శివమహాపురాణంలో ఒక ఆసక్తికరమైన కథ ఉంది. పార్వతీపరమేశ్వరుల వివాహ సందర్భం అది. పురోహితుడు.. ‘మీ తండ్రి పేరేమిటి?’ అని శివుణ్ణి ప్రశ్నించాడు పురోహితుడు. నా తండ్రి ఎవరు! అని శివుడు ఆలోచిస్తుంటే నారదుడు ‘బ్రహ్మ’ అనండి అన్నాడు. అది చెప్పాక ‘మీ తాత ఎవరు?’ అని శివుణ్ణి అడిగితే విష్ణువు అని చెప్పాడు. ‘మీ ముత్తాత ఎవరు?’ అనే ఆఖరు ప్రశ్న అడగ్గానే శివుడు ‘నేనే ముత్తాతను’ అన్నాడు. శివుడు ఆద్యంతాలు కనుక్కోలేని లింగస్వరూపుడు. దేవతలందరిలో నిర్గుణరూపం ధరించినవాడు. దక్షుడు శివుణ్ణి గుణహీనుడని నిందిస్తే “ఆయన నిర్గుణుడు” కాబట్టి ఆ తిట్టు కూడా స్తోత్రమే అని చెప్పుకొంటాం.

స్వస్వరూపం కాకుండా లింగరూపంలో సాక్షాత్కరించే శివుడి ‘ఆద్యంతాలు కనుక్కొంటాం’ - అని బ్రహ్మవిష్ణువులు ప్రయత్నించే కథ ఒక ప్రతీక మాత్రమే.  నిర్గుణతత్వం తెలుసుకోవాలనుకొంటే సాధకుడు విష్ణుత్వం పొంది సహస్రారం వైపైనా వెళ్లాలి, బ్రహ్మత్వం పొంది మూలధారంలోని కుండలినైనా స్పృశించాలి అన్న యోగరహస్యం అందులో ఉంది. ఈ యోగం ద్వారా పరబ్రహ్మ సాక్షాత్కారం కలగడమే లింగోద్భవం. అదే సాధకుడికి శివరాత్రి. నిర్గుణుడైన శివుడు నిత్యతృప్తికి చిహ్నమై ఆనందస్వభావంగల నందిని ఎదురుగా పెట్టుకున్నాడు.

మంద, తమో గుణాలుగల గజము చర్మం ధరించి వాటికి ఆతీతంగా ఉండాలని సందేశం ఇచ్చాడు. విభేదాలను భస్మం చేసి దానిని ధరించి అద్వైతభావన, స్థిరత్వం సూచిస్తున్నాడు. డమరు చేతిలో ధరించి శివుడు నాదబ్రహ్మమయినాడు. అలాంటి ‘శివం’ ఓ సర్వ వ్యాపకమైన ఉనికి. దు:ఖాన్ని నశింపజేసి మంగళతత్వాన్ని కలిగిస్తుంది.

************************************************

ॐ 卐 డాక్టర్. పి. భాస్కర యోగి ॐ 卐
ॐ卐 ఆధ్యాత్మిక వ్యాసం ॐ 卐 ॐ విజయక్రాంతి 卐 ॐ 
ॐ卐మంగళవారం 卐 08-05 -2018 卐 ॐ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి