మార్కెట్ మాయాజాలంలో ఏది పడితే అది నమ్మడం ఓ బలహీనత. ఆ బలహీనతను ఆసరగా చేసుకోవడం పాపం పుణ్యం లేని నైపుణ్యం…!
లేకపోతే తిరుమల సుప్రభాత సేవ టిక్కెట్లను బ్లాక్‌లో కొనుక్కొని పూజలు చేయడం ఏమిటి? సినిమా టిక్కెట్లు ఎక్కువ ధరకు కొనడంలో కొంత తెలివి తక్కువ తనమున్నా అందులో వినోదం ఉంది. మరి దేవుడి దగ్గర వ్యాపారం ఏంటి? వింత కాకపోతే!
ఇదిలా ఉండగా నగలు రెట్టింపవుతాయని ఏదో సినిమాలో ‘అరగుండు’లు చేసినట్టు కరక్కాయ పొడి కొంటానంటే వేల రూపాయలు తగలబెట్టడమేంటి? అదీ 5 కోట్లు కుంభకోణం హైదరాబాద్‌లో జరగడమా!
జనం కూడా ఏది చెబితే దాని వెంబడి వెళ్లడానికి పరాకాష్ఠ ఇది. ‘నీకు ఆకలి కాకుండా మందు ఇస్తాను పట్టెడు చద్దెన్నం పెడతావా’ అన్నాడట వెనుకటికొకడు. ‘ఆకలి కాకుండా మందు ఇచ్చేవాడు మనల్ని నిన్నటి అన్నం ఎందుకు అడుగుతాడు !’
ఈ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్న వేలం వెర్రి వేయి విధాలన్నా ఆశ్చర్యం లేదు. అంత బాగా కరక్కాయ పొడిని ఎగుమతి చేయగలవాడు మనల్ని ఎందుకు అడుగుతున్నాడు ?
అని ఒక్క క్షణం ఆలోచించపోవడమే ఈ దుస్థితికి కారణం. ఇప్పటికీ అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలను తీర్చలేక నారా వారు నానాయాతనలు పడుతున్నారు.
బ్యాంక్‌ల బాధితులు, చిట్స్ మోసాలు, పాలసీ మోసాలు… ఇలా ఎన్నో సమోసాలు తినిపిస్తుంటే వాటిని జీర్ణం చేసుకోలేక ఆయాసపడుతుంటే ఇలాంటిదే మరో కొత్త మోసమన్న మర్మం తెలియక మన ఖర్మను మనమే వేలం వెర్రిగా నెత్తికి రుద్దుకొంటున్నాం ! తస్మాత్ జాగ్రత్త !!
*********************************
– డా|| పి.భాస్కర యోగి
మాటకు మాట : విశ్లేషణ : జాగృతి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి