శ్రీరామకృష్ణులు శిష్యుడైన వివేకానందుణ్ని ఒకసారి.. ‘నాయనా భగవంతుడు రససముద్రం. ఆ సముద్రంలో నీవు మునుగుతావా లేదా చెప్పు? ఒక గిన్నె నిండా పానకం ఉందనుకో. నువ్వు ఈగవై ఉన్నావనుకో, ఎక్కడ కూర్చోని ఆ రసాన్ని గ్రోలుతావు?’’ అని అడిగారు. దానికి వివేకానందుడు.. ‘‘నాయనా! అది సచ్చిదానంద సాగరం. దాంట్లో మునిగినా మరణభీతి లేదు. అది అమృతసాగరం’’ అని సమాధానమిచ్చారు. భక్తులందరికీ ఇది వర్తిస్తుంది. అయితే, ఆ అమృత సాగరంలో మునగాలంటే కొన్ని లక్షణాలు తప్పనిసరి అని శాస్త్రాలు ప్రబోధిస్తున్నాయి. అది లేకుండా బాష్యమైన వేషాలతో ఆధ్యాత్మిక ప్రపంచంలో అడుగుపెడితే గుడ్డిదైన ఈగ వెళ్లి పానకంలో బడి చచ్చినట్లే. అలా కాకుండా అందులో ఓలలాడడానికి వెళ్లే ముందు చిత్తవృత్తులను నిరోధించే ప్రవృత్తులను అభ్యాసం చేస్తే అక్కడంతా అమృతమయమే. ‘చిత్తవృత్తులను నిరోధించడమే యోగం అని పతంజలి మహర్షి అన్నాడు. యోగం తెలిసినవారు యోగమూర్తులు. అప్పుడు మోక్షం సిద్ధిస్తే ‘పునరపిమరణం పునరపి జననం’ లేదన్నమాట. అది అమృతత్వమే. ఆ స్థితి సాధించాక ఆ అమృతసాగరంలో దూకకపోయినప్పటికీ ఒక్క చుక్క నోట్లో పడితే చాలు. అందరం అమృతపుత్రులమే. ఆ అమృతత్వం సాధించాలంటే భక్తిలక్షణాలు ఒడిసిపట్టాలి.
అద్వేష్టా సర్వ భూతానాం మైత్రః కరుణ ఏవచ
నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమీ
సకల భూతాల పట్ల ద్వేషంలేనివాడు, అందరితో మిత్రత్వంకలవాడు, జీవకారుణ్యంగలవాడు, మమతలేనివాడు, అహంకారం లేనివాడు, సుఖదుఖాల్లో సమభావంగలవాడు, ఓర్పుగలవాడు అనే ఏడు లక్షణాలను భక్తుడు కలిగి ఉండాలి. ఇవన్నీ భాగవత ధర్మాలు. వీటిని గీత ఎందుకు ప్రతిపాదించిదంటే ఇవి లేకుండా భగవద్భక్తి సంపూర్ణం కాజాలదు. భక్తి కేవలం ఆచార, సంప్రదాయాల అనుష్ఠానం కాదు. హృదయస్థానాన్ని పరిశుద్ధం చేసుకొనే సాధన. ఈ పరివర్తనకు సంబంధించిన ఆధ్యాత్మిక ఆచరణ పథ్యం పాటించకుండా ఔషధం సేవించడం లాంటిది. గీతలో చెప్పబడిన భక్తలక్షణాలు వ్యక్తిని వ్యష్టితత్వం నుండి సమష్టివైపు తీసుకువెళ్తాయి. విషయాసక్తత నుండి దూరంచేసి సమభావం హృదయం నిండా నింపి యోగానికి దగ్గరచేస్తాయి. ఈ సన్మార్గ దృష్టి లేకుండా ఆచరించే ఆధ్యాత్మికత ఇసుక వంతెనలా కూలుతుంది. భక్తి దృఢచిత్తంలో స్థిరీకృతం చేసి ఆవలి తీరానికి చేరాలంటే నిజమైన భక్తుడి లక్షణాలు ఆచరించాల్సిందే. మరీ ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో ఇవి మరింతగా ఆచరణలో పెట్టాలి. మొక్కలు చిన్నగా ఉన్నపుడు కంచె ఎలా అవసరమో ఈ ఆచరణ అంతే ముఖ్యం.

*************************************************
      డాక్టర్‌. పి. భాస్కర యోగి
      ॐ ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన ॐ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి