''తమసోమా జ్యోతిర్గమయ!

అసతోమా సద్గమయా
తమసోమా జ్యోతిర్గమయా
మృత్యోర్మా అమృతంగమయా''
అసత్తునుండి సత్తుకు, తమస్సునుండి వెలుగుకు, మృతువునుండి అమృతత్వానికి తీసుకెళ్లు! అని పరమాత్మను ఋషులు ప్రార్థించిన శ్లోకం. వాళ్లను చూస్తే మన అతి తెలివిపరులైన మానవజాతికి ఆశ్చర్యం కలుగక మానదు. ఎందుకంటే మనం ‘అమృతత్వం’ మాటను పక్కన పెడితే ‘మానవులుగా’ జీవిస్తున్నామా? అన్నదే ప్రశ్న!
పరదారాపహరణమ్- ఇతరుల భార్యలను దొంగిలించడం; పరధనాపహరణమ్- ఇతరుల ధనాన్ని హరించడం; పరరాజ్యాపహరణమ్- ఇతరుల రాజ్యాన్ని హరించడం- ఈ మూడూ రాక్షసుల గుణాలని చెప్పబడ్డాయి.
ఈ రాక్షసుల ప్రవృత్తిని తూ.చ తప్పకుండా వేర్వేరు రూపాల్లో మనం ప్రవర్తిస్తూనే మళ్లా బుద్ధిమంతుల ముసుగేసుకుంటున్నాం! ‘అమృతపుత్రులుగా’ వేదం మనల్ని గురించి చెప్పింది. మరి ఏమిటో మనలోని ఈ రాక్షస ప్రవర్తన!
ధనవ్యామోహం: డబ్బు సంపాదించినవాడే గొప్పవాడనుకోవడం మన దురదృష్టం. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలకు సమాజంలో ఎవ్వరికీ లేని గౌరవం లభిస్తున్నది. తద్వారా డబ్బు సంపాదించుకోవడం గొప్ప అనుకొంటున్నాం. అంతేగాకుండా ‘ఆర్థిక సరళీకరణ’వల్ల డబ్బు వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోయింది.
దానికితోడు ‘్భగలాలసత’ బాగా పెరిగిపోయింది. మనకు తాత్త్వికదృష్టి తగ్గిపోయి ‘ఆనందమే పరమావధిగా జీవిస్తున్నాం.
అధికార కాంక్ష: పూర్వం సమాజంలో జ్ఞానులకు, త్యాగపురుషులకు, గొప్ప పనులు చేసినవాళ్లకు, పీఠాధిపతులకు, సమాజ సంస్కర్తలకు గౌరవం ఉండేది. ప్రస్తుతం రాజకీయ నాయకులకు- వారెంత చెడ్డవాళ్లైనా సకల మర్యాదలు అందుతున్నాయి. ఎన్ని తప్పులు చేసినా ‘అధికారం’ ఉంటే చాలు అన్న భావన బలపడింది. ఈ మనస్తత్వం ప్రజల్లో కూడా పెరిగిపోతోంది. కాబట్టి అడ్డదారిలోనైనా ఈ అధికారం సంపాదిస్తే చాలు అన్న ధోరణి పెరిగిపోయింది.
ఈర్ష్య: ఇతరుల మంచిని చూసి ఓర్వలేనితనం, అసహనం రోజురోజుకు పెరుగుతున్నది. సంపదను, అధికారాన్ని ఇతరులతో పోల్చి చూసుకొని మన సొంత వాళ్ళను కూడా ఓర్వలేని బుద్ధి రోజురోజుకు పెరిగిపోతున్నది.
ఈ మూడు ఈనాడు నాయకులనుండి సామాన్యుల వరకు అందరినీ పాడుచేస్తున్నాయి. వీటిని వదలిపెట్టాలంటే తాత్విక దృష్టిని అలవర్చుకోవాలి. అందుకు సంబంధించిన భాగవతాది గ్రంథాలను పఠించాలి. ‘సర్వం పరమేశ్వర ప్రసాదం’ అనే భావన ఉండాలి. ‘నేను నిమిత్తమాత్రుడను’ అనే భావన హదృయాల లోతుల్లో పాతుకుపోవాలి.
నిరాడంబరత - వైరాగ్యం: సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో జీవితం కొనసాగించాలి. మనిషికి రాక్షస ప్రవృత్తిని కల్గించే మద్య మాంసాలు త్యజించాలి. మన గృహంలో జరిగే ప్రతి కార్యక్రమంలో మద్యమాంసాల ప్రాధాన్యత తగ్గించాలి
ఆహార విహారాల్లో సాత్త్వికదృష్టి: మనం ధరించే వస్తువులు, దుస్తులు సరళంగా- అందంగా ఉండేట్లు చూసుకోవాలి. తామసాన్ని కలిగించే ఆహారాన్ని వదలిపెట్టి సాత్త్విక ఆహారం భుజించే అలవాటు చేసుకోవాలి. ఇలా ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించుకోవచ్చు. మన సంస్కృతిని అభిమానించడం: భారతీయ ఋషులు, మహర్షులు ఎన్నో ఏళ్ళ తపస్సు ద్వారా సాధించిపెట్టిన మన సంస్కృతిని మన వారసత్వంగా భావించాలి.
ఈ దేశంలోని దేవాలయాలు, శిల్పం, కళలు, విద్యలు, ధార్మికత, గ్రంథాలు, మన చరిత్ర, మన వీరులు.. ఇదంతా మన సంపదగా భావించాలి. ధార్మిక దృష్టి:మన మహాత్ముల, గ్రంథాల బోధనలను నిశితంగా అర్థం చేసుకోవాలి. దేశాన్ని దేవుణ్ణి రక్షించుకొనే ధార్మిక దృష్టి అలవర్చుకోవాలి.
స్వామీ! ఈ దేశాన్ని రక్షించు! నాకూ ఈ దేశానికీ చైతన్యం కల్పించేది నీవే. ఈ దేశానికి దిక్సూచివి. ప్రజలకు సద్బుద్ధిని ప్రసాదించు. ఓం తత్ సత్.


************************************************

      డాక్టర్‌. పి. భాస్కర యోగి
      ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ
ॐ బుధవారం 卐 ఏప్రిల్ 25 卐 2018 ॐ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి