మన దేశం నుండి ఓ ఉన్నతాధికారి జర్మన్ రాయబార కార్యాలయానికి వెళితే, అక్కడ ఎందరో శాస్తవ్రేత్తలు, గొప్పవాళ్ల పక్కన మన దేశస్థుడైన ఓ వ్యక్తి ఛాయాచిత్రం కన్పించింది. మన దేశపు ఉన్నతాధికారి ఆసక్తిగా అందులోని వ్యక్తిని గురించి ప్రశ్నించాడు? అక్కడి రాయబార కార్యాలయం అధికారులు ఆ ఫొటోలోని వ్యక్తిని గురించి వివరించారు. “ఆయన పేరు దండిభట్ల విశ్వనాథ శాస్త్రీ. రాజమహేంద్రవరానికి చెందిన వేద పండితుడు. ఈ శాస్త్రీ వేదానికి శాస్త్ర సమ్మతమైన అర్థంతోపాటు వైజ్ఞానిక అర్థం కూడా చెప్పేవాడు. ఈయనను 1930కి పూర్వమే జర్మన్ ప్రభుత్వం ఇక్కడికి రప్పించింది. ఈయనవల్లనే కొన్ని ఆయుధాలకు భారతీయమైన పేర్లను మేం పెట్టుకొన్నాం. అందుకే మా శాస్తవ్రేత్తల సరసన ఆయన ఫొటో పెట్టుకొన్నాం” అని వారు వివరించారు.

నిజంగా భారతీయులు అంత గొప్పవారు! కానీ దురదృష్టవశాత్తూ ‘మనది అనుకొన్న ఏ విషయం కూడా మనకు కాకుండా చేయడమే’ ఈ దేశాన్ని పాలించినవారు, స్వయం ప్రకటిత మేధావుల మహత్కార్యం. వారు ఈ విషయంలో కొంత విజయం సాధించారనే చెప్పవచ్చు. భారతదేశం నుండి చైనా రాయడం నేర్చుకున్నది అన్న విషయం ప్రపంచ భాషా శాస్తవ్రేత్తలు అంగీకరించినా మన ‘చైనా మేధావులు’, భక్తులు ససేమిరా అంటారు. వైజ్ఞానికమైన మన సూత్రరూప భాషకు భాష నేర్పించే అద్భుతమైన ‘మెకానిజం’ ఉంది. భాషగా సంస్కృతాన్ని, లిపిగా బ్రాహ్మీ లిపిని మనమే మొదట అందించాం. లక్షల ఏళ్ల ముందు రచించారని చెప్పే రామాయణంలోని భాష 21వ శతాబ్దంలో కూడా మార్పులు లేకుండా నేర్చుకోవచ్చు. ప్రపంచంలోనే ప్రాచీనమైన డచ్చి, ఫ్రెంచి, గ్రీస్, జర్మన్ భాషలు తమ అస్తిత్వాన్ని కోల్పోయినా, మన దేశంలో సంస్కృతం మాత్రం లిఖిత రూపకంగా పటిష్టంగా ఉంటే, పూజలోనో, పద్యంగానో, శ్లోకంగానో, మంత్రంగానో ‘ప్రజల భాష’గా ఈనాటికీ ఉంది. ప్రపంచంలో అత్యంతమైన ‘వైజ్ఞానిక భాష’ సంస్కృతమని ‘నాసా’ ప్రకటించింది. కానీ దీనిని ఒప్పుకోవడం మన పిడివాదపు భాషావేత్తలు ఇష్టం ఉండదు.

‘నికోలస్ ఓస్లర్’ అనే పరిశోధకుడు ప్రపంచ భాషలపై గొప్ప పరిశోధన చేసి వెలువరించిన ‘ఎంపైర్స్ ఆఫ్ ది వర్డ్’(Languages History of the World) అనే గ్రంథంలో భారతీయ భాషలు ప్రపంచవ్యాప్తంగా ఎంత గొప్పగా నిలబడగలిగాయనే విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి వివరించారు.

అయితే సంస్కృతం మనం పౌరాణిక భాషగా మాత్రమే పరిమితం చేసుకున్నా, దాని ఛాయల్లోని మాతృభాషల ఉనికి కూడా కోల్పోయే ప్రమాదంలో ఉన్నాం. అలా వధ్యశిలపై ఉన్న భాషలకు రక్షణ కావాలి. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం జరుపుతున్న “ప్రపంచ తెలుగు మహాసభల” అంతర్గత లక్ష్యం ఇదే కావాలి. ఈ ప్రాంతంలోని వౌఖిక, లిఖితరూప గ్రంథాలు, సాహిత్యం, శాసనాలు, ప్రాచీన గేయాలు, పలుకుబడులు, నుడికారాలు తెలుగు భాషా పరిపుష్టికి దోహదం చేయాలి.

ఇక్కడి ప్రాచీన కవుల రచనలు కొత్త తరానికి మార్గదర్శనం చేయాలి. భాషను భావోద్వేగంగా కాకుండా ‘మాధ్యమంగా’ సమాచార సాధనంగా మనం ఎలా ఉపయోగించవచ్చో అనే పరిశోధన జరగాలి. కాని “అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్ల శని” అన్నట్లుగా స్వాతంత్య్రం వచ్చాక భాషపట్ల పాలకవర్గాలకు, మేధావులకు చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే మనం ఇప్పటికిప్పుడు బాగు చేసుకోలేనంత ప్రమాదంలో పడ్డాం. మనం వెయ్యేళ్లు బానిసలుగా ఉన్న కారణంగా పాలకులు, ప్రజలపై బలవంతంగా రుద్దిన భాషలు మన మూల సంస్కృతిని ధ్వంసం చేశాయి. అందుకే “మనం భాషపరంగా 11వ శతాబ్దంలో ఉన్నా, రాజనీతి, విదేశ విధానం ప్రకారం 17వ శతాబ్దం”లో ఉన్నాం అనిపిస్తుంది. ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ కుట్రలన్నీ ఈ రోజుకూ మన విద్యావిధానంలో చొచ్చుకొని వస్తున్నాయి.

అది కన్పించేటంత ప్రమాదకరంగా లేదు. కన్పించనంత రహస్యంగా కూడా లేదు. ప్రభుత్వం గుర్తించిన భారతీయ భాషల స్థానంలో విదేశీ భాషలు చేరుతుంటే, ఆంగ్ల ప్రపంచవ్యాప్త భాషగా మన మెదళ్లలోకి ఎక్కి కూర్చుంది. దీనికంతా మన విధానాలే కారణం! ఇటీవల విదేశ విశ్వవిద్యాలయాల పేరుతో వివిధ పాశ్చాత్య భాషలు మనల్ని మింగడానికి వస్తున్నాయి. మనదేశంలాగానే ప్రపంచంలోని ఆఫ్రికా, మైన్మార్, శ్రీలంక, బ్రెజిల్, చిలీ, చైనాలాంటి అనేక దేశాలు చాలా ఏళ్లు బానిసత్వంలోనే మగ్గాయి. పై వాటిలో చాలా దేశాలు ఫ్రాన్సు, బ్రిటన్, అమెరికా దేశాలకు బానిస దేశాలుగానే ఉన్నాయి. అయితే అవన్నీ స్వాతంత్య్రం వచ్చాక భాషల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ తమ అస్తిత్వాన్ని చాటుకొన్నాయి.

తమ మాతృభాషల్లో పాలన సాగిస్తూ విశేషమైన అభివృద్ధి సాధించాయి. ‘ఏ దేశం తమ మాతృభాషను కోల్పోతుందో అది విచ్ఛిన్నం అయ్యే అవకాశాలు ఎక్కువ’ -అని ప్రపంచ భాషా చరిత్రకారులు చెబుతున్నారు. అందుకే ప్రపంచంలో ప్రసిద్ధమైన ఏ దేశం తమ సంస్కృతిని కోల్పోయిందో అది విధ్వంసం అయిపోయింది. అందులో భాష కూడా నశించడం దేశ విధ్వంసానికి సూచనే. గొప్ప నాగరికతగల దేశాలన్నింటిలో భాషను ధ్వంసం చేసిన తర్వాతనే ఆ దేశాన్ని శత్రువులు ధ్వంసం చేశారు. మన దగ్గర బలమైన ‘సంస్కృతం’ పునాదులు భాషకున్న పట్టును సడలనివ్వలేదు. అందుకే ‘మెకాలే’ విద్యావిధానం ప్రక్షాళన పేరుతో కొమ్మను నరుక్కొంటూ వచ్చాడు. ఈ రోజు ఇంటర్నేషనల్ స్కూళ్ల పేరుతో చేస్తున్న విద్యావిధానంపై మనం ఒక అకడమిక్ పరిశోధన చేసి కుట్రలు బయటపెట్టాలి.

1949లో స్వాతంత్య్రం పొందిన చైనా సామాజిక, ఆర్థిక రంగాల్లో అమెరికాలాంటి దేశాలకే సవాల్ విసరసాగింది. దానికి వాళ్ల ‘చీనీ’ భాషకు ప్రాధాన్యం ఇవ్వడమే కారణం. అలాగే జపాన్ దేశం జపనీస్ ద్వారా హాలీవ్పు పట్టు సాధించింది. అమెరికా ఆర్థికరంగంలో జపాన్ పెట్టుబడులు ఎక్కువ. కానీ భాష విషయంలో జప్పా అమెరికా ఇంగ్లీషు పట్టు సాధించలేకపోయింది. అలాగే ఫిన్లాండ్, డెన్మార్క్, నార్వే వంటి 26 దేశాలు ప్రపంచంలోనే చాలా చిన్నవి. ఈ దేశాల్లో 15 - 30 కోట్లకన్నా ఎక్కువ జనాభా లేదు. వాటికి సైనికశక్తి, మానవ వనరులు తక్కువగా ఉన్నా ఏ అగ్రదేశానికీ భయపడకుండా తమ మాతృభాషను పకడ్బందీగా అమలు చేస్తున్నాయి.

ఫిన్లాండ్ వందేళ్లు బానిసగా ఉన్నా, బ్రిటన్కు అతి దగ్గరగా ఉన్నా తమ భాషా సాధికారతను పరిరక్షించుకొంటున్నది. అలాగే కేవలం 22 లక్షల జనాభా ఉన్న డెన్మార్క్ తమ మాతృభాష డేనిష్ను తమ దేశ ప్రతి అవసరంలో ఉపయోగిస్తున్నది. స్వీడన్ స్వీడిష్, నార్వే నార్వేజియన్ను విద్యారంగంలో అన్ని స్థాయిల్లో ఉపయోగిస్తున్నది. ఇంత చిన్న దేశాలు వాళ్ల మాతృభాషను గౌరవిస్తున్నాయి. మరి మానవ వనరుల్లో ఎంతో గొప్పదైన మనదేశంలోని గుర్తింపు పొందిన 25 భాషల్లో ఏ ఒక్కటీ రాజభాషగా, అధికార భాష గుర్తింపును పొందలేదు. కనీసం రాజ్యాంగంలో భాషలకు సంబంధించిన రాజ్యాంగంలోని 345, 348 ప్రకరణాల్లో ద్వంద్వ ప్రమాణాలను సరి చేసుకోలేకపోయాం. ఆఖరుకు త్రిభాషా సూత్రాన్ని కాపాడుకొని దేశ సమగ్రతను కూడా పరిరక్షించుకోలేని దుస్థితి.

ప్రపంచంలో దాదాపు 200 దేశాలుండగా 650 కోట్ల జనాభా ఉంది. కానీ కేవలం 11 దేశాల్లో మాత్రమే ఆంగ్లం చదవడం, రాయడం బాగా తెలిసిన వాళ్లున్నారు. అంటే 5శాతం దేశాల్లో మాత్రమే ఆంగ్లానికి ప్రాధాన్యం ఉందన్నమాట. ప్రపంచ జనాభాలో 4 శాతం మాత్రమే ఆంగ్లం తెలిసిన వారున్నారు. మరి అది ప్రపంచంలోనే అతిపెద్ద భాష ఎలా అయ్యిందో చెప్పే మేధావి ఎవరూ కన్పించరు!?

ప్రపంచ భాష కావాలంటే 140 కోట్ల ప్రజలు మాట్లాడే చీనీగానీ, 100 కోట్ల మందికి తెలిసిన ‘హిందీ’గాని, మూడవ స్థానంలోని రూసీ, నాల్గవస్థానంలో స్పానిష్, 5వ స్థానంలోని పోర్చుగీసు ఉండగా 11వ స్థానంలో ఆంగ్లం ఉంది. అయినా మనదేశంలో వేలంవెర్రిగా ఇంగ్లీషును నెత్తిన పెట్టుకొని ఊరేగిస్తున్నారు. బ్రిటన్కు బానిస దేశాలుగా ఉన్న 11 దేశాల్లో ఆంగ్లం బలవంతంగా రుద్దబడింది.

ఐర్లాండ్, స్కాట్లాండ్ను భాష ద్వారానే చాలా ఏళ్లు బ్రిటన్ తమ చెప్పుచేతుల్లో పెట్టుకొంది. ఇంగ్లండులోకి ఆంగ్లం 4వ శతాబ్దం తర్వాత వస్తే, ఈ రోజుకూ వెబ్స్టర్, ఆక్స్ఫర్డ్ నిఘంటువుల్లో లక్షన్నర పదాలు మాత్రమే ఉన్నాయి. కానీ వాటిలో కూడా లాటిన్, పోర్చుగీసు, గ్రీకు, సంస్కృతం పదాలే ఎక్కువ. పరిశోధకుల పరిశోధనల ప్రకారం ఆంగ్ల మూల పదాలు 2900 మాత్రమే ఉండటం గమనార్హం. ఇలా దుర్మార్గమైన సాంస్కృతిక పెత్తనం వల్ల 187 దేశాల చరిత్రపైన బ్రిటన్, అమెరికా సంస్కృతుల ప్రాబల్యం పెరిగింది. ఈ ప్రభావం మన మాతృభాషలపై కూడా పడి అవన్నీ సమాంతరంగా నడుస్తున్నట్లు అనిపిస్తున్నా కానీ ఆంగ్లం ధాటికి ఎక్కడ విధ్వంసం అవుతాయో అన్నట్లు సర్వేసర్వత్రా వినిపిస్తున్నమాట. ఈ ఆందోళన నుండి మనం బయటపడా లంటే మనకున్న ‘భాషా అధ్యయన మెకానిజం’ పునరుద్ధరించుకోవడమే ఏకైక లక్ష్యం. ఏ జాతి తన ఉనికిని, చరిత్రను, సంస్కృతిని కోల్పోతుందో అది దాని మరణశాసనాన్ని అదే స్వయంగా రాసుకున్నట్లే! ఇప్పటికైనా జాతీయ భాషతోపాటు, మాతృభాషను జీవభాషలుగా నిలబెట్టుకోవాలి.

***************************************************
ॐ卐 డాక్టర్. పి. భాస్కర యోగి 卐 సంపాదకీయ వ్యాసం ॐ卐

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి