పదకొండవ లోక్‌సభలో భాజపా అతిపెద్ద ఏకైక పార్టీగా ఆవిర్భవించినా, ఆనాటి ప్రధాని ఎ.బి.వాజపేయి అచిరకాలమే పదవిలో ఉన్నారు. ఆయన రా జీనామా చేసిన సందర్భంగా సుష్మా స్వరాజ్ చేసిన ప్రసంగం నాటి, నేటి రాజకీయాలకు అద్దం పడుతుంది. 1996 జూన్ 11న లోక్‌సభలో భాజపా నాయకురాలు సు ష్మా చేసిన ప్రసంగం చారిత్రాత్మకమైనది. ‘జనాభిప్రాయం ఎలా ఉన్నా స్వీకరించాలి. మాకు వ్యితిరేకంగా అన్ని పక్షాలు ఒక్కటయ్యాయి. రాజనీతిలో ఇది కొత్తేమీ కాదు. త్రేతాయుగంలో శ్రీరాముడికి ఇలాగే జరిగింది. ద్వాపరలో ధర్మరాజును వనవాసం పంపారు. దుష్ట శకుని- ‘సింహాసనంపై కూర్చోవలసిన వాళ్ల’ను అధికారం నుండి దూరం చేసాడు. ఆనాడు రాముడిని, ధర్మరాజును ఒక మంధర, ఒక శకుని రాజ్యాధికారం నుండి దూరం చేస్తే మాకు ఈనాడు వ్యతిరేకంగా ఎందరు మంధరలు, ఎందరు శకునిలు పనిచేస్తున్నారో చెప్పలేం’’- అని సూడో సెక్యులర్ ముసుగేసుకున్న పార్టీలను పార్లమెంటు సాక్షిగా ఆమె కడిగేశారు.

భాజపాలో ఆనాటికీ, ఈనాటికీ పెద్ద మార్పు రాలేదు. అకాలీదళ్, శివసేనలు భాజపాకు సుదీర్ఘకాలం నుండి వెన్నంటి ఉంటూ వచ్చాయి. హిందుత్వానికి ‘ఫైర్‌బ్రాండ్’ నేతగా ప్రఖ్యాతి పొందిన మహానాయకుడు బాలాసాహెబ్ థాకరే ఉన్నన్ని రోజులు భాజపా, శివసేనల మధ్య ఎలాంటి పొరపొచ్చాలు రాలేదు. కానీ ఇటీవల కొంత దూరం ఏర్పడిన మాట వాస్తవం. అలాగే కొందరు మిత్రపక్షాలుగా, మరికొందరు మద్దతుగా భాజపా పట్ల వ్యవహరిస్తున్నారు. అవసరాల ప్రాతిపదికగా బసపా, టిడిపి, అన్నా డిఎంకె, టిఆర్‌ఎస్ మిత్రులుగా వ్యవహరించారు. ఇపుడు మిత్రపక్షాలను భాజపా బ్రతిమాలడం లేదు. మోదీ నాయకత్వంలో భాజపాకు స్వంత మెజారిటీ రావడంతో కొంతమేరకు ‘మిత్రుల ప్రాబల్యం’ ఇటీవల తగ్గింది.

‘అధికారంలో ఉండడం సంకీర్ణ ధర్మం ద్వారానే సాధ్యం’అనే సూత్రాన్ని గత రెండు దశాబ్దాలుగా వింటున్నాం. ఆ రికార్డును తిరగరాసి నెహ్రూ, ఇందిర, ఆ తర్వాత అంత బలమైన నాయకత్వంతో మోదీ ప్రభుత్వం ఏర్పడడం దేశ రాజకీయలాకు ఆరోగ్య పరిణామమే. ప్రాంతీయ పార్టీల ప్రభావం సంబంధిత రాష్ట్రాలకే పరిమితమవడంతో వారికి స్వప్రయోజనాలుంటాయి. ఈ స్వప్రయోజనాలను కూడా లక్ష్యపెట్టకుండా ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్ తన చుట్టూ తిప్పుకొంది. ఇపుడు చరిత్ర తిరగబడి ప్రాంతీయ పార్టీల చుట్టూ కాంగ్రెస్ తిరిగే పరిస్థితి వచ్చింది. తాజాగా కర్ణాటకలో భాజపాను అధికారం నుండి దూరం పెట్టేందుకు బద్ధవిరోధులైన జెడియస్, కాంగ్రెస్‌లు ప్రభుత్వాన్ని అనైతిక కలయికతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ సంకీర్ణ సర్కారులో లుకలుకలను రోజువారీగా రాహుల్ గాంధీ ఢిల్లీ నుండి సమీక్షించి సరిచేసే దుస్థితి వచ్చింది. జెడిఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం ఏ కారణంతోనైనా ముక్కలైతే 2019 ఎన్నికలపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కాబట్టే ‘అనువుగాని చోట అధికులమనరాదు’ అన్న సూక్తిని కాంగ్రెస్ చాలా జాగ్రత్తగా పాటిస్తున్నది. కేరళలో బద్ధ విరోధులైన కమ్యూనిస్టులతో వైరం, జాతీయ స్థాయిలో స్నేహాన్ని కాంగ్రెస్ ప్రదర్శిస్తోంది. కొన్నిచోట్ల ములాయం, మాయావతిలతో కాంగ్రెస్‌కు సరిపడకున్నా భాజపా భయానికి అవకాశ పొత్తులకు బీజం వేస్తున్నది. 

కర్ణాటక ఫలితాల తర్వాత విపక్షాల నేతలంతా దాదాపు 14 పార్టీలకుపైగా ఒకే వేదికపై దర్శనమిచ్చి మోదీని ‘పరిస్థితులు చక్కదిద్దుకో’ అన్నట్లుగా చేతులు కలిపారు. గోరఖ్‌పూర్, పూల్పూర్ ఉపఎన్నికల తర్వాత ప్రతిపక్షాలు కాస్త బలం పుంజుకుంటున్నట్లు ఊహల్లో తేలియాడుతున్నాయి.

కర్ణాటక ఎన్నికలు నిజానికి కాంగ్రెస్ పండుగ చేసుకొనేంత గొప్పవేం కాదు. గోరఖ్‌పూర్, పూల్పూర్‌లలో ఎస్పీ,బిఎస్పీలు ఏకమై భాజపాపై గెలిచాయి. కాంగ్రెస్‌కు ధరావతు కూడా దక్కలేదు. కర్ణాటకలో కాంగ్రెస్ 78 సీట్లతో ద్వితీయ స్థానంలో నిల్చినా, 37 సీట్లు దక్కించుకున్న కుమారస్వామి ముందు మోకరిల్లింది. ఇవన్నీ ఓ రకంగా కాంగ్రెస్‌కు పరాజయాలే. ‘పక్కింట్లో పెళ్లయితే మన ఇంట్లో భోజనాలు పెట్టిన’ట్లు కాంగ్రెస్ సంబరాలు చేసుకొంది. ఏదో రకంగా భాజపా ను నిలువరించామని ఆనం దం తప్ప కాంగ్రెస్ స్వం తంగా సాధించింది శూన్యం. మనింట్లో కరెంట్ పోతే పక్కవాడి ఇంటివైపు చూడడం అంటే ఇదే.

ఒకప్పుడు ఇందిరా గాంధీ, ఆమె కుమారుడు సంజయ్ గాంధీ నిర్వాకం వల్లే దేశంలో అత్యాయిక పరిస్థితి విధింపబడింది. దానికి వ్యతిరేకంగా ‘లోక్‌నాయక్’ జయప్రకాశ్ నారాయణ్ ఆధ్వర్యంలో పెద్ద తిరుగుబాటు వచ్చింది. అలనాడు నెహ్రూకు వ్యతిరేకంగా శ్యాం ప్రసాద్ ముఖర్జీ, హిందూ మహాసభ వంటివి ఎదురొడ్డి నిల్చినా అతని గాంధేయవాద ముసుగు ముందు అవన్నీ ఫలించలేదు. 1952 అక్టోబర్ 16న ఢిల్లీలో నెహ్రూ విధానాలకు వ్యతిరేకగా ప్రతిపక్షాలు ఒక్కటయ్యాయి. కలకత్తా, ఢిల్లీలో జరిగిన బహిరంగ సభల్లో డా.శ్యాంప్రసాద్ ముఖర్జీతోపాటు, ఆచార్య కృపలానీ, ఎన్.సి.్ఛటర్జీ పాల్గొన్నారు. ఇందిరకు వ్యతిరేకంగా జరిగిన ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమం తర్వాత జనతా పార్టీ అధికారంలోకి వచ్చినా అది కూడా ఆదిలోనే విచ్ఛిన్నమైంది. ఆ ఉద్యమం నుండి పుట్టిన కొత్తతరం నాయకత్వమే లాలూ, ములాయం, దేవెగౌడ, జార్జి ఫెర్నాండెజ్ వంటివాళ్లు. వీళ్లంతా కాంగ్రెస్‌కు ఆగర్భ శత్రుత్వంతో రాజకీయాల్లోకి వచ్చారు. కానీ మన దేశంలోని కుల, సూడో సెక్యులర్ రాజకీయాలవల్ల జాతీయ భావనకు వ్యతిరేకంగా తయారయ్యారు. నేషనల్ ఫ్రంట్ కూడా ఒక రకంగా భాజపాను నిలువరించడానికే పుట్టింది. దానివల్ల దేశానికి గొప్ప నాయకులేం రాలేదు. చంద్రశేఖర్, వీపీ సింగ్, దేవెగౌడ, ఐకే గుజ్రాల్.. ఈ నలుగురూ మన్మోహన్ సింగ్‌కు పెద్దన్నలే! తెలుగువాడైన పీవీ నరసింహారావు గొప్ప రాజనీతిగల సమర్థ ప్రధాని. అతణ్ణి కాంగ్రెస్ పార్టీనే ఓర్చుకోలేకపోయింది.

ఇక కమ్యూనిస్టులది ఎప్పుడూ అరాచక వాదమే. దేశవిభజనకు ముందునుండి ఎప్పు డూ వారు విధ్వంస రాజకీయాలే చేస్తూ వచ్చారు.

The communists disdain to conceal their view and aims. They openly dec lare that their ends can be attained only by the forcible over throw of all existing social conditions. Let the ruling class tremble at a communist revolution.

కమ్యూనిస్టులు తమ లక్ష్యాలను, ఉధ్దేశాలను దాచిపెట్టారు. ప్రస్తుత సామాజిక పరిస్థితులను బలవంతంగా నష్టపరచనిదే వారి ధ్యేయం నెరవేరదు. వారి విప్లవ భావాల వల్ల పాలకవర్గం భయంతో వణికిపోవాలి. ఇదీ కమ్యూనిష్టుల అసలు లక్ష్యం అని మా ర్క్స్ రాసిన పత్రాల సా రాం శం. అందుకే వాళ్లు కొ న్నాళ్లు నెహ్రూను, ఇందిరను సమర్థించారు. ఎమర్జెన్సీని ఓ వర్గం వ్యతిరేకిస్తే, మరోవర్గం సమర్థించింది. హిందుత్వ జాతీయతను పుట్టుకతో ద్వే షించే మార్క్సిస్టులు జిన్నా కు, ముస్లిం లీగ్‌కు మద్దతిచ్చి దేశవిభజనకు పరోక్షంగా సహకరించారు. ఈ రోజు లౌకికవాదం అనే ముసుగు తగిలించుకొని హిందుత్వ వ్యతిరేక శక్తులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. కర్ణాటకలో సిపిఎం ఒక్క సీటు గెలవకున్నా- కుమారస్వామి ప్రమాణ స్వీకార వేదికపై సీతారాం ఏచూరి చేతులూపుతుంటే ‘సిగ్గుతనమే’ సిగ్గుతో తలదించుకొంది. అదీ- కమ్యూనిస్టు కోటను బద్దలుచేసి వాళ్లకు బెంగాల్‌లో నిలువనీడ లేకుండా చేసిన మమతా బెనర్జీతో ఏచూరి కలిపి వేదిక పంచుకోవడం!?

అదే వేదికపై రాహుల్ గాంధీతో కరచాలనానికి నానా తంటాలు పడిన తెదేపా అధినేత చంద్రబాబు మరో చారిత్రక తప్పిదం చేశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవం పేరిట ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడైన చంద్రబాబు కాంగ్రెస్ నాయకుల ప్రక్కన ఫొటోలు దిగడానికి చేసిన ప్రయత్నం అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. అధికారంలో ఉండగా ఒకరినొకరు ముప్పతిప్పలు పెట్టుకొన్న మయావతి, అఖిలేశ్‌లు కూడా అదే వేదికపై కన్పిస్తే- యూపీలో గత ముప్ఫై ఏళ్ళనుండి హత్యలకు గురైన ఆ ఇరుపార్టీల కార్యకర్తల కుటుంబాలు గుండెలు బాదుకున్నాయి.
దీనికంతటికీ భిన్నంగా మరో దృశ్యం.. అంతకుముందురోజే తెలంగాణ సీఎం, తెరాస అధినేత కేసీఆర్ బెంగళూరు వెళ్లి కుమారస్వామికి అభినందనలు చెప్పి రావడం. కేంద్రంలో చక్రం తిప్పుతానని మరోసారి చక్రాల్లో గాలి నింపుతున్న చంద్రబాబు, ఫెడరల్ ఫ్రంట్ పెట్టి కాంగ్రెస్, భాజపాలకు సమాన దూరం పాటిస్తానని ప్రకటించిన కేసీఆర్ కలిసి ఈవిషయం గురించి మాట్లాడుకోకపోవడం మరో విశేషం. బహుశా చంద్రబాబు నమ్మకద్రోహం తెలిసే కేసీఆర్ కుమారస్వామి పట్ట్భాషేకానికి వెళ్లలేదని కొందరంటే, చంద్రబాబుకు పోటీగా భాజపాకు పరోక్షంగా సహాయపడడానికే అని మరికొందరు విశ్లేషిస్తున్నారు.

ఏది ఏమైనా దేశ రాజకీయ చరిత్రలో ఎవరైనా బలమైన వ్యక్తిని నిందించడానికి ఎన్నోసార్లు రాష్ట్ర, కేంద్ర స్థాయిలో కూటములు ఏర్పడ్డాయి. రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు గోడదూకే చర్యలపై ఓ పుస్తకం రాయొచ్చు. డబ్బుకు, అధికారానికి ఆశపడి పాల్పడే గోడదూకే చర్యలకు ముకుతాడు వేయడానికి 1985లో ఫిరాయింపుల నిరోధక చట్టానికి 52 రాజ్యాంగ సవరణ ద్వారా పదవ షెడ్యూల్లో స్థానం కల్పించారు. ఆ తర్వాత ఈ చట్టంలోని లొసుగులను ఉపయోగించుకొని రాష్ట్రాల్లో అస్థిర ప్రభుత్వాల ఏర్పాటైనపుడల్లా సంతలో పశువులను కొన్నట్లు ఎమ్మెల్యేలను కొనడం రివాజైంది. లోపాలను సరిదిద్దేందుకు 91 రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు చట్టం చేయగా, 2004 నుండి ఇది అమల్లోకి వచ్చింది. ఈ సవరణనే 2008లో యెడ్యూరప్పను అధికారం నుండి దూరం చేసింది. ఇక్కడొక ముఖ్యమైన అంశం మన ముందుకు వస్తున్నది. ఎమ్మెల్యేల బేరసారాలను మనం చట్టం, రాజ్యాంగం, గవర్నర్- అనే చిన్న చట్రంలోనే చూస్తున్నాం. భావ సారూప్యత లేని, భిన్న ధృవాలైన పార్టీల కలయిక కేంద్ర స్థాయిలో జరిగితే అదేదో మహాప్రభంజనం అంటున్నాం. ఇక్కడ చట్టం కన్నా స్వార్థం ఎక్కువ. చట్టాన్ని అధర్మంగా, అనైతికంగా ప్రజల నెత్తిన రుద్దడానికి కలగూర గంపలను తయారుచేస్తున్నారు.

లౌకికవాద పరిరక్షక భావ సారూప్యత పేరుతో స్వా తంత్య్రం వచ్చినప్పటి నుండి ఎందరో అవినీతి నాయకులను, అసమర్థులను, కుటుంబ, కులతత్వ వాదులను దేశంపై బలవంతంగా రుద్దడం నిజం. బిహార్ సీఎంగా పనిచేసిన లాలూ యాదవ్ 970 కోట్ల పశుదాణా కుంభకోణంలో మూడు కేసుల్లో నిందితుడైనా మనం ఆయనను ‘లౌకికవాద ఐకాన్’గా చూస్తూనే ఉన్నాం. మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరం కొడుకు కార్తీ ఐఎన్ ఎక్స్ మీడియా సంస్థలోకి 26 శాతం విదేశీ పెట్టుబడులలు అనుమతించేందుకు నిబంధనలకు విరుద్ధంగా 2007లో ఏకంగా మిలియన్ డాలర్లు డిమాండ్ చేసారన్నా, చిదంబరం లౌకికవాది కాబట్టి గొప్పవాడే. కాంగ్రెస్ స్వంత పత్రిక లాంటి ‘నేషనల్ హెరాల్డ్’ను మ్రింగేందుకు సాహసించిన కోట్ల కుంభకోణంలో ఇరుక్కున్న సోనియా, రాహుల్ ఇద్దరూ మనకు గొప్పవారే. హత్యా రాజకీయాలు నడుపుతున్న మమత, స్వార్థంతో అధికారం పొందిన దేవెగౌడ కుటుంబం.. ఇలా అందరూ అధికారం కోసం ఎదుటివారిపై కత్తులు దూసినట్లు నటించి మళ్లీ ఎన్నికల తర్వాత పునరేకమై కొత్త ఫ్రంట్ అంటారు. వహ్వా.. ఏం రాజకీయం..?

****************************************
✍✍డాక్టర్. పి. భాస్కర యోగి

Published Andhrabhoomi :


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి