సనాతన భారతంలో గంగా, యమున, సరస్వతి లాంటి నదులు ప్రవహించాయి. ప్రాచీన తత్వం అంతా ఆ నదుల ఒడ్డున వెలసింది. మనకు అత్యున్నత హిమవత్పర్వతాలు ఉన్నాయి. మన సంస్కృతంతా అంత ఎత్తున ఉండేది. మన ఆధ్యాత్మికతలోని పవిత్రతకు అవి నిదర్శనాలు. ప్రపంచంలోనే తొట్టతొలి గ్రంథం ఋగ్వేదం. ఆర్షఋషుల అడుగుజాడలు అందులో కన్పిస్తాయి. మన వైదిక ధర్మంలోని ఘనమైన వారసత్వ సంపద, తాత్వికత మనకు కన్పిస్తాయి.
ఇలాంటి గొప్ప విశ్వజనీన విషయాలు మన స్వంతం కాని ఈ రోజు ఏ పత్రిక చూసినా, ఏ టీవీ చానల్ చూసినా హత్యలు, అత్యాచారాలు, మోసం.. ఇవే నిండా దర్శనమిస్తాయి. దాదాపు 90 కోట్ల మంది భారతదేశంలో వైదిక ధర్మాన్ని విశ్వసించేవాళ్లు, ఆధ్యాత్మికతను అనుసరించేవాళ్లు ఉన్నా, ఇన్ని జరగడం దురదృష్టకరం. మరి మనలో లోపం ఎక్కడుంది. మన జీవన విధానమే ఆధ్యాత్మిక స్పృహతో కూడుకొని ఉంది.
మన ఆహారం, విహారం, దుస్తులు, ప్రవర్తన, కుటుంబం అన్నీ ఓ ప్రత్యేకత గలవే. మన జీవనంలో యోగం, భోగం రెండూ ఉన్నాయి. కాని మన ఋషులు యోగానే్న ఆశ్రయించి, ఆచరించారు. కానీ రోజురోజుకు మనలో పెరుగుతున్న అసహనం, అసహజ జీవనం వికృత పోకడలకు దారితీస్తున్నది. సమాజంలో ఉన్న ఈ రుగ్మతలు అన్ని రంగాలకు వ్యాప్తి చెందడం విడ్డూరం. ఆధ్యాత్మికవేత్తలు పూజలు, ఆరాధనలకు, పాదపూజలకు పరిమితమైపోతున్నారా! ఆధ్యాత్మిక పండితులు పదవులు పొందడానికో ప్రచారానికో పరిమితమైపోతున్నారా? అనిపిస్తుంది.
ప్రభుత్వాలు అవినీతితో కూరుకుపోయి జాతికి కావలసిన జవసత్త్వాలను అందించడంలో విఫలమవుతున్నాయి. మన మతంలో భిన్న విశే్లషణలు రాజకీయ వ్యవస్థ, అధికార వ్యవస్థ అర్థం చేసుకోలేక ‘నిరపేక్ష మతభావన’ను (లౌకికవాదం) ప్రోత్సహిస్తున్నది. అలాగే ఇతర మతాలకు కావలసిన ప్రోత్సాహాలు అందిస్తున్నది. సమాజంలో ప్రచార ప్రసార మాధ్యమాలు బాధ్యత వహిచకుండా ఆ పూట ప్రకటన కొరకు తాపత్రయపడుతూ శాశ్వత విలువలకు సమాధి కడుతున్నది. ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలియని మూర్ఖులు ఆధ్యాత్మిక అంశాలపై వివాదం ఏర్పడినపుడు చర్చల్లో పాల్గొని హిందూ సమాజాన్ని బజారుకీడుస్తున్నారు.
హేతువాదం, లౌకికవాదం పేరుతో సర్వసృష్టి నియామకుడైన దేవుని ఉనికిని ప్రశ్నిస్తూ వైదిక ధర్మ ప్రతిష్ఠను మంటగలుపుతున్నారు. అదే ఇతర మతాల వాళ్లను ప్రశ్నించడంలేదు. సత్యం కొరకు పాటుపడాల్సిన మేధావులు పక్షపాతం వహించడం పెద్ద నేరం. ఈ ప్రశ్నలకు సమాధానం ఒక్కటే- అదే వైదిక ధర్మాచరణ. నీ ధర్మంలోని గొప్పతత్వం నీవు తెలుసుకోవాలి. అప్పుడు నీకు ‘ఉన్నతం’ సిద్ధిస్తుంది. లేకుంటే నీకు పతనం తప్పదు. తస్మాత్ జాగ్రత్త!

*********************************************
*✍ డాక్టర్‌. పి. భాస్కర యోగి*
ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి