‘యోగం’ అంటే ఆసన ప్రాణాయామాలేనా? 



‘యోగం’అనే మాటకు ‘కలయిక’ అని అర్థం. జీవాత్మ ఫరమాత్మతో కలిసే ప్రక్రియనే యోగం అంటారు అని యాజ్ఞవల్కుడు మొ.న మహర్షులు తెలిపారు. జీవాత్మ తనకున్న జీవలక్షణాన్ని వదలిపెట్టి పరమాత్మతో ఐక్యం చెందే మహోన్నత స్థితి చేరడమే యోగం.

సాధనలన్నింటిలో అత్యున్నత స్థానంగా యోగసాధన చెప్పారు మన మహర్షులు. ఎన్నో వికారాలతో కూడిన మనస్సును సాధన ద్వారా లొంగదీసి, చిత్తమాలిన్యాలను తొలగించి ఆత్మస్వరూపానందం పొందడమే యోగం. అయితే ‘యోగం’అనే మాటకు ఆసన, ప్రాణాయామాలు అనే కొత్త అర్థం మాత్రమే ఈనాడు స్థిరపడిపోయింది. ఆసన, ప్రాణాయామాలను కూడా వ్యాపార వస్తువుగామార్చి, క్లబ్బుల్లో సాధనంచేసే స్థితికి తెచ్చిన ‘వ్యాపార ఆసన యోగులు’ దీనికి కారణం.

యోగం ప్రదానమైనది కాగా, ఆ యోగానికి ఎనిమిది అష్టాంగాలు ఉన్నవి అవి 1. యమ, 2. నియమ, 3. ఆసన, 4. ప్రాణాయామ, 5. ప్రత్యాహార, 6. ధ్యాన, 7. ధారణ, 8. సమాధి ఈ యోగాంగాలు పతంజలి, యాజ్ఞవల్కుడు, ఘేరండ, శివసహింతలు, హఠయోగ ప్రదీపిక చెప్పినా, ఇవి నేర్చుకోవడంలో లేదా సాధన చేయడంలో గొప్ప ప్రయోజనం ఉంది. మానవుడు శరీరంద్వారా యోగ సాధనచేసి భగవంతుణ్ణి పొందాలి. అదే ‘యోగం’అన్నాం. 

ఆత్మపరమాత్మోసాసన చేయాలన్నా, శరీరమే దానికి సాధనం. శరీరంతో సాధన చేయాలంటే ఆ శరీరాన్ని స్థిరంచేసి, దాన్ని ఆశ్రయించి ఉన్న మనస్సును నిశ్చలం చేయాలంటే దానికి మొదట సాధన కావాలి. అందుకే యోగసాధనకన్నా ముందు అష్టాంగయోగం ప్రవేశపెట్టారు. ఋషులు, యమ, నియమాలు మనిషిలో వ్యక్తిత్వాన్ని కలిగించి శరీరాన్ని సాధనకొరకు లొంగదీస్తాయి. ముఖ్యంగా ప్రాణాయామం శరీరాన్ని సాధనకొరకు లొంగదీస్తాయి. ముఖ్యంగా ప్రాణాయామం ప్రాణశక్తిని ఇచ్చి, లోపల ఉన్న శరీరక మాలిన్యాలను బయటకు పంపిస్తుంది. తద్వారా నాడీ శుద్ధి, శరీరశుద్ధి జరిగి తర్వాత చేసే సాధనకు మనస్సును, చిత్తాన్ని స్వాధీనపరచి సిద్ధంచేస్తుంది. ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి-అనే అంగాలు వ్యక్తిలో ఆత్మోన్నతికి కావల్సిన లక్షణాలు అందిస్తాయి. ఈ సాధన పరమప్రయోజనం వదిలిపెట్టి కేవలం ఆరోగ్యంకోసం ఆసన, ప్రాణాయామాలు సాధనచేస్తూ, దానికే ‘యోగా’అన్న పేరుపెట్టి కార్పోరేటీకరణ చేస్తున్నాం. 

ఋష్యాశ్రమాల్లో, యోగపీఠాల్లో ఉచితంగా నేర్చుకోవాల్సిన యోగం వ్యాపార వస్తువుగా మారడం ఆందోళనకరమైన అంశం.

మన సంప్రదాయంలో ఆధ్యాత్మిక గ్రంథాలు, విద్యలు తప్ప భౌతికంగా మానవుణ్ణి అభివృద్ధిచేసే విజ్ఞానం లేదా?

భారతీయ సంస్కృతికి ఊతంఇచ్చే ప్రతి శాస్త్రం, ప్రతి కావ్యం ఓ ప్రత్యేకత కలిగి ఉంది. మనిషి యొక్క భౌతిక శరీరంకన్నా మానసిక తత్త్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయి శాస్త్రాలు. మానవుని సమస్త కర్మలకు మూలం మనస్సు, ఆ మనస్సును కట్టడిచేసే సాధకాలుగా శాస్త్రాలను తీర్చిదిద్దారు ఋషులు. 

అట్లాగని పూర్తిగా భౌతికాన్ని వదలిపెట్టలేదు. భౌతికదృష్టి అంతరదృష్టిని సమన్వయం చేసి చూపిన ఋషులు, ఈ రెండింటిని సమపాళ్ళలో మనకు అందించారు. మనిషికి ఆకలి శరీరంలోపల పుడుతుంది. కాని బయటినుండి ఆహారం అందితేనే ఆకలి శాంతిస్తుంది. కాబట్టి బయట, లోపల సమన్వయం సాధించడమే భారతీయ సంస్కృతి ముఖ్యలక్షణం లక్ష్యం.

భౌతికంగా మానవునికి అవసరమయ్యే విజ్ఞానంపై ప్రపంచం కళ్లు తెరవక ముందే ఋషులు పరిశోధించారు. నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, భూమి-ఈ పంచభూతాలపై వేదవిజ్ఞానం ఎంతో పరిశోధించింది. భరద్వాజ వైమానిక శాస్త్రం, ఆయుర్వేదం, చతుష్యష్టికళలు, శరీర విజ్ఞానశాస్త్రం, మనస్తత్వ శాస్త్రం ఇలా ఎన్నో విషయాలు ఆనాటి పరిస్థితులనుబట్టి, అందుబాటులోని సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని సిద్ధంచేసినా నేటి దృష్టికి అవి ఆనకపోవచ్చు. అంతమాత్రాన ప్రాచీనులకు విజ్ఞానం తెలియదు అనవద్దు. పాశ్చాత్యులు ఈనాడు సాధిస్తున్న ఫలితాలు ఒకేరోచు మొత్తం సాధించినవికావు. క్రమక్రమంగా అవసరాలనుబట్టి ఒక్కొక్కటి ఆవిష్కరించారన్న విషయం మనకు తెలియదు.

వ్యక్తిని భౌతిక దృష్టినుండి ప్రక్కకు మరల్చి వానిలో సంస్కారం, నైతిక ప్రవర్తన, ధర్మబుద్ధి ప్రవేశపెట్టాలని ఋషుల సంకల్పం. ఎప్పుడైతే పూర్తి భౌతక దృష్టితో మానవుడు జీవిస్తాడో నైతికపతనం జరిగిపోతుంది.

నైతికంగా పతనమై మనిషిని ఆటవస్తువులా మార్చే సంస్కృతి ఉన్నచాలా జాతులు ఈరోజు ఎన్నిరకాల ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయో మనకు తెలియదా! నైతిక పతనం లేకుండా విలువలున్న వ్యక్తులుగా భారతీయులకు పేరున్న విషయం మరచిపోవద్దు. వ్యక్తిగత స్వార్థం లేకుండా ‘జగద్దితంబు’ మన శాస్త్రాలకు, కావ్యాలకు మూలం అన్న విషయం విస్మరించకూడదు.

- ఇంకావుంది...


*****************************************
✍ డాక్టర్‌. పి. భాస్కర యోగి
ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ
ॐ మంగళవారం 卐 జూన్ 26 卐 2018 ॐ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి