ॐ విజయక్రాంతి దినపత్రిక 卐 శనివారం 05-05 -2018 卐 ॐ

చంచలమైన మనస్సును మనం అర్చనలోని ఆరాధన చూసి ఏకాగ్రతలోకి తేవటానికి ప్రయత్నం చేస్తాం, దేవునికి మనం సమర్పించే గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం అనే వాటిద్వారా కళ్లు, ముక్కు, చెవులు, నాలుక, స్పర్శ - ఇవన్నీ సుఖం పొందుతాయి. ఇది పంచోపచారపూజ’ ద్వారా పొందే ఆనందం.

ఆలయానికి పేర్లు

ఆలయం, గుడి, కోయిల్, మందిరం, ప్రాసాదం, చైత్యం, హర్మ్యం ఇవన్నీ ఆలయానికి పర్యాయపదాలు. అయితే ఇందులో ఆలయం, గుడి, మందిరం ప్రసిద్ధికెక్కాయి. మందిరం - శబ్దానికి గృహం అని అర్థం కూడా ప్రాచుర్యంలోకి వచ్చాక బట్టల దుకాణానికి కూడా (శారీమందిర్) అని తగిలించి, మందిర శబ్దాన్ని అపవిత్రం చేశారు.

దేవాలయం -రకాలు

స్వయంవ్యక్తములు :- స్వయంగా వ్యక్తమయినవి. ఉదా॥ కాశి, తిరుపతి
దివ్యములు :- ద్రాక్షారామం, అమరారామం
ఆర్షములు :- ఋషులచే నిర్మింపబడినవి (యాదవ ఋషిచే యాదగిరి)
సిద్ధములు :- కంచి
మానుషములు :- మానవులచే నిర్మితమైనవి.

దేవుడికి నైవేద్యం

విశేషంగా గ్రహించే శక్తి గలది విగ్రహం. ఏ దేవతనైతే మనం అర్చించదలచుకొన్నామో ఆ దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసే సమయంలోనే జీజాక్షరాలతో కూడినయంత్రాలను, ఆకర్షణయంత్రాలను పెట్టి వాటికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. దేవతకు సాకార స్వరూపమే విగ్రహం. అలాంటి విగ్రహాలకు 1) తాత్కాలిక నైవేద్యం 2) మహానైవేద్యం - అని రెండు రకాలుగా నివేదన చేస్తారు. భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య పదార్థాలను ఎవరి దృష్టి పడకుండా శుచి, శుభ్రతతో తయారుచేస్తారు. పెద్ద పెద్ద ఆలయాల్లో 1) హరిద్రాన్నం 2) ముద్గౌదనం 3) పాయసాన్నం 4) స్నిగ్దౌదనం 5) దధ్యోదనం మహానైవేద్యాలుగా పెడతారు.

దేవుడిని దర్శించడంలో అంతరార్థం

దేవుడిముందుకు రావాలంటే ఆలయానికి ఓ పద్ధతిగా ప్రవేశించాలి. గోపురం నుండి ఆలయంలోకి అడుగుపెట్టిన వెంటనే తాను, తన శరీరం శాశ్వతం కాదని, ఆత్మస్వరూపమని తెలుసుకొంటాడు. గోపురం దాటి ప్రాకారంలోకి అడుగుపెట్టగానే ‘బలిపీఠం’ కన్పిస్తుంది. అక్కడికెళ్లి అరిషడ్వర్గాలను విడిచి సాష్టాంగదండ ప్రణామం చేస్తారు. లేచి ధ్వజలింగ చిహ్నమైన ధ్వజస్తంభానికి నమస్కరిస్తారు. బలిపీఠం - కుండలిని, మూలాధారచక్రానికి ప్రతీక అయితే, ధ్వజస్తంభం స్వాధిష్ఠాన చక్రానికి ప్రతీకగా భావిస్తారు. ఆలయంలోని జ్యోతి ఆత్మజ్యోతికి ప్రతీక, పూర్తిగా వికసించిన పద్మం పరమాత్మకు సంకేతం దళాలు సృష్టి లయకారానికి, సంకేతాలుగా చెప్పొచ్చు. మహామంటపంలో వాహన దర్శనం చేసి మూలవిరాట్ దర్శన అనుమతి తీసుకోవాలి. మహామంటపంలోని ధ్వజస్తంభం జీవుని ఊర్ధ్వగమనానికి సూచికగా, కుండలిని శక్తికి ప్రతీకలుగా భావించాలి.

ఆలయం -ఆనందం...! 

భక్తి అలవడుతుంది. క్రమశిక్షణ నియమబద్దజీవనం ఆలయం ద్వారా నేర్చుకోవడానికి వీలు కలుగుతుంది. దేవుణ్ణి గుర్తింపజేసే స్థలం.ఆత్మ-పరమాత్మల తాదాత్మ్యం ఆలయంలో కలుగుతుంది.మత సంబంధ విషయాలు తెలుసుకోవడానికి, ఆచరించడానికి అనువైన స్థలం ఆత్మలయించే స్థలం దేవాలయం.ధార్మికశక్తి పెరిగి ఏకత్వభావన నిర్మాణం అవుతుంది. అహం తగ్గిపోయి, భక్తి విశ్వాసాలు పెరుగుతాయి.ఆలయాల్లో వ్యాపారదృష్టి తగ్గి దైవతత్వం పరిమళించాలి.దైవభక్తి, నీతినిజాయితీ గల వ్యక్తులనే పాలకమండళ్లలో నియమించాలి.

ప్రతి ఆలయంలో ధ్యానకేంద్రం, పుస్తకాలయం, సమావేశమందిరం, తప్పక నిర్మించాలి. ఆలయంలో తప్పకుండా సత్సంగం, ఆధ్యాత్మిక ప్రవచనాలు జరగాలి. దేవాలయంపై మంచి సూక్తులు, సంగీత సాహిత్యం మేళవించిన పాటలు వినిపించాలి.దేవాలయం ఆధీనంలో పేదలకు అన్నదానం, ఉచిత ఆసుపత్రి నిర్వహించాలి.స్త్రీలు సహస్రనామపారాయణ బృందాలుగా ఏర్పడి చేయాలి.

భగవద్గీత పఠనం, అధ్యయనం దేవాలయంలో చేయాలి

దేవాలయం ఓ పరిశోధనశాలధ్వని సూక్ష్మమైన విద్యుత్తని ఈరోజు శాస్త్ర సాంకేతిక రంగాలు అంగీకరిస్తున్నాయి. నిజం చెప్పాలంటే ప్రతీది విద్యుత్తు యొక్కరూపమే, భారతీయఋషులు విద్యుత్తు శబ్దరూపమనీ, దానికి పునాది ధ్వని అనీ, విద్యుత్తు కాదని లోతైన చింతనతో చెప్పారు. అందుకే భగవంతుణ్ణి శబ్దబ్రహ్మఅని పిలుస్తారు. గోపురం క్రింద కూర్చొని ఓం అనే మంత్రాన్ని నిజమైన ధ్యాని ఉచ్ఛరించినపుడు అక్కడ గోపురం-దేవాలయం మాయమై శబ్ద బ్రహ్మ పరమాత్మనే మిగులుతాడు. ఇలా శబ్దబ్రహ్మ అయిన భగవంతుని అన్వేషణకు ఏకైక పరిశోధన కేంద్రం దేవాలయం.

కేవలం శబ్దబ్రహ్మ ఉపాసనాకేంద్రం మాత్రమే కాదు; సామాజిక విజ్ఞాన శోధన కేంద్రంగా దేవాలయాన్ని చెప్పవచ్చు, పశుత్వంలోని మనిషిని - మనిషిగా, దివ్య పురుషులుగా తీర్చిదిద్దే శక్తికేంద్రం దేవాలయం. అలాంటి దేవాలయాలు ఈనాడు కబంధహస్తాల్లో చిక్కుకొని హైందవ జాతిని నిర్వీర్యం చేస్తున్నాయి.

“ఇన్ద్రమిత్రం వరుణమగ్నిమాహురథో
దివ్యః సుపర్ణొ గరుత్మాన్ 
ఏకం సద్విప్రా బహుధావదన్తి అగ్నిం
యమం మాతరిశ్వానమాహుః ॥

సనాతన ధర్మంలో బహు దేవతారాధన ఉంది  దీనికి పై శ్లోకమే ప్రమాణం.

ॐ 卐 డాక్టర్. పి. భాస్కర యోగి ॐ 卐  ఆధ్యాత్మిక వ్యాసం ॐ 卐



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి