కురూపిగా ఉన్న ఓ వ్యక్తి వారి వీధిలోని పక్కింటి అందమైన అమ్మాయిపై కన్నేసాడు. ఈ కురూపిది అమ్మాయి తండ్రి వయసు. వెంటనే అతడు గాంధేయ పద్ధతిలో ‘ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను’ అని ధర్నాకు దిగాడు. అతనిపట్ల అందరికీ జాలి కలిగి ఇతను ఇంత గొప్ప ప్రేమికుడా! అని ఆశ్చర్యపోతున్నారు. వారం రోజులు అతని నిరాహార దీక్షను చూసి ఇతను మజ్నూ, ఫర్హాద్, మహీవల్ లాంటి అమర ప్రేమికుల వరసలో చేర్చాల్సిన వాడే అనుకున్నారు. అమ్మాయికి, వారి కుటుంబ సభ్యులకు ఇతనంటే అసలు ఇష్టం లేదు. అమ్మాయి తండ్రి ఈ కురూపిని ఏమైనా చేద్దామంటే అతను అహింసా మార్గంలో నిరాహార దీక్షలో ఉన్నాడు. చివరకు బాగా ఆలోచించి అంధవికారంగా ఉన్న ఓ వేశ్యకు కొంత డబ్బు ఇచ్చి ఇతని ధర్నాకు ఎదురుగా మరో నిరసన దీక్ష ప్రారంభింపజేసాడు.

ఆమె కూడా ఈ కురూపిని అమితంగా ప్రేమిస్తున్నానని, అతను పెళ్లి చేసుకునే వరకు అన్నం ముట్టనని శపథం చేసి మరీ దీక్షకు కూర్చొంది. దీంతో దెబ్బకు దయ్యం వదలి ఆ కురూపి ప్రేమికుడు ఇంటిదారి పట్టాడు.  ఆంధ్రప్రదేశ్ భాజపా నాయకులు ఈ రకమైన మెరుపు నిరసన ప్రకటించకపోతే అక్కడ పార్టీ నాశనం అయిపోవడం ఖాయం. గత నలభై రోజుల నుండి పిచ్చివాళ్లకే పిచ్చి ఎక్కించేటట్లుగా హోదా పేరుతో జరుగుతున్న మైండ్ గేమ్‌కు అడ్డుకట్ట వేయకపోతే అక్కడ బీజేపీ బతికి బట్టకట్టడం కష్టం!  మీడియా, ధనం, దుష్ప్రచారం  అనే చతురంగ బలాలతో చంద్రబాబు పూటకో నాటకం ఆడుతుంటే భాజపా కర్మ సిద్ధాంతంతో జీవిస్తే కష్టమే. ఇలాంటి వ్యూహాలను రాజకీయ వ్యూహాలతోనే ఎదుర్కోవాలి. లేదంటే ఆత్మహత్య సదృశమే.

స్వయంగా ముఖ్యమంత్రి ధర్మపోరాట దీక్షలో కూర్చుంటే ఆ సభలో శాసనసభ్యుడు, నటుడు, చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ సాక్షాత్తు ప్రధానిని బండబూతులు తిడుతుంటే సీఎం చిరు దరహాసాలు చిందించాడు తప్ప నిలువరించలేదు. పోనీ ఆ తర్వాతనైనా ఖండించలేదు. అఖిలప్రియ అనే మంత్రి మోదీనే దగ్గరుండి రేపులు చేయిస్తున్నాడని సభల్లో మాట్లాడటం విడ్డూరం. ఖథువాలో ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగితే చంద్రబాబు స్పందించి అది భాజపా మోదీ చేయించారన్నట్లు మాట్లాడారు. ఈ నెల రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో దాచేపల్లి మొదలుకొని అనేక చోట్ల (నాలుగు చోట్ల) అత్యాచారాలు జరిగాయి. కానీ భాజపా వాళ్లు చంద్రబాబును సరిగ్గా టార్గెట్ చేయలేకపోయారు. నాలుగేళ్లు మంత్రులుగా రాష్ట్ర ప్రభుత్వంలో కీలక శాఖల్లో పనిచేసిన పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్ ప్రభుత్వంలో జరిగిన అంతర్గత లొసుగులు ఎన్నో తెలిసినా చంద్రబాబును ఒక్కమాట అనడానికి సాహసించట్లేదు.

పుష్కరాల సందర్భంగా హిందువుల గుళ్లు కూల్చినా, స్నానఘట్టాల నిర్మాణాల అవకతవకలపై, పుష్కర స్నానాల్లో మరణాల కారణంపై; దుర్గగుడిలో జరుగుతున్న అవకతవకలపై, రాత్రివేళ పూజలపై, దుర్గగుడి ఫ్లుఓవర్‌పై  దానికి సంబంధించిన శాఖ నిర్వహించిన మాణిక్యాలరావు అందులోని రహస్యాలను బయటపెట్టలేదు. ఆరోగ్య శాఖా మంత్రిగా పనిచేసిన కామినేని శ్రీనివాస్ మంత్రి పదవులకు రాజీనామా చేసాక రెండుసార్లు మీడియాలో కనిపించాడు. అదీ వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా వివిధ కార్యక్రమాలకు వచ్చినపుడు ఆయన వెంబడి!?  మంత్రులుగా ఉన్న అశోకగజపతిరాజు, సుజనా చౌదరి, ఇతర ఎంపీలు భాజపాను బజారుకీడ్చుతుంటే ఈ ఇద్దరు ఒక్కసారైనా గట్టిగా మాట్లాడలేదు.  నుండి చంద్రబాబు పొత్తులో దాచుకొన్న కర కత్తులను గురించి సోము వీర్రాజు మొత్తుకుంటూనే ఉన్నారు.

ఏ అదృశ్య శక్తి వల్లనో తెలియదు గాని అతని మాటను పెడచెవిన పెట్టారు. విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్, టీవీ చర్చల్లో విష్ణువర్ధన్ రెడ్డి, రామకోటయ్య, విల్సన్ బాగా ఎదుర్కొంటున్నారు. పురంధేశ్వరి తన పలుకుబడిని గట్టిగా ఉపయోగించట్లేదు. సౌమ్యుడైన కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర భాజపా సారథి అయ్యాక ఎలా ముందుకు పోతారో, ఈ కుయుక్తులకు శాస్త్రీయంగా ఎలా సమాధానం ఇస్తారో చూడాలి.  వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి అయ్యాక రాష్ట్ర పార్టీకి కేంద్రానికి మధ్య వారధిలా రాంమాధవ్ వ్యవహరిస్తున్నారు. రాంమాధవ్ రంగంలోకి దిగారని తెలియగానే శత్రుపక్షాల్లో అక్కసు పెరిగింది. ఎందుకంటే ఎన్నో ఏళ్ల ప్రచారక్ అనుభవం, కాశ్మీర్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో, ఈశాన్య రాష్ట్రాల్లో భాజపా గెలుపులో అతనిది గణనీయమైన పాత్ర అని అందరికీ తెలుసు.

అలాగే గుంటూరుకు చెందిన జీవీయల్ నరసింహారావు తర్కబద్దంగా గట్టిగా పచ్చమీడియాపై విరుచుకు పడుతున్నాడు. ‘కర్ణాటక ఎన్నికల తర్వాత తీవ్ర పరిణామాలుంటాయి’ అని జీవీయల్ అన్న మాటలు యధాలాపంగా చేసిన రాజకీయ వ్యాఖ్యలే, కానీ తెలుగు మీడియా, చంద్రబాబు అనుచరగణం మాత్రం అది చంద్రబాబుపై పగతీర్చుకోవడమే అని ప్రచారం చేసారు. ఇక్కడ ఎల్లో మీడియా, చంద్రబాబు, లోకేశ్, వారి అనుచర గణం విచిత్రమైన వాదన చేస్తున్నారు. కేంద్రంపై యుద్ధం చేస్తామని ప్రకటిస్తారు; వెంటనే కేంద్రం మాపై కుట్రలు చేస్తుందంటారు. ఆంధ్రప్రదేశ్‌లో భాజపాకు ఒక్క ఓటు రాదని వారే అంటారు; ఆ భాజపానే రేపు ఎన్నికల్లో మా ప్రధాన శత్రువు అంటారు. మోదీ నన్ను అరెస్టు చేయిస్తాడేమో అనే అర్థంలో మాట్లాడుతూనే, ఇలాంటి వారిని చాలా మందిని చూసాం అంటారు.

చంద్రబాబు కేంద్రంలో చక్రాలు తిప్పడం ఆయన రాజకీయ ప్రతిభగా ఎక్స్‌పోజ్ చేస్తూ, మోదీ, షాల వరుస విజయాలు కుట్రలుగా ప్రచారం చేయడం విచిత్రం. ఈ ద్వంద్వ వైఖరిపై ప్రజలను ఆలోచింపజేసేటట్లుగా ఆంధ్ర భాజపా పావులు కదపకపోతే ‘నేను లేస్తే మనిషినిగాను’ అన్న సామెతలా వార్నింగ్‌లు ఇచ్చే లోపే ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తాయి. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం ఎంత ముఖ్యమో రాజకీయాల్లో దుష్ప్రచారం ఎదుర్కోవడం అంతే ముఖ్యం. బలవంతులను ఓడించడం చేతకానపుడు శత్రువులు దుష్ప్రచారంతో నిలువరిస్తారు. ప్రధానిని ఏ రాష్ట్రంలో ఎక్కడా నిందించనంతగా మీడియా యాంకర్లు, చోటామోటా నాయకులు నోటికొచ్చినట్లు తిడుతున్నా,  మమ్మల్ని కాదన్నట్లు, నిమ్మకు నీరెత్తినట్లు, చోద్యం చూస్తే రేపు ఎన్నికల్లో తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఇంకా కొందరు చెవులు కొరుక్కుంటున్నట్లుగా భాజపా నాయకుల్లో హోదా విషయంలో ‘ఏదో అభద్రత’ ఉన్నట్లు ప్రజలు భయపడే అవకాశం ఉంది.

ఓవైపు చంద్రబాబు, అతని అనుచరులు ఒంటికాలిపై లేస్తూ పొద్దున లేచినప్పటి నుండి మోదీ, అమిత్‌షాలపై దుమ్మెత్తి పోస్తుంటే ‘మాకు చంద్రబాబు అంటే గౌరవం’  అంటూ భాజపా నాయకులు హద్దులు మీరిన మర్యాదలతో సంబోధిస్తూ వాదన వినిపిస్తే అది అరణ్యరోదనే అవుతుంది.  చంద్రబాబు అండ్ కో చేస్తున్నది ఇదే.  రాష్ట్రాభివృద్ధి అంటే అమరావతి నిర్మాణమే అన్నట్లుగా తెలుగుదేశం చెప్తున్నా భాజపా మిగతా ప్రాంతాల ప్రజలను మేల్కొల్పకపోతే ఎలా? తిరుమలలో భాజపాకు సంబంధం లేకున్నా దోషిగా చేస్తున్నా మిన్నకుండిపోయారు. అమిత్‌షాపై టీడీపీ వర్గాలు రాళ్లదాడి జరిపినా శివాజీపై జరిగిన దాడికి వచ్చినంత పబ్లిసిటీ రాలేదు! ఎందుకు!?  భాజపా నాయకులు ఇలాగే పేలవంగా ప్రదర్శన చేస్తే 2019లో మొన్నటి ఉప ఎన్నికల్లాగా ఎక్కడైనా జరిగే లోటును పూడ్చుకోవడానికి ఆంధ్రను వేదికగా చేసుకోవడం కష్టమవుతుంది. చంద్రబాబుకు న్యాయవ్యవస్థలో, విదేశాల్లో, కులపరమైన ఏకత్వం కలిగించడంలో, ఎదుటివారిపై దుష్ప్రచారం చేయడంలో విశేష ప్రజ్ఞ ఉంది.

ప్రశాంత్ భూషణ్ లాంటి ప్రముఖ న్యాయవాదే ‘జ్యుడిషియరీ’లో అతనికున్న పలుకుబడి, అతని జీవితకాలంలో అతణ్ణి ఏమీ చేయజాలదని వ్యాఖ్యానించినట్లు లక్ష్మీపార్వతి ఎన్నోసార్లు చెప్పింది. ఇటీవల కర్ణాటక ఫలితాల అనంతరం జరిగిన పరిణామాల్లో చంద్రబాబు ఈ అస్త్రాన్ని ఉపయోగించినట్లు విశ్లేషకులు చెప్తున్నారు. దానికి తోడు 2014 ఎన్నికలకు ముందు మోదీ హైదరాబాద్ వస్తే ముందు వరుసలో నిలబడి కలిసిన నాయకులు, నటులు, మీడియా అధిపతులు ఈ రోజు మోదీపై ఆరేబియా సముద్రంలోని బురదనంతా తెచ్చి చల్లుతున్నారు. కేసీఆర్ కర్కశంగా వ్యవహరించడం వల్లగావచ్చు, అతని రాజకీయ వ్యూహం వల్ల గావచ్చు తెలుగు మీడియా అటువైపు పన్నెత్తి మాట్లాడ్డానికి సాహసించడం లేదు. ఇంగ్లీషు నవలల్లో కొందరు ధనికులు తమ పిల్లలకు కోపం వస్తే కొట్టడానికి ఓ ఉద్యోగిని నియమించే వారని చదువుకొన్నాం. ధనవంతుని పిల్లాడికి వచ్చే ప్రతి చిరాకును, కోపాన్ని ఆ ఉద్యోగిపై చూపించేవాడు.

అలాగే తెలుగు మీడియాకున్న చిరాకును, ఆక్రోశాన్ని ఇపుడు భాజపాపై, మోదీ, షాలపై చూపిస్తున్నారు.  చంద్రబాబు కూడా భాజపా అనే లేని శత్రువును సృష్టించుకొని తనపైన తనే యుద్ధం ప్రకటించుకొన్నాడు. హిట్లర్ తన ఆత్మకథలో “మీకు శత్రువులు అనే వారే లేకపోతే మీరంతా ఎప్పుడూ గొప్ప నాయకులు కాలేరు. ఒకవేళ మీకు శత్రువులు లేకున్నా ‘మీ దేశం ప్రమాదంలో ఉంది’ అనే కట్టుకథ సృష్టించండి. వెంటనే పరిస్థితి మీ ఆధీనంలోకి వస్తుంది. ఎందుకంటే భయంలో ఉన్నవారే రాజకీయవేత్తలను అనుసరించడానికి సిద్ధంగా ఉంటారు” అంటాడు. సరిగ్గా హోదా పేరుతో..

చేయాల్సిన పాలన 14 నెలల ముందే గాలికి వదిలేసి ఆత్మస్తుతి, పరనిందలలో మునిగి తేలడం నలభై ఏళ్ల రాజకీయ ఇండస్ట్రీ అనుభవం ఉన్న చంద్రబాబుకు తగదు. దేశంలో నెహ్రూ  శ్యాంప్రసాద్ ముఖర్జీ, కమ్యూనిస్టులు, ఆరెస్సెస్, ముస్లీం లీగ్  హిందూ మహాసభ, ఇందిర  సోషలిస్ట్ నాయకులు కూడా హద్దులు మీరిన శత్రుత్వాన్ని ప్రదర్శించలేదు. రాజకీయాలు సిద్ధాంతపరంగా, సత్యం ఆధారంగా ఉండాలి కాని తీవ్రంగా నిందించడం, అణచివేతతో సాధిస్తామంటే తెలంగాణ మలి ఉద్యమం లాగా మళ్లీ పెను ఉప్పెన రావడం చరిత్ర చెప్పిన సత్యం.

*********************************************

 డాక్టర్. పి. భాస్కర యోగి : సంపాదకీయ వ్యాసం 







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి