావిడ కమ్యూనిష్టు సెక్యులర్ నాస్తిక హేతువాద అవకాశవాద కుత్సిత’ మేధావులంతా అండగా నిలబడతారా? బ్రహ్మ కుమార్తె పుంజికాదేవిని రావణుడు అవమానిస్తే దానికి బ్రహ్మ ఆగ్రహించి ‘ఇష్టం లేని స్ర్తిని నీవు ముట్టుకుంటే నీ తల వేయి ముక్కలవుతుందని’ శాపం పెడతాడు. అందువల్ల రావణుడు సీతను చెరపట్టలేదు, కాని ఆయనేం కత్తి మహేశ్ చెప్పినట్లు సుద్దపూస కాదు.
సీత తప్ప ఎందరో కన్యలను రావణుడు అపహరించి తన దగ్గర పెట్టుకొన్నాడు. వాళ్లంతా అతని వైభోగానికి లొంగినవాళ్లే. సీత తన భర్త అరణ్యంలో ఉన్నా తన భర్తనే గొప్పగా భావించింది. సీతను బలవంతం చేస్తే తన తల పగులుతుందని ఊరుకున్న రేపిస్ట్ రావణబ్రహ్మ.
అలాంటివాణ్ణి ఈ రోజు అయితే ‘నిర్భయ చట్టం’ క్రింద ఉరితీయాల్సిందే! కథువా రేప్‌ను ప్రపంచానికి డప్పుకొట్టి చాటిన సూడో సెక్యులర్ గ్యాంగ్ మధ్యప్రదేశ్‌లోని మాండసోర్ హిందూ బాలిక అత్యాచారంపై నవరంధ్రాలు మూసుకున్నారు. రావణుని రేపిస్ట్ బుద్ధి విషయంలో కూడా ఇలాగే వౌనం దాల్చేవారేమో! ఎందుకంటే రాక్షసులకు ఓట్లుంటే- రావణుడిని తిడితే ఈ ఓట్లు ఎక్కడ వేయరో అని భయపడుతారేమో!
రాముణ్ణి వ్యతిరేకించడం క్రొత్త కాదు. పెరియార్ రామస్వామి రామాయణ వ్యతిరేకతను 1955లో, 1968లో తీవ్రంగా చేసాడు.
ఆర్య-ద్రావిడ సిద్ధాంతం పేరుతో గ్రుడ్డిగా రామ దూషణ చేయడమే ఇందులో దుర్మార్గం. దాని కొసనే జస్టిస్ పార్టీ అందుకోగా తెలుగు ప్రాంతాల్లో ఈ తోకను పట్టుకొనే కమ్యూనిస్టులు, ఆ తర్వాత సూడో సెక్యులర్ గుంపు చాలా దూరం వెళ్లిపోయారు. ఇటీవల కొన్ని పార్టీలవారు కూడా ఉత్తర- దక్షిణ విభజన గోడలను ఈ సిద్ధాంతంపైనే కడుతున్నారు. వీళ్లకు పశ్చిమ భారతంలో పుట్టిన నరేంద్ర మోదీ నచ్చడు! తూర్పు భారతంలో పుట్టిన జ్యోతిబసు, మమతా బెనర్జీ ముద్దొస్తారు? ఈ విడ్డూరం వెనుక గ్రుడ్డి వ్యతిరేకత, చీప్ పాపులారిటీ తప్ప ఇంకేం లేదు.
తమిళనాడులో రామభక్తుడైన ఓ న్యాయమూర్తి సమక్షంలో నాస్తికుడు ఒకటే రామనింద చేస్తున్నాడట. ఆ జడ్జిగారికి చిర్రెత్తి 10 తలలు, ఇరవై కాళ్లూ చేతులున్న రావణుడే రాముడిని ఏమీ చేయలేకపోయాడు. ‘రెండు చేతులు, రెండు కాళ్లు, ఓ తలకాయతో నీవేం చేస్తావ్‌లే’ అన్నాడట. ఇపుడు
హిందువులూ అలా భక్తితోనే చమత్కారంతోనో సరిపెట్టుకొనే రోజులు పోయాయి. ఎముక లేని నాలుకతో ఏది పడితే అది మాట్లాడితే అది మాట్లాడే వాళ్లకు సమాధానం చెప్పే ‘బజరంగ్ శక్తి’ బజార్లోకి వస్తూనే వున్నది. రామాయణ సంస్కృతిని ధ్వంసం చేయాలనుకునేవారు ఆకాశంలోని సూర్యునిపై ఉమ్మేయడం లాంటిదే. రామసంస్కృతి దశదిశలా వ్యాప్తి చెందింది. కమ్యూనిస్టు దేశమైన రష్యాలో రామాయణ నాట్య ప్రయోగం జరిగింది. ప్రపంచంలోనే అతి పెద్ద ముస్లిం దేశమైన ఇండోనేషియాలో బాలీ ద్వీపంలో రామలీల ఈరోజుకూ జరుగుతుంది. రామగాథ అజరామరం!
*****************************************
డాక్టర్. పి. భాస్కర యోగి
ఆంధ్రభూమి : భాస్కర వాణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి