ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీని పాత్రికేయుల సమావేశంలో ఓ విలేఖరి “మీరు విదేశాలకు వెళ్లేటప్పుడు ఎక్కువగా సిల్కు చీరలు ధరిస్తారు. అదే మనదేశంలో మామూలు నూలు చీరలు కట్టుకుంటారు ఎందుకో చెప్పగలరా?” అని ప్రశ్నించాడట.  పైపై మెరుగులంటే చాలా ఇష్టం. కానీ మన దేశంలో నేను చీర మాత్రమే కాకుండా, గౌను తొడిగినా నా మీద ఎనలేని గౌరవం ప్రదర్శిస్తారు ప్రజలు” అని ఇందిర జవాబిచ్చింది. ఆనాటి పాత్రికేయ లోకం సెలబ్రిటీల నుండి రాబట్టే జవాబును కూడా సందేశాత్మకంగా అందించేది. అలాగే రాజకీయ నాయకులతో పాటు ఇతర సెలబ్రిటీలు మీడియాను తమ వ్యక్తిగత ప్రచారానికి కాకుండా తమ దగ్గరున్న పరిజ్ఞానాన్ని లోకానికి అందించే ప్రయత్నం చేసేవారు.

అలాగే ఓ బూతు పత్రిక నడిపే వ్యక్తి కాలమిష్టుగా మారి వ్యాసాలు పంపితే ఓ దినపత్రికలోని ఆడ కంపోజర్లు ఆ రాతలను కంపోజ్ చేయకుండా నిరసన వ్యక్తం చేసారు. అదీ ఆనాటి కమిట్‌మెంట్. నిషి మనసు కన్నా వేగంగా పరుగెత్తుతున్న సాంకేతిక పరిజ్ఞానం హోరును అందుకోవాలనే తహతహ ప్రసారమాధ్యమాలకు ఎక్కువైంది. ఒకప్పుడు పత్రికలు రాసే విషయంలో స్పష్టత, నిర్దుష్టత మాత్రమే కాకుండా సమాచారమార్పిడి ఆలోచనాత్మకంగా ఉండేది. వార్తలను ఆచితూచి అందించేవారు. ఇప్పుడు ప్రసారమాధ్యమాల పరుగుపందెంలో వార్త కన్నా వ్యాఖ్యకే ప్రాముఖ్యం పెరిగింది.  స్టోరీ బోర్డ్‌లు, వార్తావ్యాఖ్యలు నిష్పక్షపాతంగా నిర్మాణాత్మకంగా కాకుండా స్వీయ దురభిమానంతో జరగడం దురదృష్టకరం. తమ కులం వ్యక్తిని గద్దెపై స్థిరంగా ఉంచాలన్నా లేదా గద్దెపైకి ఎక్కించాలన్నా దానికోసం మాధ్యమాలు నిస్సిగ్గుగా విషపు కూతలు కూస్తున్నాయి.

తమ వ్యక్తిగతంగా పెట్టుకొన్న చానళ్లు వారి కార్యకలాపాలకు పెద్దపీట వేస్తున్నాయి. అలాగే వర్గ దృక్పథంతో పనిచేసే చానళ్లు సిద్ధాంతాల వారు తమ సిద్ధాంతాలకు ప్రాచుర్యం కల్పిస్తూ వ్యాఖ్యానిస్తున్నాయి. అలాగే తమ వ్యాపారాల సంరక్షణకు కవచంగా ఉండే పార్టీలకు మరికొన్ని చానళ్లు కొమ్ముగాస్తున్నాయి. విలువలకు పట్టం కట్టాల్సిన చానళ్లు సమజాంలో కలకలం రేపుతున్నాయి. సమన్వయంతో సమాజాన్ని నడిపించాల్సిన వారు సంఘర్షణలు రేకెత్తిస్తున్నారు!?  రేటింగ్‌ల కోసం సమాజంలోని ఉద్వేగకర అంశాలను వేడివేడిగా వండి వార్చాలన్న అత్యుత్సాహంతో కొన్ని చానళ్లు కుల, మత, ప్రాంత, భాషాపరమైన అంశాలను తమకు సాధనాలుగా వాడుకొంటున్నాయి. పత్రికల్లో వచ్చే వార్తలు మనసులోని ఉద్వేగాలు కాస్త చప్పబడ్డాక చదివితే వివేకాన్ని పెంచేవి.

ఇపుడు నిమిష నిమిషానికి ‘బ్రేకింగ్ న్యూస్’లతో ప్రతీది ఉడికించడం ఎలక్ట్రానిక్ మీడియాకు పరిపాటి అయ్యింది.  మెడలో గంట ఎవరు కడతారు?’ అన్న చందంగా సమాజాన్ని ఫోర్త్ ఎస్టేట్‌గా ఉండి రక్షించే మీడియా సర్వభక్షకిగా మారనుందా? మనుషుల మనోవికాసాన్ని చంపేసే వ్యాపారాత్మక కార్యక్రమాలు, నేర ప్రవృత్తిని పెంచే నేరాలు లైంగిక దాడులు జరిపే సినిమాల ఎక్స్‌పోజింగ్, మహిళలను విలన్లుగా జిడ్డు సీరియళ్లు మన అత్యున్నత గౌరవాలను కించపరిచే కామెడీ షోలు, బాలలను బానిసలుగా మారుస్తున్న కార్టూన్లు... అన్నీ పరిమితికి మించి సాగిస్తున్న విన్యాసాలు మనల్ని ఎక్కడికి తీసుకుపోతాయో చెప్పలేం. మరి అలా అయితే ఈ పరిజ్ఞానాన్ని ఒక్కసారిగా ధ్వంసం చేయడం సాధ్యమా?  పరిమితులు, చట్టంలోని లొసుగులు ఇలాంటి అవాంఛనీయమైన పరిస్థితులకు అన్నిరంగాల్లో కారణం అవుతున్నాయి. అయితే మిగతా రంగాలు సమాజంలోని కొంత భాగాన్ని మాత్రమే ప్రభావితం చేయగలుగుతాయి.

కానీ ప్రసార మాధ్యమాలు సింహభాగం సమాజాన్ని అతలాకుతలం చేయగలవు కాబట్టి ఈ మాధ్యమాలకు స్వీయనియంత్రణ అవసరం. ముఖ్యంగా తెలుగు చానళ్ల భావదారిద్య్రం ఇటీవల ఈ నియంత్రణ కోల్పోయింది. సినిమా కుటుంబాలను, నటులను, క్రికెట్ స్టార్లను రాజకీయ వేత్తలుగా మార్చే పనిని కూడా ప్రసార మాధ్యమాలు తమ భుజానికెత్తుకున్నాయి!? కేవలం వ్యాపార బుద్ధితో కొన్ని చానళ్లు ప్రవర్తిస్తే, వ్యక్తిగత స్వార్థం కోసం మరికొందరు చానళ్ల ద్వారా ఉద్వేగాలు పెంచుతున్నారు. అలాంటి ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు. ఇటీవల పోసాని కృష్ణమురళిని ఓ ప్రముఖ చానల్ రాజకీయ విశ్లేషణకు పిలిచింది. అతని ఎదురుదాడికి విశ్లేషకుడి గొంతు మూగబోయింది. ఆ సందర్భంగా జర్నలిస్ట్ మాట్లాడిన మాటలు స్త్రీలను అగౌరవపరచగా, ఈ అంశం పోలీస్ స్టేషన్ వరకు చేరింది.

2014లో తెలంగాణ ఏర్పడ్డాక ఇక్కడి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాన్ని హేళన చేస్తూ రెండు ప్రముఖ చానళ్లు విశ్లేషణ చేశాయి. దాంతో కేసీఆర్ అగ్గిమీద గుగ్గిలం అయ్యి ఆ రెండు చానళ్లను కొన్నాళ్లపాటు నిషేధం చేసాడు. ఆ దెబ్బతో హైదరాబాద్ కేంద్రంగా నడిచే మీడియా సంస్థలన్నీ దారిలోకొచ్చాయి. అందుకే కేసీఆర్ ప్రభుత్వంపై ఏవైనా ఆరోపణలు ప్రతిపక్షాలు చేసినప్పుడల్లా దానిపై ఎక్కడ చర్చించాల్సి వస్తుందో అని కొత్తదారి వెతుక్కుంటున్నాయి. తాము దాడి చేయలేని పరిస్థితి వచ్చినప్పుడల్లా ఎలక్ట్రానిక్ మీడియా తనపైన తానే యుద్ధం చేసుకొని ఎంగేజ్ అవుతుంది. సినిమా నటుల డ్రగ్స్ వ్యవహారంపై ఎలక్ట్రానిక్ మీడియా చేసిన హడావుడి ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ డ్రగ్స్ వ్యవహారంలో భూమ్యాకాశాలు ఏకమైనంతగా చర్చోపచర్చలు చేశారు.

అలాగే శ్రీరెడ్డి వ్యవహారం పేరుతో ‘క్యాస్టింగ్ కౌచ్’పై పెద్ద దుమారం లేపారు. అది తిరిగి తిరిగి పవన్ కల్యాణ్ మెడకు చుట్టుకొని వ్యక్తిగత దూషణల వరకు వెళ్లేసరికి మీడియా సినిమా ఇండస్ట్రీ లోలోపల సెటిల్మెంట్ చేసుకున్నాయి. మరుసటి రోజు నుండి ఈ రోజు వరకు శ్రీరెడ్డి ఊసేలేదు. సినిమా పెద్దల, రాజకీయ పెద్దల వ్యక్తిగత ప్రతిష్ఠ దెబ్బతింటుందని తెలియగానే ఈ దమ్మున్న దగ్గున్న చానళ్లు ఆ అంశాలను పెట్టెలో వేసి మూసేస్తాయి. స్త్రీని భోగ వస్తువుగా మార్చేసి నాలుగు మాటలు నేర్పించి తెరముందు కూర్చోబెట్టి యువతను మత్తెక్కిస్తున్నారు!? ఇలాగే ఇటీవల ‘సెక్స్ రాకెట్’ పేరుతో జరిగిన వ్యవహారాన్ని అంతర్జాతీయ విషయంగా ఎక్స్‌పోజ్ చేస్తున్నాయి. కొన్నాళ్లు బ్యూటీషియన్ శిరీష హత్య కేసులోని విషయాలను పరోక్షంగా లైంగిక విషయాలను చెప్పే విధంగా ఎలక్ట్రానిక్ మీడియా అందించేది.

కొందరు రాజకీయ నాయకుల దుర్మార్గపు ఘనకార్యాలను వాళ్లకు ప్రచారం కల్పించేటట్లుగా ప్రసార మాధ్యమాలు తమ తలకు ఎత్తుకుంటున్నాయి. అలాగే నాయకుల పుత్రరత్నాల క్లబ్బు డ్యాన్సులు, దాడులు, పబ్బు హుక్కాలు, డ్రంక్ అండ్ డ్రైవ్‌లు నిరాటంకంగా ప్రసారం చేసి వాళ్లకు భావి రాజకీయ యవనికను సిద్ధం చేస్తున్నాయి. పూర్వం సెలబ్రిటీలంటే గొప్ప నాయకులు, సాహిత్యవేత్తలు, కళా రంగానికి చెందినవారు, ఆధ్యాత్మిక వేత్తలు ఉండేవారు. ఇపుడు ఫేస్‌బుక్, ట్విట్టర్ ఉపయోగించదగిన ప్రతివారూ సెలబ్రిటీలే. వీళ్ల తోలు మందం చూసి మీడియా వాళ్లకు తగినంతగా ప్రాచుర్యం కల్పిస్తున్నది. ఈ మధ్య తెలుగు ప్రసార మాధ్యమాలకు పచ్చకామెర్ల రోగం పట్టుకుంది. ఏకంగా ఓ మూలబడ్డ చానల్ యాంకర్ పార్టీ కార్యకర్త కన్నా ఎక్కువ ఆవేశంతో అర్నాబ్ గోస్వామిలా రెచ్చిపోయి ఆ చానల్‌కు ఎనలేని ప్రచారం కల్పించాడు.

నరేంద్ర మోదీని తిట్టడమే తెలుగువారి ఆత్మగౌరవం కాపాడడం అన్న భ్రమలో కొందరు యాంకర్లు ప్రవర్తిస్తున్నారు. టీడీపీ  బీజేపీ మైత్రీబంధం బద్దలయ్యాక తెలుగు చానళ్ల ప్రైమ్ టైమ్ న్యూస్‌లో ‘ప్రత్యేక హోదా తప్ప’ ఇంకేమీ ఉండడం లేదు.  చానల్‌లో చేరి మంట పుట్టిస్తున్న ఈ ‘మహా’నటులు మూర్తీభవించిన కళాకౌశలం ప్రదర్శిస్తున్నారు. అలాగే భుజాలపై శాలువాలు ధరించి పుచ్చలపల్లి సుందరయ్యల్లా ఫోజులిచ్చే స్వయం ప్రకటిత మేధావులు మీడియాకు ఉప్పందిస్తున్నారు! తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణలో ఏమీ లేదన్న పార్టీలు, స్వయం ప్రకటిత మేధావులు ఇపుడు తెలంగాణ ప్రభుత్వం మిగులు బడ్జెట్‌తో ఆంధ్రాలో లేని పథకాలు ప్రకటిస్తున్నది.

అదే ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు కేంద్రం ఇస్తే తప్ప మేం ఏం చేయలేం అని చేతులు ఎత్తేశాడు. ఈ తర్కంలోని ద్వంద్వ విధానాన్ని ఒక్క ప్రసారమాధ్యమం ప్రశ్నించదు!? రోజూ సాయంత్రం కాగానే కేసీఆర్‌ను, చంద్రబాబును ఏమీ అనలేక తమకున్న వ్యతిరేకతను మోదీ లక్ష్యంగా దుమ్మెత్తి పోస్తున్నారు. కేసీఆర్‌పై భయంతో, చంద్రబాబుపై భక్తితో జరుగుతున్న ఈ ప్రహసనంపై సోకాల్డ్ మేధావులెవరూ నోరు మెదపకపోవడం మరో విడ్డూరం! వీళ్లంతా ఇపుడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బంధీ అయ్యారు.

తమకిష్టమైన వారిని రాత్రికి రాత్రి గొప్పవాళ్లను చేయడం, తమకు నచ్చని వాళ్లను పాతాళంలోకి తొక్కడం ప్రసార మాధ్యమాలకు నిత్యకృత్యం అయ్యింది. స్వీయ నియంత్రణ లేని ఈ విశృంఖల వార్తా స్వైర విహారం సమాజాన్ని ఎటువైపు తీసుకుపోతుందో చూడాలి. దీనికితోడు సామాజిక మాధ్యమాల దౌడును అందుకోవడానికి జరుగుతున్న ఈ రేసుగుర్రం పరుగుపందెం సమాజాన్ని తమ కాళ్ల క్రింద వసుకొని తొక్కేస్తుందన్న విషయం విస్మరిస్తున్నది. ప్రసార మాధ్యమాలను పట్టి కుదిపేస్తున్న ఈ కుసంస్కారపు ఎత్తుగడలకు స్వీయనియంత్రణ లేకపోతే కేసీఆర్ మార్గమే శరణ్యం.


********************************************

*✍✍డాక్టర్. పి. భాస్కర యోగి* 

 సంపాదకీయ వ్యాసం :  విజయక్రాంతి



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి