‘ఊరంతా ఒకధారి అయితే ఉలిపికట్టెది మరోదారి’’అన్నట్లుంది తెలుగు ఛానళ్ల తీరు. 20.12.2012నాడు గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. దేశమంతా జాతీయ ఛానళ్లలో ఒక రకమైన విశే్లషణ ఉంటే, తెలుగు ఛానళ్లు పిచ్చిపట్టినట్లు వ్యవహరించడం సిగ్గుచేటు. 

హిందుత్వను కించపరచడానికి, హిందూ నాయకులను 
కించపరచడానికి, తక్కువగా, హీనంగా చూపడానికి ప్రయత్నించడం చూస్తుంటే వీళ్ల మూర్ఖత్వం ఏ స్థాయికి చేరిందో అందులో పాల్గొన్న విశే్లషకుల మానసిక స్థితి ఎంత క్షుద్రంగా ఉందో ఆలోచించవచ్చు. అంతకుముందు ఇటీవలి కాలంలో జరిగిన సంఘటనలు ఆశ్చర్యం కల్గిస్తున్నాయి.

కొద్దినెలల క్రితం ప్రతిపక్ష నాయకుడైన అద్వానీ కేంద్ర ప్రభుత్వాన్ని ‘అక్రమ ప్రభుత్వం’ అని సంబోధించినందుకు, సోనియాగాంధీ ఆవేశపడి ఒంటికాలిపై లేచి, తమ కాంగ్రెస్ ఎంపీలను ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడమని ఉసిగొల్పడం దేశమంతా చూశాం. కాని తెలుగు పత్రికలు, ఛానళ్లు ఆమెను ‘అపరకాళిక’గా చిత్రీకరించడం చూస్తే నవ్వొస్తుంది. వీళ్ల ఛానళ్లను ఏమీతెలియని దద్దమ్మలు చూస్తున్నారని అనుకుంటున్నారో ఏమో! ప్రతిపక్ష నాయకుడిని విలన్‌గా చిత్రించే ప్రయత్నం చేయడం విడ్డూరంగా తోస్తుంది. ప్రభుత్వం చేసిన అక్రమాలను చెప్పేప్రయత్నంలో దొర్లిన మాటను పట్టుకొని, తెలుగు మీడియా సోనియాగాంధీ మాట్లాడడం, సైగలు చేయడం గొప్ప విషయంగా అదే దేశ ప్రజల అదృష్టంగా చూపించడం తలలో బుర్ర ఉన్నవారిని ఎవరినైనా తలదించుకొనేటట్లు చేసింది.

అలాగే ఇటీవల ఎం.ఐ.ఎం.పార్టీ కాంగ్రెస్ నుండి, ప్రభుత్వంనుండి ప్రక్కకు జరిగితే అదేదో భారతదేశ సమస్యలాగా, ఆ పార్టీ అధ్యక్షుడు ఏదో మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధమైనట్లు చూపించడం అందరినీ ఆశ్చర్యపరచింది.

రాత్రి పనె్నండు గంటల వరకు ఎంపీ అసదొద్దీన్ ఒవైసీతో ఇంటర్వ్యూలు చేసి తెలుగు ప్రజలకు కనువిందు చేశారు. ఆయనతో వచ్చీరాని ఉర్దూలో దమ్ములేని ప్రశ్నలతో (ప్రశ్నలు అడగడానికి కూడా భయపడుతూ) ఇంటర్వ్యూ చేశారు. రెండు రోజులు ఇదొక ప్రహసనంగా నడిపించారు మన ఛానళ్ల ప్రతినిధులు.

రాజకీయ మసాలా లేని ప్రతిరోజూ చేపమందు పేరుమీదనో, స్వామీజీల మీదనో, హిందూ మత ఆచారాల పేరుతోనో, విజ్ఞానశాస్త్రంతో సంబంధం లేని జన విజ్ఞానవేదిక వాళ్లను కూర్చోబెట్టి, అనామకుడైన తీర్థప్రసాదాలిచ్చే పూజారిని హిందువుల ప్రతినిధిగా కూర్చోబెట్టి హిందూ ధర్మాన్ని తిట్టించడం ఇటీవల తెలుగు ఛానళ్లవారికి ఆనవాయితీగా మారిపోయింది. జీవిత, రాజశేఖర్ భాజపాలో కలుస్తారనే వార్తను చింపి చాప చేసి వాళ్లను ఆ పార్టీలోకి వెళ్లకుండా చేసాయి మన ఛానళ్లు. తెలుగు ప్రజలను పిచ్చివాళ్లుగా మారుస్తున్న ప్రసార మాధ్యమాల వైనాన్ని గర్హించకపోతే ఈ పిచ్చి ముదిరిపోయే అవకాశం ఉంది.

ప్రసార మాధ్యమాలను నియంత్రించే వ్యవస్థ లేకపోతే వెయ్యి గొర్రెలను తిన్న తోడేళ్లను గొప్పగా చూపిస్తూ గొర్రెలపై కనీస సానుభూతి కూడా చూపని జాతి తయారయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే వీళ్ల దృష్టి చచ్చిన అమాయకపు గొర్రెలకన్నా, తిన్న తోడేలును గొప్పగా చూపే విధంగా ఉండడం, అది ప్రజల మనస్సులో స్థిరంగా ఉండేట్లు చేయడం మన హీనస్థితికి అద్దంపట్టే అవకాశముంది.

గుజరాత్ ఎన్నికల్లో నరేంద్రమోడీ గెలవడం ఇష్టంలేని ఈ ఛానళ్ల వీరపురుషులు క్రొత్తక్రొత్త కోణాలను చూపించడం అనంతమైన ఆశ్చర్యం కలిగించింది. ప్రతిపక్షానికి సగానికి సగం సీట్లురాకున్నా, గెలిచిన వ్యక్తికి సీట్లు ఎన్ని వచ్చినా అవేవీ పట్టించుకోకుండా దుర్మార్గపు వ్యాఖ్యానంతో మాధ్యమ వ్యవస్థపై గౌరవంలేకుండా చేస్తున్నారు. నరేంద్రమోడీది గెలుపే కాదని తెలుగుఛానళ్లు తెంపరితనాన్ని ప్రదర్శించడం విజ్ఞులైన వారిని ముక్కున వ్రేలువేసుకొనేటట్లు చేసింది. మన తెలుగు ఛానళ్లు హిందూవాదాన్ని, దాన్ని మోసే నాయకులను తక్కువచేసి చూపించడం చూసి ఎలా నిరసన తెలపాలో అర్థంకావడం లేదు. నరేంద్రభాయ్ మోడీని ప్రపంచవ్యాప్తంగా అపఖ్యాతిపాలు చేయడానికి ఎంత ప్రయత్నం చేసినా, ఆయన మూడుసార్లు గెలవడం గొప్పని చెప్పడం ఇష్టంలేని ఈ ఛానళ్లు, విశే్లషకులు సంకుచిత బుద్ధితో ప్రవర్తించారు. ఇంత గడ్డు పరిస్థితిలో అద్భుత ప్రగతిని సాధించి గెలిచిన మోడీని ప్రధానమంత్రిని కానివ్వరాదని వీళ్ల సంకల్పంగా తోస్తున్నది. 

ఒకేసారి ముఖ్యమంత్రిగా చేసి మన రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిగా అమ్ముకొని తిని చచ్చిన నాయకులను, కులమే బలంగా బ్రతికే నాయకులను హీరోలుగా చూపిస్తూ ప్రొద్దుబుచ్చుతున్న మాధ్యమాలు, గట్స్‌ఉన్న నాయకుడిని, తన బంధువులను కూడా దగ్గరకు రానీయకుండా అవినీతికి పాల్పడకుండా పాలిస్తున్న నాయకుణ్ణి విలన్‌గా చూపించడం, ఏ ప్రజాస్వామ్య విలువలకు పట్టంకడుతున్నారో చెప్పాలి...!?
మూడుసార్లు గెలిచినా, అవినీతికి పాల్పడకుండా, అభివృద్ధిపథంలో దూసుకుపోతున్న నరేంద్రమోడీ ప్రధాని పదవికి అర్హుడుకాడని విశే్లషకులు చెప్తుంటే జనం నవ్వుకొంటున్నారు. ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి. నరేంద్రమోడీ ఏంచేస్తున్నాడో, అతనికి జాతిపై ఎలాంటి కమిట్‌మెంట్ ఉందో అర్థం అవుతుంది.

యూట్యూబ్‌లో ముస్లింలు నరేంద్రమోడీపై వ్యక్తంచేసిన అభిప్రాయాలు, నెటిజన్లకు మోడీ ఇచ్చిన జవాబులు ఆసక్తికరంగా, దేశ యువతను ఆలోచింపజేసే విధంగా ఉండడం గమనార్హం. ఇవాళ ఇంధనేతర విద్యుదుత్పత్తి భారతదేశ ఉత్పత్తిలో సగం గుజరాత్‌నుండే ఉత్పత్తిఅవుతుంది అన్నా, విద్యుత్తును మూడుభాగాలుగా విడగొట్టి పల్లెలకు కూడా 24 గంటలు కరెంట్ అందించడం మతతత్వవాదమా?

- ఇంకావుంది...

*********************************************
✍ డాక్టర్‌. పి. భాస్కర యోగి
ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి