తత్వార్థ సౌరభాలతో విరాజిల్లే భగవద్గీత గొప్ప వేదాంత విజ్ఞానం. అన్ని మతాల (శైవ, వైష్ణవ) వారికి ఆమోదయోగ్యమై ఆనందకరమై ప్రవృత్తి - నివృత్తి మార్గాలకు రాచబాట... ఆత్మ నిత్యం. అది చావులేకుండా మృత్యువును శరీరం నుండి వేరు చేసి జీవులకు సద్గతి కల్పిస్తుంది. అలాంటి ఆత్మతత్వం గీతలో ఉంది. అభ్యాస వైరాగ్యాలు అనే రెండు కర్మలద్వారా భౌతిక తత్వాన్ని వదలి ఆత్మ సామ్రాజ్యంలోకి జీవుడు పయనిస్తాడు. సేవద్వారా పరిపశ్నలు వేసి జీవులు జ్ఞానం పొందాలి. కర్మఫలం ఆశించకుండా కర్మ చేయగలవాడే కర్మయోగి అనేది గీతా ప్రభోదం. శీతోష్ణ సుఖదుఃఖాలకు చలించనివాడే స్థితప్రజ్ఞుడు. అనగా ‘ద్వందాతీతుడు’ అని అర్థం.
ఫలం రావడానికి పుష్పంకారణం; కానీ ఫలం రావడంతో పుష్పం ఉండదు. జ్ఞానం కలగడానికి! కర్మ కారణం. జ్ఞానం కలిగాక కర్మలు నాశనం అవుతాయి. అయితే మనుషులు కర్మలు చేయకుండా ఉండడం సాధ్యంకాదు. సత్కర్మలు ఆచరించి జ్ఞానం పొంది యోగ మార్గం ద్వారా భగవంతుణ్ణి పొందాలనేది గీతాసందేశం. ఆత్మతత్వం, యోగం, భగవత్తత్వం ఈ మూడింటిని వదలకుండా ఉంటే మనం గీతను అనుసరించినట్లే. లోకకల్యాణం కోసం చేసే కర్మలు భగవంతునికి ఇష్టం. ఇవి బంధాన్ని కల్గించవు. మనం యోగభ్రష్టులమైనా మళ్లీ ఆ అవకాశం మనకు కల్పిస్తాడు. ధర్మానికి హాని కలిగినపుడు నేను (పరమాత్మ) ప్రకటింపబడతానన్నాడు. భగవంతుని ముందు మనం శరణుపొందటం వల్ల, “నమే భక్త ప్రణశ్యతి” (నా భక్తుడు చెడిపోడు) అనే సందేశం ఆయన ఇస్తాడు.
ఇలా భగవద్గీత భగవంతుడి సందేశము. ఇది విజ్ఞాన తత్వగ్రంథం మాత్రమే కాదు ఎవరు ఔనన్నా కాదన్నా ఇది మత గ్రంథం కూడా! పరమహంస యోగానంద చెప్పినట్లు ‘భగవద్గీత ప్రపంచంలోనే అత్యుత్తమ పవిత్ర గ్రంథము. హిందువులకు ఆరాధ్య గ్రంథము. ఏది జ్ఞానదాయకమై మన అజ్ఞానాలను పటా పంచలు చేస్తుందో అది ఆరాధ్యం అవుతుంది.
గీత! ఎందుకు జాతీయ గ్రంథం
ఇండోనేషియా దేశానికి డా॥ రఘువీర అనే ఆయన మన దేశం నుండి వెళ్లారట. అధ్యక్షులైన సుకర్ణోపుత్రిని కలిసినపుడు నా పేరుకు అర్థం మీకు తెలుసా? అని అడిగిందట. “బుద్ధ విగ్రహాలకు చెవులు పెద్దగా ఉంటాయి కాబట్టి సుకర్ణో అని పెట్టి ఉండొచ్చు అన్నారట రఘువీర గారు” సుకర్ణో నవ్వి “ అలాకాదు నేను పుట్టేటప్పటికే మా నాన్నగారు ప్రతిరోజు మహాభారతం చదివేవారు.
మహా భారతంలోని కర్ణుని దాన స్వభావం నచ్చి ఆయన పేరు నాకు పెట్టాలనుకొన్నాడు, కానీ భారతంలోని కర్ణుడు దుష్ట చతుష్టయంలోనివాడు. అతని వీరత్వం దానం గొప్పవి కాని దుష్టుడయ్యాడని నాకు కర్ణ శబ్దాన్ని సు-తో జోడించి ‘సుకర్ణో’ అని పెట్టారని ‘చెప్పడం జరిగింది. ఇది గొప్ప విషయం. చూడండి. ఇండోనేషియా 87% శాతం ముస్లింలున్న దేశం. కానీ వారికి మన దేశమూలాలున్నాయి. వారు ఆరాధనాపరంగా ఎలా ఉన్నా ‘మనసంస్కృతి’ని గౌరవిస్తున్నారు. వారు పర్‌వేస్ పేరు ‘గరుడ’, వారుతమ నోట్లపై గణేశుడి చిత్రాన్ని ముద్రించుకొన్నారు. వారు అమెరికాకు ఇచ్చిన స్నేహపూర్వక బహుమతి ‘సరస్వతీ విగ్రహం’ (అమెరికా వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌కు దగ్గరలో దాన్ని నెలకొల్పారు) ఇండోనేషియా రాజధాని జకార్తా నడిబొడ్డున శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతను బోధించే విగ్రహం పెట్టుకొన్నారు. అలాగే ఇవాళ అమెరికా, బ్రిటన్ లాంటి క్రైస్తవాధిపత్య దేశాల్లోనే యోగదా సత్సంగ సొసైటీ, ఇస్కాన్ వంటి సంస్థలు చర్చి స్థలాలను అమ్మితేకొని కృష్ణ మందిరాలు నిర్మిస్తున్నాయి. జర్మన్ రాయబార కార్యాలయం మన దగ్గర నుండి వేదాలకు గొప్ప అర్థాలు చెప్పిన దండిభట్ల విశ్వనాథశాస్త్రి చిత్రపటాన్ని పెట్టుకొన్నది. జర్మన్ వారి ఎయిర్‌హౌస్‌కి ‘లుఫ్తాన్సా’ అని మన సంస్కృతం పేరు పెట్టుకొన్నారు (లుప్తం- అంటే కనుమరుగు అవడం అని అర్థం, హంసక్షీర - నీరాలనువేరు చేసేది అని,- అది కనుమరుగయ్యిందని చెప్పడం)
ఇలా ఇతర దేశాల్లో భారత- హిందూ సంస్కృతి పరిఢవిల్లుతుంటే మనం మాత్రం మన గ్రంథాలను గౌరవించుకోలేమా? భగవద్గీతను భారత్ జాతీయ గ్రంథంగా ప్రకటించకపోతే.. ఏదేశం జాతీయ గ్రంథంగా పెడుతుంది..?
పాకిస్తాన్‌నో, అమెరికానో జాతీయ గ్రంథంగా ప్రకటించమని అడుగుదామా? భగవద్గీతను జాతీయ గ్రంథంగా పెట్టాలి అని అనడం కూడా 85% హిందువులున్న ఈ దేశంలో నేరమా? అదేదో అడగడం కూడా తప్పయినట్లు ఎర్రకళ్ల మాధ్యమాలు- మరీముఖ్యంగా మన (కుల) మాధ్యమాలు ఊదరగొడుతున్నాయి. మనం ‘హిందూ సామ్రాజ్యం’ అడిగామా? ఈ దేశంలోని 85% ప్రజల పవిత్ర గ్రంథం జాతీయ గ్రంథం చేయమన్నాం.
అంత మాత్రాన ‘మిన్ను విరిగి మీదపడ్డట్టు’ గోల చేయడం సబబా? వందేమాతరం మేం పాడలేం అన్నవాళ్లు, జాతీయ పతాకాన్ని గౌరవించం అన్నవాళ్లు, జాతీయ నాయకులను గౌరవించని వాళ్ళకు స్వేచ్ఛ కావల్సినంత ఉంటుంది. భగవద్గీత అని అందులోని భ- నోట్లోంచి రావడమే నేరమనడం ఎంత వరకు సబబు? భగవద్గీత సూక్తులతో అర్జునుడి మోహాంధకారమే పటాపంచలు కాలేదు. భారత జిజ్ఞాసాపరుల మోహగ్రంథులన్నీ ఛేదించబడ్డాయి. మహాభారతానికే దీపస్తంభం లాంటి భగవద్గీత ఈ దేశ ప్రజల మనోభావాలకనుగుణంగా జాతీయ గ్రంథం అయితే తప్పేమికాదు. ప్రాచ్యులు, పాశ్చాత్యులేకాదు; ; ముస్లింలు కూడా (దారా) గౌరవించిన భగవద్గీత జాతీయ గ్రంథంగా ఇక్కడి ప్రభుత్వం ప్రకటించినా ప్రకటించకున్నా ఏనాడో అంతర్జాతీయ గ్రంథం అయ్యింది. లేకుంటే ఆర్నాల్డ్ ఎందుకు అనువాదం చేస్తాడు. ప్రపంచంలోని ఎన్నో భాషల్లోకి అనువాదం ఎందుకు అయ్యిం ది? ఐన్‌స్టీన్, వోపన్ హామర్, వంటి శావేత్తలు, మాక్స్ ముల్లర్ వంటి పండితులు గీతను ఎందుకు గౌరవిస్తారు?
భగవద్గీత జాతీయ గ్రంథమే కాదు; అంతర్జాతీయ గ్రంథం.
శ్లో॥ గీతా సుగీతాకర్తవ్యా
కి మన్యుః శాసంగ్రహైః
యా స్వయం పద్మ నాభస్య
ముఖ పద్మాద్విని స్మృతాః॥
గీత స్వయంగా పద్మనాభుడైన భగవంతుని ముఖ కమలము నుండి వెలువడింది. గీతను చక్కగా అధ్యయనం చేస్తే చాలు. ఇతర శాస్త్రాల అవసరమేముంది?
*************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి