ధేశ విభజన జరిగిన మరుక్షణం నుంచే సరిహద్దు ప్రాంతాలు ఉద్రిక్తతలకు నిలయాలుగా మారాయి. 1947 అక్టోబర్ 22న పాకిస్తాన్ దుష్టబుద్ధితో కాశ్మీర్‌పై దాడికి దిగింది. కాశ్మీర్ సంస్థానాధిపతి మహారాజా హరిసింగ్ తన రాజ్యాన్ని భారత్‌లో విలీనం చేసి, పాకిస్తాన్ నుండి తనకు రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అర్థించాడు. ఈ విషయాలను ఢిల్లీ పెద్దలకు వివరించడానికి నాటి కాశ్మీర్ ప్రధాని మెహర్‌చంద్ మహాజన్ హస్తినకు వచ్చాడు. ముందునుండి ముస్లింలీగ్ పార్టీని చూస్తే ముచ్చెమటలు పట్టే ప్రధాని నెహ్రూ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణ యుద్ధానికి సిద్ధం కాలేకపోయింది. నెహ్రూ తాను కాశ్మీర్ వారసుడినని ఎన్నోసార్లు చెప్పుకొన్నా, ఆ ప్రాంతాన్ని రక్షించేందుకు మాత్రం మీనమేషాలు లెక్కబెట్టారు. మరోప్రక్క కాశ్మీర్‌లో రోజురోజుకూ పరిస్థితులు విషమించసాగాయి. 1947 అక్టోబర్ 24నాటికి పాక్ సైన్యం శ్రీనగర్ సరిహద్దుల్లోకి వచ్చేసింది. నెహ్రూ అవలంబించిన నిర్లక్ష్య వైఖరి, ఉదాసీన భావం కాశ్మీర్ ప్రధానమంత్రి మెహర్‌చంద్ మహాజన్‌కు ఆగ్రహం తెప్పించింది. ‘మీరు వెంటనే కాశ్మీర్ సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టకపోతే నేను లాహోర్ వెళ్లి జిన్నాను కలిసి కాశ్మీర్‌ను పాకిస్తాన్‌లో కలిపే ఏర్పాటు చేస్తాను’ అని అన్నాడు. వెంటనే సర్దార్ పటేల్ ఈ విషయంలో జోక్యం చేసుకొని నెహ్రూను యుద్ధానికి అంగీకరింపజేసి సేవల్ని కాశ్మీర్‌కు తరలించాడు. నెహ్రూ లాంటి బలమైన నాయకుడితో విభేదాలు తెచ్చుకొని, ఆయనను అంగీకరింపజేయడం అంత సామాన్య విషయం కాదు. సర్దార్ పటేల్‌తోపాటు ఈ విషయంలో డా.శ్యాంప్రసాద్ ముఖర్జీ, ఎన్.వి.గాడ్గిల్, సర్దార్ బలదేవ్‌సింగ్‌లు మంత్రులుగా ఉంటూ నెహ్రూను ఒప్పించి దేశరక్షణకు పూనుకొన్నారు. వాళ్ల దృష్టిలో దేశ సార్వభౌమత్వమే ప్రధానం. ఆ తర్వాతే రాజకీయాలు.

జాతి ప్రయోజనాల కోసం నేతాజీ సుభాష్‌చంద్ర బోస్ గాంధీజీని అంగీకరించాడు. దేశం బాగుకోసం నెహ్రూను సర్దార్ పటేల్ తలపై మోశాడు. బంగ్లాదేశ్‌ను విభజిస్తే ఇందిరను వాజపేయి పొగడ్తలతో ముంచెత్తాడు. దేశాన్ని ఎమర్జెన్సీ నుండి కాపాడేందుకు ఆరెస్సెస్ నేతలు, సోషలిస్టులు కలిసి పనిచేశారు. మరి ఇప్పుడో..? రోజుకో ముఖ్యమంత్రి ‘కేంద్రంపై యుద్ధం చేస్తా..’ అని నిర్భీతిగా ప్రకటిస్తున్నాడు. ఈ వైఖరి దేశానికి ప్రమాదకారి అని చెప్పే పార్టీల నేతలు గాని, మీడియా గాని లేకపోవడం దురదృష్టం. ప్రతి రాష్ట్రానికి ఓ కుటుంబ లేదా కుల పార్టీ తయారైంది. వారి స్వార్థ ప్రయోజనాలు, రాజకీయ లబ్ధి, అధికారం కోసం కేంద్రమే దో పరాయి రాజుల చేతుల్లో ఉన్నట్లు భ్రమింపజేస్తున్నారు. మాధ్యమాలను తమ గుప్పెట్లో పెట్టుకొని దుష్ప్రచారమే ఆయుధంగా ప్రజల సెంటిమెంట్లపై స్వారీ చేస్తున్న ఈ అరాచకం ఆగేదెట్లా?

రాజ్యాంగవేత్తలు ఆనాడే ఈ దుష్ట పన్నాగాలను ఊహించి కేంద్రం, రాష్ట్రాల బాధ్యతలను స్పష్టంగా నిర్దేశించారు. సమాఖ్య స్ఫూర్తితో కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం విధులు పంపకం చేసారు. శాసన, పరిపాలన, ఆర్థిక అంశాల చట్రంలో సంబంధాలు కొనసాగుతా యి. మన రాజ్యాంగం తొమ్మిదవ భాగంలో 245- 255 వరకు గల ప్రకరణాలు కేంద్ర, రాష్ట్ర సంబంధాలను స్పష్టంగా పేర్కొన్నాయి. రా జ్యాంగ నిర్మాతలు కేంద్ర జాబితాలో 97 అంశాలను, రాష్ట్ర జాబితాలో 61 అంశాలను, ఉమ్మడి జాబితాలో 52 అంశాలను ఉంచారు. మిగిలిన వాటిని అవశిష్ట అంశాల్లో చేర్చి, దానిపై శాసనాలను చేసే అధికారం పార్లమెంట్‌కు ఇచ్చారు. ఇవన్నీ శాసన సంబంధం కాగా, పరిపాలనా సంబంధంగా ఎవరు ఏ పనిచేయాలనేది రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది. ఇందులో గవర్నర్లు, ఆర్డినెన్సులు, మిలిటరీ, పరిపాలనా విధుల మార్పిడి మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ఆర్థిక అంశాల్లో పన్నులు, సుంకాలు, వాటిని వాడుకొనే విధానంలో వాటాలు, రాష్ట్రాలకు కేంద్రం సహాయం ఇలాంటివి పేర్కొన్నారు. కానీ నేడు కొందరు సీఎంలు పథకాలను తమ స్వంత ధనంతో అమలు చేస్తున్నట్లు మాట్లాడుతూ కేంద్రానికి ప్రజలతో ఉన్న దూరాన్ని మరింత పెంచుతున్నారు.

మారుతున్న పరిస్థితుల దృష్ట్యా సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేయడానికి 9 జూన్ 1983న కేంద్రం జస్టిస్ రంజిత్‌సింగ్ సర్కారియా ఆధ్వర్యంలో ఓ కమిటీ వేస్తే- అది ‘బలమైన కేంద్రం’ ఉండాలని సిఫార్సు చేసింది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2015 జనవరి 1నుండి నీతి ఆయోగ్ (్ఘఆజ్యశ్ఘ నిశఒఆజఆఖఆజ్యశ యచి ఘూశఒచ్యిౄజశ నిశజూజ్ఘ క్య) ఫ్రారంభమైంది. పేదరిక ని ర్మూలన, అసమానతల తొలగింపు, సంస్థాగత అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ దీని ప్రధాన లక్ష్యాలు. ఇటీవల సత్వర నిర్ణయాల కోసం ఏర్పడ్డ నీతి ఆయోగ్‌ను కేంద్ర ప్రభుత్వ ఆధీన సంస్థగా ఎక్స్‌పోజ్ చేస్తూ వివిధ రాష్ట్రాలు కేంద్రంతో, ప్రధానితో ఉన్న రాజకీయ విభేదాలకు, స్వార్థ ప్రయోజనాలకు దీనిపై దుష్ప్రచారం చేస్తున్నాయి.

కేంద్ర స్థాయిలో చేసే నిర్ణయాలను రాష్ట్రాల ద్వారా గ్రామస్థాయి వరకు తీసుకెళ్లే అధికార వికేంద్రీకరణ లక్ష్యం ఇందులో ఉంది. గవర్నర్ కేంద్రం బాధ్యతలను రాజ్యాంగం పరిధిలో చూస్తాడు. భారతదేశాన్ని స్వభావ రీత్యా సమాఖ్యగాను, స్ఫూర్తిలో ఏక కేంద్రంగా రాజ్యాంగం నిలిపింది. ఇటీవల కొన్ని ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు రాజకీయ ప్రయోజనాలే ముఖ్య ఎజెండాగా కేంద్రంపై కయ్యానికి కాలుదువ్వుతున్నాయి.

మన దేశంలో ఎంపీల వ్యవస్థ దిగజారింది. వారిలో చాలామంది ఎమ్మెల్యే అభ్యర్థులపై ఆధారపడి గెలవడం, ప్రజలతో నేరుగా సంబంధాలు నెరపకపోవడం పార్లమెంటరీ వ్యవస్థను దిగజార్చింది. దాదాపు అన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలదే ప్రధాన పాత్ర అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం ఇచ్చే నిధుల గురించి దుర్బుద్ధితో ఎక్కడా ప్రచారం చేయకుండా తమ రాజకీయ ఉనికిని కాపాడుకొంటున్నాయి. భాష, మతం, ప్రాంతం, బడుగువర్గాలు, కు లాల పేరుతో ప్రజలను చీల్చే కుట్రతో కొందరు సీఎంలు తమ ప్రతిపాదనలను కేంద్రానికి పంపించి వాటిని ఢిల్లీలో ఆమోదించడం లేదని చెబు తూ రాజకీయ లబ్ధి పొందుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబులాగా కేంద్రంపై ‘యు ద్ధం చేస్తాం’ అంటున్న నేతలు- వారిపై జిల్లాలు, స్థానిక సంస్థలు అలాగే యుద్ధం ప్రకటిస్తే తట్టుకొంటారా? ఇనే్నళ్లలో ఎ న్నడూలేని పాలనాపరమైన అవరోధం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మాత్ర మే ఇప్పుడు ఎలా వచ్చింది? నా లుగేళ్లు బీజేపీతో అంటకాగిన చంద్రబాబు ఎప్పుడూ గవర్నర్‌ను పనె్నత్తి మాట అనలేదు. తెలంగాణ వచ్చాక కేసీఆర్‌పై ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పక్షపాతం వహిస్తున్నాడని మొ దట్లో అన్నారు. ఓటుకు నో టు కేసు తర్వాత గవర్నర్‌ను విమర్శించడం మానేశారు. ఎన్డీయేతో ‘కటీఫ్’ అయ్యాక గవర్నర్‌పై టీడీపీ నాయకత్వం అవాకులు చవాకులు ప్రేలింది. గవర్నర్‌కు గుళ్లు గోపురాలు తిరగడమే ఎక్కువైందని, అతను ‘కేంద్రం గూఢచారి’ అని విరుచుకుపడింది. ఒకవేళ గవర్నర్ మసీదులకో, చర్చిలకో తిరిగితే ఇలాంటి మాటలు అనగలరా? ఒకప్పుడు గవర్నర్ వ్యవస్థను ఉపయోగించుకొని ఎన్టీఆర్‌ను గద్దెదింపి అధికారంలోకి వచ్చినపుడు ఈ నీతులు ఏ గోతిలో పాతిపెట్టారు? కేంద్రంలో అయినా, రాష్ట్రంలో అయినా తాము అధికారంలో ఉన్నది ధర్మకర్తల రూపంలోనేనని నేతలు గుర్తించాలి. రాష్ట్రాలు కేంద్రంలో అంతర్భాగమే కదా?

ప్రత్యేక హోదా పేరుతో అప్పుడప్పుడు హడావుడి చే స్తున్న నటుడు శివాజీ ఏపీ సీఎంపై ‘ఆపరేషన్ గరుడ’ జరుగుతోందని ఓ రహస్యాన్ని బయటపెట్టాడు. ఆయన ఏ అధికారంతో అలాంటి అసత్య సమాచారం ప్రజల్లోకి వ్యాప్తిచేసాడు? అదే విషయాన్ని సీఎం పేర్కొనడం ఇంకో వి డ్డూరం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మొదట ఇలాంటి అకారణ విద్వేషం ప్రదర్శించి, అనవసర వ్యాఖ్యానాలు చేసి పరువునష్టం కేసులో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో కాళ్లబేరానికి వచ్చాడు. మళ్లీ ఆ కేసు అయిపోగానే ‘కుక్కతోక వంకర’ బుద్ధితో ఢిల్లీలో ధర్నాకు దిగాడు. కోర్టు చివాట్లు పెట్టగానే ధర్నా మానుకొన్నాడు. ఈ దీక్ష మధ్యలో జరిగిన పరిణామమే ఇక్కడ ప్రధానాంశం. నీతి ఆయోగ్ సమావేశానికి అన్ని రాష్ట్రాల సీఎంలు ఢిల్లీ చేరుకొన్నారు. దీక్ష చేస్తున్న కేజ్రీవాల్‌కు కేరళ సీఎం పినరాయ్ విజయన్, కన్నడ సీఎం కుమారస్వామి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఏపీ సీఎం చంద్రబాబు సానుభూతి తెలిపి కేంద్రాన్ని తిట్టిపోసారు. అలా అయితే రాయలసీమ, ఉత్తరాంధ్ర వారు ఇపుడున్న ఆంధ్రా నాయకత్వంతో విభేదిస్తే చంద్రబాబు భరించగలడా? హైకోర్టు విభజన జరిగాక దానిని కర్నూలులో పెట్టగలరా?

రాజకీయ లబ్ధి కోసం ‘కేంద్రంపై సమరం’ అంటే అది మనపై మనం యుద్ధం చేసుకొన్నట్లే. ఉత్తరాదివారు దక్షిణాదివారిపై వివక్ష చూపిస్తారని ఆమధ్య కేంద్రాన్ని విలన్‌గా అభివర్ణించిన చంద్రబాబు మమతా బెనర్జీని ఏ ప్రాంతం వ్యక్తిగా చూస్తాడు? ఒకవేళ మమతను ఈశాన్య తూర్పు ప్రాంత నాయకురాలిగా భావిస్తే- మోదీని వాయవ్య పశ్చిమ భారతదేశ నాయకుడిగా భావించడం కుదరదా? దక్షిణాదిపై కేంద్రం పెత్తనం చేస్తోందంటున్న ఈ నాయకులు కుమారస్వామి ప్రమాణ స్వీకారంలో ఎవరితో వేదిక పంచుకొన్నారు? ఇటలీ జన్మవారసత్వం గల సోనియా గాంధీ ‘సెక్యులర్ గ్యాంగ్’కు నాయకురాలు కాగా లేనిది ఈ గడ్డపై పుట్టిన మోదీకి ప్రధానిగా అంగీకారం ఉండదా? తమిళ వారసత్వానికి నిలువెత్తు నిదర్శనమైన కరుణానిధి కుటుంబం అన్ని కూటముల వాళ్లకు ముద్దయినపుడు రేపు కేంద్రంలో అధికారం వెలగబెడతామని చెబుతున్న ‘పంచకూట కషాయం’ వేదికపై నిలబడి హిందీ భాషను తిట్టగలరా? తమిళం, తెలుగు భాషలను ప్రేమించడం తప్పుకాదు.. కానీ భారతదేశాన్ని కలిపే హిందీపై ద్వేషం సబబా? కిలోమీటర్‌కు ఓ పద్ధతి, సంస్కృతి ఉన్న భారతదేశంలో అందరినీ కలిపి ఉంచే జాతీయ ప్రభుత్వం ఉండాలి. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం జాతిని తాకట్టుపెట్టేందుకు సిద్ధపడడం ఆత్మహత్య సదృశం. భాష, కులం, ప్రాంతం, వర్గం వంటి వైవిధ్యాలు మన సమాజానికి దగ్గరగా ఉండడంతో వాటిని మెట్లుగా చేసుకొని గద్దెపైకి ఎక్కడం సు లభం కావచ్చు. కానీ ఆ విద్యలనే అధికారం దక్కించుకునేందుకు ప్రదర్శిస్తే- ‘యుద్ధం’ చేస్తామంటున్న వారికి భంగపాటు తప్పదు.. అది స్వయంకృతాపరాధమే అవుతుంది.. తస్మాత్ జాగ్రత్త!

***********************************************

డాక్టర్. పి. భాస్కర యోగి 
Published  : Andhrabhoomi 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి