వృక్షో రక్షతి రక్షతి.. అనే స్ఫ్రుహ ఈనాటిది కాదు.. క్రీస్తుపూర్వం నాటికే అశోకుడు రోడ్డుకు ఇరువైపులా వృక్షాలను నాటించాడని చిన్నపుడే పాఠాల్లో చదువుకుంటాం.. మన పురాణేతి హాసాలు, శాస్త్రాల్లో చెట్లు, మొక్కలు, పుష్పాలకు సంబంధించిన శాస్త్రీయ వివరణలు ఎన్నో కనిపిస్తాయి.. వృక్షాల స్పందన, పెరుగుదల ఎలా ఉంటుందనేది మనశాస్త్రాలు చక్కగా చెప్పుకొచ్చాయి..
అశోకశ్చరణా హత్యావకులో ముఖసీధునా
ఆలింగనాత్కురవకస్తిలకో వీక్షనేనచ
కరస్పర్శేన మాకన్దో ముఖరాగేణ మమృకః
సల్లాపతః కర్ణికారః సిన్దువారో ముఖానిలాత్
గీత్యాప్రియాళుర్నితరాం నమేరుర్మ సీతేనచ
(తాత్పర్యము: అశోక వృక్షము (స్త్రీలు) తన్నుట చేత, పొగడ చెట్టు ఉమ్మడం వల్ల, గోరంట ఆలింగనము వల్ల, తిలకం చెట్టు చూడటం వల్ల, మామిడి చేత్తో తాకడం వల్ల, సంపెంగ చెట్టు ముఖరాగం వల్ల, కొండగోగు చెట్టు మాట్లాడటం చేత, వావిలి చెట్టు ఊపిరి వదలడం వల్ల, మోరట చెట్టు సంగీతం వల్ల, సురపొన్న చెట్టు నవ్వడం వల్ల, పుష్ప ఫలాలతో వృద్ధి పొందుతాయి..)
ఇలా వృక్ష సంపదను ఎంతలోతుగా, నిశితంగా మనవాళ్లు పరిశీలించారో చూడండి. అందుకే మనం వివిధ కార్యక్రమాల్లో ఉపయోగించే కర్రలు - వాటి వెనుక అంతరార్థం గొప్పగా ఉంటుంది.
సోమిడి చెట్టు: ఈ చెట్టు కర్రలను పవిత్రంగా భావిస్తారు. అందుకే గృహాలు నిర్మించేటప్పుడు ఆ ఇంట్లోని దేవమందిరానికి ఈ చెట్టు కర్ర కొంచెమైనా ఉపయోగిస్తారు. ఈ కర్రలోనే దేవుడుంటాడని భావిస్తారు.
మోదుగ: ఉపనయనం తర్వాత వటువుకు మోదుగ కర్ర అందిస్తారు. “ఆయుర్వర్చోయశో బలాభివృద్ధర్థ్యం గోసర్ప భయనివృత్యర్థం పలాశదండ ధారణం కరిష్యే” అని సుశ్రవస మంత్రం చెప్తుంది. ఆయువు, వర్చస్సు, యశస్సు, బలం, గోరక్షణ, సర్పాల నుండి రక్షణకు ఈ కర్ర ఉపయోగపడుతుంది. అంటే మనదేశం వ్యవసాయ దేశం అనీ, సర్పభయం నుండి శత్రు భయం నుండి ఈ కర్ర రక్షిస్తుంది. బ్రహ్మచారి మోదుగ కర్ర, గృహస్తుడు అంకోల (ఊడుగ) కర్ర, సన్యాసులు వెదురు దండం ధరించడం సంప్రదాయం. ఈ చెట్టు ఆకులో భోజనం చేస్తే 60 రకాల వ్యాధులు నశిస్తాయని ఆయుర్వేద అనుభవజ్ఞులు చెప్తారు. నిన్నమొన్నటి వరకు మనం విస్తర్లు మోదుగ ఆకులతో కుట్టినవే.. నననన
తులసి: ప్రతి హిందువు తప్పనిసరిగా తమ గృహాల్లో పెంచాల్సిన చెట్టు. ఇటీవల ఫ్లోరైడ్ నీటితో కలిసి వచ్చే రోగాలను నశింపజేసే శక్తి దానికి ఉందని నిరూపించారు. అందుకే ఈ విషయం పరోక్షంగా తీర్థంగా ఆలయాల్లో ఇచ్చి మనల్ని రక్షించే వారు. అధర్వణవేదం తులసి మహిమను చెప్తూ..
“అస్థిజస్య కిలానస్య తనూజస్య చయత్త్వచి
దృశ్యాతస్య బ్రహ్మణా యక్ష్మశ్వాసమనీనశత్
నరూపకృత్‌త్వమౌషధే సాసరూపమిదం కృధి
శ్యామా నరూపకరణి పృథివ్యామత్యద్భుతా”
అంటూ శ్లాఘించింది.. చర్మం, మాంసం, ఎముకల్లో పుట్టిన మహా రోగాలను శ్వేతతులసి, కృష్ణ తులసితో శ్వేతకుష్ఠ (బొల్లి)వంటి రోగాలు తొలగిపోతాయి. అందుకే దీనికి ‘అద్భుత’ అని మరో పేరు కూడా ఉంది. మారేడు: శివునికి ప్రీతికరమైన ఈ చెట్టు కేవలం శివార్చనలో మాత్రమే వాడుతారు అని మనకు తెలుసు. కానీ జ్వర, అతిసార, శూల ఆమవాతం, గ్రహణి, మొలలు మొదలైన రోగాలకు దీనిని మందుగా వాడటం ఆయుర్వేదంలో చూస్తాం. మేడి, ఉసిరి, రావి, జువ్వి, మర్రి, వేప, వనమల్లిక, చంపక, అశోక, వాసంతి, మాలతి, కుంద, జాజి, జిల్లేడు, గన్నేరు, మారేడు, తుమ్మ, ఉత్తరేణి, కుశ, జమ్మి, నల్లకలువ, భృంగరాజ, చంద్ర, దూర్య, దర్భ, చందన, మరవ వంటి చెట్ల పుష్పాలు, ఆకులతో పూజలు చేస్తాం.
ఇవన్నీ మనకు ప్రకృతి ఇచ్చిన సంపద. వీటికి మనపూర్వులు గొప్పస్థానం ఇవ్వడం వల్ల మనం పెంచాలని తెలియజేశారు. అన్నిటిలో ఓషదీగుణాలున్నాయి. అందుకే వృరక్షతి రక్షితః అన్నారు. ఇలా చెట్లను పెంచడం ఓ జీవన విధానంగా మనపూర్వులు రూపొందించారు. ఇప్పటికీ పల్లెటూళ్లలో చాలామంది ఇంటి పెరడులో చెట్లను పెంచడం చూస్తాం. చెట్టు తనను నరికేందుకు వచ్చే గొడ్డలికి కూడా కర్రను ఇస్తుంది. బ్రతికినన్నాళ్లు ఫలం, పుష్పం, కాయలు, వంట చెరుకు ఇచ్చే చెట్టే... మరణించాక గృహోపకరణాలకు అవసరమవుతుంది. ముఖ్యంగా పర్యావరణ సమతుల్యాన్ని సరిచేసి ప్రకృతిని కాపాడుతుంది చెట్టు.
ప్రథమ వయసి పీతం తోయ మల్పం స్మరంతః
శిరసి నిహితభరా నారికేళా నరాణాం
సలిలమమృతకల్పం దద్యురా జీవితాంతం
వహికృతముపకారం సాధవో విస్మరంతి
చిన్నగా ఉన్నప్పుడు పోసినకొద్ది నీటిని త్రాగి ఆ మేలును మరవని కొబ్బరి చెట్టు నెత్తిన ఎంతో బరువైన కాయలను మోస్తూ జీవితాంతం మనుషులకు తీయని నీటిని ఇస్తుంది. ఆహా! సాధువులు ఎంత చిన్న ఉపకారమైనా మరవకుండా ప్రత్యుపకారం చేస్తారుకదా! అని దీని భావం. ప్రత్యుపకారంలో చెట్లకు మించిన గురువులు ఉండరు కదా!
అంతేకాదు మన జ్యోతిష్యం శాస్త్రం కూడా ఒక్కో గ్రహానికి ఒక్కో చెట్టును పేర్కొంది
నవగ్రహాలు నవధాన్యములు నవసమిధలు
రవి గోధుమలు అర్క-జిల్లేడు
చంద్రుడు వడ్లు మోదుగ
కుజుడు కందులు చంద్ర-ఖదిర
బుధుడు పెసలు ఉత్తరేణి
గురువు శనగలు అశ్వత్థ-రావి
శుక్రుడు అనుములు మేడి-అత్తిపత్తి
శని నువ్వులు శమి
రాహువు మినుములు గరిక
కేతువు ఉలవలు దర్భ
***************************************************
ॐ డాక్టర్. పి. భాస్కర యోగి 卐 ఆధ్యాత్మిక వ్యాసం ॐ
ॐ డాక్టర్. పి. భాస్కర యోగి 卐 ఆధ్యాత్మిక వ్యాసం ॐ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి