ఉఫన్యాసం ఒక కళ. కొందరు ఉపన్యాసం పెద్దగా చేయకున్నా సభాసరస్వతులుగా చలామణి అవుతారు. ఇంకొందరు ఏమీ మాట్లాడడం రాదు అంటూ ‘నేను సభాధ్యక్షుణ్ణి’అని గర్వంగా మురిసిపోతారు. కొందరికి సభతో సంబంధం లేకున్నా, ఏమీ మాట్లాడడం రాకున్నా సభావేదికపైకి ఎక్కి తమకు తోచింది చెప్పి తమనుతామే గొప్ప వక్తలుగా భావించుకొని మురిసిపోతుంటారు.
ఉపన్యాసాలు ఇచ్చే వాళ్ళలో ఉపన్యాస అర్జునుడు, ఉపన్యాస భీముడు, ఉపన్యాస కీచకుడు కన్పిస్తుంటారు. ఉపన్యాస అర్జునుడు తనకు ఇచ్చిన విషయాన్ని సమగ్రంగా, ఏకాగ్రంగా చెప్తూ లక్ష్యఛేదన సరిగ్గా చేస్తాడు. ఉపన్యాస భీముడు తనది ఒప్పైనా, తప్పైనా దంచేస్తుంటాడు. కాచుకోవడం శ్రోతలవంతు. ఉపన్యాస కీచకుడు మొదలుపెడితే చాలు అన్నీ దుష్టవాక్కులే. ఇక ఉపన్యాస ఉత్తరుడు అసలు విషయం దగ్గర పారిపోతాడు. ఇలాకాకుండా ఉపన్యాస కృష్ణుడు ఒకరుంటారు. క్షీరనీర న్యాయంగా ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో అద్భుత ప్రణాళికతో చెప్తారు. వారు కలకాలం శ్రోతలకు గుర్తుంటారు. ఓ ముద్ర వేస్తారు.
కేవలం ఉపన్యాసంతో శ్రీమతి ఇందిరాగాంధీ, అటల్‌బిహారీ వాజపేయి, లాల్‌కృష్ణ అద్వానీ, దీనదయాల్ ఉపాధ్యాయ, నందమూరి తారక రామారావులు ప్రముఖ రాజకీయ నాయకులుగా మన్ననలు పొందారు.
ఆధ్యాత్మిక, సామాజిక క్షేత్రాల్లో అనేకమంది గొప్ప వక్తలుగా రాణించారు. ఒక్క ఉపన్యాసంతోనే స్వామి వివేకానంద ప్రపంచ సర్వమత మహాసభల్లో భారతీయత స్థానం నిలిపి, ఈ దేశ ఆధ్యాత్మిక క్షేత్రంలో సుస్థిరస్థానం సంపాదించారు. ఆచార్య రజనీష్ ఉపన్యాసం వింటుంటే కొన్ని లక్షల పుస్తకాల సారాంశం మనకు ఇట్టే అర్థమవుతుంది. ఆనంద్‌మార్గ్ సంస్థను స్థాపించిన శ్రీ ఆనందమూర్తి (ప్రభాత్‌రంజన్ సర్కార్) ఉపన్యాసం విన్న ఎందరో సామాన్యులు ఆనందమార్గ్‌లో సన్యాసులుగా మారిపోయారు. అదీ ఆయన ఉపన్యాస ఆధ్యాత్మిక శక్తి. తీవ్రవాద మార్గాల్లో యువకుల్ని నడిపించే వ్యక్తులు కూడా ఉపన్యాసాల ద్వారానే జనాన్ని ప్రోగుచేస్తుంటారు.
శ్రీమద్రామాయణ, భారత, భాగవతాలు చెప్పడంలో మన రాష్ట్రంలో ఎందరో ఉపన్యాసకులు పేరెన్నికగలవారు. అలాగే సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో ఉపన్యాసాలు చేయగల దిట్టలు ఎందరో ఉన్నారు. శ్రీ దివాకర్ల వేంకటావధాని, శ్రీ భాష్యం అప్పలాచార్య, శ్రీ ఏలూరుపాటి అనంతరామయ్య, శ్రీ జమ్మలమడక మాధవరామశర్మ, శ్రీ జటావల్లభుల పురుషోత్తం, శ్రీ ప్రసాదరాయ కులపతి, శ్రీ ముదిగొండ శివప్రసాద్, శ్రీ మొవ్వ వృషాధ్రిపతి, శ్రీ రాణీ సుబ్బయ్య దీక్షితులు, బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖరశాస్ర్తీ, ఆచార్య శలాక రఘునాథశర్మ, శ్రీ చాగంటి కోటేశ్వరరావు, శ్రీ సామవేదం షణ్ముఖశర్మ, శ్రీ గరికపాటి నరసింహారావు, డా. మైలవరపు శ్రీనివాసరావు, ఆచార్య కసిరెడ్డి, శ్రీ ముళ్లపూడి సూర్యనారాయణమూర్తి, శ్రీ ఓగేటి అచ్యుతరామశాస్ర్తీ, శ్రీ అప్పజోడు వెంకట సుబ్బయ్య, శ్రీ కందాడై రామానుజాచార్య, శ్రీ రాళ్లబండి కవితాప్రసాద్ వంటివారు ఎందరో ఉపన్యాసాలు చేయడంతోనే పేరు తెచ్చుకొన్నవారు. ఇదే విధంగా వేదాంత విషయాలను ద్రాక్షాపాక న్యాయంగా చెప్పే సామర్థ్యం ఉండేది. శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారికి, శ్రీ త్రిదండి చిన్నజీయరుస్వామి చేసిన భగవద్గీతా వ్యాఖ్యానం పరమాద్భుతం. శ్రీ సుందర చైతన్యానందకు ఉపన్యాసమే ఊపిరి. ‘‘జ్ఞానయజ్ఞం’’అనే పేరుతో వారు ముందుకు సాగుతున్నారు.
ఇలా ఉపన్యాసం ఎందరినో వివిధ రంగాల్లో స్థిరంచేసి నిలబెట్టింది. కాబట్టి ఉపన్యాసం ఎలా ఉండాలి? అనే అంశంపై చర్చిద్దాం.
ఉప అనగా సమీపం, న్యాసం అనగా పెట్టడం అని అర్థం. అంటే విషయాన్ని హృదయానికి సమీపంగా పెట్టడం అనేది ఇందులోని భావన. వినే శ్రోత హృదయాన్ని వక్త పసిగట్టాలి. మనస్సును, హృదయాన్ని రంజింపజేయాలి. మన వెంబడి శ్రోతను నడిపించాలి. ఉపన్యాసకుడు తన ఉపన్యాసంలో ప్రస్తావించిన పది అంశాలు ఎలా ఒక దాన్నుండి ఇంకో దాంట్లోకి ప్రవేశించాడో, పూర్తిచేశాడో అర్థం కాకూడదు. అంత సులభంగా శ్రోతను మంత్రముగ్ధుణ్ణి చేయాలి.
పూర్వసంసిద్ధత:
ఉపన్యాసకుడు మొదట ఎక్కడ, ఎలాంటి చోట ప్రసంగం చేయాలో పూర్తి వివరాలు తెలుసుకొని ఉండాలి. దానికి అనుగుణంగా విషయ పరిజ్ఞానం సంపాదించుకోవాలి. వెళ్లాల్సిన తేదీని దినచర్య పుస్తకంలో రాసి పెట్టుకోవాలి. కార్యక్రమ ముఖ్య నిర్వాహకుడి ఫోను నెంబర్ మొ.వి రాసిపెట్టుకోవాలి. వీలైతే కార్యక్రమ కరపత్రం (ఆహ్వానపత్రం) పంపించాలని కోరాలి. కార్యక్రమం జరగాల్సిన చోటుకు వెళ్ళే రవాణా సౌకర్యం, ప్రయాణానికి పట్టే కాలం విచారించి నిర్ణయం చేసి పెట్టుకోవాలి. కార్యక్రమ స్వరూప స్వభావం తెలుసుకోవాలి. వీలైతే కార్యక్రమంలో ఎలాంటి శ్రోతలుంటారో, సభాస్వరూపం తెలుసుకోవాలి. ఉపన్యాసం చేయడానికి ముందు దానికి సంబంధించిన విషయ పరిజ్ఞానం బాగా పెంపొందించుకోవాలి.
ఉదా॥ మహాభారత స్వభావ చిత్రణ అనుకోండి. నేడు సమాజంలో వస్తున్న మార్పులపై అవగాహన కల్గియుండాలి. అందులో మంచి వాటిని ఎలా నిలబెట్టుకోవాలి? చెడ్డవాటిని ఎలా తొలగించుకోవాలి? అనేది రామాయణంతో తులనాత్మకంగా చెప్పగలగాలి. మనిషి ఎలా జీవించాలో తెలిపేది రామాయణం. ఎలా జీవించకూడదో తెలిపేది మహాభారతం. ఈ సత్యం మన ఉదాహరణలో చోటుచేసుకోవాలి.
--ఇంకావుంది...
**********************************************
✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి
ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ
ఉపన్యాసము అందునా భారత రామాయణ ప్రసంగాలకు పెట్టింది పేరు ఉషశ్రీ గారు. మీరు ఆయన పేరు ఎక్కడా ప్రస్తావించలేదు.వ్యాసం మాత్రం చాలా బావుంది
రిప్లయితొలగించండి