ఓంకారాన్ని పరబ్రహ్మకు పేరుగా శాస్ర్తాలు పేర్కొన్నాయి. ఆ ఓంకారం నుండి ఉద్భవించిన సృష్టి నిర్వహణ బాధ్యులు త్రిమూర్తులు. అందులో లయకారుడు శివుడు. సృష్టి గమన నిర్గమనాలకు కారణభూతుడు. అలాంటి శివుణ్ణి సగుణమూర్తిగా శివరూపంలో, నిర్గుణమూర్తిగా లింగ రూపంలో ఆరాధిస్తాం. సాకార నిరాకారాల సమన్వయమూర్తి శివుడు. లింగార్చన మోక్షప్రదమైతే విగ్రహారాధన భోగప్రదం. శివుడు కళాతీతుడు, అందువల్లనే నిరాకారుడయ్యాడు. ఇది నిరూపించడానికే లింగస్వరూపంగా కన్పిస్తాడు. ఆ నిరాకారతత్వం ఓంకారం. అది నాదరూపం, సృష్టియందున్న ప్రతి వస్తువులోని శబ్దబ్రహ్మం అదే. ప్రతి వస్తువులోని శక్తీ ఆ నాదంలో అంతర్భాగమే.

నాదాత్మకమైన శక్తి స్వరూపమే అర్ధనారీశ్వర స్వరూపం. ప్రతి మనిషీ కష్ట సుఖాలను, భిన్న తత్వపోరాటాన్ని, అతీంద్రియ ప్రవృత్తిని, అలౌకిక దృష్టిని సమదృష్టితో పొందాలని చెప్పే ద్వంద్వాతీత భావన శివయోగం. శివుడు త్రినేత్రుడు. సూర్య, చంద్ర, అగ్నులను నేత్రాలుగా కలిగి ఉన్నాడని చెప్తారు. ఇవి కాల సూచకమైనవి. భూత, భవిష్యత్‌, వర్తమాన శక్తి ఆయన విరాట్‌ స్వరూపంలో ఉందని అర్థం. ఇది శివుని సర్వజ్ఞత్వాన్ని నిరూపిస్తుంది. అలాగే శివుడు శూలాన్ని ఆయుధంగా ధరిస్తాడు. త్రికాలాలు ఆయన వశంలో ఉండడంవల్ల శివస్వరూపం త్రికాలజ్ఞత్వం అన్నారు.

శివుడి వాహనం నందీశ్వరుడు. శివుడు దేవుడు. అతని ముందున్న నంది పశువు. అది జీవుడికి సంకేతం. జీవుడెప్పుడూ దేవుడిని చూస్తూ ఉండాలని శాస్త్ర నిర్దేశం. అందుకే శివుడికి, నందికి మధ్య నుంచి నడవరాదంటారు. శివారాధన కోసం చేసే యోగం ఆటంకపడవద్దనే సూచన ఇది. నందికి నాలుగు కాళ్లు. అవి సత్య, శౌచ, దయ, ధర్మ అనే సుగుణాలు. ఈ వృషభం ధర్మ స్వరూపం. ధర్మదేవత సరిగ్గా నడవాలంటే ఈ సుగుణాలు కావాలి. శివుడు ధర్మదేవతను వాహనంగా చేసుకొన్నాడని అర్థం.

శివుని జటాజూటంలో చంద్రుడిని ధరిస్తాడు. చంద్రుడు వెన్నెల వెదజల్లినట్లే ఆ చంద్రశేఖరుడు జ్ఞాన సుధలను వెదజల్లుతాడు. శివుడు గజచర్మధారి. ఏనుగు మందంగా నడుస్తుంది. అది తమోగుణ ప్రతీక. ఆ తమస్సును తన స్వాధీనంలోకి తీసుకొని దానికి అతీతంగా జీవించాలని చెప్పేందుకు సంకేతం. శివుడు భస్మధారి. దుర్వృత్తులను అగ్నిలో కాల్చి త్రిపుండ్రంగా భస్మం ధరించడం, త్రిమూర్తులను, గణేశ, కుమారస్వాముల జీవనాన్ని ఫాలభాగంపై అలంకరించడమే. గంగను తన జటాజూటంలో బంధించడం పరుగులెత్తే మనోప్రవృత్తులకు అడ్డుకట్ట వేయడమే. ఇలా శివుడు ప్రతితత్వం వెనుక ఉన్న ప్రతీకాత్మకతను దర్శిస్తే అవన్నీ సాధకుల మనోమాలిన్యాలను భస్మీపటలం చేస్తాయి. శివమూర్తిని కేవలం ఒక దేవతగా భావిస్తే అది బాహ్య సాధనే అవుతుందిగానీ అంతఃసాధన కానేరదు.


**********************************************
      డాక్టర్‌. పి. భాస్కర యోగి
      ॐ ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన ॐ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి