ఒక పిచ్చివాడు దున్నపోతు ఎక్కి వెళ్తున్నాడట. మరో పిచ్చివాడు అది చూసి-‘ఒరేయ్! నువ్వు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం ఎంత ప్రమాదమో తెలుసా?’ అన్నాడట. పోలీసులు చూస్తే నీకు ఫైన్ కూడా వేస్తారన్నాడు. వెంటనే దున్నపోతుపై ఉన్న పిచ్చివాడు ‘లేదురా! దీనిపై ఎక్కితే హెల్మెట్ అవసరం లేదు.. కిందకు చూడు ఇది ఫోర్ వీలర్’ అన్నాట్ట. మన దేశంలో ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం ఈ సంభాషణ లానే వుంది. ప్రత్యేక హోదా పోరుతో ఎన్టీయే నుండి తెలుగుదేశం పార్టీ నేతలు బయటకు వచ్చి కొన్ని టీవీలను, పత్రికలను తన గుప్పిట్లో పెట్టుకుని మోదీని తమ విన్యాసాలతో మోదేస్తున్నారు. ఆది నుంచి మోదీని గద్దె దింపాలనే గొప్ప అప్రజాస్వామిక సిద్ధాంతంతో కాలం గడుపుతున్న కమ్యూనిస్టులు, కుహనా మేధావులు, ‘ఎర్ర’కళ్ల జర్నలిస్టులు తమ యావశ్శక్తినీ వినియోగించుకున్నారు. కుటుంబ, కుల, వంశ, అవినీతి విదేశీ సిద్ధాంతాల భావసారూప్య పార్టీలన్నీ సెక్యులర్ ముసుగు వేసుకొని మోదీపై యుద్ధం ప్రకటించాయి.
గత పార్లమెంట్ సమావేశాల్లో అవిశ్వాసం కోసం తెదేపా నోటీసులు ఇచ్చినా అన్నాడిఎంకె సభ్యుల జల వివాద నినాదాలు, టిఆర్‌ఎస్ సభ్యుల రిజర్వేషన్ గొడవలో చర్చకు అవకాశం రాలేదు. సభ క్రమశిక్షణలో లేనపుడు స్పీకర్‌కు అవిశ్వాసంపై నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదు అనేది రూల్. మొత్తానికి ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో అవిశ్వాసం పేరుతో ప్రత్యేక హోదాపై చర్చించడానికి ఓ అవకాశం దొరికింది. అవిశ్వాసంపై చర్చించేందుకు కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ దగ్గరుండి మరీ తెలుగుదేశం సభ్యులను ప్రోత్సహించారు. శుక్రవారం నాడు అన్ని పరిణామాలు సజావుగా ఉంటే చర్చకు అవకాశం ఉండవచ్చు. అవిశ్వాసం వల్ల ఒరిగేది ఏమీ లేదన్నది అందరికీ తెలిసిందే.
చర్చ ఎలా జరిగినా ఇటీవల మేధావుల బుర్రలను తొలిచే ఓ ప్రశ్న అంతటా చక్కర్లు కొడుతోంది. మోదీ ఇంత ఆకస్మికంగా చంద్రబాబును ఎందుకు దూరం పెట్టారు? ఎన్ని చానళ్లు చర్చ చేసినా, ఇరు పార్టీల నాయకులు రచ్చ చేసినా ఈ విషయంలోని రహస్యం బయటపడలేదు. ‘్ఫర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ అనుభవం వున్న చంద్రబాబును మోదీ సులభంగా దూరం చేసుకోవడం వెనుక మతలబు ఏమిటి? చంద్రబాబుపై విశ్వాసం లేకనా? జరగరానిది ఇంకేదైనా జరిగిందా? అన్నది ఇవాళ్టి ప్రశ్న! మోదీ ఈ రోజువరకు చంద్రబాబును గురించి పనె్నత్తి మాట అనలేదు. ఇటీవల నీతి ఆయోగ్ సమావేశానికి చంద్రబాబు వెళ్తే ఓ ప్రధాని ‘స్థాయికి తగినట్లు’గా పలకరించాడు. అదే చంద్రబాబు, అతని పార్టీ నాయకులు మోదీని ఎన్ని తిట్టాలో అన్నీ తిట్టేశారు. ఇక నందమూరి బాలకృష్ణ మాటలకు అడ్డూ అదుపే లేదు. బహుశా! ఎంత రాజకీయ వైరుధ్యం ఉన్నా అంత తీవ్రంగా ఎవరూ బండబూతులు తిట్టుకోరు. కానీ బాలకృష్ణ హద్దులు దాటి మోదీపై వ్యక్తిగతంగా తిట్టు కవిత్వం అందుకొన్నాడు. వచ్చీరాని హిందీలో ఈ మహానటుడు తిట్టిన డైలాగులు వింటూ చంద్రబాబు తెగ మురిసిపోయాడు.
అరవింద్ కేజ్రీవాల్, నితీశ్ కుమార్ లాంటివాళ్ళు మోదీకి ప్రత్యమ్నాయంగా ఎదగాలని పరతపించినా, ఇలాంటి దూషణ పర్వానికి ఏనాడూ దిగలేదు. మోదీ ఇ పుడు చంద్రబాబు విషయంలో ఎలా సంయమ నం పాటించాడో వాళ్ళ విషయంలో కూడా అలాగే పాటించాడు. తెదేపా నేతలు మోదీ పట్ల, భాజపా పట్ల ఆగర్భ శత్రుత్వం ప్రదర్శిస్తున్నారు. ఇన్ని తిట్లు, శాపనార్థాలు పెడుతున్నా అమిత్‌షాపై, కన్నా లక్ష్మీనారాయణపై, సోము వీర్రాజులపై తెదేపా కార్యకర్తలు లేదా వాళ్లు పురిగొల్పిన వ్యక్తులు దాడిచేసినా భాజపా తీవ్రంగా ప్రతిఘటించలేదు. ఏపీ భాజపాలో ఇంకా తెలుగుదేశం ‘స్లీపర్ సెల్స్’ ఉన్నాయా? అనే భావన ఇటీవల అందరినీ వెంటాడుతుంది. ముందునుండి చంద్రబాబు చెప్పినట్లు ఆడే ఓ గ్రూపు భాజపాలో ఉండడం వల్లే ఏపిలో భాజపా ఎదగలేదని విజ్ఞుల అభిప్రాయం. ఎంపీ సిఎం రమేశ్ దీక్ష, తెలుగుదేశం పార్టీ ఢిల్లీలో చేసిన నిరసనలు, ఆఖరుకు అవిశ్వాసం.. ఇవన్నీ భాజపా కేంద్ర నాయకత్వానికి తెలియవా? అంటే అది అమాయకత్వమే!
జపాన్‌లో జూడో అనే యుద్ధకళ చాలా ప్రసిద్ధం. అలాంటిదే ‘జూటిట్సు’ అనేది మరో మల్లయుద్ధ కళ ఉంది. ఇది విచిత్రమైన నియమాలున్న కుస్తీ. ఇందులో నిబంధనలు ఆశ్చర్యంగా ఉంటాయి. ఒక వ్యక్తి ఎదుటివారిని ఓడించాలంటే అతనిపై పడతాడు. ఎదుటివారిని దెబ్బతీయటానికి ప్రయత్నిస్తుంటాడు. ఇది పోరాటంలో సాధారణంగా ఉన్న నియమం. దీనికి వ్యతిరేకంగా, విచిత్రంగా శత్రువును దెబ్బతీసే వ్యూహం జూడో యుద్ధకళలో ఉంది. ఎప్పుడూ ఎదుటివారిపై దాడి చేయకూడదు. ఎవరు దాడి చేస్తారో వాళ్ళు ఓడిపోవడం ఖాయం. ఎందుకంటే దాడి చేసేవారు ఎక్కువ శక్తిని ఖర్చుచేయాలి. కానీ దాడిచేసిన వారిని దాడి చేయనిచ్చినపుడు ప్రశాంతంగా అతణ్ణి గెలవడం సులభం. ఎదుటివారి దాడిని తట్టుకునే వ్యూహంతో కూడిన ప్రశాంతత అవసరం. ‘నీ వరకు నీవు దాడి చేయవద్దు. ప్రత్యర్థి దాడి చేసేట్లుగా పురిగొల్పు. శత్రువు దాడిని నిబ్బరంగా ఎదుర్కో!’’ ఇది జూడోలోని యుద్ధ రహస్యం.
సరిగ్గా భారత రాజకీయాల్లో తలపండిన మేధావులకు అర్థం కాని వ్యూహాన్ని గత 18 ఏళ్లనుండి మోదీ అవలంబిస్తున్నాడు. ఇపుడు ఆ బోనులోకి చంద్రబాబు వచ్చాడు. రోజూ మోదీని తిట్టడంలో అతని శక్తిని ఖర్చుచేస్తున్నాడు. అది మోదీకి లాభమే గాని నష్టం కాదు. ఈ తిట్ల దండకానికి రెమెడీ మోదీ తప్పక ఇస్తాడు. నితీశ్ కూడా తీవ్రంగా మాట్లాడి లాలూ వలలో, కాంగ్రెస్ చెరలో చిక్కుకున్నాడు. నితీశ్ నిజాయితీపరుడు కావడంవల్ల మోదీతో వ్యక్తిగత స్నేహం బాగుంది. లాలూ నితీశ్‌తో ఉంటూనే భాజపాతో జతకట్టి నితీశ్‌ను మ్రింగాలనుకొన్నాడు. ఈ విషయం బయటపడటంతో నితీశ్ తిరిగి భాజపా పంచన చేరాడు. చంద్రబాబు కూడా లాలూ లాగా ఏమైనా పొరపాటు చేసాడా అన్నది ప్రశ్న!
భవిష్యత్తులో భాజపా వ్యూహానికి విరుగుడుగా జగన్, చంద్రబాబు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినా మనం ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదు. ఈరోజు కాకపోవచ్చు కానీ 2024లో అ యినా జరిగేది ఇదే. ఇప్పటికే ఒకే శత్రువు మూడు రూపాల్లో చంద్రబాబుపై ముప్పేట దాడి చేస్తున్నారు. జగన్, పవన్, భాజపా, కాంగ్రెస్‌లను ‘నల్లేరుపై నడకలా’ చంద్రబాబు ఎదుర్కోవడం సాధ్యం కాదు. భాజపాకు తెలుగు రాష్ట్రాల వల్ల నిజానికి ఒరిగింది ఏమీ లేదు. భవిష్యత్తులో భాజపా గ్రాఫ్ ఏపిలో పెరుగుతుంది తప్ప తగ్గేది లేదు. మంచంపై కూర్చున్నవాళ్లకు కిందపడతామన్న భయం కానీ నేలమీద కూర్చున్నవాళ్లకు కిందపడడం ఏముంటుంది? సరిగ్గా భాజపా అదే వ్యూహంలో వుంది. చంద్రబాబుకు చక్రబంధనం వేసింది. అది అర్థం కాక బాబు అసహనంతో రగిలిపోతున్నాడు. ఈ అసహనమే భాజపా ఉనికికి ఆధారం అవుతుంది.
ప్రస్తుతం ఉపరాష్టప్రతి స్థాయిలో ఉన్న వెంకయ్య నాయుడును ఎంపీగా గెలిపించిన పాపాన పోలేదు. చంద్రబాబు సామాజిక వర్గం వెంకయ్య నాయుడు వెంట ఎన్నడూ నిలవలేదు. అందుకే అమిత్ షా వ్యూహరచనలో భాగంగానే కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణను రంగంలోకి దింపాడు. మరోవైపు అదే సామాజిక వర్గం నుండి వచ్చిన పవన్ కళ్యాణ్, ముద్రగడ పద్మనాభం వంటివారు బాబుపై ఒంటికాలిపై లేస్తున్నారు. ఇవన్నీ భవిష్యత్తులో భాజపాకు లాభాలే తప్ప నష్టాలు ఏమీ కావు.
రెడ్లు, క్రైస్తవులు, దళితులు వైఎస్ జగన్ వెంట నడుస్తుండగా, కమ్మ, ఇతర వర్గాలు ఎక్కువ భాగం టిడిపికి అండగా నిలిచారు. ఇపుడు ఏ విధమైన రాజకీయ వేదిక లేని కాపులు, బీసీలు, రాజులు, కొప్పల వెలమలు భవిష్యత్తులో భాజపా వైపు చూస్తారు. ఇటీవల ఐవిఆర్ కృష్ణారావు లాంటి నిజాయితీపరుడైన బ్రాహ్మణ మాజీ ఐఏఎస్ అధికారిపై చంద్రబాబు తీవ్రత ప్రదర్శించినందుకు బ్రాహ్మణులు తెలుగుదేశానికి ఎదురుతిరుగుతున్నారు. అలాగే రమణ దీక్షితులును టార్గెట్ చేసిన తెదేపాపై బ్రాహ్మణ వర్గాలు గుర్రుగా ఉన్నాయి. సామాజిక సంబంధాలు పుష్కలంగా ఉన్న నారుూ బ్రాహ్మణులపై ఇటీవల చంద్రబాబు చేసిన వ్యాఖ్యానాలు ఆ కులస్థులతో పాటు బీసీ కులాలకు ఆగ్రహం తెప్పించాయి.
విచిత్రం ఏమిటంటే అవిశ్వాసంపై తెదేపా పార్లమెంటు సభ్యుడు జె.సి.దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ‘విప్ జారీ ఏసినా నేను పార్లమెంటు వెళ్లను’ అన్నాడు జె.సి. సిఎం రమేశ్ ‘ఉక్కు దీక్ష’లో కూడా జెసీ ఇలాంటి తేలిక వ్యాఖ్యలే చేయడం గమనార్హం! నాలుగేళ్లు మంత్రులుగా కేంద్రంలో బాధ్యతలు నిర్వహించిన అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి ‘హోదా’ గురించి అంత తీవ్రంగా మాట్లాడడం లేదు. కానీ ఇద్దరు కొత్త వ్యక్తులు ప్రజలతో నేరుగా సంబంధాలు నెరపనివారు భాజపాపై శత్రుత్వానికి ఆజ్యం పోస్తున్నారు. కనకమేడల రవీంద్ర, కుటుంబరావు- ఈ ఇద్దరూ మోదీని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. కుటుంబరావు ఏకంగా రష్యాతో కుదుర్చుకున్న ఓ ఒప్పందంలో మోదీ కుంభకోణం చేసాడని దుష్ప్రచారానికి దిగాడు. గతనెలలో ఈ కుటుంబరావు ఇలాంటిదే నేను త్రవ్వి తీయబోతున్నా అనగానే భాజపా అశోక్ గజపతిరాజు సంభాషణ ఒకటి బయటపెట్టింది. ఇపుడు ఏం జరుగబోతోందో వేచి చూడాలి..!?
ఇక, మోదీని గద్దె దింపుతానని సోనియా తాజాగా ప్రకటించింది. టెన్ జన్‌పథ్‌లో కూర్చొని ఒకప్పుడు తోలుబొమ్మ ప్రధాని కీలు తిప్పుతూ, ప్రాంతీయ పార్టీలను, కాంగ్రెస్ నాయకులను తన ముందు నిల్చోబెట్టి మాట్లాడిన సోనియాకు ఇపుడు నిద్రపట్టడం లేదు. ఈ నాలుగేళ్లుగా తన కుమారుడు ఒక్క విజయం సాధించకపోగా, ఆమె ఆరోగ్యం సహకరించడం లేదు. రాహుల్ గాంధీ రాజకీయ పరిపక్వతను కాంగ్రెస్ మిత్రపక్షాలే అనుమానంగా చూస్తున్నాయి. ఇటీవల బహుజన సమాజ్ పార్టీ నేత రాహుల్‌పై నేరుగానే మాట్లాడి మాయావతి ఆగ్రహానికి గురయ్యాడు. ఇపుడు మోదీ ప్రభుత్వాన్ని గద్దెదింపి- ఈ నాలుగు నెలలు రాహుల్‌ను ప్రధానిని చేసి అతని ‘అప్రెంటీస్ పీరియడ్’ను 2019లో వాడుకొందామని సోనియా భావిస్తోందా? నిజానికి మోదీ ప్రభుత్వానికి ఏ ఢోకాలేదని తెలిసినా టిడిపి అవిశ్వాసం ప్రతిపాదన తెచ్చింది. ఇంకే పార్టీకి అవిశ్వాసంపై అంత ఉత్సాహం లేదు. కేజ్రీవాల్, మమత, ఓవైసీ, మాయావతి పార్టీలు పాక్షికంగా దీనిని సమర్థిస్తున్నాయి. టిఆర్‌ఎస్ ఈ విషయంలో పెద్దగా స్పందించలేదు. అయినా కెసిఆర్‌ను టార్గెట్ చేసి అడిగే ధైర్యం టిడిపికి లేదు. చంద్రబాబుకు మోదీతో పెట్టుకున్నా పెద్ద ఇబ్బంది లేదు కానీ కెసిఆర్‌తో పెట్టుకోవడం అంత సులభం కాదు. భాజపా 273, శిరోమణి అకాలీదళ్ 4, రామ్‌విలాస్ పాశ్వాన్‌కు 6, శివసేనకు 18, ఇతరులకు 14 సీట్లు ఉన్నాయి. ఇదీ ఎన్టీయే బలం. మరోవైపు కాంగ్రెస్‌కు 48, తృణమూల్ కాంగ్రెస్‌కు 34, టిడిపికి 16, టిఆర్‌ఎస్‌కు 11, ఇతరులకు 50 ఉన్నా ఇందులో ఎవరు అవిశ్వాసానికి మద్దతిచ్చేవారో చెప్పలేం. అవిశ్వాసానికి కావలసిన 159 ఎంపీల సంఖ్య లేకపోయినా సోనియా గాంధీ అపరిపక్వతను ఎదుర్కోవడానికి మోదీ, షా నేతృత్వంలోని భాజపా సర్వసన్నద్ధంగా ఉంది. ఇన్ని తెలిసినా సోనియా, చంద్రబాబులు చేస్తున్న ఈ అవిశ్వాసంలోని అంధ విశ్వాసం దేశ రాజకీయాలను ఎటు మలుపుతుందో చూడాలి.
2014 ఎన్నికల ఫలితాలను అపహాస్యం చేస్తున్న ఈ అవిశ్వాసంలో ‘విశ్వాసం’ పాలు ఎంత? రాజకీయం పాలు ఎంత?? కాంగ్రెస్ నాయకులను తన ముందు నిల్చోబెట్టి మాట్లాడిన సోనియాకు ఇపుడు నిద్రపట్టడం లేదు. ఈ నాలుగేళ్లుగా తన కుమారుడు ఒక్క విజయం సాధించకపోగా, ఆమె ఆరోగ్యం సహకరించడం లేదు. రాహుల్ గాంధీ రాజకీయ పరిపక్వతను కాంగ్రెస్ మిత్రపక్షాలే అనుమానంగా చూస్తున్నాయి. ఇటీవల బహుజన సమాజ్ పార్టీ నేత రాహుల్‌పై నేరుగానే మాట్లాడి మాయావతి ఆగ్రహానికి గురయ్యాడు. ఇపుడు మోదీ ప్రభుత్వాన్ని గద్దెదింపి- ఈ నాలుగు నెలలు రాహుల్‌ను ప్రధానిని చేసి అతని ‘అప్రెంటీస్ పీరియడ్’ను 2019లో వాడుకొందామని సోనియా భావిస్తోందా? నిజానికి మోదీ ప్రభుత్వానికి ఏ ఢోకాలేదని తెలిసినా టిడిపి అవిశ్వాసం ప్రతిపాదన తెచ్చింది. ఇంకే పార్టీకి అవిశ్వాసంపై అంత ఉత్సాహం లేదు. కేజ్రీవాల్, మమత, ఓవైసీ, మాయావతి పార్టీలు పాక్షికంగా దీనిని సమర్థిస్తున్నాయి. టిఆర్‌ఎస్ ఈ విషయంలో పెద్దగా స్పందించలేదు. అయినా కెసిఆర్‌ను టార్గెట్ చేసి అడిగే ధైర్యం టిడిపికి లేదు. చంద్రబాబుకు మోదీతో పెట్టుకున్నా పెద్ద ఇబ్బంది లేదు కానీ కెసిఆర్‌తో పెట్టుకోవడం అంత సులభం కాదు.
భాజపా 273, శిరోమణి అకాలీదళ్ 4, రామ్‌విలాస్ పాశ్వాన్‌కు 6, శివసేనకు 18, ఇతరులకు 14 సీట్లు ఉన్నాయి. ఇదీ ఎన్టీయే బలం. మరోవైపు కాంగ్రెస్‌కు 48, తృణమూల్ కాంగ్రెస్‌కు 34, టిడిపికి 16, టిఆర్‌ఎస్‌కు 11, ఇతరులకు 50 ఉన్నా ఇందులో ఎవరు అవిశ్వాసానికి మద్దతిచ్చేవారో చెప్పలేం. అవిశ్వాసానికి కావలసిన 159 ఎంపీల సంఖ్య లేకపోయినా సోనియా గాంధీ అపరిపక్వతను ఎదుర్కోవడానికి మోదీ, షా నేతృత్వంలోని భాజపా సర్వసన్నద్ధంగా ఉంది. ఇన్ని తెలిసినా సోనియా, చంద్రబాబులు చేస్తున్న ఈ అవిశ్వాసంలోని అంధ విశ్వాసం దేశ రాజకీయాలను ఎటు మలుపుతుందో చూడాలి. 2014 ఎన్నికల ఫలితాలను అపహాస్యం చేస్తున్న ఈ అవిశ్వాసంలో ‘విశ్వాసం’ పాలు ఎంత? రాజకీయం పాలు ఎంత??
*****************************************
✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి
📰 ఆంధ్రభూమి : భాస్కర వాణి 📰
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి