రోజూ కాశ్మీర్ ప్రాంతంలో ఎందరో సైనికులు మరణించినా, కాశ్మీర్‌లో లక్షలాది మంది పండిట్లు పుట్టకొకడు చెట్టుకొకడు పొట్ట చేత బట్టుకొని వెళ్ళినా ఒక్కనాడూ పన్నెత్తి మాట అనని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం రెండు రోజుల క్రితం మావోయిస్టు ్టమేధావిగా ముద్రపడిన జి.ఎన్ సాయి  విడుదల చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరింది! ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ఈ ఆచార్యుడు మావోయిస్టుల మద్దతుదారుడని ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఆయన వికలాంగుడు కాబట్టి వదలిపెట్టాలని వరవరరావు మొదలుకొని ఐక్యరాజ్యసమితి వరకు ప్రభుత్వాన్ని కోరనివారు లేరు. ఎందుకు ఆయన జైల్లో ఉన్నాడని ఒక్కరూ ప్రస్తావించరు. కేవలం అతణ్ణి విడుదల చేయాలని మాత్రమే డిమాండ్ చేస్తారు!? నిజానికి నక్సలిజం, పీపుల్స్‌వార్ పుట్టిన, పెరిగిన నాటి పరిస్థితులు ఇపుడు ఈ దేశంలో లేవు. ఆర్థిక, సాంకేతిక రంగాల్లో దేశం దూసుకుపోతోంది.

వ్యవస్థలోని లోపాలను సరిచేయకుండా కొందరు యుద్ధానికి సిద్ధం అంటున్నారు. నిజానికి భిన్న సంస్కృతులు, అనేక విశేషాలు గల భారతదేశంలో మనమున్న ఈ సమాజంలో మావోయిజం నడుస్తుందా? మావో పుట్టిన చైనా ఇవాళ అన్ని సిద్ధాంతాలను ప్రక్కన బెట్టి ప్రత్యామ్నాయ అభివృద్ధిలో దూసుకుపోతోంది. చైనాలో బహుళ పార్టీ వ్యవస్థ రావాలని, ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని, మానవ హక్కులు రక్షింపబడాలని ఛార్టర్  08 రాసిన చైనా మేధావి లియాకు 2010 నోబెల్ శాంతి బహుమతి లభించింది. కొన్ని కమ్యూనిష్టు దేశాలు కకావికలమై ఐసిస్ చేతిలోకి ఎందుకు వెళ్ళాయి? మరికొన్ని మావోను ఆరాధించే దేశాలు గ్లోబలైజేషన్‌తో ఉరకలెత్తుతుంటే ఇక్కడి వామ పక్ష శక్తులు ఎందుకు గుర్తించరు? అలాగే కమ్యూనిస్ట్టుల చేత తీవ్రంగా ద్వేషించబడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మార్కిస్ట్‌లు వీరాభిమానంతో ఉప్పొంగే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ మధ్య సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగేవరకు వచ్చింది.

మరి మన దేశంలో దండకారణ్యంలో మిగిలిన దళిత, బహుజన కులాలకు చెందిన మావోయిస్టులు మరణించడమో, లొంగిపోవడమో, పోలీసు బలగాలను దెబ్బ తీయడమో చూస్తాం. కానీ మహానగరాల్లో కూర్చొని అడవిలోని వాళ్ళను రెచ్చగొడుతున్న ఈ అర్బన్ నక్సల్స్ గురించి మనం ఆలోచించడం మానేశాం. దేశాలను ఎదుర్కోగల సత్తా ఉన్న భారతసైన్యం, అణువిజ్ఞానం ముందు, సాంకేతిక పరిజ్ఞానం మధ్య ఈ అరుణపతాక రెపరెపలు సాధ్యమా? దండకారుణ్యం నుండి మీకు ఢిల్లీ ఎంతో దూరం లేదని భారత సార్వభౌమత్వానికే సవాల్ విసిరే మానసిక స్థితిని కల్పిస్తున్నదెవరు? అమాయకులను అరణ్యంలోకి పంపించి 1980 నుండి 2005 వరకు తెలుగు ప్రాంతాల్లోనే ఎన్నో ప్రాణాలు గాల్లో కలిపిన మేధోవర్గం కుటుంబాల్లో ఒక్కరి కుమారుడైనా మరణించారా?! వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు చర్చలపేరిట అడవుల్లోని అన్నలను హైదరాబాదుకు పిలిపించారు.

వాళ్ళ ముఖాలను టీవీలు, పత్రికల ద్వారా లోకానికి తెలిపి వాళ్ళకు నిలువనీడ లేకుండా చేశారు. ఆ తర్వాత ఎన్‌కౌంటర్లలో ఎందరో నక్సల్స్ మరణించారు. కానీ రోజూ పేపర్లలో వ్యాసాలు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, అప్పుడపుడు ప్రెస్‌క్లబ్‌లలో జరిగే కార్యక్రమాలు చూస్తే అసలు మనం మావోయిస్టుల రాజ్యంలోనే ఉన్నామా! అని ఎవరు భ్రమింప చేస్తున్నారు? మరికొందరు పాత్రికేయుల రూపంలో మావోయిస్టుచర్చల్లో కన్పిస్తారు. స్వామీజీలను అతిథులగా తమ ఇంట్లో ఉంచుకొంటారు!? ఇపుడు మాహానగర మావోయిస్టులంతా గుబురు గడ్డాలు పెంచుకొని, రీడింగ్ గ్లాసెస్ పెట్టుకొని విశ్వవిద్యాలయాల్లో మేధావుల్లా నటిస్తూ దేశ వ్యతిరేక చర్యలకు ఆజ్యం పోస్తున్నారని ఇటీవల వార్తలు చెబుతున్నాయి. మావోయిస్టులతో సంబంధాలున్న నేరంపై గత ఏడాది అరెస్టయి జీవిత ఖైదు శిక్షపడిన జి.ఎన్ . సాయిబాబా సన్నిహితుడు రోనా విల్సన్ గురించి విన్నాక దేశం నివ్వెర పోయింది.

మావోయిస్టులకు సంబంధించి పట్టణ, అటవీ ప్రాంతాలు అంతర్జాతీయ నెట్‌వర్క్ సమన్వయం చేసే బాధ్యతను ఈ రోనా విల్సన్ చూడడం వెనుక ఏ కుట్ర దాగి ఉందో చెప్పలేం. ఇప్పుడున్న మార్క్సిజం, మావోయిజం లక్ష్యాలు కులం, మతం పరిధిలోకి రావడం విచారించదగిన అంశం. ఇపుడు మావోయిస్ట్ మేధోగణం, మార్క్సిస్ట్ సిద్ధాంత కర్తలు మతం మత్తు మందు అనే మత్తులో తూగుతున్నారు. మార్క్స్ ఏ మతం గురించి అది చెప్పాడో అస్సలు చెప్పరు!? ప్రతి రోజూ సీతారాం ఏచూరి, డి. రాజా, సురవరం సుధాకర్‌రెడ్డి, బి.వి. రాఘవులు ‘మతతత్వంపై మా పోరాటం’ అంటారు. వీళ్ళు ముస్లింలీగ్, మజ్లిస్, ఆజాంఖాన్‌ల మతతత్వంపై ఎన్నడూ పోరాటం చేయరు. హురియత్ కాన్ఫరెన్స్ షేక్ గిలానీలు వీళ్ళకు ప్రీతి పాత్రులు. పైగా వాళ్ళ ఇళ్ళ ముందు సీతారాం ఏచూరి లాంటివారు చర్చల కోసం పడిగాపులు కాస్తారు. హఫీద్ సయిద్‌లాంటి వాళ్ళ ఉపన్యాసాలకు, వీళ్ళ వ్యాఖ్యానాలకు ఏమీ తేడా ఉండదు! వీళ్ళు జీవితాంతం దళిత, బహుజనులను ఉద్ధరిస్తామంటారు.

వాళ్ళ కార్యవర్గాల్లో బహుజనులకు స్థానం ఉండదు. నంబూద్రిపాద్ మొదలుకొని సీతారాం ఏచూరి వరకు ఒకే సామాజిక వర్గం వారు అధిష్ఠానాల్లో ఉంటుంటారు. అంతెందుకు ! తెలుగునాట ‘కామ్రేడ్’ లు అంతా ఎవరో ఈ ‘కామ్రెడ్’ పదం విడదీస్తే తెలుసుకోవచ్చు. అమరుల కుటుంబాల చావు డప్పుల వద్ద పిడికిలి బిగించి లాల్‌సలాం చెప్పే వరవరరావు ఎవరు? ఆరు తరాల చావులు చూసిన భీష్మ పితామహుడిలా ఈయన ఎందరికి పిడికిలి బిగించి పిండ ప్రదానం చేసాడో లెక్క చెప్పలేం! తెలుగునాట ప్రజాయుద్ధనౌకగా పేరొందిన గద్దర్ ఎన్నో చోట్ల దున్నేవాడిదే భూమి అని అద్భుతంగా గానం చేశాడు. గూడ అంజయ్య రాసిన ‘ఊరు మనదిరా ఈ వాడ మనదిరా’ పాటను గొప్పగా ప్రచారం చేశాడు. ‘దొరఏందిరో వాని పీకుడేందిరో’  అని గొంతెత్తి కాలికి గజ్జె కట్టి గంతేసాడు. కానీ ఇంటి ప్రక్కనున్న ‘దొరను’ అంతే గొప్పగా గౌరవించాడు. ఆయనపై పన్నెత్తి మాట పాట పాడలేదు. కాలెత్తి గజ్జ కదుపలేదు.

ఆయన భూమిలో ఎర్రజెండా పాతలేదు. ఆఖరుకు ఆయన కుమారుడు జి.వి. సూర్యకిరణ్ కాంగ్రెస్‌లో చేరుతుంటే ఆపలేదు. అది వారి వ్యక్తిగత అంశం. వదిలేద్దాం. అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో, ఇతర విశ్వవిద్యాలయాల్లో తమ ప్రాపకంతో వారి పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించిన ఎర్రమేధావులు కూడా ఉన్నారు. వీళ్ళను ఎప్పుడూ చైతన్యవంతంగా ఉంచే మార్క్సిస్ట్ మదర్సా జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు) ఈ కార్యకలాపాలకు మూల కేంద్రం. ఇపుడు దండకారణ్యంలోని ఎర్రదండు అంతా డియూ, జెఎన్‌యు పంచన చేరింది. వీళ్ళు ‘అప్పుడు చావనీయరు ఆర్నెళ్ళు బ్రతకనీయరు’ అన్న సిద్ధాంతంతో బ్రతికేస్తారు. ఇక హైదరాబాద్‌లో అస్తిత్వ ఉద్యమాలకు, సాహిత్య ఉద్యమాలను నడిపే గుంపు ఒకటి ఉంది. ఇందులో వీళ్ళు రోజూ ప్రజాస్వామ్యం  దాని విలువల గురించి తెగ ఉపన్యాసాలు దంచేస్తుంటారు.

మరి తుపాకీ గొట్టంతో రాజ్యాధికారం సంపాదించడం ఏ రకమైన ప్రజాస్వామ్యం!? చిన్న తుపాకివాడిని పెద్ద తుపాకి వాడు బెదిరిస్తే ఏకె 47 వాడు పెద్ద తుపాకీపై యుద్ధం చేయడా? ఈ చిన్న తుపాకిలన్నింటిపై అణుబాంబు ఉన్నవారు సమర శంఖం ఊదితే హిరోషిమా, నాగసాకిలను ఇంకో చోట వెదకాల్సిన అవసరం లేదు. అలాగే తెలుగు పత్రికల్లో, తెలుగు చానళ్ళలో పేరు మోసిన సిద్ధాంత కర్తలంతా ఇపుడు ప్రజాస్వామ్యవాదులుగా చలామణి అవుతుండడం కలికాలం గాక ఇంకేమిటి? ఇంకో బ్యాచ్ కులాలను రెచ్చగొడుతూ జాతీయ వాదాన్ని, హిందూమతాన్ని తీవ్రంగా విమర్శించి సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. ఇటీవల ఓ కులవాది రాముణ్ణి టీవీలో బండబూతులు తిట్టి మరుసటి రోజు నేను ఎంపికి పోటీ చేస్తానని తనకు తానే ప్రకటించుకున్నాడు.

సూడో సైన్స్ పేరిట జనాల్ని భ్రమలో ముంచుతున్న హిందూమత వ్యతిరేకులు టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో చెలరేగి పోతున్నారు. వీళ్ళందరి వెనుక ఉన్నది ఈ మహానగర మావోయిస్టులే! ఇపుడు తుపాకులతో, తూటాలతో సాధ్యంకావడం లేదు కాబట్టి విద్యార్థుల మనసుల్లో కులవిషబీజాలు నాటుతున్నారు. అఫ్జల్‌గురులను, యాకూబ్‌మెమెన్‌లను ఆరాధించే కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్, షెహ్లా రశీద్‌లను ఈ అర్బన్ నక్సల్స్ సృష్టిస్తున్నారు. ‘అధికారాన్ని ఆక్రమించు’ అన్న స్టాలిన్ మాటలను ఈ గ్యాంగుల వెనుక ఉన్న పెద్దలు ప్రోత్సహిస్తున్నారు. కులతత్వాన్ని సమన్వయంతో కాకుండా సంఘర్షణతో ఎదుర్కోవాలని రెచ్చగొడుతున్నారు. ఒకప్పుడు రష్యా, చైనా, బ్రిటిషు కమ్యూనిష్టుల చేతుల్లో కీలుబొమ్మలుగా ఈ దేశ కమ్యూనిష్టులు ఇటీవల ‘మతతత్వంపై యుద్ధం చేస్తాం’ అనే మాట తప్ప ఇంకోటి చెప్పడం లేదు.

ఆ మతతత్వం హిందూమతానికే పరిమితి కావడం కొసమెరుపు! ఈ దేశంలో హిందూమతం నాశనమయ్యాక సెక్యులరిజం ఆనవాళ్ళు కూడా ఉండదన్న విషయం 75 ఏళ్ళయినా వాళ్ళు గ్రహించడం లేదు. హిందువులు మతతత్వవాదులయ్యాకనే భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వచ్చిందని వీళ్ళు పరోక్షంగా సంకేతాలను ఇస్తున్నారు. మార్కిస్ట్, మావోయిస్ట్ మేధావిగణమంతా కళా, సాహిత్య, సాంస్కృతిక, పత్రికా రంగాలను ఆక్రమించి మానవ హక్కుల పేరుతో చర్చి హక్కులను, కాశ్మీరీ రాళ్ళు కొట్టే గ్యాంగును వెనుకేసుకొస్తున్నారు. ఇటీవల మావోవాదానికి కొత్త రూపు తీర్చిదిద్ది విశ్వవిద్యాలయాల్లో కులవాదం, మత  యుద్ధం చేస్తాం అంటూనే  వైదేశిక శక్తులకు అండగా నిలుస్తున్నారు.  తూటాలతో బహుజనుల ప్రాణా  బలిగొన్నవారే ఇపుడు మాటలతో అన్ని వర్గాలను మంట పుట్టిస్తున్నారు. పార్టీలు, ప్రభుత్వాలు ఓట్ల కక్కుర్తితో ఈ మేధో ఉగ్రవాదాన్ని వదిలేస్తే అది భస్మాసుర హస్తం కావడం ఖాయం.


***************************************
✍✍డాక్టర్. పి. భాస్కర యోగి
  🔴 సంపాదకీయ వ్యాసం :  విజయక్రాంతి 🔴 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి