* రాజ్యాంగాన్ని రచించే సమయంలోనే వేల సవరణలను డా.బాబా సాహెబ్ అంబేద్కర్ లాంటి సహృదయుడు స్వయంగా పరిష్కరించాడు. రాజ్యాంగ ఆమోదం పొందాక 68 సంవత్సరాల్లో 110కి పైగా రాజ్యాంగ సవరణలు చేసుకున్నాం కదా! ఇది డా.బాబా సాహెబ్‌ను అవమానపరిచినట్లా? ప్రతి విషయానికి డా.అంబేడ్కర్‌ను ప్రస్తావిస్తూ ఆయన గురించి, ఆయన రచనల గురించి కొందరు మేమే టేకేదార్లమన్నట్లు మాట్లాడుతున్నారు.
* ఒక మతంవారిని, అందులోని సంప్రదాయాలను తిడుతూ మరో మతంవారిని తలకెత్తుకోవడం ఎలాంటి సెక్యులరిజం? ఎప్పుడైతే సెక్యులరిజం ఓ తిట్టుపదంగా దుర్వినియోగం అయ్యిందో మరోవైపు సూడో సెక్యులరిజం అనే మాట పుట్టుకొచ్చింది. దాని పర్యవసానమే మోదీ, షాల రాజసూయ యాగం. ప్రస్తుతం అది ఉత్తరభారతం నిండుకొని దక్షిణం వైపు అడుగులు వేస్తోంది.
‘We the people of India having solemnly resolved to constitute India into a Sovereign Socialist Secular democratic Republic and secure to all its citizens’
మేము భారతదేశ ప్రజలము. ఇండియాని సర్వసత్తాక ప్రజాస్వామిక, సామ్యవాద, లౌకికవాద గణతంత్ర రాజ్యంగా ఏర్పరచుటకు తీర్మానించాం”- ఈ మాటలు వినగానే మనం రాజ్యాంగానికి ఎంతలా కట్టుబడి ఉన్నామో అని ఏ నాగరిక దేశంవాడైనా అనుకొంటాడు. లోతుగా ఆలోచించడం మొదలుపెడితే - ఎందరో వీరుల త్యాగఫలం వల్ల స్వాతంత్య్రం సిద్ధించింది. ముఖ్యంగా ఇక్కడి హిందువులు దాదాపు వెయ్యేళ్ల బానిసత్వం అనుభవించి చివరకు లక్షల ప్రాణాల బలిదానంవల్ల స్వేచ్ఛను పొందారు. ముస్లింల మనోభావాల కనుగుణంగా దేశ విభజన జరిగింది. కానీ హిందువులు మాత్రం డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ వంటి మేధావులను ముందుబెట్టి రాజ్యాంగ రచన చేయమన్నారు. రాజ్యాంగ సభ ఏర్పడి మొదటి సభ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో 9 డిసెంబర్ 1946న జరిగింది.
రాజ్యాంగ రాతప్రతిని తయారుచేయడానికి 29 ఆగస్టు 1947 నాడు డ్రాఫ్ట్ కమిటీ ఏర్పడగా డా.బి.ఆర్.అంబేడ్కర్ దానికి అధ్యక్షుడయ్యాడు. రాజ్యాంగ సభ 11సార్లు 165 రోజులపాటు సమావేశం అయ్యింది. ఇందులో సుమారు 114 రోజులు రాతప్రతి తయారీకి సమయం వెచ్చించింది. ఈ రాతప్రతిని తయారుచేస్తున్న సమయంలో 7,635 సవరణ ప్రతిపాదనలు వచ్చాయి. ఇందులో సుమారు 2,473 ప్రతిపాదనలను రాజ్యాంగ సభ పరిశీలించి పరిష్కారం చేసింది. మొత్తానికి భారత రాజ్యాంగం అద్భుతంగా రూపుదిద్దుకొని 26 నవంబర్ 1949న సభలో ఆమోదించి 24 జనవరి 1950నాడు సభ్యులు రాజ్యాంగ ప్రతిపై సంతకాలు చేశారు. సంతకాలు చేసిన రోజున బయట చిరుజల్లుగా వర్షం కురిసింది. అందరూ ఆనాడు ఇదో శుభ శకునంగా భావించారు. మొత్తానికి 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి రావడంతో ఆ రోజున గణతంత్ర దినోత్సవం జరుపుకొంటున్నాం. ఈరోజు రాజ్యాంగమే మనకు స్మృతి.
కొందరు దీనిని ఈ రోజుల్లో ‘అంబేడ్కర్ స్మృతి’గా అభివర్ణిస్తున్నారు. అయితే మొన్నీమధ్య కర్ణాటక రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. ముఖ్యంగా ‘లౌకికవాదం’ అనే పదం తలా తోకా లేకుండా ఉందని, అది ఓటు బ్యాంకు రాజకీయాలకు ఉపయోగపడుతుందని, అవసరమైతే దానిని సవరించి అసలు అర్థం బయటకు తీస్తాం అన్నది ఆయన మాటల సారాంశం. కానీ కొందరు స్వయం ప్రకటిత మేధావులు, తమకు తామే రాజ్యాంగ పరిరక్షకులుగా అభివర్ణించుకొనేవాళ్లు, సూడో సెక్యులర్ నాయకుల గుంపు కేంద్ర మంత్రిపై ఒంటికాలిపై లేచారు. దాంతో అనంతకుమార్ హెగ్డే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొంటున్నట్లు పార్లమెంట్లో ప్రకటించారు. ఇక వివాదం అంతటితో ఆపకుండా రాజ్యాంగం సవరించడం నేరం, ఇది డా. బాబా సాహెబ్‌ను అవమానించడం, హిందూ ఫాసిజం, మతతత్వం.. అంటూ క్రొత్త క్రొత్త పదాలకు ఎర్రబురద రుద్ది జాతీయవాద భావజాలాన్ని ఆయా సంస్థలను దుమ్మెత్తిపోశారు.
రాజ్యాంగాన్ని రచించే సమయంలోనే వేల సవరణలను డా.బాబా సాహెబ్ అంబేద్కర్ లాంటి సహృదయుడు స్వయంగా పరిష్కరించాడు. రాజ్యాంగ ఆమోదం పొందాక 68 సంవత్సరాల్లో 110కి పైగా రాజ్యాంగ సవరణలు చేసుకున్నాం కదా! ఇది డా.బాబా సాహెబ్‌ను అవమానపరిచినట్లా? ప్రతి విషయానికి డా.అంబేడ్కర్‌ను ప్రస్తావిస్తూ ఆయన గురించి, ఆయన రచనల గురించి కొందరు మేమే టేకేదార్లమన్నట్లు మాట్లాడుతున్నారు. డా.అంబేడ్కర్ ఈ రోజు భారతీయ మహాపురుషుడు. నిష్కళంక దేశభక్తుడైన డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ అందరివాడు. ఆయనను ఇటీవల కాలంలో కొందరు వర్గానికి పరిమితం చేస్తున్నారు. ఆయనకున్న పాండిత్యం అపారం. “అసలు పండిట్ అనే బిరుదు మొదట డా. బాబాసాహెబ్ అంబేడ్కర్‌కు ఇవ్వాల్సింది” అన్న డా. సుబ్రహ్మణ్యస్వామి మాటలు అక్షరసత్యాలు. అన్ని పరీక్షలు ఫెయిల్ అయినవాళ్లు ఈ దేశంలో గొప్ప గొప్ప బిరుదులు పొందారు. ఏ సేవ చేయకుండా భారతరత్న పొందారు.
కానీ మొన్నీమధ్య ఎప్పుడో ఓ దేశభక్త ప్రభుత్వం వచ్చాకగానీ ఆయనకు భారతరత్న ఇచ్చుకోలేని దౌర్భాగ్యులం మనం. డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ సంకుచిత స్వభావం కలవాడు కాదు. తన కులంవాడైనా తప్పు చేస్తే మందలించగల ధీశాలి. ఓసారి డా.అంబేడ్కర్ ముంబాయి విశ్వవిద్యాలయంలో పరీక్ష పేపర్లు దిద్దుతుంటే అందులో ఓ దళిత విద్యార్థికి సహాయం చేయాలనే సిఫారసు వచ్చింది. దానికి ఆయన మండిపడుతూ “తెలివితేటల్లోనూ, యోగ్యతలోనూ ఇలాగ ఎవరికోసమైనా సిఫారసు చెయ్యడం నాకు అసహ్యం. ఇతర విద్యార్థులకన్నా తాను ఏ రకంగా కూడా తక్కువవాణ్ణని ఏ దళిత విద్యార్థి ప్రవర్తించకూడదు. ఇది నా అభిప్రాయం. ఇతర విద్యార్థులతో పోల్చుకుంటే ఓ ఆదర్శ విద్యార్థిగా అతడు తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాలి అని నేను భావిస్తాను” అన్న బాబాసాహెబ్ మాటల్ని ఆయన జీవితచరిత్రలో వసంతమూన్ చెప్పాడు.
ఇంత నిష్పాక్షిక, ఉదాత్త హృదయంగల డా. బాబా సాహెబ్ అంబేడ్కర్ పేరుతో ఈ దేశ సూడో మేధావులు ఇంకెన్నాళ్లు రాజకీయం చేస్తారు? అంతెందుకు! రాజ్యాంగంలో పది శాతం ఈ డ్బ్బుఏళ్లలో అమలుచేసినా మన దేశం దుర్గతి ఇలా ఉంటుందా? అని ప్రశ్నించేవారు ఉన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఓ మతం వారిని సంతృప్తిపరుస్తూ గంపగుత్తగా ఓట్లు పొందే రాజకీయ పార్టీ, దాని పల్లకీ మోసే ‘ఎర్ర బోయాలూ’ డ్బ్బు ఏళ్లు నిర్విఘ్నంగా పరోక్షంగానో, ప్రత్యక్షంగానో రాజ్య సింహాసనంపై కూర్చునే ఉన్నారు. ఆ శక్తులే ఈ రోజు రాజ్యాంగం ప్రమాదంలో పడిందని గగ్గోలు పెడుతున్నారు?!
రాజ్యాంగం అంటే అదేం వేదఋక్కులు కావు. మేధావుల ఆలోచనల కలబోత. ఆనాడు వాళ్లకు అందిన స్ఫురణతో అత్యద్భుతంగా సంకలనం చేశారు. దానిని కూడా విమర్శించే వాళ్లు ఉన్నారు. అది కూడా భావస్వేచ్ఛగా, భావ సంఘర్షణగా ఎందుకు చూడకూడదు? 1935లో ఆంగ్లేయులు గవర్నమెంట్ రూల్ ఆఫ్ ఇండియాను ప్రవేశపెట్టారు. అందులోని 95 ఆర్టికల్స్ భారత రాజ్యాంగంలోకి ఇంచుమించు యథాతథంగా వచ్చాయని చెప్తారు. ఉదాహరణకు 1860లో ఇంగ్లీషువాళ్లు తయారుచేసిన పోలీస్ యాక్ట్ను ఈ రోజు మనం అలాగే అమలు చేస్తున్నాం. 1857లో జరిగిన మొదటి స్వాతంత్య్ర పోరాటం సిపాయిల తిరుగుబాటును అణచివేయడానికి ఈ చట్టం ప్రవేశపెట్టారు. ఈ చట్టం యొక్క దుర్వినియోగంవల్లనే కదా 13 ఏప్రిల్ 1919 నాటి జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగింది. ఈ చట్టానికన్నా ముందు భారతదేశంలో సైనిక వ్యవస్థ ఉండేది కానీ పోలీస్ వ్యవస్థ లేదు. మైకేల్ ఓ డయ్యర్ అనే దుర్మార్గమైన అధికారి ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకొని లాలాలజపతిరాయ్ని గాయపరిచి మరణానికి కారణమయ్యాడు.
ఈ దుర్ఘటన పర్యవసానం రాజగురు, సుఖదేవ్, భగత్సింగ్ వంటి వీరయోధుల మరణానికి కారణం అయ్యింది. ఈ సంఘటన 13 మార్చి 1940 నాడు 21 ఏళ్ళ తర్వాత వరకు సర్దార్ ఉద్యంసింగ్లో ప్రతీకార జ్వాలగా రగిలి జనరల్ డయ్యర్, లార్డ్ జెట్లండేత్‌ల ప్రాణాలు తీసింది. మరి ఈ రోజు అవసరాలకు తగినట్లుగా మనం ఈ చట్టాన్ని భారతీయులకు అనుకూలంగా మార్చుకొన్నాం. అంత మాత్రాన ఇది రాజ్యాంగానికి అవమానం అయ్యిందా? అదేవిధంగా సెక్యులరిజం పేరుతో జరుగుతున్న ఓట్ల రాజకీయం పరోక్షంగా రాజ్యాంగ హననం కాదా? దీనిని ప్రశ్నించిన హెగ్డే ఎందుకు బోనులో నిలబడ్డాడు. ఇక్కడే మనం తప్పులో కాలేస్తున్నాం. దళితుడైన జడ్జి కర్ణన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తప్పుబడితే అతణ్ణి వెంటాడి జైలుకు పంపారు.
అదే బెంచ్లోని ఓ న్యాయమూర్తి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తల్లా నలుగురు జడ్జిలు చీఫ్ జస్టిస్పు తిరగబడితే రాజ్యాంగ పరిరక్షణా!? దానికి ఎర్ర కామెర్ల రోగులంతా తగిన ప్రచారం కల్పించి, ప్రభుత్వంపై నిందలు వేస్తారా? ఇదేనా రాజ్యాంగ రక్షణ! అనంతకుమార్ హెగ్డే లేవనెత్తిన అంశంపై దురుద్దేశంతో దుమ్మెత్తిపోయకుండా దేశంలో సావధానంగా, ఆరోగ్యకరమైన చర్చ జరగాలి. నిజంగా సెక్యులరిజం అమలు అయితే అది రాజ్యాంగ స్ఫూర్తే. కానీ ఒక మతంవారిని, అందులోని సంప్రదాయాలను తిడుతూ మరో మతంవారిని తలకెత్తుకోవడం ఎలాంటి సెక్యులరిజం? ఎప్పుడైతే సెక్యులరిజం ఓ తిట్టుపదంగా దుర్వినియోగం అయ్యిందో మరోవైపు సూడో సెక్యులరిజం అనే మాట పుట్టుకొచ్చింది. దాని పర్యవసానమే మోదీ, షాల రాజసూయ యాగం. ప్రస్తుతం అది ఉత్తరభారతం నిండుకొని దక్షిణం వైపు అడుగులు వేస్తోంది.
యూరప్ దేశాల్లో 19వ శతాబ్దానికి ముందు రాజు, రాజ్యం క్రైస్తవ మతాధిపత్యంలో నడిచేవి. మత శాఖల ఆజ్ఞానుసారం అవిశ్వాసులను, అసమ్మతివాదులను ఓ పథకం ప్రకారం సామూహికంగా హత్య చేసేవారు. ఇది ప్రజల్లో ఆందోళనకు దారితీసింది. రాజ్యాంగ వ్యవస్థలో చర్చి జోక్యం తగ్గించడంకోసం ఏర్పడ్డ రాజకీయ భావనే సెక్యులరిజం. ఆ చరిత్రనంతా బాగా అధ్యయనం చేసిన కారల్ మారక్స్ ‘మతం మత్తుమందు’ అన్నాడు. కానీ మన దేశంలో మత సహనం మన రక్తంలోనే ఉంది. మారక్స్ అక్కడి చారిత్రక పరిస్థితులను గమనించి చెప్పిన విషయాన్ని ఇక్కడి కమ్యూనిస్టులు గమనించకుండా ఈ దేశ మెజారిటీ ప్రజలపై యుద్ధం ప్రకటించారు. అదీ బహుశా! ఓ చారిత్రక తప్పిదమే కాబోతుంది. సెక్యులరిజం అనే పదాన్ని ఉమర్ ఖాలీద్ లాంటి దేశద్రోహులకు, కన్హయ్య కుమార్ లాంటి జాతి విద్రోహులకు రక్షణ కవచంగా ఉపయోగిస్తున్నారు. ఇదేనా భారతరత్న డా.బాబా సాహెబ్ అంబేడ్కర్ మనకిచ్చిన స్ఫూర్తి!
ఈ డెభ్భై ఏళ్ల భారత గణతంత్ర నిర్మాణంలో రాజ్యాంగం యొక్క వౌలిక భావనలు అర్థం చేసుకోకుండా భావోద్వేగాలకు ఉపయోగించి రాజ్యాధికారం చెలాయించిన గుంపు ఇతరులు తమ చేతిలోని అధికారాన్ని హస్తగతం చేసుకొంటే భరించలేకుండా ఉండడం ఏ రకమైన ప్రజాస్వామ్యం? ప్రపంచంలోనే అత్యంత విలువైన రాజ్యాంగం మనకుంది. కానీ ఈ డ్భె ఏళ్లలో సామాజిక జీవనంలోని అన్ని కేంద్రాలను మనకు మనం ధ్వంసం చేసుకున్నాం. అధికారం పొందాలనే యావతో దేశాన్ని మరణశయ్యపై ఉంచి లోపలున్న పనికివచ్చే పదార్థాన్ని తిని పైన కుళ్లిపోయిన డొల్లను చూసి మురిసిపోతున్నాం. ఈ రహస్యాన్ని కనిపెట్టి అధికార దాహానికి చరమగీతం పాడి ప్రజాశ్రేయస్సు కొరకు పనిచేయడమే రాజ్యాంగ స్ఫూర్తి!
*********************************************
డాక్టర్. పి. భాస్కర యోగి : సంపాదకీయ వ్యాసం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి