సెక్యులరిస్టుల భక్తి ప్రపత్తులు..!?
***************************************
✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి
వర్తమాన భారతం : విజయక్రాంతి
జులై - 24 - 2018 : మంగళవారం
అడాల్ఫ్‌హిట్లర్ జాతకాన్ని పరిశీలించిన ఓ జ్యోతిష్యుడు “నీవు యూదుల సెలవురోజు మరణించడం ఖాయం” అన్నాడు. వెంటనే హిట్లర్ ఏ సెలవు రోజో చెప్పగలరా? అన్నాడు. అది చెప్పడం సాధ్యం కాదు కాని నేను చెప్పింది మాత్రం జరిగి తీరుతుంది అన్నాడు జ్యోతిషుడు. అదే ఎప్పుడో చెప్పండి అన్నాడు హిట్లర్. ‘ఏ సెలవో చెప్పలేనుగానీ నువ్వు మరణించిన రోజు మాత్రం యూదులకు సెలవు దినం అవుతుంది’ అన్నాడు జ్యోతిషుడు. సరిగ్గా మన దేశంలోని లౌకికవాద వ్రతం చేసే వాళ్ళకు ఈ హాస్య సన్నివేశం అతుకుతుంది.
గత వారం జార్ఖండ్‌లో స్వామి అగ్నివేశ్‌పై కొందరు దాడిచేసారు. భౌతిక దాడులు చేయడం తప్పు. కానీ అలా చేసేందుకు ప్రేరేపించడం కూడా అంతే తప్పు.
ఒకరిది శారీరకమైన దాడి అయితే మరొకరిది మానసికమైన దాడి. స్వామి అగ్నివేశ్‌ను ఈ దేశ లౌకిక వాదానికి ప్రతీకగా భావిస్తారు. ఆర్య సమాజం అంటూనే ఎన్నోసార్లు హిందువులను బండబూతులు తిడతాడు. రాజకీయంగా ఎన్నైనా విమర్శలు చేయవచ్చు. కానీ ఇతరుల మనోభావాలను, నమ్మకాలను గేలి చేసే అధికారం ఎవరికీ లేదు. స్వామి అగ్నివేశ్ ఓ సభలో మాట్లాడుతూ హిందువులు మూర్ఖంగా ఆరాధన చేస్తారని, నరేంద్రమోడీ గంధం పెట్టుకొని మాల ధరించి పశుపతి నాథుణ్ణి, కాశీ విశ్వేశ్వరుణ్ణి, ఢాకేశ్వరిని పూజించ డం తప్పని నిందించాడు. హిందువులు శ్రీ వెంకటేశ్వర స్వామిని, అయ్యప్పను, అమర్‌నాథ్ లింగాన్ని పూజించడాన్ని ఎగతాళి చేశాడు.
అదీ ఇతర మతాల సభలో ఇలాంటి విషయాలు ప్రస్తావించడం ఎంతవరకు సబబు!? పోనీ ఆయనను అనుసరించే వీర సెక్యులర్ నిష్ఠాపరులంతా ఈ గుళ్ళకు వెళ్ళే వారే కదా! వారంతా మూర్ఖులా? ఈ దేశంలో సెక్యులర్ వ్రతం బాగా పాటించే వారే ఎక్కువగా భక్తి ప్రపత్తులు చాటుకున్నారు కదా! అందుకు వందల ఉదాహరణలు చెప్పవచ్చు. మహాత్మాగాంధీ సెక్యులర్ సిద్ధాంతానికి పిత. ఆయనలో హిందూ, జైన సంప్రదాయాలు మిక్స్‌డ్‌గా కన్పిస్తాయి. పాపభీతి, శరీరక క్రమశిక్షణకు గాంధీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆయన చేతిలో భగవద్గీత ఉండేది. ఆఖరుకు మరణించేటపుడు ‘హేరామ్’ అన్నాడని పెద్ద చర్చనే జరిగింది. సోషలిజాన్ని సెక్యులరిజాన్ని మిక్సీలో వేసి దంచితే నెహ్రూ పుట్టాడంటారు. అలాంటి నెహ్రూ రచనల్లో, జీవితంలో ఎన్నో హిందూ ఆచారాలు కన్పిస్తాయి.
నెహ్రూ జాతకాలను నమ్మేవాడని అంటారు. డా॥ బి.ఆర్ అంబేద్కర్ నాస్తికుడుగా జీవించలేదు కదా! బౌద్ధాన్ని జీవన చరమాంకంలో స్వీకరించినా అది జ్ఞానమే దేవుడిగా చెప్పే ఉపనిషత్తుల విలువల్ని పుణికి పుచ్చుకొన్నది కదా! రామ్ మనోహర్ లోహియా లాంటి సోషలిస్ట్ మేధావి తూర్పుపశ్చిమాలను కృష్ణుడు కలిపితే, ఉత్తర దక్షిణాలను శ్రీరాముడు కలిపాడని, భారతదేశ ఐక్యతకు ఈ ఇద్దరు మూలపురుషులని పేర్కొన్నారు. రామస్వామి నాయకర్ భార్య నాగమ్మాళ్ తన భర్తతో కలిసి ఉద్యమాలు చేసినా గొప్పదైవభక్తురాలు. పూలే భార్య సావిత్రీబాయి ముఖంలో బొట్టు లేకుండా చూడగలమా! మహాత్మా పూలే కూడా ఆర్య సమాజ ఊరేగింపులో పాల్గొన్నారు.
సెక్యులరిజం అనే ముద్దు పదాన్ని చట్టబద్దం చేసిన ఇందిరాగాంధీ గొప్ప భక్తురాలు. ఆమె మెడలో ఎప్పుడూ మాల కన్పించేది. ధీరేంద్ర బ్రహ్మచారి లాంటి వాళ్ళను గురువులుగా స్వీకరించింది. రాజీవ్ గాంధీ ఏకంగా రామజన్మభూమి తాళాలు బద్దలు కొట్టిస్తే, రామాయణ కల్పవృక్షాన్ని రసంలా కడుపులో నింపుకున్న పి.వి. నరసింహారావు బాబ్రీమసీదు నేలమట్టం అవుతుంటే నిశ్చేష్టుడయ్యాడు. అలాగే తాంత్రిక గురువు చంద్రస్వామితో పి.వి. సంబంధాలపై ఒక పుస్తకమే రాయొచ్చు. రాష్ట్రపతిగా పనిచేసిన శంకర్‌దయాళ్ శర్మ గుళ్ళకు వెళ్ళడం, పూజలు, హోమాలు చేయడం మనం చూసాం.సెక్యులర్ వ్రత నియమాలకు భంగం వాటిల్లకుండా కంకణం కట్టుకొన్న లాలూప్రసాద్ యాదవ్ బీహార్‌లో నిర్వహించే ‘ఛత్‌పూజలో’ ఎలా పాల్గొంటాడో హోళీ పండుగకు రంగుల్లో ఎలా మునుగుతాడో మనం చూసాం.
అలాగే ములాయాం సింగ్ ఇంట్లో పండుగలు, పర్వాలు, ఉత్సవాలు అన్నీ ఎంత సంప్రదాయబద్దంగా జరుగుతాయో అందరికీ తెలుసు. ములాయాం కోడలు స్వయంగా గోశాల నిర్వహిస్తున్నారు. దేవేగౌడకు ఉన్న సెంటిమెంట్లు చూస్తే ఆయన పార్టీ పేరులో సెక్యులర్ ఉంటుంది గాని వంటి నిండా భక్తి పరవశమే. ఆయన కుమారుడు కుమారస్వామి గద్దెను ఎక్కడానికి ఎన్నోచోట్ల యజ్ఞాలు చేయించారని చెప్తారు. అలాగే దేవేగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణ వాస్తు బాగోలేదని తన అధికారిక నివాసంలో ఉండకుండా ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసాడు. కుమారస్వామి సీఎం కుర్చీ ఎక్కగానే స్వామీజీల ఆశీర్వాదం తీసుకున్నాడు.
ఏకంగా ఈ దేశ సెక్యులర్ టీం ఛాంపియన్‌గా పేరొందిన సిద్ధరామయ్య కాకి వాలిందని కారే ఎక్కలేదు!! చంద్రబాబు అవసరాన్ని బట్టి అందుకునే సెక్యులర్ నినాదం అప్పుడపుడు అటక ఎక్కిస్తూ, దించేస్తూ ఉంటాడు. సత్యసాయి, జగ్గీవాసుదేవ్, బ్రహ్మ కుమారీస్‌ల దగ్గరకు వెళ్తాడు. బీజేపీతో కలిసి ఉంటే స్కూళ్ళలో సూర్య నమస్కారాలు చేయిస్తాడు. బీజేపీకి కటీఫ్ చెప్పినపుడు యోగా డే నాడు అదే పాఠశాలలకు సెలవులూ ఇవ్వగలడు!? కాంగ్రెస్‌కు చెందిన ప్రముఖ నాయకులు ప్రియారంజన్‌దాస్‌మున్షీ, కమల్‌నాథ్ ఆశారాంబాపు దగ్గరకు తరచుగా వెళ్ళేవారు. ఎందరో మంత్రులు, నాయకులు రహస్యంగా పూజలు చేస్తుంటారు.
రాముణ్ణి దిట్టంగా తిట్టగల కరుణానిధి స్వయంగా శ్రీమద్రామానుజులపై రాసిన సీరియల్ కలైంగల్ టీవీలో ప్రసారం అయింది. టీటీడీకి చెందిన వేద పండితులు 06 నాడు ఆయనను ఆశీర్వదించారు. అదే కరుణానిధి భక్తి వికాస స్వామితో రామానుజుల జీవనంపై సమాలోచన చేసాడు. ఫరూఖ్ అబ్దుల్లా పాండే హిందూభక్తి గీతాలను మనం వింటే పులకించిపోతాం. ఒమర్ అబ్దుల్లా, అతని భార్య పాయల్ తమిళనాడులోని విల్లుపురం దగ్గరున్న విష్ణుదేవాలయం సందర్శించారు. ఓ సారి జయలలిత ఎన్నికల్లో గెలిచాక గురువాయుర్ దేవాలయంలో ఏనుగును సమర్పించారు. ఎన్టీఆర్ వివేకానందునిలా వేషం ధరించి, భస్మధారణ చేసాడు. బి.వి. మోహన్ రెడ్డి జాతకాలు ఆయన బాగా నమ్మేవాడని చెప్తారు. అలాగే క్షుద్ర పూజలు చేసాడని కూడ వార్తలొచ్చాయి.
ఇక ప్రస్తుత గవర్నర్ నరసింహన్ సాక్షాత్తూ వైష్ణవపెరుమాళ్‌గా కన్పిస్తాడు.
రాహుల్ గాంధీ కూడా ఈ రోజు సెక్యులరిజం పరిరక్షకుడే. ఆయన గుజరాత్ ఎన్నికల్లో శివభక్తుడిగా మారిపోయి, నాకూ జంధ్యం ఉందని గుళ్ళూ గోపురాలు సందర్శించాడు. కర్ణాటకలో ఎన్నో మఠాలను, శృంగేరి శారదా పీఠాన్ని దర్శించి స్వాములకు నమస్కరించాడు. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కమ్యూనిష్టులు నాస్తిక స్వాములను ఆశ్రయిస్తే సెక్యులర్ పార్టీల నేతలు మఠాల ముందు సాగిలపడ్డారు. ఇక కేసీఆర్ బ్రాహ్మణ భక్తి, దైవభక్తి, దైవభక్తి, గురుభక్తిని గురించి చెప్పనలవికాదు. దేశంలో ఎవరూ చేయని ఆయత చండీయా గాన్ని అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహింపజేసారు.
కొరవి వీర భద్రస్వామికి, తిరుపతి వెంకన్నకు, బెజవాడ కనకదుర్గకు మొక్కులు చెల్లించాడు. యాదాద్రి అభివృద్ధి చేస్తున్న తీరు చరిత్రలో నిలిచిపోయేదే. ఇతర దేవాలయాలు, పండుగలు, ఉత్సవాలు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనంత గొప్పగా చేస్తున్నాడు. కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి భక్తి సంగారెడ్డికి వెళ్తే తెలుస్తుంది. మొన్నటివరకు కమ్యూనిష్టుల్లా వుండి బెంగాల్‌ను ఆక్రమించుకున్న మమతా బెనర్జీ ఇపుడు బీజేపీ పోటీకి వస్తుందని దుర్గా నవరాత్రులు, రామనవమి చేసేవరకు వెళ్ళింది.
వీళ్ళంతా సెక్యులరిజం శిలువ మోసినా నాస్తికులమని చెప్పలేదు. కానీ కమ్యూనిష్టుల భక్తి విశేషాలను ప్రత్యేకంగా చెప్పాల్సిందే! హిరేన్ ముఖర్జీ తిరుపతికి వెళ్ళినట్లు సమాచారం. నంబూద్రిపాద్ లోలోపల దైవభక్తుడే. సీతారాం ఏచూరి, బి.వి. రాఘవులు, కె. నారయణలాంటి అద్భుతమైన సంప్రదాయపు పేర్లు బీజేపీ వాళ్ళకు కూడా లేవు. ఇటీవల కేరళలో బీజేపీకు పోటీగా కమ్యూనిష్టులు వినాయకుడిని పెట్టినట్లు ఓ కమ్యూనిష్టు నేత టీవీ ముఖంగా ఒప్పుకున్నాడు. జూలై 17 నుండి ఆగస్టు 16 వరకు సీపియం పార్టీ తరపున సంస్కృత సంఘం రామాయణ మాసం నిర్వ హించాలని వార్తలొచ్చాయి. వరవరరావు మావోయిస్టుల లక్ష్యాన్ని భారత కథలోని కుంతీ సహదేవుల పుత్రవాత్సల్యంతో వర్ణించారు. కె. నారాయణ తిరుపతికి వెళ్ళి తన కుటుంబం కోసమే అన్నాడు.
దిగంబర కవులుగా అరాచకం సృష్టించిన జ్వాలాముఖి, మహాస్వప్నలు కాళీభక్తులని చెప్తారు. కరడుగట్టిన మార్క్సిస్ట్ గజ్జెల మల్లారెడ్డి స్వామి వివేకానంద రచించిన ద సాంగ్ ఆఫ్ సన్యాసి (The Song of Sanyasin)ను యతిగీతం పేరుతో అనువదించారు. రాముడు లేడని భావించే రంగనాయకమ్మ రామాయాణ విషవృక్షం రాసింది! మార్క్సిస్ట్ జీవనం గడిపిన రావిశాస్త్రి రాచకొండలో దేవాలయం సందర్శించి ‘ఇది మా పూర్వీ కుల గ్రామం’ అని సగర్వంగా చెప్పి అక్కడి మట్టిని మూట గట్టుకుపోవడం ఆశ్చర్యం కాదా! ఇటీవల కె. నాగేశ్వర్ రామాయణంపై చక్కటి క్లారిటీ ఇచ్చాడు. రాముడిని తిట్టిన కత్తి మహేశ్ చివరకు రామనామం జపించాడు.
చేకూరి రామారావు చివరి దశలో భాషాశాస్త్రం ప్రక్కనబెట్టి భగవద్గీత పట్టుకు తిరిగాడని చెప్తారు. అమీనా, మైదానం వంటి నవలలతో హిందుత్వాన్ని, సంప్రదాయాలను అవమానపరచి విశృంఖల స్వేచ్ఛా విహారానికి కారణమైన గుడిపాటి వెంకటాచలం రమణ మహర్షి దగ్గరకు వెళ్ళి ఆ మౌనంలోనే ఏకం అయ్యాడంటే మనం నమ్మగలమా!
తుపాకులు పట్టాలన్న దాశరథి రంగాచార్య ఊర్ధపుండ్రాలు ధరించి వేదానువాదం, ఇతిహాసాలు రాయడం నిజం కాదా? అలాగే పురాణం సుబ్రహ్మణ్యశర్మ నారయణీయం అనువాదం చేసి జన్మ తరింపజేసుకోలేదా? గద్దర్ కొమరవెల్లి మల్లన్న, భద్రాచల రాముడిని దర్శించలేదా? కోదండరాం అనంతగిరి అనంత పద్మనా భుని దర్శించడం నిజంకాదా? మార్కిస్ట్‌లు రహస్యంగా భార్యలతో కలిసి పూజలు చేస్తుంటారన్నది సత్యం.
అంతెందుకు! ఎందరో శాస్త్రవేత్తలు గొప్పభక్తులుగా జీవించారు. ఏపిజే అబ్దుల్ కలాం వీణవాయించి, గీతాపఠనం చేసి హిందువులా రామేశ్వరంలో జీవిస్తే ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ వంటి షెహనాయి కళాకకారుడు గంగను, కాశీ విశ్వనాథుడిని చూసి పులకించి పోయారు. చంద్రశేఖర్ వెంకట్రామన్ గ్రహణం రోజు పట్టు స్నానం, విడుపు స్నానం చేస్తే మీకు ఈ నమ్మకాలేమిటి అని ఎవరో అడిగితే దట్ ఈజ్ సైన్స్, దిస్ ఈజ్ సెంటిమెంట్ అన్నాట్ట! ఇలా ఎందరో సెక్యులర్ ఛాంపియన్లు ఇంత అద్భుత శక్తి ప్రదర్శన తమ వ్యక్తిగత జీవితంలో చేస్తూనే హిందుత్వను చిన్న చూపు చూస్తారు. హిందూమతంలోని ఆచారాలను, పూజలను సెక్యులర్ అని పిలిచేవారే ఎక్కువ నమ్ముతారు.
మరి అగ్నివేశ్ అలా విమర్శిస్తే సెక్యులరిజాన్ని తిట్టినట్లా? దానిని అనుసరించే ఈ నాయకులను తిట్టి నట్లా? మతతత్వ పార్టీ నాయకులుగా ముద్రపడిన ఎ.బి. వాజ్‌పేయి, థాకరే, అద్వాణీలలో పూజలు, ఆచారాలు చెప్పుకోదగినట్లు కన్పించవు. యోగి ఆదిత్యనాథ్ మాత్రం నవనాథుల్లో ఒకరైన గోరఖ్‌నాధ్ పీఠానికి మహంత్‌గా కన్పిస్తారు. నరేంద్ర మోడీ దుర్గా నవరాత్రుల్లో పచ్చి మంచినీళ్ళతో కఠిన ఉపవాసం చేస్తారు. గెలిచాక తన నియోజక వర్గమైన కాశీలో గంగాహారతిలో పాల్గొన్నారు. పశుపతినాధ్, ఢాకేశ్వరిని సందర్శిం చారు.
ఇంతే తప్ప రోజువారీ కార్యక్రమాల్లో హద్దులు మీరిన ఆధ్యాత్మిక చూపించరు! అదే సెక్యులర్ నాయకులు తమ రోజువారీ కార్యక్రమాల్లో భక్తి తీవ్రత ప్రదర్శిస్తారు. ఇక రంజాన్ మాసం వస్తే వీళ్ళంతా బొట్టుపెట్టుకొని, టోపీలు ధరించి ఇఫ్తార్‌లలో పాల్గొంటారు. ఏ ముస్లిం కూడా హిందూ పర్వదినాల్లో తిలకం ధరించడు! కానీ ఇదే సెక్యులర్ మేధావులు, మీడియా మోడీ, , ఆదిత్యనాథ్ టోపీని తిరస్కరించినందుకు పెద్ద వివాదం సృష్టించారు. ఇక్కడ ముస్లిం నాయకులకు క్లారిటీ ఉన్నట్లే బీజేపీ నాయకులకు క్లారిటీ ఉంది. ఎటొచ్చీ సెక్యులర్ నాయకులకే లేదు. ఇంతలా మాతాచారాలను నెత్తినమోసేవారు హిందుత్వంపై విరుచుకు పడతారు. ఇదంతా అవగాహనా లోపమా! అవకాశవాదమా!!
✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి
వర్తమాన భారతం : విజయక్రాంతి
జులై - 24 - 2018 : మంగళవారం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి