రసవాధ సిద్ధాంతాన్ని ప్రామాణికంగా తీసుకుని రసవిద్యలో అనేక ప్రయోగాలు చేసారు. భారతీయ రసవాదులలో ప్రథమశ్రేణికి చెందుతారు. బట్టీ పట్టడం(స్వేదనం), పరిశుభ్రం చేయడం (శుద్ధిపరచడం), భస్మం చేయడం (కాల్సినేషన్) మొదలైన విధానాలతో లోహముల రంగు మార్పు తీసుకురావడం, లోహ మిశ్రమం (మిశ్రధాతువు) చేయడం మొదలైనవి ఈయన నూతన ఆవిష్కరణలు. అగ్నిశిలల (స్వర్ణమాక్షికం) నుంచి రాగి లోహన్ని రాబట్టగలగడం, వైద్య చికిత్సలలో ధాతు (లోహ) సంబంధ భస్మములను ఉపయోగించడం మొదలైన ప్రయోగాలతో ఈయన విదేశాలలో కూడా ఖ్యాతి గడించారు. ఈనాటికీ ప్రపంచ దేశాలలో ఇతర లోహాలతో బంగారాన్ని తయారుచేయడానికి విఫలయత్నాలు జరుగుతున్నాయంటే ఈయన రస వాసనలు దేశ దేశాల వ్యాపించాయని అనిపిస్తోంది.

గ్రంథ రచన

బౌద్ధమత సంబంధమైన, రస విద్య సంబంధమైన అనేక గ్రంథ రచనలు చేసారు. ఈయన శాస్ర్తియ ప్రయోగాల వివరాలు శిలల మీద చెక్కినట్టు తెలియవచ్చింది. రసవిద్య, లోహ సంగ్రహణ శాస్త్రం (మెటలర్జి) ఖనిజం నుంచి లోహం తయారుచేయువిధానాలమీద ఈయన రాసిన ‘రసరత్నాకర’ గ్రంథములోని అంశాలు ఈనాటికీ ప్రయోగాల సంరంభములలో ఉండటం విశేషం.
ఈయన రాసిన ఇతర గ్రంథాలు ఎందువలన ప్రచారానికి నోచుకోలేదో తెలియడంలేదు. వాటి మూలప్రతులుగాని, ఆధారిత వ్యాఖ్యానాలుగాని లభ్యం కావడంలేదు.
‘రసరత్నాకరం’ మాత్రం ఈనాటికీ రసాయనిక శాస్త్రానికి సంబంధించినంత వరకు ఆధునిక శాస్తజ్ఞ్రులు కూడా ఒక విలక్షణమైన ప్రమాణ గ్రంథంగా గుర్తించే విధంగా మనగలగడం గమనార్హం. సమకాలీన సమాజం, భవిష్యత్తరాలవారు తమ ధాతు విజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలనే తపనతో ఈ గ్రంథ రచనను వాద, ప్రతివాదాల రూపంలో మలచి, తనకూ దేవతలకూ మధ్య నడిచిన సంభాషణల రూపంగా సృష్టించారు. ఈయన కల్పించిన ఈ రచనా శైలి మూలంగా ఆశించిన ఫలితం లభించడంతోపాటు ఈయనను దేవదూతగా కూడా ఆనాటి ప్రజలు భావించవలసి వచ్చింది. ఈయనకు మహిమలను కూడా జోడించి కథలుగా ప్రజలు చెప్పుకున్నారని చరిత్రకారులు ప్రస్తావించారు. ఈయన ప్రయోగించిన చిట్కావలన ప్రాచీన శాస్తవ్రేత్తలెవరికీ దక్కని ప్రచారం కూడా ఆనాడు లభించింది.

రసాయన శాస్తవ్రేత్త

ఈయన రసాయన శాస్తప్రరంగా అనేక పరిశోధనలు చేశారు. ప్రాథమికంగా వివిధ లోహాల ముడి పదర్థాలను ప్రకృతి ద్వారా సేకరించి వాటిని శుద్ధి చేసే విధానాలను ప్రయోగాల పరంపరతో కనుగొన్నారు. వెండి, రాగి, తగరం, పాదరసం, బంగారం, వజ్రాలు మొదలైన వాటిని శుద్ధిచేసేందుకు తిరిగి ప్రకృతినే ఆశ్రయించారు. పగటివేళ కంటే రాత్రి సమయాలలో ముఖ్యంగా వెనె్నల కాంతులు విరజిమ్ముతున్న వేళలో అటవీ ప్రాంతాలను గాలించి, పలు రకాల మూలికలు సేకరించి ప్రయోగాలు చేశారు. కొన్ని విజయవంతమైతే, మరికొన్ని పరాజయం పాలయ్యాయి. జంతువుల, వృక్షముల సంబంధిత పదార్థాలను కూడా తమ ప్రయోగాలలో విస్తృతంగా వాడారు. తమ ప్రయోగ ఫలితాలను గూర్చి తమ గ్రంథ రచన ‘రసరత్నాకరం’లో చర్చించారు, వివరించారు.

‘రసరత్నాకరం’ గ్రంథంలో పాదరసంతో మేళవింపు పొందిన రసాయనిక మూలకాల వివరణ ప్రధాన పాత్ర పోషించింది. ఈ విధంగా రస సంయోగికాలను గురించి వివరించి తొట్టతొలి గ్రంథం కాగలిగింది. ఆధునిక పరిభాషలోని మెటలర్జీ, ఆల్కెమీ మొదలైన రసాయనిక శాస్త్ర వివరాలకు సంబంధించిన సమూలమైన చర్చ జరిపింది.
రసాయనశాస్త్రం ఒక ప్రయోగాత్మక విజ్ఞాన శాస్త్రం. ఈ శాస్త్రప్రయోగాల ద్వారానే భిన్న భిన్న ధాతువుల నిర్మాణం లేదా వాటి మేళవింపు, తద్వారా ప్రయోజనకర సత్ఫలితాలు వెలువడుతాయని నాగార్జునుడు నిరూపించారు.

ప్రాచీన భారత రసాయన శాస్త్ర అభివృద్ధికి ఎనలేని సేవలు చేసి, రసవాద సిద్ధాంతాన్ని ప్రతిష్ఠించాడు. రసాయన శాస్తవ్రేత్తగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందాడు. ‘రసవాది’గా, ‘శాస్తవ్రేత్త’గా కృషి చేసిన నాగార్జునుడిని రసాయన శాస్తమ్రునకు ఆద్యుడుగా మనం కీర్తించాలి.

వైద్య శాస్తవ్రేత్త

ధాతు విజ్ఞాన సంబంధమైన అపూర్వ పరిశోధనలు, ప్రయోగాలు చేసి, ఫలితాలు సాధించిన నాగార్జునుడు తన సిద్ధాంతాలను, ప్రతిపాదనలను జనసామాన్యంలోకి తీసుకువెళ్లాలని పరితపించారు. ధాతు విజ్ఞానంతో వ్యాధి చికిత్సా విధానం ముడిపడి వుండడంతో తన పరిశోధనా జ్ఞానాన్ని ఒక చిన్న చిట్కాతో సమాజానికి పరిచయం చేశారు.
ఈ విజ్ఞానం యావత్తూ తనకు, దేవతలకు నడుమ జరిగిన సంభాషణల వలననే తనకు అబ్బిందని చెప్పారు. ఈ అంశాన్ని ‘రసరత్నాకరం’ గ్రంథ రచనలో ప్రముఖంగా పేర్కొనడంతో విస్తృత పరిధిలో పరివ్యాప్తమై ఈయన అంచనా ఫలించింది. ఆయుర్వేద వృద్ధికోసం పాదరసాన్ని, గంధకాన్ని మేళవించిన పదార్థమునకు కొద్ది ఇంగువను జోడించి స్వీకరిస్తే ఆయుఃప్రమాణము పెరుగుతుందని వివరించారు. ఈ ఔషధాన్ని ఈ రోజున రససింధూరం పేరుతో వ్యవహరిస్తున్నారు.

అంతేకాదు, వైద్యంలో కజ్జాలి(బ్లాక్ సల్ఫైడ్ ఆఫ్ మెర్క్యురి)ని పరిచయం చేసిన ఘనతను అందుకున్నారు. నాగార్జునుడు తన వైద్య శాస్త్ర గ్రంథంలో కూడా రసధాతువుల గూర్చి చర్చించారు.

- ఇంకావుంది

*****************************************************
✍ డాక్టర్‌. పి. భాస్కర యోగి

ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి