ఈ చరాచర సృష్టికి ఆధారభూతమైన, సృష్టితత్వాన్ని నడిపిస్తున్నది పరమాత్మ. ఆరోజు హిందువులు అని పిలువబడే వైదికులు పరమాత్మను మరచిపోయారు. ‘‘కలియుగంబున ఘనతకు నైచ్యంబు, నైచ్యంబునకు ఘనత గలుగుచుండు’’అన్నారు.

భోగలాలసతలో మునిగిపోయిన ఈ దేశం పరమాత్మను పది కిలోమీటర్ల దూరంలోపెట్టి ఆ ఏకత్వాన్ని దూరం చేసుకొంటున్నది. ఏ తత్వం ఈ సృష్టిని తన కనుసన్నలలో నడిపి చైతన్యవంతం చేయగలదో ఆ తత్త్వాన్ని గురించి ఆలోచించే తీరిక లేదు. ఎప్పుడు చూసినా సంసారవృక్షంలోని విషపు పురుగుల్లా తయారవుతున్న మనకు సాంత్వన చేకూర్చగల తాత్త్విక సిద్ధాంతం ఎక్కడుంది?

అసలు జీవితంలో ఎప్పుడైనా తాత్వికతవైపు, మోక్షంవైపు మనం దృష్టిసారిస్తున్నామా! ఈ జీవితం మాత్రమే శాశ్వతమనే భ్రమలో ఉండి సంసార కూపంలో మునిగి తేలుతున్నాం కాని జన్మజన్మల నుండి వస్తున్న వాసనల్ని వదిలిపెట్టి భవబంధాన్ని తెంపుకొనే ఆలోచన చేయడం లేదు. ఎంతసేపూ నిత్యవ్యవహారాల్లో మునిగి తేలుతున్నాం. నేనెవరు? నేను ఎక్కడినుండి వచ్చాను? నేను ఎక్కడికి వెళ్లాలి? నా ఈ ప్రస్థానానికి వెనుక దాగి ఉన్న శక్తి ఏది? అనే తాత్విక దృక్పథం వదలిపెట్టి దారం తెగిన గాలిపటంలా జీవితం సాగిస్తున్నాం.
అందమైన రంగురంగుల పూలను దండగా కూర్చితే అంతస్సూత్రమైన దారం ఒకటి ఉంటుంది. పైన కన్పించే పూలే మనకు కన్పిస్తాయి కాని లోపల దాగిన దారం కన్పించదు. అలాగే మానవులు పైపైన ఆడంబరాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

కాని మనందరినీ నడిపించే పరమాత్మను విస్మరిస్తున్నారు. ప్రతిరోజు సంధ్యాసమయంలో పరమాత్మ ఆరాధన చేయాలి. అప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుంది.
దేహం బలహీనమైతే రోగక్రిములు శరీరంలో ప్రవేశిస్తాయి. దేశం బలహీనమైతే దుర్మార్గులు దేశాన్ని దోచుకుతింటారు. అవినీతిని దేశం నిండా నింపేస్తారు. ధర్మాన్ని బలహీనంచేస్తారు. కాబట్టి నిరంతరం ‘ధర్మరక్షకులు’ దేశాన్ని-దైవాన్ని స్మరించుకోవాలి. ఈ దేశం మనకిచ్చిన వైదిక విద్యను కావలసినంత ప్రచారం చేయాలి. వైదిక సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయాలి. దేశం నాది అనే భావన కలిగియుండాలి. ‘తస్యవాచక ప్రణవః’ - పరమాత్మ వాచకమైన ప్రణవం (ఓంకారం) నాది అని ఎల్లెడల చాటాలి. వేలాది సంవత్సరాల ఋషిపరంపరకు చిహ్నమైన కాషాయాన్ని మన ఐక్యతకు గుర్తుగా స్వీకరించాలి. ఈ దేశం నాది. ఈ ధర్మం వేద ధర్మం-రెండూ నాకు పరమప్రాణం అనే దీక్షను స్వీకరించాలి.

*********************************************
     డాక్టర్‌. పి. భాస్కర యోగి
      ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి