ప్రాపంచిక విషయాల్లో నిరంతరం మునిగితేలే మనిషి తనకు తెలియకుండానే ఎన్నో పొరపాట్లు చేయడం చూస్తాం. ఎన్ని లౌకిక వ్యవహారాలు చేసినా అవన్నీ చతుర్విధ పురుషార్థాల్లో ఒకటైన ధర్మం చుట్టూ తిరుగుతూ ఉండాలి. అందుకే ధర్మార్థకామ మోక్షాలనే నాలుగింటిలో ధర్మం మొటిది. ధర్మం ఈవలి ఒడ్డు అయితే మోక్షం అవతలి ఒడ్డు. కామం మాత్రమే ప్రధానంగా భావించి రావణబ్రహ్మ హతమయ్యాడు. ధర్మవిరుద్ధమైన అర్థాన్ని అనుభవించాలని దుర్యోధనాదులు అనుకోవడం వల్ల కురుక్షేత్ర సంగ్రామం జరిగింది.
ధర్మం ప్రక్కనబెట్టి అనుభవించే అర్థకామాలు ఎప్పటికీ సుఖం ఇవ్వవు. జన్మజన్మాలు దాని ప్రభావం ఉండే తీరుతుంది. ఉదాహరణకు అవినీతి అనేది ధర్మవిరుద్ధం. ఒక అధికారో నాయకుడో అవినీతి సొమ్ము బాగా సంపాదించాడనుకొందాం. దాంతోనే ఆహారం తయారుచేసుకొని తింటాడు. ఆ ఆహారంతో అతని శరీరంలో రక్తం, వీర్యం తయారవుతాయి. దాంతో అతను తన సంతానానికి జన్మనిస్తాడు. జన్మించిన సంతానం ఇప్పుడు ఎవరి సంతానమో సూక్ష్మబుద్ధితో మనం విచారణ చేయాలి. అందుకే మనం తినే ఆహారం పరమ పవిత్రంగా స్వార్జితమై ఉండాలి. అవినీతితోగాని, దుర్మార్గంతోగాని, ఇతరులను నష్టపరచిన సంపాదన చేస్తే అది దొంగలపాలో, రాజులపాలో, వైద్యులపాలో అవడం ఖాయం. అంతేగాకుండా మన మనస్సు దేహాదులపై దాని ప్రభావం ఉండి యశస్సు కలుగకుండా అడ్డుపడుతుంది.
‘‘పాపిష్టి సొమ్మును దిగమ్రింగినవాళ్లకు అది వెంనటే గొంతుకు అడ్డుపడి ప్రాణం తీయదు. నిజమే! కాని ఆ పాపిష్టి సొమ్ము తాలూకు లేశాలు, అతడి కడుపు నుండి బుర్రకుచేరి, వాడు ఎప్పుడైతే జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకోవలసి వస్తుందో అలాంటపుడు విజయం వైపు కాకుండా వినాశనం వైపు మొగ్గేలా వాణ్ణి ప్రక్కదారిలోకి, పెడదారిలోకి లాగివేయడం జరుగుతుంది’’ అని విదురుడు చెప్తాడు. దుర్యోధనుల విషయంలో జరిగింది సరిగ్గా ఇదే. ధర్మం సూక్ష్మమైనది. అది అనంతమైన శక్తిగలది. దాన్ని అర్థం చేసుకొన్నవారు, ధర్మసూక్ష్మం తెలిసినవారు- వాళ్లే సూర్యచంద్రులున్నంత వరకు చరిత్రలో నిలబడుతారు.
ఒక వ్యక్తి దాహంతో, ఆకలితో చాలా బాధపడుతూ అడవిలో తిరుగుతున్నాడు. చివరకు ప్రవాహంతో ఓ కాలువ అతని కంట పడింది. అందులో నీళ్లు త్రాగుతుంటే పైనుండి ఓ ఆపిల్ పండు కొట్టుకొని వచ్చింది. ఆకలి బాధతో వున్న ఆ వ్యక్తి ఆ పండును గబగబా తిన్నాడు. ఆకలి, దప్పిక రెండూ తీరిపోయాక ‘‘అసలీ పండు ఎవరిది? ఎక్కడనుండి వచ్చి నాకు దొరికింది?’’ అన్న ఆలోచన అతనిలో మొదలైంది. పండు ఎక్కడనుండి వచ్చిందో కనుక్కొందామని ప్రవాహానికి ఎదురుగా నడిచాడు. కొద్ది దూరంలో ఓ పళ్లతోట కన్పించింది. తోట యజమాని కొరకు తోట దగ్గర ఎదురుచూసాడు. యజమాని రాగానే ‘‘అయ్యా! తమరి తోట నుండి వచ్చిన ఓ పండు ఎలాంటి పరిహారం లేకుండా తిన్నాను. అందుకు ప్రతిఫలంగా మీ దగ్గర నేను కొద్ది రోజులు పనిచేస్తాను’’ అన్నారు. మొదట యజమాని వద్దన్నాడు. బలవంతపెట్టేసరికి సరేనన్నాడు.
అప్పుడే పళ్లు విరగకాస్తున్నాయి. ఓ రోజు తోట యజమాని తన బంధువులను తీసుకొని తోటకు వచ్చి, అతిథుల కోసం పళ్లు కోసుకుతెమ్మన్నాడు. ఈ నౌకరు కొన్ని పళ్లు కోసి ముందు పెట్టాడు. ఓ పండు ముక్క నోట్లో పెట్టుకొన్న యజమాని నౌకరును పిలిచి ‘‘ఏమయ్యా! నీకు బుద్ధి లేదా? అతిథులకు ఇలాంటి పుల్లని పళ్లు తినడానికి ఇస్తావా? ఏవి మంచివో, ఏవి చెడ్డవో ఆ మాత్రం తెలియదా నీకు’’ అని గద్దించాడు. ‘‘అయ్యా! యజమానిగారూ! నేనెప్పుడూ పళ్లు తిని చూడలేదు’’ అన్నాడు. అదీ ధార్మికుడైన నౌకరు నిజాయితీ. ధర్మం సూక్ష్మమైనది. ఆలోచిస్తే సున్నితమైంది కూడా. మనం ఏమీ పట్టించుకోకుండా మొరటుగా ప్రవర్తిస్తున్నాం.
ఇతరుల సొమ్ము పాపపు సొమ్ము. ‘అపరిగ్రహం’ అనే పేరుతో పతంజలి మహర్షి యోగశాస్త్రంలో పేర్కొన్నాడు. శ్రమ లేకుండా ఇతరుల కష్టంతో మనం భుజించాలనుకోవడం మహాపాపం. కాబట్టి మనం ధర్మబుద్ధితో ఆలోచించినపుడు మనవల్ల సమాజానికి, సమాజంవల్ల మనకు ఎలాంటి ఇబ్బందులు కలుగవు. ధర్మదృష్టి లేనవాడి జీవితం నరకంతో సమానం. నిరంతరం తప్పులు చేయడం పరిపాటి అవుతుంది. ఆ తప్పుల వలయంలో పడి ‘పునరపిమరణం పునరపి జననం’ తప్పదు.
*********************************************
*✍డాక్టర్. పి. భాస్కర యోగి*
ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి