ఈ సృష్టి భగవంతుని క్రీడా మైదానం. ఈ విశ్వ మైదానంలో పిపీలికాది బ్రహ్మ పర్యంతం క్రీడాకారులు. అంతా ఒకే విధంగా ఉంటే అందులో ‘మజా’ ఉండదు కదా! అందుకే ఇన్ని వైవిధ్యాలు. నదులు, వనాలు, పర్వతాలు, అన్నిరకాల జీవజంతుజాలం, పంచభూతాలు - వీటన్నిటిని కేంద్రంగా చేసుకొని నడుస్తున్నది మానవ జీవన విధానం.

మనిషి ఎంత గొప్పవాడైనా, ఎంత పెద్ద పదవిలో ఉన్నా, ఎంత ధనవంతుడైనా పై సహజీవన విషయాలు లేకుండా జీవించలేడు. అందుకే వీటన్నిటితో సమన్వయం పొంది కలిసి జీవిస్తేనే సార్ధకత. లేదంటే మానవ జీవనం కూడా జడపదార్థంగా మారిపోతుంది. తన ఇంటి ముందు విరగబూసిన పుష్పాలను చూసి ఆనందం చెందినప్పుడు, పారుతున్న సెలయేరు గలగలలు విని మనస్సు ఉప్పొంగినప్పుడు, ఉదయిస్తున్న సూర్యబింబం, వెన్నెల వెదజల్లే చందమామ అన్నీ అనుభూతిని కలిగిస్తాయి. ఇదంతా ప్రకృతిలోని సహజానంద స్వరూపం. ఇది వెలకట్టి పునఃసృష్టి చేయలేనిది.

అలాగే అన్ని భూతాలనూ తనయందు, తనను అన్ని భూతాల యందు దర్శించేవాడు ఉత్తముడని శాస్త్రం చెబుతోంది. శరీరం, ఆత్మ అనేవి మన వేదాంతంలో అతి ముఖ్యమైన అంశాలు. శరీరం స్థూలమైనది. దీనికి అనేక రకాల బంధాలుంటాయి. 

పరిశోధక విద్యార్థి విద్యార్థి కులం, భాష, రూపం, ఆకృతి, దేశం కాలం, ఇవన్నీ స్థూలశరీరాన్ని గుర్తించేవి. వీటిలోని వైవిధ్యాలే మనిషిని ఇన్ని భాగాలుగా విభజించింది. రెండవదైన ఆత్మ సూక్ష్మ శరీరం. దీనికి కుల, ప్రాంత, వర్గ, భాష, దేశ, ఆకార, రూప విశేషాలు ఏవీలేవు. ఇది ధనవంతులు - బీదవారు, ఈ రూపం ఆ రూపం, ఈ కులం ఆ కులం, ఈ భాష ఆ భాష అనేది లేకుండా అందరిలో పరివ్యాప్తమై ఉంది. శరీరానికి ఉండే అహంకార, మమకారాల వల్ల ఈ తత్వం మరిచిపోయి వ్యక్తుల మధ్య భేదాలు కల్పిస్తాం. అలాంటి తేడాలను పోగొట్టడానికే ఆధ్యాత్మికత ఉపయోగపడుతుంది. మరచిపోయున స్వస్వరూపాన్ని తెలుసుకొనేట్లు చేయడమే సాధన.

తనదికాని విషయాన్ని తనదే అనుకొని భ్రమించి సృష్టి నిండా పరివ్యాప్తమైన సూక్ష్మతత్వాన్ని వదలివేయడమే అజ్ఞానం. అలాంటి అంధకారపు పొరలను చీల్చివేసి, మహోన్నతమైన వెలుగును నింపే సాధన ఆధ్యాత్మికత. ఆత్మను అధివసించి ఉన్న ఈ స్థూలశరీరాన్ని మోస్తున్నామని తెలుసుకొని జీవించాలి. ఆ సూక్ష్మతత్వం ప్రకృతి నిండా ఆనందస్వరూపంగా ఉంది. ‘అదే నేను’ అనే అభేదరూపాన్ని పొందడమే సర్వేశ్వర దర్శనం.

**********************************************
      డాక్టర్‌. పి. భాస్కర యోగి
      ॐ ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన ॐ



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి