‘‘మనం క్రొత్తగా ఏ శక్తినీ సృష్టించలేము. కాని దిశానిర్దేశం చేయగలం. మన ఆధీనంలోని మహత్తర శక్తులను నియంత్రించడం నేర్చుకోవాలి. సంకల్ప శక్తితో వాటిని తుచ్ఛమైన ప్రాపంచిక సుఖాలకోసం కాకుండా, ఆధ్యాత్మిక పురోభివృద్ధికి వినియోగించాలి’’ అంటారు స్వామి వివేకానంద.
మనం వేసే ప్రతి అడుగు గొప్ప లక్ష్యసాధన కొరకు ఉండాలి. పనికిరాని విషయాలకు మన శక్తి వృధా చేయకూడదు. అందువల్ల అసలు లక్ష్యం దెబ్బతింటుంది. మన ప్రయత్నంలో లోపం ఉండకూడదు. ప్రయత్నం మనసులో అనుకోవడమే సంకల్పం. అది వజ్ర సంకల్పమై ఉండాలి. అప్పుడే కార్యసిద్ధి త్వరగా అవుతుంది. అందుకే మన ధర్మంలో ఏ శుభకార్యం మొదలుపెట్టినా సంకల్పం చెప్పించే అలవాటు ఉంటుంది.
మన సంకల్పమే సరిగ్గా లేనపుడు మన కార్యం అస్తవ్యస్తం అవుతుంది. మనకు అడుగు ముందుకు వేయడానికి అవకాశం ఉండదు. మనం బలహీనులమని, ఇది చేయలేని వారమని మనసులో ఊరికే భావన దృఢం చేసుకుంటే నిజంగానే బలహీనులుగా మారిపోతాం. బలహీన మనస్తత్వంగల ఓ గాడిద ఉండేదట. అది ఎప్పుడూ తనను తాను బలహీనురాలిగా భావించుకొనేది. మంచి గడ్డి పెరిగే వానాకాలంలో అది బక్కచిక్కిపోయేదట. బాగా గడ్డి ఉన్న ప్రాంతంలో అది వెళ్లి తిని వెనక్కి చూసుకొని అయ్యో! నేనేమీ తినలేదే అని బాధపడి బక్కగా అయ్యిందట. ఎండాకాలంలో మేయడానికి వెళ్లి పాత కాగితపుముక్కలు, ఇతరాలు తిని నేను గడ్డి మొత్తం తిన్నానే అని సంబరపడి లావుగా బలిసిపోయిందట. కాబట్టి మన ఆలోచనలోనే అన్నీ ఉన్నాయి. మంచి, చెడ్డలకు మన మనస్సే కారణం. ఆ మనస్సుకున్న అపరిమిత శక్తిని సక్రమ మార్గంలో ప్రవేశపెట్టాలి. అప్పుడే మన సంకల్పం సక్రమంగా పనిచేసి లక్ష్యం నెరవేరుతుంది.
మనం సామాజికం, ఆధ్యాత్మికం.. ఏ రంగంలో పనిచేసినా మనలో నిబద్ధత ఉండాలి. సాధించే, శోధించే తపన మనలో ఉండాలి. అప్పుడే మన సంకల్పం విజయవంతం అవుతుంది. గొప్ప గొప్ప కార్యాలన్నీ ఉత్తుత్తిగా నెరవేరవు. వాటిని సాధించే నైపుణ్యం మనకు తగినంత ఉండాలి. అంటే దానికి సంబంధించిన విషయ సమగ్రత మనకుండాలి. అప్పుడు మనకు విజయపథం కనిపిస్తుంది.
ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాల్లో మనిషికి కావలసిన వనరు విషయ పరిజ్ఞానం. అది తెలుసుకోవాలనే తలంపునే మన శాస్తక్రారులు ‘జిజ్ఞాస’ అన్నారు. ఆ జిజ్ఞాస మన వ్యక్తిత్వాలకు సరైన మార్గదర్శనం చేయాలి. అప్పుడు మన మానసిక శక్తి బాగా వికసిస్తుంది. ఆ వికాసమే సంకల్పంగా మారుతుంది. అది కార్యసిద్ధిని కలిగిస్తుంది. మనల్ని భగవంతునివైపు తీసుకెళ్తుంది.
అలాంటి దృఢ సంకల్పం మనం అవలంభిద్ధాం!
పరమేశ్వరా!
నన్ను నా మనస్సును వజ్రసమానంగా మార్చు
మన్ను మిన్ను ఏకమైనా నన్ను వదలకుండా నీతో చేర్చు
బరువు మొత్తం నీదేనని నమ్మినా, నాకు నీవుండగా
కరువు లేదని గ్రహించినా, మా కోరికలు తీర్చే
తరువు నీవేనన్నది సత్యం!!


*************************************************

      డాక్టర్‌. పి. భాస్కర యోగి
      ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ
ॐ గురువారం 卐 ఏప్రిల్ 26 卐 2018 ॐ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి