‘గురువు’ అంటేనే భారమైనది, గొప్పది అని అర్థం. గురువు శబ్దం మన అజ్ఞానాన్ని పటాపంచలు చేస్తుంది. ఏళ్లనుండి కాదు కాదు జన్మలనుండి పిడచకట్టుకపోయిన మన అజ్ఞాన తిమిరాంధకారాన్ని తొలగించి, జ్ఞానజ్యోతిని వెలిగించే మహత్తర శక్తి గురువు.
తన దగ్గరున్న తత్వాన్ని ప్రపంచానికి పంచి జీవుడు తన తలపై ఎత్తుకున్న చెరువులాంటి బరువును దించి, సన్మార్గం చూపే గురువును భారతదేశం యుగాలనుండి గొప్ప దృష్టితో చూస్తున్నది. ధర్మదండాన్ని గురువు చేతికిచ్చి దేశధర్మాన్ని నడిపించమని కోరిన ఘనత భారతీయులది.
ఆధ్యాత్మిక తత్త్వాన్ని ఆపోసన పట్టిన గురువులు కొందరు, రాజనీతి సామాజిక బాధ్యత తమ భుజాలకెత్తుకొన్న గురువులు మరికొందరు. ఎవరి మార్గంలో వారు పనిచేస్తూ ధార్మిక తత్త్వాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. వేదకాలంలో ఋషిపరంపర గురుపరంపరగా ఉండిపోయింది. దాని వివిధ దశలు, రూపాలు ఈనాటికి మనం చూస్తూనే ఉన్నాం.
వైదిక జ్ఞానాన్ని విభజించి, వేదమార్గం సుస్థాపితం చేసిన వేదవ్యాసుడు జన్మించిన రోజునే గురుపౌర్ణమిగా జరుపుకోవడం దేశంలో సంప్రదాయం. గురుపూర్ణిమకు దేశంలోని అన్ని సంప్రదాయాలను అవలంభించేవారు తమ గురు పరంపరను పూజిస్తారు. వారి త్యాగం, తపస్సు స్మరించుకొంటారు. భక్తుల మధ్య ఏకత్వాన్ని కల్గించే ఈ కార్యక్రమం గురుతత్త్వాన్ని ప్రబోధిస్తుంది.
భారతీయ సంస్కృతిలో గురువుకు చాలా ప్రాధాన్యత వుంది. మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానదీపాన్ని వెలిగించేవారే గురువులు. అందుకే గురువులను త్రిమూర్తులతో, దేవితో సమానంగా సంభావించడం జరిగింది. అయితే గురువులు ఎన్నో రకాలుగా, వారిచ్చే దీక్షలు ఎన్నో విధాలుగా ఉంటాయి. అవేమిటో చూద్దాం. చదువు చెప్పే గురువును సూచక గురువు అని, కుల ధర్మాలు, ఆశ్రమ ధర్మాలు బోధించే గురువును వాచక గురువు అని, మహామంత్రాలనుపదేశించే గురువును బోధక గురువు అని, వశీకరణ, మారణప్రయోగాలు నేర్పే గురువును నిషిద్ధ గురువని, విషయ భోగాలమీద విరక్తి కల్గించి జ్ఞానమార్గంవైపు నడిపే గురువును విహిత గురువని, జీవబ్రహ్మైక్యం బోధించే గురువును కారణ గురువని, జీవాత్మ పరమాత్మ యోగాన్ని ప్రబోధించే గురువును పరమ గురువని విభజించారు పెద్దలు.
గురువులు అయిదు విధాలుగా దీక్షలిస్తుంటారు. 
1.స్పర్శదీక్ష- గురువు శిష్యుణ్ణి తాకినంతనే (స్పృశించినంతనే) శిష్యునికి శక్తివస్తుంది. ఇది ఎంతో తపశ్శక్తిగల మహాత్ములిచ్చే దీక్ష. 
2. ధ్యాన నదీక్ష- గురువు దూరంగా ఉంటూనే శిష్యుని ఉద్ధరణకు ధ్యానం చేస్తాడు. దానివల్ల శిష్యునికి శక్తి కల్గుతుంది. ఆ విధంగా శిష్యుడు ఉన్నత సాధనా భూమికల్లోకి ప్రవేశిస్తాడు. 
3.దృగ్దీక్ష- ఈ దీక్ష కంటిచూపులతోనే ఇచ్చేది. 
4.మంత్రదీక్ష- గురువు శిష్యునికి క్రమంగా ఆధ్యాత్మిక విషయాలు ప్రబోధిస్తూ, ధర్మసూత్రాలు విశదీకరిస్తూ, మంత్రదీక్ష ఇచ్చి తరుణోపాయం చూపిస్తాడు. మన సంప్రదాయంలో ఎక్కువమంది ఇలాంటి దీక్షలే ఇస్తుంటారు. 
5.వైదికదీక్ష- వైదిక సంప్రదాయం ప్రకారం శాస్త్రోక్తంగా వేదమంత్రోచ్ఛారణమధ్య ఇచ్చే దీక్ష. ఈ దీక్షలో ఉపనయనం, వేదాధ్యాయనం, బ్రహ్మోపదేశం మొదలగునవి ఉంటాయి. *

*************************************************
      డాక్టర్‌. పి. భాస్కర యోగి
      ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి