అది 1930-31 కాలంలో జరిగిన సంఘటన. నాగపూర్‌కు చెందిన బచ్‌రాజ్ వ్యాస్ అనే విద్యార్థి ఆర్‌ఎస్‌ఎస్ శిక్షణ శిబిరానికి వెళ్లాలనుకొన్నాడు. ఆ కుర్రాడిది బ్రాహ్మణ కుటుంబం. బయట భోజనం చేయకూడదనే ఆంక్షలు వాళ్లింట్లో ఉండేవి. వ్యాస్ ఎలాగైనా శిబిరంలో పాల్గొనాలనే ఉబలాటంతో తన ఇంట్లో నియమాన్ని సంఘ్ వ్యవస్థాపకులు డా హేడ్గేవార్‌తో చెప్పుకొన్నాడు. అది విన్న డాక్టర్జీ అతని రాకకు ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా శిబారినికి అనుమతించాడు. శిబిరం ప్రారంభమయ్యాక బచ్‌రాజ్ తన స్వహస్తాలతో భోజనం వండుకొని ఒంటరిగా ఓ మూల కూర్చొని భోజనం చేస్తున్నాడు. మొదటి పూట ఎలాగో భోజనం అయ్యింది. అక్కడి యువకులంతా కలివిడిగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నట్లే భోజనం వండేస్తున్నారు. కలిసి కూర్చూని తింటూ ఛలోక్తులతో, ఆనందంగా శిక్షణ పొందుతున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన వ్యాస్ కళ్లు చెమ్మగిల్లాయి. ‘అందరూ ఆనందంగా భోజనం చేస్తుంటే నేను ఒంటరినయ్యాను కదా’ అని చింతించాడు. తన పొరపాటుకు చింతించి రెండవ పూట అందరితో కలిసి భోజనం చేశాడు. ఎవరికి వారు మారే విధంగా ప్రశాంతంగా ‘మార్పు’కు అవకాశం ఇచ్చారు డాక్టర్జీ. ఆ తర్వాతి కాలంలో ఈ బచ్‌రాజ్ వ్యాస్ జనసంఘ్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. డాక్టర్జీ మార్పును ఎంత ప్రశాంతంగా, గంభీరంగా చేస్తారో బచ్‌రాజ్ ఈ సంఘటనను ఉదాహరించి స్వయంగా చెప్పుకొన్నారు.
‘వృత్తపత్రమే నామ ఛపేగా పహనూంగా స్వాగత సుమహార్- ఛోడ చలో యాహ క్షుద్ర భావనా హిందూ రాష్టక్రే తారణ్‌హార్’- ఓ హిందూ రాష్ట్రాన్ని తరింపజేయడానికి బయలుదేరిన సాహసీ! పత్రికల్లో నీ పేరు కన్పించాలని, స్వాగత సుమ హారాలను మెడలో ధరిస్తాననే క్షుద్రభావన నుండి బయటకు రా! ఈ రాష్ట్ర సౌధానికి పునాదిరాళ్లుగా, అజ్ఞాతంగా మనం ఎవరికీ తెలియకుండా ఈ భువన భారాన్ని మోయాలి. అని ఎందరినో సిద్ధం చేశారు డాక్టర్జీ. 1925 సంవత్సరంలో విజయదశమి నాడు పది, పనె్నండేళ్ల వయసున్న కొద్దిమంది పిల్లలతో ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ’ను హెడ్గేవార్ స్థాపించారు. అది ఈనాడు వటవృక్షంగా మారింది. అత్యంత క్రమశిక్షణగల లక్షలాదిమంది కార్యకర్తలను తయారుచేసి ఈ దేశంలో జాతీయ భావాన్ని నిలబెట్టింది. స్థాపించిన ఎనిమిదేళ్లకే అంటే- 1933 నాటికి 100 శాఖలు, 10వేల మంది స్వయం సేవకులు సిద్ధమయ్యారు. ఈ రోజు దేశానికి రాష్టప్రతిని, ప్రధానిని అం దించే స్థితికి ఎదిగింది. అలాంటి సంస్థ జూన్ 7వ తేదీన నాగపూర్ ప్రధాన కార్యాలయంలో తృతీయ వర్ష శిక్షావర్గను పూర్తిచేసుకొన్న 709 మంది కార్యకర్తలను ఉద్దేశించి మాజీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ సందేశం ఇవ్వనున్నారనే విషయం ఈ రోజు పెద్ద చర్చగా మారింది.

ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీని, భాజపాను విమర్శించాలనుకొన్నపుడల్లా ఆరెస్సెస్‌ను కూడా కలిపి తిడుతున్నాడు. ఆ సంస్థను ఓ నియంతృత్వ మనస్తత్వం ఉన్నట్లుగా దూషిస్తున్నాడు. ఆఖరుకు తమిళనాడులోని తూత్తుకుడిలో స్టెరెలైట్ ఫ్యాక్టరీని మూసివేయాలన్న స్థానికుల ఆందోళన సందర్భంగా ప్రాణనష్టం జరిగినపుడు- రాహుల్ ట్వీట్ చేస్తూ ‘ఆరెస్సెస్ మాట విననివాళ్లని ఇలాగే అణచేస్తారు’ అన్నారు. ఆరెస్సెస్‌కూ, తూత్తుకుడిలో ఆందోళనకు ముడిపెట్టడం ‘మోకాలుకూ బోడిగుండుకూ లంకెపెట్టడం’ లాంటిదే. ‘సెక్యులర్’ పార్టీలకు ప్రతినిధులమని చెప్పుకునే నేతలు ఆరెస్సెస్‌ను నిందించి ఇతర మతాల మెప్పు పొందాలనుకుంటారు. ఈ నేపథ్యంలో మాజీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ నాగపూర్ వెళ్లడం కొందరికి సుతరామూ ఇష్టం లేదు. ఆ జీవన పర్యంతం కాంగ్రెస్ పార్టీలో నిబద్ధుడిగా, దేశభక్తుడిగా, ఆర్థిక మంత్రిగా, వివాద రహిత రాష్టప్రతిగా ప్రణబ్ పేరు తెచ్చుకొన్నారు. దేశభక్తిలో ప్రపంచంలోనే పేరుపొందిన జాతీయవాద సంస్థ కార్యక్రమానికి ప్రణబ్ ముఖ్య అతిథిగా వెళ్లాలనుకుంటే ఇతరులకు అభ్యంతరాలెందుకు?

సూడో సెక్యులర్ పార్టీల నాయకులెందరో ఎన్నో సార్లు తీవ్రవాదులకు సహాయం చేయడం, వాళ్ల ఇళ్లల్లోకి వెళ్లి ఓదార్చడం చూసాం. వేర్పాటువాదుల ఇళ్లముందు కాశ్మీర్‌లో సీతారాం ఏచూరి కమ్యూనిస్టు నాయకుడు పడిగాపులు కాసి, బ్రతిమాలింది మనకు తెలుసు. తీవ్రవాదులకు సంతాప సభలు జరిపేవారు. దేశద్రోహులను ఉరితీయొద్దని క్రొవ్వొత్తులు వెలిగించి, ర్యాలీలు తీసినపుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు?

ప్రముఖులెందరో ఆరెస్సెస్ శిబిరాలను సందర్శించి, ప్రశంసించారు. 1934 మధ్యలో ఏర్పాటైన శీతాకాలపు శిబిరానికి గాంధీజీ అనుకోని అతిథి. ఈ శిబిరం వార్థా నుండి శేగాల్ వెళ్ళే మార్గంలో జరిగింది. అక్కడికి సమీపంలోని ఓ చిన్న బంగ్లాలో గాంధీజీ బస చేశారు. ఆ ప్రాంతంలో హడావుడిని గమనించి ‘ఇక్కడేమైనా సమావేశం జరుగుతుందా? అని బజాజ్‌ను ప్రశ్నిస్తే, ‘ఇది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శిక్షణా శిబిరం’ అన్నాడు. దీని ఖర్చు ఎవరు భరిస్తారు? అన్నాడు గాంధీజీ. బహుశా! ఎవరి ఖర్చు వారే భరిస్తారు అన్నాడు జమునాలాల్. అందరిలాగే గాంధీజీకి ఆహ్వానం అందింది. అయితే మొదట వెళ్లలేదు కానీ మేడమీది నుండి అక్కడి కార్యకలాపాలు చూసి, తన వ్యక్తిగత కార్యదర్శి మహదేవ్ దేశాయ్‌తో ‘ఆరెస్సెస్ శిబిరం చూడాలని ముచ్చటేస్తుంది’ అన్నారు. వెంటనే వార్థా జిల్లా సంఘ్ చాలక్ అప్పాజీ జోషికి వర్తమానం అందింది.

మరుసటి రోజు ఉదయం 6 గంటలకు గాంధీజీ మహాదేవ్ భాయ్, మీరాబాయి తదితరులతో కలిసి శిబిరంలోకి వెళ్తే దాదాపు 1500 మంది స్వయం సేవకులు ‘మాక్ వందనం’ చేశారు. అంతా చూశాక మీ వంట గది చూడాలన్నాడు గాంధీజీ. ‘అందరూ కలిసే భోజనం చేస్తారా?’ అని ప్రశ్నించారు. ‘‘అవును! ఒకే పంక్తిలో భోంచేస్తాం. ప్రక్కవారిని కులం అడగం’ అన్నారు నిర్వాహకులు. అంతా కలియదిరిగిన గాంధీజీ ‘జాతి భేదాలనే దెయ్యాన్ని మీరు ఎలా పారద్రోలారు? దానికోసం మేం ఎంతో ప్రయత్నిస్తున్నాం! ఈ శిక్షణ మీకు ఎవరు ఇచ్చారన్నారు’ అని ఆరా తీశారు. ‘అంతా సోదరులం అని మాకు డా హెగ్డేవార్ నేర్పించారు’ అన్నారు స్వయం సేవకులు. ఈలోగా ధ్వజారోహణ ప్రారంభం కాగా, స్వయం సేవకులతో గాంధీజీ నిలబడి ధ్వజప్రణామం చేశారు. 1939 ఏప్రిల్ 21న పూణె శిక్షావర్గలో డా అంబేడ్కర్ పాల్గొని కవాతు కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు. మధ్యాహ్నం అందరితో పాటు డాక్టర్జీ, బాబా సాహెబ్ నేలమీద కూర్చొని భోజనం చేశారు. మధ్యాహ్నం రెండున్నరకు బౌద్ధికవర్గంలో ‘దళితులు- దళితోద్ధరణ’ అన్న అంశంపై అంబేడ్కర్ ప్రసంగించారు. అక్కడకు వచ్చిన వారిలో కుల భేదాలున్నాయేమో తెలుసుకుందామని అనేక ప్రశ్నలు వేశారు. కానీ ఎవ్వరిలో అలాంటిది కన్పించలేదు. ఆ తర్వాత అంబేడ్కర్ కరాడ్ అనే గ్రామంలోని శాఖలో ప్రసంగిస్తూ ‘అస్పృశ్యతను ఆరెస్సెస్ ఎలా మరిపిస్తుందో తనకు తెలుసని’ సంతోషం వ్యక్తం చేశారు.
జాకిర్ హుస్సేన్, జయప్రకాశ్ నారాయణ్, జనరల్ కరియప్ప, ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ రవిశంకర్, రిపబ్లికన్ పార్టీ నేత ఆర్‌ఎస్ గవాయి, నేపాల్ మాజీ సైనికాధికారి రుక్మాంద్ కటావల్, మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ టిప్నిస్, కర్నాటకలోని ‘్ధర్మస్థల’ ట్రస్టీ వీరేంద్ర హెగ్డే లాంటి ఉద్దండులెందరో సంఘ్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 1962 చైనా యుద్ధ సమయంలో పెరేడ్‌లో పాల్గొనమని ప్రధాని నెహ్రూ ఆరెస్సెస్ వారిని ఆహ్వానించారు. 1965లో పాకిస్తాన్ యుద్ధం సమయంలో అఖిలపక్ష సమావేశానికి గోల్వాల్కర్ గురూజీని స్వయంగా ప్రధాని లాల్ బహదూర్ శాస్ర్తీ ఆహ్వానించారు. వివిధ వర్గాల మద్దతు ఉండబట్టే కన్యాకుమారిలో వివేకానంద స్మారక నిర్మాణానికి మూడు వందల పైచిలుకు పార్లమెంట్ సభ్యుల సంతకాలతో ఏకనాథ్ రనడే మద్దతు కూడగట్టారు.

ఈ రోజుకూ ఎందరో ‘ప్రచారక్’లు తమ కుటుంబాలను వదలి ఈ దేశమే సర్వస్వమని పక్షుల్లాగా పర్యటిస్తారు. పల్లెటూళ్లకు, కుగ్రామాలకు వెళ్లి అక్కడి వారితో మమేకం అవుతారు. చిన్న సంస్థలకు, పార్టీలకు అధిపతులైన వాళ్లు ఎంతో అహంకారం, దర్పం ప్రదర్శిస్తారు. కానీ తెలంగాణ మొత్తానికే సంఘ్ బాధ్యతలు చూసే వ్యక్తి సిటీ బస్సుల్లో తిరుగుతారంటే మనం నమ్మగలమా? సంఘ్‌కు తన జీవితం అర్పించిన ఒక పెద్దాయన సంతాప సభ జరుగుతుంటే ముగ్గురు సంఘ బాధ్యులు వేదికపై ఉన్నారు. సభికుల్లో క్రింద కూర్చున్న వారిలో సాధారణ స్వయం సేవకులతోపాటు ఎంపీలు, కేంద్ర మంత్రులు కూర్చొని ఆ అమరుడైన వ్యక్తి గురించి వినడం ఏ సంస్థలోనైనా చూడగలమా! కాషాయ వస్త్రాలు ధరించని ఋషుల్లాగా జీవిస్తూ, కనీసం తమ పేర్లు కూడా బయట సమాజానికి తెలియకుండా, తెలియాలని కోరుకోకుండా జీవించడం అంత సులభమా? కొందరు రోజూ దుష్ప్రచారం చేసినట్లు సంఘ్ మతకలహాలు ప్రోత్సహించదు. వ్యక్తులపై ఆధారపడదు. వ్యక్తి కన్నా వ్యవస్థకు ప్రాధాన్యం ఇవ్వాలని నమ్మే డాక్టర్జీ సంఘ్‌ను స్థాపించారు. అది ఈ రోజు అనేక రంగాల్లో చొచ్చుకొనిపోతోంది.

‘విక్టోరియా ధన్యసతీ అవతరిలియా జగతి’ అన్న గేయం నాగపూర్ పాఠశాలలో పిల్లలతో పాడిస్తే 7వ తరగతి చదివే కేశవ బలిరాం విక్టోరియా స్తుతిని ధిక్కరించాడు. జగజ్జనని సీతతో విక్టోరియా రాణిని పోలుస్తారా? అని ఎదురుతిరిగాడు. స్వాతంత్య్ర పోరాటాల ఉత్థాన పతనాలు స్వయంగా చూసి స్వాభిమానం లేని జాతి స్వాతంత్య్రం పొందినా ఉపయోగం లేదని 1925లో సంఘ్‌ను డాక్టర్జీ స్థాపించాడు. అనంతరం ద్వితీయ సర్ సంఘ్ చాలక్‌గా బాధ్యతలు చేపట్టిన యం.యస్.గోల్వల్కర్ సంఘ్‌ను అపూర్వంగా తీర్చిదిద్దాడు. ఆయన కాలంలోనే గాంధీజీ హత్యానంతరం సంఘ్ నిషేధానికి గురైంది. 4 ఫిబ్రవరి 1948 నాడు సంఘ్ నిషేధానికి గురికాగానే గురూజీని నాగపూర్ జైలులో నిర్బంధించారు. వారిని విచారించేందుకు బాగా దృఢంగా ఉన్న డిఐజి హీరాచంద్ జైన్ వచ్చాడు. అతడు అహంకారంతో కాళ్ళు టేబుల్ మీద పెట్టుకుని, సిగరెట్ నోట్లో పెట్టుకొని గురూజీ వైపు చూస్తూ ‘గురూజీ అంటే నువ్వేనా? ఇంత బక్కచిక్కినవాడివి నువ్వేం సర్‌సంఘ్ చాలక్‌వయ్యా?’ అన్నాడు. వెంటనే గురూజీ సమాధానం ఇస్తూ ‘డా హెడ్గేవార్ శరీరం కొలతల ఆధారంగా తీసుకొని సంఘానికి సర్‌సంఘ్ చాలక్‌ను నియమించలేదు. అలా అయితే నిన్నో, దున్నపోతునో సర్ సంఘ చాలక్‌ను చేసి ఉండేవారు’ అని సమాధానంతో ఛెళ్లుమనిపించారు.

అంత నిరాడంబరం, అనుశాసనయుతమైంది సంఘ కార్యక్రమం అని వారి కార్యక్రమాలు గమనిస్తే తెలుస్తుంది. సంఘం ఇనే్నళ్లలో భారత్ సార్వభౌమాధికారం, జాతీయ భావన, సేవా దృక్పథం, త్యాగబుద్ధి, అంకితభావం, దేశభక్తి ఎన్నో రూపాల్లో ఈ దేశానికి అందించగలిగింది. వివిధ కులాలమధ్య సమన్వయం, ఏకత్వం సాధించడమే ఆక, భిన్న సంప్రదాయాల ఆచారాలను, స్వామీజీలను ఏకత్రాటిపైకి తీసుకురాగలిగింది. ‘అంటరానితనం పాపం కాకపోతే ప్రపంచంలో మరేదీ పాపం కాదు’ అని గురూజీ తదనంతరం సర్ సంఘ్ చాలక్‌గా పనిచేసిన బాలా సాహెబ్ దేవరస్ ప్రకటించాడంటే సంఘం దృక్పథం ఏంటో మనకు అర్థం అవుతుంది.

ఇవేవీ అధ్యయనం చేయని వ్యక్తులు ఆరెస్సెస్‌పై మతతత్వ ముద్ర వేసి ఇతర మతాలవాళ్లకు బూచీగా చూపించి గత డెబ్భై ఏళ్ల నుండి పబ్బం గడుపుతున్నారు. సంఘం గంగా ప్రవాహం. అది ఎందరినో కౌగిలించుకుని అక్కున చేర్చుకుంటుంది. దానికి రోజువారీగా భావోద్వేగాలుండవు. కష్టం వస్తే క్రుంగదు. సుఖం వస్తే పొంగదు. దేశాన్ని రక్షించడం, ఈ సంస్కృతిని కాపాడడమే దాని కర్తవ్యం. నాగపూర్‌కు ప్రణబ్ ముఖర్జీ లాంటి అకళంక కాంగ్రెస్ దేశభక్తుడు రావడం సాధారణమేగాని దుష్పరిణామం ఎంత మాత్రం కాదు. సజీవ సనాతన మతం అస్తిత్వాన్ని గుర్తించడం చరిత్రకు మేలే చేస్తుంది. For the rest, let the public judge అన్న గురూజీ మాటలు అక్షర సత్యాలు.

************************************************************

డాక్టర్. పి. భాస్కర యోగి 
Published  Andhrabhoomi :

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి