హిందువుగా జన్మించుట ఇలలో మహా భాగ్యం’ అన్న పెద్దల మాట అక్షర సత్యం. వేల సంవత్సరాల ఉన్నత సంస్కృతికి వారసులు హిందు వులు. కత్తికి భయపడిపోయి మతం మార్చుకోని ధైర్యవంతుడు హిందువు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల రక్షకులు హిందువులు.

ఒకజాతి సంస్కృతి వారు ఆచరించే పండుగలను బట్టి అంచనా వేయవచ్చు. సంస్కృతీ సంప్రదాయా లకు పుట్టినిల్లు అయిన హిందూదేశంలో ప్రతిరోజు ఓ పండుగే. విశ్వానికే గురువైన ఈ పవిత్ర భూమిలో ఆచరించే పండుగలన్ని శాస్త్రీయమైనవే. 

తిథి, వారం, నక్షత్రం, ఋతువులు, గ్రహాల గమనంపై ఆధార పడినవి, సూర్యుని గమనానికి సంబంధించినవి, ప్రకృతిని పరిచయం చేసేవి, మనిషి సహజ స్వభావ మైన ఆనందాన్ని ఇతరులతో పంచుకునేందుకు ఉద్దేశించినవి, కుటుంబ సభ్యుల మధ్య అనురాగాలు, అనుబంధాలు పెంచేవి, మనిషి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఏర్పాటు చేసినవి, మన పూర్వీకులకు కృతజ్ఞతను ప్రకటించేవి, మన ఇంటిని స్వచ్ఛతతో అందంగా అలంకరించుకునేందుకు ప్రేరణనిచ్చేవి, ఇంటికి బంధుమిత్రులను ఆహ్వానించి సత్కరించు కునేందుకు, తన ఉన్నతికి కారకులైన గురువులను సత్కరించుకోవటం కోసం ఉద్దేశించినవి – సమర్పణా సంస్కారం కలిగించేవి, లోక సంగ్రహణ ప్రధాన ఉద్దేశంగా ఋషులు అందించిన పర్వదినాలు ఎన్నో మనకు ఉన్నాయి. 

ప్రతిరోజు పండుగే మనకు. ఈ పండుగలలో అరవై పండుగల గురించి విస్తృతంగా రాసిన గ్రంథమే ‘హిందువుల పండుగలు’. 670 పేజీల ఉద్గ్రంథం. ఈ ఘనకార్యం చేసిన గ్రంథకర్త డా|| పి.భాస్కరయోగి.

‘ఆధునిక జీవనాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ ఈ దేశ పౌరులకు తన అక్షరాల ద్వారా విజ్ఞానాన్ని అందిస్తున్న కవి, రచయిత, పండితులు, విమర్శకులు, అధ్యాపకులు, పాత్రికేయ ప్రకృతి తెలిసిన విజ్ఞులు’ అంటూ డా|| భాస్కరయోగిని శ్లాఘించారు ఆచార్య కసిరెడ్డి ఈ పుస్తకం ముందుమాటల్లో. ఈ యోగి యోగ్యమైన కలం జాగృతి పాఠకులకు సుపరిచితమే.

లోగడ సురవరం ప్రతాపరెడ్డి(1931), తిరుమల రామచంద్ర(1960) రాసిన పండుగ పుస్తకాలకు మరింత మెరుగులు దిద్దిన ఉద్గ్రంథం ‘హిందువుల పండుగలు’. పూర్వ రచనలతోపాటు 182 ఇతర పుస్తకాలు, ఎన్నో ఆధ్యాత్మిక వ్యాసాలు పరిశీలించి, పరిశోధించి సమగ్రమైనదిగా, శాస్త్రీయమైనదిగా పాఠకుల ముందు పెట్టిన అపూర్వ గ్రంథమే ఇది.

ప్రతీ పండుగకి ఉన్న శాస్త్రీయత, ఆధ్యాత్మికత, చారిత్రకత వెరసి అరవై పండుగల కథా- కమామీషుని సులభమైన భాషలో ఈ పుస్తకంలో డా|| భాస్కరయోగి తెలుగు పాఠకుల ముందుపెట్టారు.

సృష్టికి జన్మదినమైన ‘ఉగాది’తో రచయిత పుస్తకాన్ని ప్రారంభించారు. తొలి పండుగకి 24 పేజీలు కేటాయించారు. ఉగాది జరుపుకోవటానికి ఉన్న పౌరాణిక (మత్స్యావతారం దాల్చిన రోజు), చారిత్రాత్మక (విక్రమాదిత్య పట్టాభిషేకం రోజు) కారణాలను వివరిస్తూ.. అసలు మన 12 మాసాలకి 12 నక్షత్రాల ఆధారంగా పేర్లు ఎలా వచ్చిందీ తెలియ జేశారు. 

ఉగాదికున్న ఖగోళ, జ్యోతిష్య విశేషాలను, ఉగాది పచ్చడి వెనుకున్న వైజ్ఞానిక రహస్యాలను, వివిధ రాష్ట్రాలలో ఈ పండుగను ఎలా జరుపుకుంటారన్న సమాచారాన్ని రచయిత విపులంగా అందించారు. సంస్కృతాంధ్ర భాషలలో రచయితకున్న పాండిత్యం కారణంగా పుస్తకంలో అక్కడక్కడ (పాయసంలో జీడిపప్పు, కిస్‌మిస్‌ల మాదిరి) అనేక శ్లోకాలను, పద్యాలను సందర్భానుసారంగా అందించటంతో విషయ నిరూపణలో ప్రామాణికత హెచ్చయింది.

వ్యవసాయ పనుల్లో సాయపడే, వర్షంతో ముడిపడిన కార్తెలను గురించిన అవగాహన ప్రజలలో సన్నగిల్లడంపై రచయిత ఆవేదనను వ్యక్తం చేశారు. బ్రిటీష్‌ దురహంకారుల వల్లనే మన ప్రాచీనులు అందించిన శాస్త్రీయ విషయాలు ప్రజలకు దూరమయ్యాయని అన్నారు. 

స్వాతంత్య్ర భారతంలో కూడా వ్యవసాయ పట్టభద్రులకు ఈ జ్ఞానాన్ని అందించక పోవటం శోచనీయం. హిందువులు ఆచరించే ఉపవాసాలు దేహానికి, దేశానికి కూడా ఉపయోగిస్తాయి.

‘ఏకాదశి’ పర్వదినాలను గురించిన అధ్యాయంలో 24 వివిధ ఏకాదశుల ప్రాశస్థ్యాన్ని, ఆ పుణ్యతిథుల్లో ఆచరించాల్సిన ఆహార నియమాలు, దీపదానాలు, జాగరణలు వంటి వాటిని సవివరంగా తెలిపారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకూ సాగే చాతుర్మాస దీక్షలు, వాటి ప్రాశస్థ్యం, విధి, నిషేధాలను భాస్కరయోగి భక్తి ప్రపత్తులతో అందించారు.

‘దేశంలో వివిధ ప్రాంతాలలో హిందువులు ఆచరించే పండుగలు, వాటి పరమార్థం, దశావ తారాల జయంతులతోపాటు హనుమ, శంకర, బసవ, మహావీర్‌, మధ్వాచార్య, రామానుజాచార్య, విశ్వకర్మ, గురునానక్‌ వంటి ప్రాతః స్మరణీయుల జయంతి పండుగలను వివరంగా రచయిత అందించారు. పత్రికా విలేకరులకు ఆద్యుడైన ‘నారదమహర్షి’ జయంతిని పాత్రికేయ దినోత్సవంగా, ఛత్రపతి శివాజీ సింహాసనాన్ని అధిష్టించిన రోజును ‘హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకోవటం కొంతమందికే తెలుసు. శివాజీని గురించిన స్ఫూర్తిదాయక ఘట్టాన్ని 11 పేజీల్లో రచయిత ఎంతో బాగా వర్ణించారు. 

ధర్మయుద్ధాలకు మాత్రమే అలవాటుపడిన హిందూ రాజులను మోసపూరితంగా గెలుస్తూ వస్తున్న విదేశీ దురాక్రమణదారులకు వారిదైన భాషలో జవాబు చెప్పి, చెమటలు పట్టించి, వెన్నులో వణుకు పుట్టించిన గెరిల్లా యుద్ధతంత్ర నిపుణుడైన శివాజీని రచయిత ఈ వ్యాసంలో  
శ్లాఘించి ‘హిందూ సామ్రాజ్యదినోత్సవాన్ని’ పాఠకులకు పరిచయం చేశారు.

పండుగల పరమార్థం తెలుసుకోవాలంటే, ఆ పండుగలను గురించిన లోతైన విషయాలను ఆకళింపు చేసుకోవాలంటే ఈ గ్రంథం పనికి వస్తుంది. ఎక్కువ మందికి రచయిత కొత్తగా పరిచయం చేసిన పండుగ ‘తేజో ఉత్సవం’. ‘తేజ్‌’ అంటే కన్నె పిల్ల. ఆమె ఎవరో కాదు సాక్షాత్తు గౌరీ దేవియే. గిరిజనులు తమ సంప్రదాయాల కనుగుణంగా శ్రావణమాసంలో జరుపుకొనే ఈ పండుగ గురించి రచయిత చాలా వివరాలే సేకరించి అందించారు. వాళ్ళు పాడుకొనే పాటలను బంజారీ తండాల నుంచి సేకరించి అందించటం విశేషం.

‘ప్రతిరోజూ పండుగే’ అంటూ చివరిగా ఓ 228 రోజుల ప్రాధాన్యాన్ని మాసాల వారీగా రచయిత తెలియజేశారు. హిందువులమైనందుకు గర్వించేవిగా ఉన్న ఈ సూచి చదువుతోంటే ‘ప్రతిరోజూ పండుగే మనకి’ అని తప్పక అనిపిస్తుంది. గ్రంథకర్త డా|| పి.భాస్కరయోగి కృషి అభినందనీయం. ఈ పండుగల పుస్తకాన్ని మన పుస్తకాల గూటిలోనికి తప్పక తెచ్చుకోవాలి.

''హిందువుల పండుగలు''
రచన : డా|| పి. భాస్కరయోగి
పుటలు : 676, వెల : రూ.500/-
ప్రతులకు : కొండా లక్ష్మీ కాంతరెడ్డి
విజ్ఞాన సరోవర ప్రచురణలు
ఫోన్‌ : 040-27427920, 9959656464
అన్ని ప్రముఖ పుస్తక విక్రయకేంద్రాలు, హైదరాబాద్‌

*********************************
 ✍ ✍ బి. ఎస్. శర్మ 
 జాగృతి :  పుస్తక సమీక్ష

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి