వ్యక్తులకు కలిగే సుఖదు:ఖాలను తమవిగా భావించి, వాటిని పంచుకునే సమాజ వ్యవస్థ కులం. కానీ కుల అహంకారం, కుల అంతరం అనేరెండూ కులతత్వరూపాలు, కులంపట్ల ఇలాంటి దృక్పథం లేకపోతే హిందూ సమాజం కొత్తప్రమాదాలను కొనితెచ్చుకొన్నట్లే! మనుషులు దడికట్టుకొని జీవించే మానసికరుగ్మత కులతత్వం, ‘సర్వేజనా: స్సుఖినోభవన్తు’ అనే ఋషులు ఘోషిస్తే, బసవేశ్వరుడు ఇంకొక అడుగుముందుకేసి “సర్వేజీవాఃస్సుఖినోభవన్తు” అన్నాడు. ఇలాంటి గొప్ప హిందూ ధర్మంలో తన తోటివారికి ఆలయ ప్రవేశంలేదు అని చెప్పడానికి నోరెలా వస్తుంది. ఉుతే మన ధర్మానికి ఓగొప్ప చలనశీలత ఉంది. ఎప్పుడెపుడు ధర్మగ్లాని కలుగుతుందో అప్పుడు భగవంతుని అవతారం వచ్చినట్లు హైందవ ధర్మానికి ఏర్పడే మచ్చలను తుడిచివేయడానికి ఎందరో సంస్కర్తలు వచ్చారు.
సంస్కర్తల సామాజిక దృక్పథం
కులం ప్రస్తావనరాగానే మనువును మనుస్మృతిని తెగనాడడం చూస్తాం. మనుర్భవ మనిషివి కావాలి అనే సందేశం ఇచ్చిన మహర్షికి ఎందుకింత అపవాదు? మనుస్మృతి కృతయుగంలో, గౌతమస్మృతి త్రేతాయుగంలో, శంఖలిఖితస్మృతి ద్వాపరయుగంలో, పరాశరస్మృతి కలియుగంలో అనుసరించాలి. మరి కృత యుగపు మనుస్మృతిని ఇవాళ నిందించడం సబబేనా..? అయినా మనుస్మృతి చదివిన హిందువులెంతమంది? అరవై ఏళ్ల రాజ్యాంగం 110 మార్లు సవరించుకొన్నాం.
కృతయుగానికి చెందిన మనుస్మృతిని సవరించుకోవద్దా? వేయి సంవత్సరాల బానిసత్వంలో అందులో ఇతర మతస్థులు ప్రక్షిప్త, ప్రక్షేపాలు చేయడం నిజం కాదా? జైన మతస్థుడైన అమర సింహుడు రాసిన నిఘంటువును సంప్రదాయ హిందువులంతా చదువుకోవడం వల్ల మన మతానికి దెబ్బతగిలింది. అంతకు ముందున్న వరరుచి నిఘంటువును ఎవరు రద్దు చేశారు! ఇది కఠోరసత్యం.. అయినా చెప్పక తప్పదు. కులంపేరుతో అంటరానితనం పాటించేవారు- దాన్ని అమలు చేయాలనుకొనేవారు - దాన్ని దోషంగా చూపించి హిందువులను నిందించే వారు హైందవ ధర్మ తత్వాన్ని సరైన కోణంలో అధ్యయనం చేస్తే సత్యం బయటపడుతుంది.
1. వేదఋషి అయిన యాజ్ఞవల్క్యుడు శూద్రుడు నమస్కార మంత్రాలతో ‘పంచయజ్ఞాలు’ చేయాలని నిర్దేశించాడు.
2. ఓం నమశ్శివాయ, ఓం నమోనారాయణాయ అనే వేదమంత్రాలను ఈ రోజు అందరూ చదవడం లేదా? వేదమంత్రాలు వేదసంబంధమైనవికావా?
3. సామవేదాంతర్గతమైన వజ్రసూచికోపనిషత్ “కోవా బ్రహ్మణోనామః కింజీవః? కిందేహః? కింజాతిః ? కింజ్ఞానం ? కిం కర్మ? కింధార్మిక ఇతి” బ్రహ్మణుడనగా ఎవరు? జీవుడా ? దేహమా ? జాతియా ? జ్ఞానమా ? కర్మమా ? ధార్మికమా? అని ప్రశ్నించింది.
“పాపవర్తనుండు బ్రహ్మణుడయ్యును
నిజము శూద్రునికంటె నీచతముడు
సత్య శౌచ ధర్మశాలి శూద్రుండయ్యు
నతడు సద్ద్విజుండ యనిరిమునులు”
అని ముగింపుపలకడం ఛాందగ్యోపనిషత్ (4-4-2) సత్యకామజాబాలి కథ కులతత్వాన్ని బద్దలు కొట్టింది.
4. మహాభారతాన్ని “పంచమవేదం” అన్నారు. మరి భారతాన్ని చదవడానికి అందరికీ అర్హత ఉన్నపుడు వేదం అందరూ చదవగలరనే కదా! అర్థం.
5. ఆదిశంకరుడే స్వయంగా జ్ఞానం పొంది ‘మనీషాపంచకమ్’ చెప్పారు. శంకర చండాల సంవాదం ఆయన కళ్లు తెరిపించింది.
6. హిందూధర్మంలో గొప్ప స్థానం పొందిన వ్యాస, వాల్మీక, సత్యవతి, కర్ణుడు, ధర్మవ్యాధుడు, తిన్నడు, నందనార్, నమ్మళ్వారు వంటి వారు పుట్టుకతో బ్రహ్మణులు కారు. వారు స్వభావంతో గొప్ప పేరు పొందారు.
7. బుద్ధుడు, వివేకానందుడు బ్రాహ్మణకులంలో పుట్టలేదు. అంతెందుకు బ్రహ్మణులు ఎవరి గురించి జీవితకాలం మొత్తం తపస్సు చేస్తారో అలాంటి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు క్షత్రియులు కదా..!
8. వేదసూక్తాలను సృష్టించిన జనశ్రుతి శూద్రుడే.
9. తనకు పాపం వచ్చినా సరే అని గురువును ధిక్కరించి “ఓంనమో నారాయణాయ మంత్రాన్ని ప్రపంచానికి అంకితం చేసిన శ్రీమద్రామానుజాచార్యులు హిందూమత ఉద్దరణకు పాటు పడిన మహనీయుడు కదా..
10. 12వ శతాబ్దంలోనే తన అనుభవమంటపంలో అన్నికులాలకు ప్రతినిధులను నియమించి శైవమతాన్ని పునరుద్ధరించిన బసవేశ్వరుడు హిందూ సంస్కర్తలకు ఆదర్శం.
11. సంతురవిదాసు, కనకదాసు, అన్నమయ్య, వేమన, పోతులూరి వీరబ్రహేంద్ర స్వామి, శివరామ దీక్షితులు, సంతుతుకారం.. వంటి భక్తకవులు, యోగులు, సిద్ధపురుషులు హిందూధర్మరక్షణకు పాటుపడ్డారు.
12. అలాగే బ్రహ్మనాయుడు, మహర్‌చొఖ్ఖకుళా వంటి మహనీయులు వివిధ సంస్కరణల ద్వారా, భక్తి ద్వారా హైందవధర్మరక్షణ గొప్పగా చేశారు.
13. దయానంద సరస్వతి వేదాన్ని జనబాహుళ్యంలోకి తెస్తే, మలయాళస్వామి, పాండురంగ అఠవాలే భగవద్గీతను జనసామాన్యంలోకి తీసుకెళ్లారు.
14. నారాయణగురు, భక్తకబీర్, గురునానక్, గౌతమబుద్ధుడు, స్వామి వివేకానంద వంటి మహనీయులు తమబోధనల ద్వారా కులపంకిలం కడగాలని ప్రయత్నించారు. కులాన్ని సమూలంగా పెకిలించి, సంస్కరణలనగిషీలు చెక్కకపోతే హిందూ సౌధం బీటలువారే ప్రమాదముంది. కాబట్టి బుద్ధి జీవులంతా ఆలోచించి కులం కుట్రను పాతరేయండి. అన్ని ధర్మాలను సమానమనే భావన ఎలా సమాజంలోకి తీసుకెళ్తాన్నామో, అన్నికులాలు సమానమనే దృక్పథాన్ని సమాజంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఏర్పడింది..
***************************************************
ॐ卐 డాక్టర్. పి. భాస్కర యోగి 卐 సంపాదకీయ వ్యాసం ॐ卐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి