రాజకీయం రాయిలా జీవం లేనిధి.. కానీ- రాయి పువ్వును నాశనం చేస్తుంది. పువ్వు ప్రతిఘటించడం చేతగానిది’ అని ఓ మహాత్ముడన్నాడు. వాజపేయి కాలం నాడు భాజపా ఓ కమలం పువ్వు మాత్రమే. ఇప్పుడు ఆ పువ్వుకు రక్షణగా రెండు గట్టి ముల్లులు ఉన్నాయి. ఆ రోజు వాజపేయి, అద్వానీలను మతతత్వ వాదులని కొందరు విపక్ష నేతలు నిందించారు. ఇప్పుడు భాజపాలో నరేంద్ర మోదీ, అమిత్ షాలు గొప్పవారని ఆనాటి వృద్ధనేతలు పొగుడుతున్నారు. తొలి ప్రధాని నెహ్రూ నుండి మన్మోహన్ సింగ్ వరకు అందరితో వాజపేయి మన్నన పొందినవాడే. ప్రతిపక్షాలతో పొగిడించుకున్నవాడే.. కానీ ఆయన హయాంలో భాజపా ఇంతగా ఎదగలేదు.

ఈ రోజు రాజకీయం మారింది. 1984కు ముందు 2 ఎంపీ సీట్లున్న భాజపా ఇప్పుడు 21 రాష్ట్రాల్లో విస్తరించి పక్కా రాజకీయ పార్టీగా ఎదిగింది. దానికి సిద్ధాంతపరమైన వ్యూహాత్మక రాజకీయం ఉంది. ఈ విషయం తెలుసుకోకుండా తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అకారణ శత్రుత్వం ప్రదర్శిస్తున్నాడు. వాజపేయిలా వెనక్కి వచ్చి కౌగిలించుకొని, ప్రేమతో గెలుచుకొంటారని మోదీ, షాలను గురించి చంద్రబాబు ఆశపడితే అది అత్యాశే అవుతుంది. రాజకీయ బెదిరింపులు, హుంకారాలు, దుష్ప్రచారం, నిత్యం నిందలు వేస్తూ తిట్టడం వంటి చర్యలతో మోదీ, షాలను లొంగదీసుకోవాలని చంద్రబాబు భావిస్తే పప్పులో కాలు వేసినట్లే!

‘రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు’ అనేది ఓ దిక్కుమాలిన సిద్ధాంతం. ఇది అవకాశవాద రాజకీయాలను ప్రోత్సహించేందుకు, కొందరు చేసే రాజకీయ వ్యభిచారం సరైందే అని సమర్థించుకోవడం కోసం తయారుచేసిన దివ్యౌషధం. ఈ సిద్ధాంతం ఎప్పుడూ నిజమని భ్రమపడి కాబోలు చంద్రబాబు, ఆయన అనుచరులు గత కొద్ది వారాలుగా మోదీని, కేంద్రాన్ని అదేపనిగా తిట్టిపోస్తున్నారు. నిత్యం అనేక టీవీ చానళ్లు ఇదే అంశంపై చర్చోపచర్చలు చేస్తున్నాయి. ఆఖరుకు మీడియాను కూడా ‘కులం’ కోణంలో చూసే దుస్థితి వచ్చేసింది. ఏపీకి ‘ప్రత్యేక హోదా’ విషయంలో మోదీ అన్యాయం చేసినట్లు విజ్ఞత మరచిన చంద్రబాబు విద్వేషం వెళ్లగక్కడం సబబేనా? ఎన్నికల హామీలు ఎందుకు అమలు చేయలేదని ‘జనసేన’ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మితిమీరిన ద్వేషం ప్రదర్శిస్తే చంద్రబాబు సహిస్తాడా? దేశంలో ఏ రాజకీయ పార్టీగాని, విపక్ష నేతలు గాని ఈ స్థాయిలో మోదీపై వ్యక్తిగత విద్వేషం ప్రదర్శించలేదు. దీనికితోడు కొన్ని టీవీ చానళ్లు టిఆర్‌పి రేటింగ్స్ కోసమో, కులాభిమానంతోనో ప్రాంతీయ దురభిమానాన్ని నూరిపోస్తున్నాయి. తెలంగాణ ఉద్యమకాలంలో ఆందోళనకారులు ఇంతటి తీవ్రతను ప్రదర్శించి ఉంటే రాష్ట్రం భగ్గున మండేది కాదా? కాబట్టి రాజకీయాలు సిద్ధాంతం ఆధారంగా, అభివృద్ధి సూచకంగా ఉండాలే తప్ప- ఇలా విద్వేష పూరితంగా కొనసాగితే భావితరాలు మనల్ని క్షమించవు.

ఉత్తర భారతదేశంలో బలమైన నేతలైన ములాయం, శరద్‌పవార్‌లు కూడా మోదీని సిద్ధాంతపరంగా వ్యతిరేకించినా, వ్యక్తిగతంగా ఎన్నోసార్లు ఆప్యాయతగా పలకరించుకొన్నారు. మోదీని ఎంతో ద్వేషించే మమతా బెనర్జి ఈమధ్య ఆయన కోల్‌కత వెళ్తే ఎంతో బాగా పలకరించి, గౌరవించింది. దిల్లీ సీఎం కేజ్రీవాల్ తర్వాత మోదీపై ఇంతలా వ్యక్తిగత దూషణలకు దిగింది చంద్రబాబే కావడం గమనార్హం.

1999లో వాజపేయి ప్రభుత్వానికి తగినంత బలం లేదు. ఆనాడు తెదేపాకు ఉన్న 30 మంది ఎంపీలు భాజపా సంకీర్ణానికి మద్దతు ఇవ్వడం పెద్ద గొప్ప. అప్పుడు ప్రమోద్ మహాజన్ వంటి కొద్దిమంది నేతలే భాజపాలో వ్యూహాత్మకంగా రాజకీయం చేసేవారు. వాజపేయి కాలం నాటి భాజపా నేతలు సత్త్వ సంపన్నులు కాబట్టి చంద్రబాబు ఎలా అంటే అలా సాగేది. అపుడు చంద్రబాబు ఉమ్మడి ఏపీలో ముఖ్య నాయకుడు. అటు పిమ్మట పరిస్థితులు మారిపోయాయి. 

గుజరాత్ అల్లర్ల తర్వాత ఇక్కడి కాంగ్రెస్‌కు మైలేజ్ దక్కవద్దని అత్యుత్సహంతో మోదీని తొలగించమని బాబు ఆర్డరేశాడు. కానీ బిజెపి పట్టించుకోలేదు. ఆ నెపంతో బయటకు వచ్చి 2004లో వైఎస్ చేతిలో ఘోర పరాజయం మూటగట్టుకొని, రాష్ట్ర విభజన జరిగే వరకూ ఆయన అధికారానికి దూరంగా ఉన్నాడు. 1999లో, 2014లో భాజపాతో కలిసినపుడే చంద్రబాబు అధికారం పొందాడన్న విషయం విస్మరించకూడదు. 2009లో వామపక్షాలు, తెరాసలతో కలిసి పోటీ చేసి ఎలాంటి అనుభవం పొందాడో ఆయనే చెప్పాలి. 

ఉమ్మడి రాష్ట్రంలో ఎగసిపడ్డ తెలంగాణ ఉద్యమం బాబును, తెదేపాను ఎముకల గూడుగా మార్చింది. రాష్ట్ర విభజన చివరి నిమిషంలో ‘తెలుగు ఆత్మగౌరవం’ అనే నినాదాన్ని తెదేపా అందుకొంది.

2014లో మోదీ హవా చూసి వెంకయ్య నాయుడును అడ్డుపెట్టుకొని భాజపాకు చంద్రబాబు దగ్గరయ్యాడు. గుజరాత్ అల్లర్ల తర్వాత తన వివరణ ఇచ్చుకోవడానికి మోదీ ప్రయత్నించినా బాబు పట్టించుకోలేదు. అయినా ఆ చేదు అనుభవాన్ని మోదీ మరచిపోయి బాబుకు స్నేహహస్తం అందించాడు. ‘ప్రపంచానికే మోదీ అధినేత’ అని గత నాలుగేళ్లలో నలభైసార్లు పొగిడిన చంద్రబాబు- ఎన్నికలు సమీపిస్తుండడంతో తన పూర్వ బుద్ధిని ప్రదర్శించి ఎన్డీఎ నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించాడు. ఆ నిర్ణయం ప్రకటించిన మరుసటి రోజు నుంచి రాష్ట్ర పాలనను సైతం పక్కన పెట్టి, మోదీని, భాజపాను తిట్టడానికే చంద్రబాబు తన పూర్తి సమయం కేటాయించడం విడ్డూరం. అంశాల వారీగా విమర్శలు చేయడానికి బదులు, మోదీని ‘విలన్’ను చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విద్వేషం హద్దులు మీరడం ప్రజాస్వామ్య ప్రియులను కలవరపరుస్తోంది.

మోదీపై ఈ దేశంలో చాలామందికి వ్యతిరేకత ఉంది. ఫరూఖ్ అబ్దుల్లా, శరద్ యాదవ్, కేజ్రీవాల్, మమత, సోనియా, రాహుల్ గాంధీ, ములాయం, లాలూ, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, దేవెగౌడ, కరుణానిధి లాంటి రాజకీయ నాయకులే కాదు, సిద్ధాంతపరంగా వామపక్షవాదులు, సూడో సెక్యులర్ మేధావులు.. ఇలా చాలామందికి మోదీ ఉమ్మడి శత్రువు. వీళ్లంతా సిద్ధాంతపరంగానే విమర్శిస్తారు. కానీ, ప్రధాని స్థా యిని కూడా గౌరవించకుండా వ్యక్తిగత విద్వేషం కుమ్మరిస్తున్న చంద్రబాబు తాను సైతం రాజకీయాల్లో ఉన్నానన్న వాస్తవాన్ని విస్మరించడం విడ్డూరం. తన బావమరిది, వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ మోదీని అనరాని మాటలన్నా బాబు నిలువరించలేదు. అలాగే తెదేపా నాయకులు, మంత్రులు, ఆంధ్ర ప్రాంత పరిరక్షక మేధావులు, కొందరు సినీనటులు విద్వేషాగ్నికి ఆజ్యం పోస్తున్నారు. ఈ ధోరణి ప్రస్తుతం ఆనందం కలిగించినా, భవిష్యత్‌లో అశనిపాతం అవుతుంది.

తెలంగాణ ఉద్యమం చివరి దశలో కొందరు మేధావులు, స్వార్థ నాయకులు ఇలాగే ఆంధ్ర ప్రాంత ప్రజలను రెచ్చగొట్టారు. దానివల్ల తెలంగాణ ఉద్యమం మరింత బలోపేతమయ్యింది. ఆనాడు వీరంతా కేసీఆర్‌ను బూచిగా చూపించి, నిందలు వేస్తే అతను ఇవాళ ఆకాశమంత ఎత్తు ఎదిగాడు. ఇపుడు మోదీపై కూడా ఇలాంటి అకారణ ద్వేషానే్న ప్రదర్శిస్తున్నారు. 

చంద్రబాబు రాజకీయాల్లో ఉత్థాన పతనాలు చాలా ఉన్నాయి. ఇక, చంద్రబాబు ఢిల్లీలో ‘చక్రం తిప్పి’ దేశానికి అందించిన ప్రధానులు దేవెగౌడ, గుజ్రాల్ పెద్ద మెరుపుతునకలేం కాదు. ఆ ఆపద్ధర్మ ప్రభుత్వాల వల్ల దేశానికి ఒరిగిందేమీ లేదు. రాష్ట్ర విజభన వద్దని బాబు వ్యూహాలు పన్నితే, అదే పాఠశాలలో పిహెచ్‌డి చేసిన కేసీఆర్ అవలీలగా వాటిని ఎదుర్కొని నిలబడ్డాడు. విభజన తర్వాత పదేళ్లు హైదరాబాద్‌లో ఉంటూ రాజకీయాలు చేయాలనుకున్న బాబును ఒక్క ఏడాదిలోనే అమరావతి మార్గం పట్టించాడు కేసీఆర్.

2014 ఎన్నికల్లో చంద్రబాబుకు ఆక్సిజన్ ఇచ్చి భాజపా ముందుకు నడిపించింది. అది నైతిక మద్దతే అన్నది నిజం. రాష్ట్ర విభజన జరిగాక- కాంగ్రెస్‌ను ద్వేషించి ‘విలన్’గా చూపించి తేదేపా అధినేత అధికారంలోకి వచ్చాడో ఇపుడు మోదీని, భాజపాను అలాగే ద్వేషిస్తున్నాడు. అమరావతి, పోలవరం, రైల్వే జోన్, కృష్ణపట్నం పోర్ట్ వంటి అంశాలపై రోజూ కేంద్రాన్ని దుమ్మెత్తి పోయడం తప్ప- కేంద్రం ఇచ్చిన నిధుల గురించి చంద్రబాబు చెప్పడం లేదు. ఏపీ రాజధానికి అనువైన ప్రాంతాన్ని గుర్తించేందుకు కేంద్రం ఏర్పరచిన శివరామకృష్ణన్ నివేదికను శాసనసభలోగాని, అఖిలపక్షంలోగాని, మంత్రివర్గంలో గాని విస్తృత చర్చ జరుపకుండా మాయం చేశారు. చంద్రబాబు తన సొంత మనుషులతో ఓ కమిటీ వేసి కృష్ణ-గుంటూరు మధ్య రాజధానిని నిర్ణయించేశారు. 

శివరామకృష్ణన్ కమిటీ సూచనలకు విరుద్ధంగా ఓ ప్రాంతాన్ని ఎంపిక చేసి వేలాది ఎకరాల పంట పొలాలను రైతుల నుంచి తీసుకున్నారు. విచక్షణ లేకుండా- ఓ రియల్ ఎస్టేట్ సంస్థ లే అవుట్ వేసినట్టు రాజధాని నిర్మాణంపై బాబు ప్రభుత్వం మాయోపాయం పన్నడమే కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య పొరపొచ్చాలకు ప్రధాన కారణం.

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం కేంద్రం బాధ్యతే అయినా తనకే పేరు రావాలని చంద్రబాబు ఆ ప్రాజెక్టును నెత్తిన ఎత్తుకొన్నాడు. 2010-11 గణాంకాల ప్రకారం పోలవరానికి 16 వేల కోట్ల అంచనా వ్యయాన్ని ఇటీవల 58 వేల కోట్లకు పెంచారు. పోలవరం కాల్వల నిర్మాణం వైఎస్ హయాంలోనే దాదాపు పూర్తయింది. కాఫర్ డ్యాం ఎత్తును 31 మీటర్ల ఎత్తునుండి 42 మీటర్లకు పెంచి కేంద్రాన్ని తికమకపెట్టారు. 

రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్ సంస్థను పోలవరం పనుల నుండి దూరం పెట్టాలనుకొంటే కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీకి ఫిర్యాదు చేసి కాఫర్ డామ్ కథను కంచికి చేర్పించాడు. ఇదంతా చిరాకు తెప్పించడంతో చంద్రబాబు భాజపాకు ఎదురుతిరిగి రోజుకో క్రొత్త పద్ధతిలో నిరసన చేస్తున్నాడు. దక్షిణాదిపై ఉత్తరాది ఆధిపత్యం, తెలుగు జాతి ఆత్మగౌరవం, మోదీ-షాల అహంకారం, ప్రాంతీయ పార్టీలపై అణచివేత, గవర్నర్ వ్యవస్థ రద్దు, తిరుమలపై కేంద్ర ప్రభుత్వం కన్ను, ఐటీ దాడులు, పవన్-జగన్‌లను ఉసిగొల్పడం, మోదీతో వైకాపా నేతల స్నేహం... ఇలా రోజుకో అంశంపై కేంద్రంపై చంద్రబాబు కయ్యానికి కాలుదువ్వుతున్నారు. కేంద్రంలోనూ రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం ఉందన్న విషయం విస్మరించి, ఇలా మితిమీరిన ద్వేషం ప్రదర్శించడం- కొత్త రాజకీయాలను తెరపైకి తెచ్చేందుకు సంకేతమే!

****************************************************

డాక్టర్. పి. భాస్కర యోగి 
Published  Andhrabhoomi :

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి