నాగార్జునుడి పేరు తలచినంతనే బంగారాన్ని కృత్రిమంగా తయారుచేయడానికి అష్టకష్టాలు పడిన బౌద్ధ సన్యాసిగా గుర్తించే కాలం అది. ధాతు విజ్ఞానవేత్తగా ప్రచారం, గుర్తింపు పొందినా ఆచార్య నాగార్జునుడు ఆధునిక శాస్తవ్రేత్తలకు దూరమైపోయారు. పాదరసము వాడకాన్ని తొలిసారిగా ప్రయోగించినవారు ఈయనే. పాదరస్యాన్ని దాన్ని శుద్ధి చేసి ఉపయోగించే విధానం గూర్చి ప్రపంచానికి పరోక్షంగా తెలిపిందీ ఈయనే. ఈయన పాదరసంతో అనేకానేక ప్రయోగాలు చేసారు. పాదరస శుద్ధి చాలా క్లిష్టతరమైనప్పటికీ సాధించారు.
శుద్ధి చేసిన పాదరసమును ఔషధాల తయారీలో ప్రయోగించడం చాలా సూక్ష్మప్రక్రియ, ప్రమాదకరం కూడా. అయినా ఆయా ప్రయోగాల నిర్వహణను చాలా స్పష్టంగా వివరించారు. పాదరసంతో బంగారం తయారుచేయడం ఈయన తెలుసుకున్నారని చరిత్రకారులు పేర్కొన్నారు. బంగారంలో మార్పులు చేయడానికి పాదరసానే్న ఎంపిక చేసిన ఈయన ఇతర ధాతువులను వాడలేదు. ఆధునిక శాస్త్ర విజ్ఞానం ప్రకారం వివిధ ధాతువుల నిర్మాణం, వాటి పరమాణువులలోని ప్రొటానుల సంఖ్యమీద ఆధారపడి వుంటుంది.
పాదరసంలో 80ప్రోటాన్- ఎలక్ట్రాన్‌లు వుండగా బంగారంలో 79 ప్రోటాన్ - ఎలక్ట్రాన్‌లు ఉన్నాయి. మరి ఈ శాస్త్ర రహస్యం నాగార్జునుడికి ఎలా తెలియవచ్చిందో?!
ఇంగిలీకం నుంచి పాదరసం వంటి పదార్థాలను తయారుచేయు విధానాలను, సీసం మాదిరిగా కన్పించే ‘కాలమైన్’ తరహా పదార్థాలను రూపొందించే పద్ధతులను ‘రసరత్నాకరం’లో పొందుపర్చడం మహా అద్భుతంగా తలంచవలసి వస్తుంది. రాగి, సీసం, తుత్తునాగం, వెండి, బంగారం మొదలగు ముడి పదార్థాలను ప్రకృతి ప్రసాదించిన ఖనిజాల నుంచి ఏఏ ప్రక్రియల ద్వారా సంగ్రహించాలో, వాటిని ఏ ప్రకారంగా శుద్ధి చేయాలో మొదలైన విధానాలను గురించి కూడా వర్ణించారు. ఈ గ్రంథంలో అసాధారణ ప్రజ్ఞతో విపులీకరించిన నాగార్జునుడి మేధస్సును ఆధునిక శాస్త్ర పరిజ్ఞానంతో కూడా గణించడం కష్టసాధ్యం. ఇందుకు నాగార్జునుడే ధాతువులు, ఖనిజాలలో వున్న హానికల గుణాలను పరిహరించి, వాటితో ఒనగూడే ప్రయోజనాల నిమిత్తం అనేక ప్రయోగాలు చేసి శుద్ధిపరిచే విధానాలను ఆవిష్కరించారు.
భిన్న భిన్న ధాతువుల మిశ్రమముల తయారీ, పాదరసం మొదలగు ధాతువుల మూలాలను శోధించడం, విభిన్న ధాతువుల ద్వారా బంగారం, వెండి, లోహాల రూపకల్పన మొదలైన అంశాలను గూర్చి వివరించిన తొలి శాస్తవ్రేత్త నాగార్జునుడే.
స్వర్ణలోహ తయారి: పాదరసమును అష్టాదశ (18) పర్యాయములు శుద్ధి చేసి, ఆ ద్రావకంలో వనమూలికల కషాయమును రంగరించి విపరీత స్థాయిలో చిలకరించాలి. ఆ చిక్కటి ద్రవంలో గంధకం, అబ్రకం, మరి కొన్ని క్షార పదార్థాలను మిళితం చేసి, తిరిగి 17 సార్లు శుద్ధి చేయాలి. ఫలితంగా స్వర్ణలోహం రూపం దాల్చుతుంది. ఈ ప్రయోగంలో ఏవేవి ఎన్నిపాళ్లు వుండాలో స్పష్టంగా తెలియరావడం లేదు.
జింక్‌ను మూడు రెట్లు రాగితో కలిపి అత్యధిక ఉష్ణోగ్రతలో వుంచిన ఇత్తడి ధాతువు రూపొందునని తెలుస్తోంది. మరి బంగారం సృష్టి ఎలా సంభవం కాగలదు?
‘‘క్రమేణా కృత్వాంబుధరేణ రంజితః
కరోతి శుల్వం త్రిపుటేన కాంచనం’’- అని రసరత్నాకరం గ్రంథంలోనే ప్రస్తావించడం జరిగింది.
ఏది ఏమైనా బంగారాన్ని కృత్రిమ ప్రయోగాలతో తయారుచేయడమనేది నేటికీ ప్రశ్నార్థకంగా వుంది. ఈ ప్రశ్నార్థకమే నాగార్జునుడిని ఆధునిక కాలంలో విస్మరించలేని శాస్తజ్ఞ్రుడుగా నిలిపింది. ఈ రసవిద్యను ప్రపంచంలో తొలిసారిగా ప్రయోగాలకు గురిచేసిన శాస్తవ్రేత్తగా నాగార్జునుడికే భవిష్యత్తరాలలో కూడా గుర్తింపు వుంటుంది.
******************************************
✍ డాక్టర్. పి. భాస్కర యోగి
ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి