ప్రపంచంలో అత్యంంత ప్రాచీన భాష సంస్కృతం. భారతీయ భాషలన్నింటిపైనా సంస్కృత ప్రభావం ఉంది. ఇప్పటికీ మన పూజా విధానంలోని మంత్ర విజ్ఞానమంతా సంస్కృతమే వాడుతున్నాం. కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు ప్రజలందరి సంప్రదాయ పద్ధతిలో కొద్ది మార్పులతో సంస్కృతభాషను వాడుతున్నాం. మన నిత్యజీవితంలో సంస్కృతం ఓ భాగమై పోయింది. ఆ భాష ప్రభావం అన్ని ప్రాంతీయ భాషలపై ఉండడం వల్ల మన ప్రార్తనలు, స్తోత్ర పఠనాలపై కూడా వైదిక సమానత్వం కన్పిస్తుంది. హిందూధర్మంలో బహుదేవతారాధన ఉంది. కానీ “ఏకం సద్విప్రా బహుధావదన్తి” - ఉన్నది ఒక్కటే సనాతన సత్యం.. పండితులు దానిని అనేక విధాలుగా చెప్తారు కానీ, అది ప్రధాన సూత్రంగా భావిస్తోంది.
మనధర్మం చీమ మొదలుకొని బ్రహ్మ వరకు ఒకే తత్త్వం అనేకరూపాల్లో ప్రవర్తిస్తుందనేది ఆ వేద వచనం సారాంశం. మోక్ష సాధనకు పరమాత్మను ప్రార్థన చేస్తాం. అందుకు అనుగుణమైన తత్త్వాన్ని అందించడం కోసం దేవతలను ఆరాధిస్తాం. అలాగే మనకు సహాయపడే శక్తులను ఆరాధిస్తాం. “నా ధర్మం సేవచేయడమే..దానికి కట్టుబడి ఉండటమే” అంటాడు అప్పర స్వామి. రంతి దేవుడు పరోపకారం కోసం 48 రోజులు ఉపవాసం చేసి ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ‘అఖిల దేహ భాజాం ఆర్తిం ప్రపద్యే” అంటే - ‘సమస్త జీవుల బాధలను స్వీకరించే శక్తిని నాకు ఇవ్వు” అంటాడు. ఇంతకన్నా గొప్ప మాట ఇంకేముంది? హిందూ ధర్మంలో ఇలాంటి మహోన్నతత్త్వానికి భావనలు కోకొల్లలు కన్పిస్తాయి. భూమిని ఒక తల్లిగా, జీవితత్వానికి ప్రతీకగా హిందువులు భావిస్తారు; అందుకే ‘పృధ్వీ సూక్తమ్’ పఠనం చేస్తాం. భూమి మనకిచ్చిన వనరులు-మనం వాడుకొన్నందుకు కృతజ్ఞతగా భూసూక్తంతో ప్రార్థన చేస్తాం.
చెట్టు-పుట్టల పట్ల హిందువులకున్న కృతజ్ఞత ప్రపంచంలో ఏ జాతికి లేదు. మనకు ఎందరో గ్రామ దేవతలున్నారు, వారి మూలరూపం పౌరాణిక దేవతలే. ఉదాహరణకు మహిషారసుర మర్దని -మైసమ్మగా, బాలా త్రిపురసుందరి - బాలమ్మగా మారింది. త్రిమూర్తులు మొదలు ప్రతి దేవుడికి ఉపాసనకు అనుగుణంగా స్త్రీదేవత, వాహనం మొదలుకుని కన్పిస్తాయి. సిద్ధి, బుద్ధి అనే స్వభావాలు (గుణాలు) వినాయకుడి ఉపాసనలో భార్యలుగా భావిస్తారు. ప్రజలకు నైతిక విలువులు అందించడం కొరకు నీతి సూత్రాలు సంస్కృతంలో ఉన్నా.. సామాన్యులకు అదో సామెతగా, ఆ నీతి సూత్రం మారిపోయింది. ఏమి చదువురాని వారు కూడా ఉదయం నిద్రలేచి, తమ అరచేతిని దర్శించి “కరాగ్రే వసతే లక్షీ...” శ్లోక పఠనం చేస్తారు. సూర్యుడ్ని దర్శించి నమస్కారం చేస్తారు.
వేదంచదువుకొన్న వారు ‘సంధ్యావందనం’ చేస్తారు. ఈ రెండింటి మధ్య అమంత్రక, సమంత్రక భేదమే తప్ప ఇంకేమీ లేదు. హిందూ వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ ఇవాల్టికీ పటిష్టంగా ఉన్నాయి. ప్రపంచ సంస్కృతిలో మనది ప్రత్యేక సంస్కృతిగా నిల బడింది ఈ రెండింటి వల్లనే అని చెప్పొచ్చు. ధర్మేచ,అర్థేచ, కామేచ... అంటూ ప్రమాణం చేయిస్తాడు పురోహితుడు. నాతిచరామి - నేను అతిగా చతుర్విధపురుషార్థాల్లో చరించను అని ప్రమాణం చేస్తాడు. మూడు ముళ్లు, ఏడు అడుగులు, లాజహోమం, చేసి ఏడు జన్మల వరకు దంపతులు కలిసి జీవిస్తారు. నిత్య, నైమిత్తిక కర్మలో దంపతులు అప్రతిహతంగా జీవితాంతం ముందుకు సాగిపోతారు. కేవలం కొన్ని ప్రమాణాల ద్వారా దేవుడిని ఆధారం చేసుకొని ఇంతచక్కని వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం హిందూవ్యవస్థలో విశేషం.
పూర్వం అప్పు తీసుకున్న వారు ఋణ పత్రం రాసుకొనే టపుడు ‘సూర్య చంద్రుల సాక్షిగా’ - అని రాసుకొనే వారు. ప్రత్యక్షంగా కన్పించే దేవతలను సాక్షులుగా పెట్టి నియమాలకు కట్టుబడి ఉండేవారు. నదీస్నానాలు వివిధ పర్వదినాల్లో ఎవరూ చెప్పకున్నా హిందువులు ఆచరిస్తారు. నదులపై మన ఋషులు సూక్తాలు రచిస్తే, కవులు కావ్యాలు రచించి ప్రజల్లో వాటి పట్ల ప్రేమను నిర్మించారు. మనకు ఆహారాన్ని అందించే పంటలకు నీరు ముఖ్యం. నీటికి నదులు ముఖ్యం. కాబట్టి నదులను ఆరాధించారు హిందువులు, వాటి నుండి సాగునీరు-త్రాగునీరు లభిస్తుంది. కాబట్టి వాటి గొప్పతనానికి పవిత్రతను ఆపాదించడంవల్ల నదీపూజనం మన జీవితంలో ఓ ముఖ్య భాగం అయింది. ఖగోళంలో జరిగే మార్పులను గమనించడానికి జ్యోతిష శ్శాస్త్రం రచింపబడింది.
వాటి శుభాశుభాలను తెలుసుకోవడానికి నక్షత్ర, గ్రహగమనాన్ని, పంచాంగాన్ని సామాన్యుల వరకు అందించడానికి ఫలితభాగం తోడయ్యింది. ఎప్పటికపుడు మనిషి నడతను నియంత్రణలో ఉంచడానికి పంచాగం కీలకమయ్యింది. హిందువులకు ఇంటి దేవతలు, ఇష్ట దేవతలు, కుల దేవతలు, గ్రామదేవతలు వెలిసారు. వీళ్లంతా ప్రజల కష్టనష్టాల్లో మనోధైర్యం ఇవ్వడానికి ఉపయోగపడతారు. ఇటీవల ఓ మతపార్టీ నాయకుడు మాట్లాడుతూ ‘పుట్టుకతో అందరూ ముస్లింలే’ అన్నాడు. మరి ఇస్లాం పుట్టింది 6,7 శతాబ్దాల్లో అయితే అంతకు ముందు ప్రజలు ఏమతం వారు? ఇస్లాం, క్రైస్తవంలో కూడా కొన్ని సంస్కారాలు గర్భస్థ శిశువు జన్మించాకే నిర్వహిస్తారు. కాని హిందూ సంప్రదాయంలో పిండోత్పత్తి జరుగకముందే చేసే కొన్ని సంస్కారాలుంటాయి.
ఇవి షోడశ సంస్కారాల్లో భాగమే, గర్భాదానం నుండి అంత్యేష్టి వరకు ఈ సంస్కారాలు హిందూ జీవనాన్ని ప్రతిబింబిస్తాయి. గర్భాదానం, పుంసవనం, సీమంతం, జాతకర్మ, నామకరణం, అన్న ప్రాశనం, చూడాకరణము, ఉపనయనం, వైశ్వదేవం, గోదానం, స్నాతకం, వివాహం, అంత్యేష్టి అనే 16 సంస్కారాలు హిందువులను పుట్టక ముందు నుండి మరణించే వరకు కాపాడుతుండడమే గాక, జీవితాలకు ధర్మాన్ని ముడిపెట్టి ఉంచే ప్రయత్నం చేస్తాయి. హిందువుల ప్రతి అడుగులో పాత్రవహించే కుంకుమ, పసుపు, గంధం, తిలకం, పూలు, అలంకరణ, గాజులు, పురుషులకు యజ్ఞోపవీతం, గురుమాల (దీక్షామాల) ప్రాధాన్యత వహిస్తాయి. శరీరం ఎలా తన భాగాలను కలిగి ఉంటుందో, అన్ని విషయాలు ఇందులో భాగమై ఉంటాయి. సంధ్యావేళ దీపం వెలిగించి ‘దీపంజ్యోతి పరబ్రహ్మ’, అంటూ బాలకులు గానంచేసి పరమాత్మను స్ఫురణకు తెచ్చుకొంటారు.
ఇలా హిందువులు నిత్య జీవితంలో మతాచారాలను తమ నిత్య కర్మల్లో భాగంగా ఆచరిస్తారు. మత -సంప్రదాయలను ప్రత్యేకంగా ఆలోచించి చేయకుండా విశ్వాసంతో, శ్రద్దతో క్రమశిక్షణతో ఆచరిస్తారు. అందువల్ల హిందూమతం జీవనవిధానమేగాని జీవితాలపై రుద్దబడేది కాదు. పుట్టడం - పెరగడం - మరణించడం అనేవి నిత్య జీవనంలో సులభంగా గ్రహించే విధంగా వేదాంతం ఏర్పాటు చేశారు మన ఋషులు. అందులోని మర్మాలను అన్వేషించి, ఆధునిక కాలానికి సరిగ్గా అన్వయించుకుంటే మన ధర్మాన్ని మనం శాశ్వతం చేయగల్గుతాం.
పరమాత్మా ! పరిరక్షించు నా ధర్మాన్ని
వరమిచ్చే దేవుడవై కరుణించే ధాముడవై
పరమానస శక్తుల చుర కత్తుల నుండి
చెరబట్టే దుష్ట శక్తుల దురాగతాల నుండి రక్షించు నా ధర్మాన్ని!
***************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి