వేలంవెర్రిగా, ‘వెఱ్ఱి వేయి విధంబులు’ అన్నట్లుగా ఈ రోజు ఆధ్యాత్మిక మార్గం రంకెలు వేయడం విడ్డూరం. శాస్త్రం లేని ఆధ్యాత్మికత అహంకారానికి, ఆధ్యాత్మికత లేని శాస్త్రం అజ్ఞానానికి దారితీస్తుందన్న పెద్దల వాక్కు నిజమే. ఎందుకంటే దేవాలయంలో ఉన్న పూజారి ‘దేవుణ్ణి నేనే బ్రతికిస్తున్నాను’ అనుకోవడం ఎంత మూర్ఖత్వమో, మతాన్ని, జ్ఞానాన్ని నేనే ఔపోసన పట్టాను అనుకోవడం కూడా అంతకన్నా పొరపాటు.
దేవుణ్ణి అంగడి సరుకుగా మార్చి పూజకో రేటు పెట్టి, దేవుణ్ణి పూజారుల చేతుల్లో పెట్టి ఎలాంటి తత్వం తెలుసుకోకుండా ఫలాన్ని పొందాలనుకున్నపుడే మనం ఆధ్యాత్మికంగా దిగజారిపోయామని గుర్తెరుగండి. తత్వజ్ఞానాన్ని పొందకుండా కనపడ్డ ప్రతి దాంట్లో వ్రేలు పెట్టి నాలుక్కరచుకోవడం మన అజ్ఞానానికి పరాకాష్ఠ.
విశ్వకళ్యాణమూర్తి, జగన్నియామకుణ్ణి ఆరాధించే విజ్ఞానం- మార్గం మన వద్ద ఉండాలి. అప్పుడే జాతి పునరుజ్జీవితం అవుంది. ఏ జాతి ఆధ్యాత్మిక శక్తి ఏకోన్ముఖమై ప్రవర్తిల్లుతుందో ఆ జాతి ప్రపంచంలో విజేతగా నిలుస్తుంది. వైదిక ధర్మం- హిందూ ధర్మం కొన్నాళ్లనుండి అలాంటి విశ్వజనీన శక్తిని మరచిపోయింది. సకల శాస్త్రాలు, చతుష్షష్టికళలు పుట్టిన ఈ దేశంలో రోజురోజుకు ఆధ్యాత్మికత ముసుగులో అజ్ఞానం పెరిగిపోతుంది. ప్రచార ప్రసార మాధ్యమాలు, ఇతర మతాల వాళ్లు మనల్ని ఎంత వెక్కిరింపులకు గురిచేసినా మన తీరులో మార్పు లేదు. ‘నేను నా ధర్మం’ అస్తిత్వం రోజురోజుకు తగ్గిపోయి- ‘నాది నాది’ అనే ధోరణి రోజురోజుకు పెరిగిపోతుంది. మనం ఎక్కడనుంచి వచ్చాం? ఎక్కడికి వెళ్తాం? అనే తాత్విక ధోరణి మనకు అలవడితే మన వేదాంత తత్వం ఏమిటో మనకు అర్థం అవుతుంది. రోజురోజుకు వస్తున్న విమర్శలు చూస్తే నవ్వొస్తుంది, కోపమూ వస్తోంది. ఎదుటివాడిపై ఆగ్రహం కలుగుతుంది. మళ్లీ మనస్సుకు బంధం పడుతుంది. మన పశువును బాగా కట్టేస్తే మందిచేను ఎందుకు మేస్తుంది అన్న సామెత గుర్తొస్తుంది. అందుకే ఈ కఠినపు వ్యాఖ్యలు. గురువులు మోసం చేస్తున్నారని ఓ రోజు.. ఓ స్వామి స్థలం ఆక్రమించాడని మరో రోజు.. ఓ స్వామి ఇంకా దోచేసాడని ఇంకో రోజు.. ఇలాంటివి టీవీలో చూస్తే బాధేస్తుంది. ఏమైంది మనకు..!? మన ఆధ్యాత్మిక శక్తి ఎందుకు ఏకీకృతం చెయ్యలేకపోతున్నాం అన్న ప్రశ్న మనస్సును వేధిస్తున్నది. ఎవ్వరికి ఎన్ని రకాల దేవతా సంప్రదాయాలున్నా, విశ్వాసాలున్నా ఈ ప్రపంచానికి ఆధారభూతమైన ఆ పరమాత్మను విస్మరించవద్దు. పరమాత్మను ధ్యానించే స్మరించే సాధననే యోగం అన్నారు. ఈ యోగం విడిచినవాడికి ‘మోక్షం’ లేదు. పునరపి మరణం పునరపి జననం తప్పదు కావున ‘తస్మాద్ యోగీభవ’. ఆధ్యాత్మిక పథమే శరణ్యం
భారతదేశం ఒకప్పుడు గొప్ప సిరిసంపదలే కాక జ్ఞాన సంపద కలిగిన దేశం. ప్రపంచంలో ఎంతో అద్భుతంగా అభివృద్ధి చెందిన దేశాలకు లేని జ్ఞానం అనే సంపద మనకు మాత్రం ఉంది. అయితే ఆ జ్ఞానం అనేక విధాలుగా ఆటంకాలు ఎదుర్కొంటూ ముందుకు క్రొంగొత్త రూపాల్లో ఆవిష్కృతవౌతూ వుంది. గ్లోబలీకరణ పేరుతో ఆర్థిక వ్యత్యాసాలను మనం ఎప్పుడైతే అధిగమించడానికి ప్రయత్నించడం మొదలుపెట్టామో జ్ఞానం మిథ్యగా మారి, మానవ సంబంధాలు మహా ప్రమాదంలో పడిపోయాయి. ఓ మనిషిని మహోన్నతుడిగా మార్చాలన్నా, మాయలో పడేయాలన్నా మనసు గొప్ప ఆయుధంగా పనిచేస్తుంది. మనసు స్వరూపాన్ని తెలుసుకోవడానికి మన ఋషులకు, యోగులకు వేల సంవత్సరాలు పట్టింది. మన యోగ, ఆత్మ శాస్త్రాలన్నీ అదే పరిజ్ఞాన నిర్మాణం కొరకు పనిచేసాయి. అలా వేల యేళ్ల నుండి మనసును, మనిషిని ఓ క్రమశిక్షణలో నడపడానికి మనవాళ్లు పనిచేశారు. అందులో ఆధ్యాత్మిక దృష్టి, తాత్వికదృష్టి, సామాజిక దృష్టి అన్నీ కన్పిస్తాయి. స్ర్తిలు కూడా పాశ్చాత్య పోకడలను మన బిడ్డలకు నేర్పించకూడదు. అదొక వికృత కామ సామ్రాజ్యం. అందులో ప్రవేశించినవాడు పతనంవైపు అడుగు వేస్తాడు. కాని పరమోన్నతికి వెళ్లలేడు. వైదిక సంస్కృతి మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేది, నరోత్తముడిగా మార్చేది. దాని సాధన మనం వదలిపెట్టిననాడు దుఃఖసాగరంలో మునగాల్సిందే.

*************************************************
      డాక్టర్‌. పి. భాస్కర యోగి
      ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ
కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి