మోదీ కన్నడ ప్రాంతంలో ప్రచారానికి వెళ్లకముందు కర్ణాటకలో ప్రచారానికి దిగిన ఈ దేశ ఘనమైన వారసత్వ సంపద శ్రీమాన్‌ రాహుల్‌గాంధీ తనకు 15 నిమిషాలు సమయం దొరికితే మోదీని కడిగేస్తాను అన్నాడు. ఆయన కడగాలనుకొన్న సంతూర్‌ సోపుతోనే మోదీ రాహుల్‌ను, ఆయన కుటుంబాన్ని, నక్కజిత్తుల సిద్ధూను ఉతికి ఆరేశాడు. దాంతో మైండ్‌బ్లాక్‌ అయిన రాహుల్‌ ప్రచారంలో అనేక శీర్షాసనాలు వేసాడు. ఆఖరుకు ‘అసలు ఈ కర్ణాటక ఏంటి ? 2019లో నేనే ప్రధానిని’ అన్నాడు. ఈ మాట విని దేశం ఒక్కసారిగా అవాక్కయ్యింది.
మన పార్లమెంటరీ వ్యవస్థలో ఎన్నికలు జరిగేముందు ఏదైనా కూటమో, పార్టో ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తుంది. నరేంద్రమోదీని కూడా 2014 ఎన్నికలకు ముందు భాజపా పార్టీ కాబోయే ప్రధానిగా ప్రకటించింది. లేదా గెలిచిన ఎంపీల సంఖ్యను బట్టి పార్లమెంటరీ పక్షం ఎన్నుకొని నేతను ప్రకటిస్తుంది. కానీ రాహుల్‌గాంధీ మాత్రం తెంపరితనంతో తనకు తానే ‘నేనే ప్రధానిని’ అని ప్రకటించుకుని మరోసారి అపరికత్వ నేతగా నిలబడ్డారు.
గతంలో మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వ ఆదేశాన్ని దేశీయ మీడియా సాక్షిగా బుట్టలో చించేసిన ఈ వారసత్వ ఘన శిఖామణి మరోసారి తన రాచరికపు నైజాన్ని బయట పెట్టుకొన్నాడు. నెహ్రూ, ఇందిర, రాజీవ్‌, సోనియా, రాహుల్‌.. ఇదో రాజవంశ పరంపర. వీళ్లు పొద్దున లేచినప్పటి నుండి ప్రజాస్వామ్యం గురించి, దానిని కాపాడాల్సిన విధానం గురించి చట్ట సభల్లో, బహిరంగ సభల్లో మాట్లాడుతుంటే మనం నోరెళ్లబెట్టి చూడటం తప్ప ఇంకేం చేయలేం. వీరి వంధిమాగధులు వారి కుటుంబం మాత్రమే ఈ దేశాన్ని సురక్షితంగా ఉంచగలదని ప్రచారం చేస్తారు. అయితే ‘గెలిస్తే’ అది ఆ కుటుంబం చలవే అనీ, ఓడిపోతే మన్మోహన్‌సింగ్‌నో, సిద్ధరామయ్యనో బలి పశువును చేస్తారు. అదే వీరి విజయాల వెనకున్న చిదంబర రహస్యం. అందుకే అంత గడుసుగా రాహుల్‌ తన మనసులో మాట చెప్పేశారు..!

*************************************************************
– డా|| పి.భాస్కరయోగి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి