భగవంతుడు అన్నిటికీ అధిపతి. సర్వేశ్వరుడు. విడివిడిగా సృష్టిలోని అనేకత్వాన్ని చూసి మనం భ్రాంతిలో పడుతుంటాం. ఆ అనేకత్వంలోని ఏకత్వాన్ని తెలుసుకోలేకపోతాం. సర్వజగన్నియామకుడైన ఆయనను ఆశ్రయించి ఉండడం జీవలక్షణం. దాని నుండి విడివడి జీవించడం వల్లనే మాయ మన వెంటపడుతుంది. పరమాత్మకు మనకు మధ్యనున్న మాయ తెరను తొలగిస్తేనే ఆత్మజ్ఞానం సులభోపాయం అవుతుంది.

యోమాం పశ్యతి సర్వత్రమయి పశ్యతి
తస్యాహం నపుణశ్యామి స చ మే నప్రణశ్యతి

..అని గీతలో కృష్ణుడు బోధించాడు. ‘‘ఎవరు నన్ను సకల భూతాల్లో దర్శిస్తారో సకల భూత సముదాయంలో నన్ను చూస్తున్నారో అలాంటి వారికి, నాకు భేదము లేదు. కాబట్టి వారికి నేను కనబడకుండా ఉండలేను వారు నాకు కనబడకుండా ఉండలేరు’’ అని శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పాడు. జీవుడెప్పుడూ సనాతనంగా ఆయన ఆనంద స్వరూపాన్ని పొందే ఉన్నాడు. మధ్యనున్న అనేక తెరల వల్ల స్వస్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాడంతే. శ్రీమద్రాయణ కథను ఆత్మార్థంలో గ్రహిస్తే- శ్రీరాముడు పరమాత్మ, సీతమ్మ జీవత్మ. రావణుడిది దేహబుద్ధి, హనుమంతుడు సాధన- ప్రాణశక్తి అనుకొందాం. రావణుడనే దేహబుద్ధి జీవాత్మను అపహరించి తన మాయా స్వరూపమైన లంకలో దాచిపెట్టాడు. ప్రాణశక్తి అనే హనుమత్సాధన ద్వారా జీవాత్మ రహస్యం తెలుసుకోబడి.. సకారాత్మక శక్తులుగా చెప్పబడిన వానర మూకలతో కలిసి రావణుడనే దేహబుద్ధిని శ్రీరాముడు లేకుండా చేసాడు.

మరో కోణంలో హనుమంతుడిని గురువుగా కూడా భావించవచ్చు. సీతారాములను ఏకం చేయడమంటే అది యోగమే. ‘జీవాత్మా పరమాత్మా సంయోగే యోగ ఉచ్యతే’ అన్నట్లు పరమాత్మను ఆశ్రయించి ఏకంగా ఉన్న జీవాత్మను తిరిగి ఆయనలో లీనం చేయడమే సాధనా లక్ష్యం. పూర్వకాలంలో మన ఇళ్లలో విసుర్రాళ్లు ఉండేవి. అందులో జొన్నలో, పెసలో వేసి విసిరినప్పుడు.. దాని బొడ్డు చుట్టూ ఉన్న కొన్నిగింజలు అలాగే ఉండేవి. అవి బొడ్డును ఆశ్రయించి ఉన్నందున పిండిగా నలిగేవి కావు. అలాగే పరమాత్మ అనే బొడ్డును ఆశ్రయించి ఉన్నవారు సురక్షితంగా, నిర్మోహంతో, నిరహంకారంగా జీవిస్తారు. అలా కాకుండా అన్నీ తానే అనే అహంకారంతో జీవుడు ప్రవర్తిస్తే అగాథంలో పడినట్లే. కర్మఫలరహిత బుద్ధితో చేసే ఏ పనైనా దాని ఫలితం పరమేశ్వరునికే చెందుతుంది. అన్నీ భగవంతునికి సమర్పించే స్థితిని మనం పొంది ధ్యానిస్తే కర్మ ఫలాలు మనల్ని అంటవు.


  *******************************************
     ✍ ✍  డాక్టర్‌. పి. భాస్కర యోగి
      ॐ ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన ॐ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి