ఫ్రపంచంలో దాదాపు 200 దేశాలున్నాయి. 650 కోట్ల జనాభా ఉంది. కాని కేవలం 11 దేశాల్లో మాత్రమే ఆంగ్లం చదవడం, రాయడం బాగా తెలిసిన వాళ్లున్నారు. అంటే 5% దేశాల్లో మాత్రమే ఆంగ్ల ప్రాధాన్యం ఉందన్నమాట. ప్రపంచ జనాభా 4% మాత్రమే ఆంగ్లం తెలిసినవారున్నారు. అది ప్రపంచంలోనే పెద్ద భాష ఎలా అయ్యిందో ఈ మేధావులే చెప్పాలి?

ప్రపంచ భాష కావాలంటే- 140 కోట్ల ప్రజలు మాట్లాడే చైనా మాతృభాష ‘చినీ’గాని, 100 కోట్ల మందికి తెలిసిన హిందీ గాని కావాలి. మూడవ స్థానంలో ‘రూసీ’, నాల్గవ స్థానంలో స్పానిష్, 5వ స్థానంలో పోర్చుగీసు ఉండగా 11వ స్థానంలో ఆంగ్లం ఉంది. బ్రిటన్‌కు బానిస దేశాలుగా ఉన్న భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, అమెరికా, కెనడా.... లాంటి 11 దేశాలపై ఆంగ్లం బలవంతంగా రుద్దబడింది. ఆంగ్లేయుల మనస్తత్వమే అలాంటిది. 

ఐర్లాండ్(ఐరిష్), స్కాట్లాండ్ (స్కాటిష్)లను భాష ద్వారానే బ్రిటన్ తమ చెప్పుచేతల్లో ఉంచుకుంది. ఇంగ్లండులోని ఆంగ్లం 5వ శతాబ్దం తర్వాత వచ్చింది. అంతకుముందు ఇంగ్లండులో లాటిన్ భాషనే ఉండేది. విచిత్రం ఏమిటంటే ప్రపంచంలోని భాషలన్నీ ఆంగ్ల భాషకన్నా ముందు పుట్టినవే.

వెబ్‌స్టర్, ఆక్స్‌ఫర్డ్ నిఘంటువులు, ఇంకొన్ని ప్రసిద్ధ నిఘంటువులు ఆంగ్లంలో లక్షన్నర దాకా పదాలున్నట్లు తెలుపుతున్నాయి. కాని వాటిలో లాటిన్, పోర్చుగీసు, సంస్కృతం, గ్రీకు, హిందీ పదాలు చాలా ఉన్నాయి. వాళ్లు పాలించిన ఇతర ప్రాంతాలనుండి కొన్ని పదాలు ఆంగ్లంలోకి దిగుమతి అయ్యాయన్నమాట! (గంటకు 15 పదాలు) పరిశోధకుల పరిశోధన ప్రకారం ఆంగ్ల మూల పదాలు కేవలం 2900 మాత్రమే ఉండడం గమనార్హం. ప్రపంచంలోని చాలా తక్కువమంది మాట్లాడే భాషలుగా చెప్పే స్పానిష్, డేనిష్ భాషల్లో ఆంగ్లంలోకన్నా ఎక్కువ పదాలున్నాయి. ఇంకా చెప్పాలంటే భారతదేశంలోని ఎన్నో భాషల్లోని పదాలకన్నా ఆంగ్ల పద సంపద చాలా తక్కువ.

ఉదాహరణకు హిందీలో దాదాపు 7 లక్షల పదాలున్నాయి. అలాగే తెలుగు, కన్నడ, తమిళం వంటి భాషల్లో గొప్ప పద సంపద ఉంది. సంస్కృతంలో ఒక ధాతువునుండి వేల పదాలు సృష్టించవచ్చు. కత్తికి పదును పెడుతుంటేనేగా ఉపయోగం పెరిగేది. పదునుపెట్టకుండా ఒక మూలన పారవేస్తే కొంత కాలానికి కత్తే అంతరించిపోతుంది.

 ప్రస్తుతం భారతదేశంలో 25 అధికార భాషలు కాగా, 3280 భాషలు మాట్లాడేందుకు మనం ఉపయోగిస్తున్నాం. గత 63 సం.ల కాలంలో ఈ 25 అధికార భాషల్లో ఏదీ తమ విద్యావ్యవస్థనుగాని పరిపాలనా యంత్రాంగం గాని, న్యాయ వ్యవస్థలు గాని తమ భాషల్లో నడుపుకునే స్థాయికి ఎదగలేదు. కారణమేమిటి? ఏక భాషయిన హిందీవద్దని గొంతెత్తి చాటేవాళ్ళ సమాధానమేమిటి? కేవలం నినాదాలు, ధర్నాలు, సత్యాగ్రహాలు చేసే వారి కార్యదీక్ష ఇలాగే వుంటుందని అనుకోవాలా?

క్రిందటి సం.ము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 6వ తరగతిలో ఇంగ్లీషు భాషను మాధ్యమంగా ప్రవేశపెట్టింది. ఈ సం.రం ఒకటవ తరగతి నుండి మొదలుపెట్టింది. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంపై పట్టు సాధించలేక, తెలుగులో విద్య నేర్వలేక ‘రెంటికీ చెడ్డ రేవడి’లా తయారయ్యారు. దానికి కారణం పాలకులు, అధికారులు, వారి చిత్తశుద్ధి కొరత లేదంటారా? వీరందరు గాంధీజీని మోసము చేయట్లేదంటారా? ఆయన ఆత్మ ఎంత క్షోభిస్తుందో? కాబట్టి ఆంగ్ల భాషావ్యాప్తి భారతదేశ అభివృద్ధికే గొడ్డలిపెట్టుగా మారింది.

ఆంగ్లంలో ప్రపంచ ప్రసిద్ధ గ్రంథాలేవీ రాలేదు. వైజ్ఞానిక, పరిశోధన రంగానికి సంబంధించిన గ్రంథాలు ఎక్కువ ‘‘రూసి’’లో వచ్చాయి. ఎక్కువగా పరిశోధన పత్రాలు, సిద్ధాంత వ్యాసాలు ‘రూసీ’లో వచ్చాయి. కాంట్, ఏంగిల్స్, మార్క్స్‌వంటి మేధావులు పుట్టిన జర్మన్ భాషలో ఎక్కువ దార్శనిక సిద్ధాంతాలు అందుకు అనుగుణమైన సూత్రాలు కల్గిన గ్రంథాలు వచ్చాయి. 

చిత్రకళ, సంగీతం, కళలకు సంబంధించిన గ్రంథాలు ఎక్కువగా ఫ్రెంచి భాషలో వచ్చాయి. అతి పెద్ద ఇతిహాసం మహాభారతం సంస్కృతంలో వచ్చింది. సంస్కృత భాషలో వ్రాయబడిన మహాభారతం ప్రపంచ గ్రంథాలన్నిటిలో కంటే పెద్దది. ఏ ఒక్క గ్రంథము దీనికి సాటిరాదు. స్పానిష్ భాషలోకూడా అతి ఎక్కువ ఇతిహాస సంబంధ గ్రంథాలు వచ్చాయి. అలాగే వైజ్ఞానిక పరిశోధన గ్రంథాలు ఆంగ్లంలోకన్నా అన్ని భాషల్లో ఎక్కువగానే వచ్చాయి. 5వ శతాబ్దంకన్నా ముందు ఇంగ్లండు చాలా బీద దేశం. అప్పటికే మన దేశంలో మంచుగడ్డలు ఉత్పత్తిచేసే ఫ్యాక్టరీలు ఉండేవి. 

న్యూటన్ కన్నా ముందే మన దేశంలో 9,10 శతాబ్దాల్లోనే గమన నియమాలు, గురుత్వాకర్షణ సిద్ధాంతాలు కనుగొన్నారు. ఇంగ్లీషువారికి ముందు నుంచి ఓ నైపుణ్యం ఎక్కువ. ఇతరుల సిద్ధాంతాలను తమవిగా మార్చుకుని ప్రచారం చేసుకోవడం, వాటిని తమవిగా సొంతం చేసుకోవడానికి కుట్రలు పన్నడం. ఇది వారికి సహజంగా వచ్చిన విద్య.

మనకు ప్రపంచంలోని 187 దేశాల చరిత్ర, సంస్కృతులు కన్పించడం లేదు. కేవలం అమెరికా, ఇంగ్లండు మాత్రమే కన్పిస్తున్నాయి. వాటి మనస్తత్వం ఏమిటోకూడా మనం గుర్తించలేకుండా ఉన్నాం. వీటి వెనుకనున్న మనస్తత్వాన్ని గుర్తించలేక పోవటమైనా, గుర్తించనట్లు నటించటమైనా మన దురదృష్టకరం.

--ఇంకావుంది

*********************************************
✍ ✍ డాక్టర్‌. పి. భాస్కర యోగి
ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి