తెలంగాణ మాసపత్రిక : జూన్ 2018 : పుస్తక దర్శిని



తెలంగాణ ప్రాంతం తన మూలాలను తడిమి చూసుకొంటున్న తరుణంలో లభించిన యోగమూర్తి మాదిగ మహాయోగి దున్న ఇద్దాసు. ఈ పేరును యోగుల చరిత్రను అందించిన డా|| బి. రామ రాజు మొదట ప్రతిపాదించగా, తెలంగాణ తొలి దళితకవిగా సాహిత్య చరిత్రకారుడు డా|| సుంకిరెడ్డి నారాయణరెడ్డి స్థిరం చేశారు. నల్లగొండ జిల్లా చింతపల్లిలో మాదిగ దున్న రామయ్య, ఎల్లమ్మలకు జన్మించిన దున్న, ఇద్దాసు తన జీవితంలో ఎక్కువకాలం పాలమూరు జిల్లాలో జీవించాడు. ఇతని జీవితంలో యోగం, గ్రామ దేవతారాధన, అచల సిద్ధాంతం, సాహిత్యం-కలగలిసి ఉన్నాయి. ఈ ఆసక్తికర జీవనాన్ని తెలంగాణ ప్రజలకు అందించాలన్న సదు ద్దేశంతో తెలంగాణ వికాస సమితి దున్న ఇద్దాసు వంశంలోని దున్న విశ్వనాథాన్ని సంపాదకులుగా ఉంచి ప్రచురించింది. 16 శీర్షికలతో 264 పుటలతో ఉన్న ఈ పుస్తకంలో 31 తత్వాలు, 2 మేలుకొలుపులు, 5 మంగళ హారతులు ఉన్నాయి.
ఈ పుస్తక ప్రచురణలో ఎందరో పరిశోధకుల కృషి ఉంది. గతంలో చిన్న ఎక్కాల పుస్తకమంత పరిమాణంలో ఉన్న దున్న ఇద్దాసు తత్వాలను కపిలవాయి లింగమూర్తి ఆదేశంతో మల్లేపల్లి శేఖర్‌రెడ్డి శుద్ధ ప్రతిగా రాశాడు. దానికి విశ్వనాథం, దినకర్‌, వనపట్ల సుబ్బయ్య, సంబరాజు రవిప్రకాశ్‌రావు అక్షరరూపంలోకి మార్చినారు. ఆ తత్వాలతోపాటు దున్న ఇద్దాసు జీవిత చరిత్రకు రూపు ఇచ్చారు. ఈ పుస్తకం ఇంత అందంగా సాహిత్యలోకంలోకి రావడానికి ఓ గొప్ప వ్యక్తి కృషి ఉంది. ఆయనే దేశపతి శ్రీనివాస్‌. ‘మాదిగ మహాయోగి దున్న ఇద్దాసు జీవితం తాత్విక చింతనను పరిచయం చేసే పుస్తకం తెస్తున్నందుకు తెలంగాణ వికాస సమితి గర్విస్తున్నది’ (పు-17) అని ఆయన సగర్వంగా ప్రకటించారు. దున్న విశ్వనాథం ఈ పుస్తకంలో ఎక్కువ భాగం ఇద్దాసు జీవితంలోని క్రొత్త విషయాలను లోకానికి అందించారు. దున్న ఇద్దాసు స్థాపించిన అయ్యవారిపల్లి ఈశ్వరమ్మ పీఠానికి వారే అధిపతులు. సాయన్న మొదులుకొని మహేంద్రనాథ్‌ వరకు ఎందరో ఇద్దాసు శిష్యుల జీవితాలు - గురువుతో వారి అనుబంధాలను పేర్కొన్నారు. తొలి దళితకవిగా పేర్కొన్న సుంకిరెడ్డి వ్యాసం, అచలయోగి దున్న ఇద్దాసు పేరుతో దేశపతి శ్రీనివాస్‌ వ్యాసం, తన ఆంధ్రయోగుల్లో గొప్ప స్థానం కల్పించిన డా|| బి. రామరాజు వ్యాసం, కపిలవాయి వ్యాసం పేర్కొనదగినవి. ఇక దున్న ఇద్దాసు తత్వాలు ఆత్మపరంగా, జ్ఞానపరంగా తెలంగాణ గడ్డపై వచ్చిన అమృత గుళికలు. వేదాంత శాస్త్రాల సారాన్ని సామాన్య జనంలోకి వొంపి ఆధ్యాత్మిక సుగంధాలు వెదజల్లిన దున్న ఇద్దాసు జీవనం, తత్వాలను ఆస్వాదించాలంటే ఈ పుస్తకం మన సెల్ఫ్‌లోకి చేరాల్సిందే.

*******************************************

✍       డాక్టర్‌. పి. భాస్కర యోగి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి