పురాణ విషయాలను సరైన పద్ధతిలో అర్థం చేసుకోకుండా ‘ఎర్ర’కళ్లద్దాలతో పరికించే మేధావులకు దృష్టి మొత్తం ఎర్రగా మారడం పెద్ద విడ్డూరం ఏమీ కాదు. మన పౌరాణిక, ఆధ్యాత్మిక విషయాలను అర్థం చేసుకోవాలంటే ఎన్నో విషయాల్లో నైపుణ్యం ఉండాలి. సకారాత్మక దృక్పథం ఎక్కువగా ఉండాలి. అప్పుడే మనం లోతుల్లోకి వెళ్లగలం. అలా కాకుండా చిన్న చిన్న పదాలకు అర్థాలు కూడా తెలియకుండా పురాణాలను, ఇతిహాసాలను విశ్లేషణ చెయ్యాలనుకుంటే అది ఇసుక నుండి తైలం తీయాలను కోవడమే. ఉదా॥ ‘వసుదేవుడు గాడిద కాళ్లు పట్టుకోవడం’ అన్న జాతీయం ప్రచారం పొందింది. ఇది మన ధర్మంపై కోపంతో వ్యతిరేక ప్రచారం చేసింది కాదు.

పరిజ్ఞానం లేక చేసిన వైపరీత్యం. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికే జన్మనిచ్చే వసుదేవుడు గాడిద కాళ్లు పట్టుకోవడం ఏమిటి. ఆ రోజు  శ్రీకృష్ణుడు జన్మించే రోజు మిగతా సృష్టి అంతా వసుదేవుడికి సహకరిస్తే గాడిద మాత్రం ఎందుకు అరచి ఉంటుంది? అన్న తర్కం మనం వదలిపెట్టి ‘వసుదేవుడు గాడిద కాళ్లు పట్టుకొన్నట్లు.. నేను కూడా పరిస్థితులు  బాగా లేక ఇలా చేశా’ పోల్చుకుంటాం. కానీ ఇందులోని అసంబద్ధతను ఇలా వివరించవచ్చు.. శంఖచక్రాది ఆభరణాలతో, చతుర్భుజునిగా  శ్రీహరి దేవకీవసుదేవులకు దర్శనమిస్తాడు. వసుదేవుడు ఆయన పాదాలను పట్టుకునే సరికి తాను శ్రీహరి అయిన ఈ జన్మలో వసుదేవుని కుమారునిగా ఉన్నాననే తక్షణ జ్ఞానంతో  శ్రీహరి పాదాలను దగ్గరకు తీసుకున్నాడు. ఆ ఘట్టంలో శ్రీహరిని ఉద్దేశించి వసుదేవుడు “వసుదేవుడు కాడు -ఇదె కాలును పట్టినవాడు” ఈ పట్టుకున్న వాడు నీవనుకున్న వసుదేవుడు కాడు - శ్రీహరి భక్తుడు అనే అర్థంలో ఈ పద్య పాదం ఉంది.

కానీ ఏ అజ్ఞాని దీన్ని మరోలా ప్రచారం చేశాడో తెలియదు “వసుదేవుడు గాడిదె కాలును పట్టినవాడు” అని ప్రచారం చేశాడు. తెలుగులో గసడదవాదేశ సంధి ప్రకారం వసుదేవుడు+కాడు = వసుదేవుడుగాడు అవుతుంది. దానికి ‘ఇదె’ అనే పదాన్ని కలుపగా ‘వసుదేవుడు గాడిదె’ అనే మాట ఏర్పడుతుంది. దీనికి మిగిలిన వాక్యం కలిపి “వసుదేవుడు+గాడిదె+కాలును+పట్టినవాడు’ అని ప్రచారం చేశారు. ఇది వ్యాకరణంతో పరిష్కరించాల్సిన  సందేహం.
అలాగే పౌరాణిక విషయాలను యథాతథంగా చూస్తే మనకు చాలా చోట్ల అతిశయోక్తి అలంకారాలే కన్పిస్తాయ్. మనం ఎన్నో కోణాల్లో వాటిని అర్థవంతంగా చెప్పాలి.

అనేక పురాణాల్లో విశ్వ ఆవిర్భావం (సృష్టి) గురించి చెప్పడం జరిగింది. నీటిపైన వటపత్రశాయిగా (మర్రి ఆకుపై పడుకున్న బాలుడు) విష్ణువు కన్పిస్తాడు. జగన్మాత అయిన దేవి ఆజ్ఞ ప్రకారం విష్ణువు తన శరీరం నుండి సకల చరాచర సృష్టిని చేశాడని పురాణాలు ముఖ్యంగా, భాగవతం, దేవీ భాగవతం చెప్తున్నది. ఇదే విషయాన్ని ఆధునికశాస్త్ర (సైన్సు) దృష్టితో చెప్పొచ్చు. బిగ్ బ్యాంగ్ సూత్రం ప్రకారం గ్రహ, నక్షత్రాలు ముద్దగా ఉంటే ఏదో అద్భుతశక్తి వల్ల ఆ అగ్నిగోళం ప్రేలి బ్రహ్మాండం, గ్రహాలు, నక్షత్రాలుగా విభజింపబడి చెల్లాచెదురయ్యాయని అవన్నీ ఇప్పటికీ అలా సాగుతూనే ఉన్నాయని బిగ్ బ్యాంగ్ థియరీ చెప్తుంది.

అలాగే విశ్వముకులిత సూత్రం ప్రకారం కోట్ల సంవత్సరాల తర్వాత బ్రహ్మాండంయొక్క కేంద్రస్థానం సహాయంతో అదే ఈ గ్రహనక్షత్రాలను తనవైపు ఆకర్శించి మళ్లీ బ్రహ్మాండంగా (అగ్నిగోళం)గా రూపుదిద్దుకుంటుంది. బిగ్ బ్యాంగ్, విశ్వముకులిత సూత్రాలే ఈనాటి సైన్సు చెప్తున్న సృష్టి రహస్యాలు కానీ ఏ పరికరాలు, పరిశోధనాలయాలు లేకుండా సృష్టిని నిర్వచించారు మన పురాణకర్తలు. ఆ అద్భుత శక్తే మనం చెప్పే ఆదిశక్తి పరాదేవత. గురుత్వాకర్షణశక్తి, అణుశక్తి, ఉష్ణశక్తి, విద్యుదయస్కాంతశక్తి అనే ఈ శక్తుల కలుుక వల్ల ఏర్పడ్డ మహాశక్తి మనపురాణాలు వర్ణించిన ఆదిశక్తి. అంటే విశ్వం విడిపోయి ఏర్పడాలన్నా (బిగ్‌బ్యాంగ్) దగ్గరికి లాగబడి (విశ్వముకుళిత) ఏర్పడాలన్నా ఆదిశక్తియే కారణం అనేది నిరూపించబడుతుంది.

విష్ణువు అంటే విశ్వమంతా వ్యాపించినవాడు అని అర్థం. అవును! ఈ విశ్వమంతా విష్ణు స్వరూపం అనుకుందాం. ఆయన నుండి పుట్టిన బ్రహ్మనే ఈ ప్రకృతి అనుకుందాం! వీళ్లను నడిపించే మహాశక్తే అమ్మవారు అని అను్వుంచే దృష్టి మనకున్నప్పుడు మన పౌరాణిక గాథలు చెప్పేవి అసత్యాలు కావని మనం సవాల్ చేసి చెప్పొచ్చు. ఇలా మనధర్మం అనేక విషయాలను ‘సింబాలిక్’గా (ప్రతీకాత్మకంగా) చెప్పింది. అలా చెప్పిన ఎన్నో విషయాలకు పౌరాణిక, ఆధ్యాత్మిక అర్థాలు విశ్లేషణలు మనం బాగానే చేసుకున్నాం గాని ఆధునికమైన వైజ్ఞానిక విషయాలతో సమన్వయం చేసి చెప్పడంతో విఫలమవుతున్నాం.

విశేషమంటే మనధర్మంలో ఉత్పన్నమయ్యే ప్రతి సమస్యకు మనం పరిష్కారం చెప్పే సమాధానాలు మనకు పుష్కలంగా ఉన్నాయి. దానికోసం కొంతలోతైన ‘అన్వేషణ’ అవసరం. అలాగే ఆ అన్వేషణ మూస పద్ధతిలో కాకుండా ఒక శాస్త్రీయమైన అవగాహన కల్గించే విధానంలో ఉండాలి. అప్పుడే మన హిందూ ధర్మం హిమాలయ శిఖరంపై గర్వంగా నిలబడుతుంది. హిందూ మహాసముద్రంలా ‘నేను లోతైన  సంస్కృతి ’ని అని రొమ్ము గుద్ది చెప్పగలుగుతుంది.

 ***************************************************
  
ॐ డాక్టర్. పి. భాస్కర యోగి 卐 సంపాదకీయ వ్యాసం ॐ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి