భక్తి అనేది ‘భజ్’ అనే ధాతువునుండి పుట్టింది. భజ్ అంటే సేవాయాం అన్నారు. సేవించడం భక్తి అన్నమాట. అది ప్రేమగా మారి పరిపూర్ణమయ్యింది. ధనంపై ప్రేమ ఉంటే ‘లోభము’ అని, స్ర్తిలపై ప్రేమ వుంటే ‘మోహం’ అని, మనకంటే చిన్నలపై ప్రేమ ఉంటే ‘వాత్సల్యం’ అని, పెద్దలపై ప్రేమ వుంటే ‘గౌరవ’మని, భగవంతునిపై గల ప్రేమ ‘్భక్తి’ అని పెద్దలు చెప్పడం జరిగింది.
మన ప్రేమ భగవంతునిపైకి మరల్చినపుడు ‘్భక్తి’ పరిపక్వతనొందుతుంది. లక్ష్యం నిర్దేశించబడుతుంది. మోక్షద్వారం తెరచుకొంటుంది. కాని ఈ నిర్దేశాల్లో ఈ రోజు ఆధ్యాత్మిక జీవనం కొనసాగుతున్నదా? అన్నదే ప్రశ్న. ఏదో మొక్కుబడిగా గుడికి వెళ్లడం, పూజలు చేయడం తప్ప అంతకుమించి మన ఆధ్యాత్మికత ముందుకు వెళ్లడంలేదు. మన ఋషులు, యోగులు ఎంతో తపోబలంచేత సాధించి పెట్టిన తాత్విక, జ్ఞాన, యోగ సంబంధ విషయాలు మన మెదళ్లకెక్కడంలేదు.
పూర్వకాలంలో ప్రతి కుటుంబానికి ఏదో ఒక ఆధ్యాత్మిక పీఠంతోనో, ఆశ్రమంతోనో, గురువుతోనో తప్పనిసరి సంబంధం ఉండేది. ప్రస్తుతం జ్యోతిషం, ధర్మం, పౌరోహిత్యం, వ్యాపారమయం కావడంవల్ల గురువులతో, కుల పురోహితులతో సంబంధం లేదు. ఎవరైనా, ఎక్కడికైనా వెళ్లి డబ్బులిచ్చి తమ మంచి చెడ్డల విచారణ చేసుకొంటున్నారు. ఆ చెప్పేవాళ్ళు కూడా వ్యాపార ధోరణితోనే చెప్తున్నారు. తద్వారా వ్యక్తికీ ధర్మానికి సంబంధం లేకుండా పోయింది.
అలాగే మనకు నిత్యం మన ధర్మాన్ని గురించి చెప్పే వ్యవస్థ లేదు. గుడికి వెళ్లడం.. డబ్బులిచ్చి అర్చనలు, హోమాలు, ఆరాధనలు చేయడం తప్ప, ఆ దేవునికీ.. ఈ భక్తునికీ వుండే అంతరార్థ సంబంధాన్ని గూర్చి చెప్పే కౌన్సిలింగ్ లేదు. అక్కడుండే అర్చకుల్లో చాలామందికి దైవభక్తి ఉండదు. ‘నేను చేసే పూజలవల్లనే ఈ దేవుడు బ్రతుకుతున్నాడు’ అనే ఆలోచనలో ఉంటారు. కానుకలు.. వచ్చేవారి పదవుల మీద.. పెత్తనం మీద వున్న దృష్టి భక్తులను ధార్మిక దృష్టితో నడిపించాలన్న విజ్ఞత వాళ్లకు లేదు. అది మన దురదృష్టం.
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడిచే దేవాలయాల్లో మరో విచిత్ర పరిస్థితి. వ్యాపార దృష్టిని దేవాలయాలకు అలవాటు చేసిందే ఈ శాఖ. గుడుల మాన్యాలు, మడులు దురాక్రమణదారులు ఆక్రమించుకుంటుంటే దాన్ని ఎన్నడూ ఈ శాఖ అడ్డుకోలేదు సరికదా, వారికి చట్టం ద్వారా ‘లాభం చేకూర్చే’ పనిని కూడా లోపాయికారిగా ఈ శాఖ చేసింది. గుడి ఖర్చులకొరకు వదాన్యులిచ్చిన సంపదను, భూములు అన్యాక్రాంతం అవుతుంటే కళ్లప్పగించి చూస్తున్న ఈ శాఖ పాత్ర నపుంసక లక్షణమే. బాగా ఆదాయం వచ్చే తిరుమల, శ్రీశైలం వంటి దేవాలయాల ఆదాయాన్ని ప్రభుత్వం చేసే ఇతర ఖర్చులక్రిందకు మళ్లిస్తూ, జీర్ణోద్ధారణ చేయాల్సిన దేవాలయాలను దిక్కులేకుండా వదిలేస్తున్నది. కాబట్టి గుళ్ల ఆదాయ, వ్యయాలతో తప్ప ధర్మదృష్టితో ఈ శాఖ ఉండాలనుకోవడం మనం ఊహించుకోవడం భ్రమే.
ఇంకొకవైపు చాలామంది స్వాములు, మఠాధిపతులు, పీఠాధిపతులు తమ వ్యక్తిగత ప్రాబల్యం కొరకు పనిచేస్తున్నారు. కులం కోసం, వారి వారి సంప్రదాయం కోసమే తమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాని విశాలమైన ‘హిందూ ధర్మ’ రక్షణ కొరకు పాటుపడడంలేదు. ఈ కారణవల్లనే మన సంస్కృతి, ధర్మం రోజు రోజుకు ఆత్మరక్షణలో పడే ప్రమాదం ఏర్పడుతుంది.
దేవాలయాల్లో అందరూ సమానమైన భక్తితో దేవుణ్ణి దర్శించుకొనే సావకాశం రావాలి. ఆలయాల్లో ధన సంబంధమైన అన్ని రకాల వ్యవహారాలు నిషేధింపబడాలి. భక్తులు తాము ప్రేమతో విరాళాలు ఇచ్చే సంప్రదాయం ఉండాలి. కాని నిర్బంధ వసూళ్లు, పూజలకింత మొత్తం అనే ధోరణి పూర్తిగా పోవాలి.
నా ధర్మం.. నా జాతి.. నా గుడి.. నా బడి.. నా ఆశ్రమం.. అనే భావన ఈ దేశంలోని ప్రతి హిందువులో కల్పింపబడాలి. అది సంప్రదాయంగా కుటుంబాలకు అందించబడాలి. అలా అయితేనే ఈ దేశంలో ఈ ధర్మంలో మనం నిలబడగలుగుతాం. ధర్మస్వరూపమైన గోవు, జ్ఞాన స్వరూపమైన గీత, పావన స్వరూపమైన గంగ, వేదస్వరూపమైన గాయత్రిని మనం రక్షించుకోవాలి. అప్పుడే మనకు విజయసిద్ధి!


************************************************

      డాక్టర్‌. పి. భాస్కర యోగి
      ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ
ॐ ఆదివారం 卐 ఏప్రిల్ 22 卐 2018 ॐ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి