‘‘ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది’’- ఇది సనాతన ధర్మసూత్రం. ఏది ధర్మం? ఏది ధర్మం కాదు!! ఇది ఆలోచన. ఓ కొడుకు తన తల్లిదండ్రులపట్ల తన బాధ్యతను నెరవేరిస్తే- అదొక ధర్మం- (ఈ సమయంలో ధర్మం పేరు కర్తవ్యం)
ఓ పంచాయతీలో న్యాయంగా మాట్లాడటం- ధర్మం (న్యాయాన్ని ధర్మశబ్దంలో ఇక్కడ వాడతారు)
ఇలా చెప్పాలంటే ధర్మం ఎన్నో రూపాలు పొందుతుంది. స్థూలంగా ‘ధర్మం’ అంటే మానవుని శ్రేయస్సును దైవిక మార్గంలో నడిపించేది అని అర్థం.
ఆ ధర్మాన్ని ఆధారం చేసుకొనే రామాయణ, భారత, భాగవత గ్రంథాలు రచించపబడ్డాయి. అందులోని పాత్రలు ధర్మాధారంగా చిత్రింపబడ్డవి కాబట్టే మనకు ఈనాటికీ ఆదర్శమయ్యాయి.

ప్రకృతి తన ధర్మం చక్కగా నెరవేరుస్తున్నది. సమయానుకూలంగా తన స్వరూప స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. మానవుడు ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాడు. అపుడు మాత్రమే దాని సమతుల్యత ఇబ్బందిలో పడుతున్నది.
సూర్యచంద్రుడు తాము కాలచక్రాన్ని చక్కగా అనుసరిస్తున్నారు, సృష్టిని నడిపిస్తున్నారు.
అలాగే ఆకాశం, భూమి, నీరు అగ్ని.. అన్నీ తమ స్వభావాన్ని వీడకుండా ధర్మధారంగా పనిచేస్తున్నాయి. కాబట్టి వేల సంవత్సరాల సృష్టి క్రమపద్ధతిలో నడుస్తున్నది.
మనిషి కూడా ప్రకృతిని, సృష్టిని ఆదర్శంగా తీసుకోవాలి. తన ధర్మాలను చక్కగా నెరవేర్చుకోవాలి. స్వభావాన్ని మధురంగా మార్చుకోవాలి.

శుద్ధ సాత్విక జీవనం మనిషికి ఓ వరం. దాన్ని వదలిపెట్టి జీవనం సాగించడం వల్లనే శరీరంలో మనసులో అపసవ్యతత్వం ఏర్పడుతుంది. మనిషి తనకు భగవంతుడు ఏర్పరచిన ధర్మమే శుద్ధ సాత్విక జీవనం.
తనకు భగవంతుడిచ్చిన ధర్మాలను విస్మరించకుండా జీవించాలి. అలా జీవించడంవల్ల తనకు స్వభావం ఏర్పడుతుంది. శాంతిగా జీవించడమే దైవిక ధర్మం. అశాంతిగా జీవించడం రాక్షసధర్మం.

సరైన ఆహార, విహారాలు మనిషికి ఉన్నపుడే శాంతజీవనం ఉంటుంది. కేవలం క్రమశిక్షణ వల్ల ప్రయోజనం లేదు. దానికి దైవిక చింతన తోడుకావాలి. దైవచింతనతో కూడిన క్రమశిక్షణ మనిషికి మహోన్నతత్వం కలిగిస్తుంది. ఆహారం ఏది దొరికితే అది తినడం నిరాడంబరం కావచ్చు. అందులో శుద్ధమైనది తినడం దైవలక్షణానికి సంబంధించిన విషయం. మనకు ఆరు రుచులున్నాయి. అవి శరీరానికి సమానంగా అందాలి. అప్పుడే జీవనక్రియ సమస్థాయిలో ఉంటుంది. దైవచింతన మనలో బలపడాలంటే ఆహార చింతన రెండూ సక్రమ దిశలో సాగాలి.యోగధర్మం మనకు వశమవుతుంది. మన ధర్మం సుస్థాపితమవుతుంది. అదే దైవధర్మం! అదే సత్యమార్గం! పరమేశ్వరా! దుర్మార్గపు ఆలోచనలనుండి దూరం చేసి సన్మార్గంలో నడిపించు! సర్వజీవ పోషకుడవై కర్మసాక్షివై మమ్ములను రక్షించు! 

*************************************************
     డాక్టర్‌. పి. భాస్కర యోగి
      ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి