వెయ్యేళ్ల బానిసత్వంలో మనం స్వంత అస్తిత్వాన్ని కోల్పోయాం. పరాయి రాజనీతి క్రింద మాత్రమే కాక, పరాయి మత అసహిష్ణుత పద ఘట్టనల క్రింద నలిగిపోయాం. అందుకే మనకు సాంస్కృతిక విస్మృతి సంభవించింది. కానీ విచిత్రంగా భారతదేశం చారిత్రక, సాంస్కృతిక పరిణామాలపై విదేశాల్లో పరిశోధనలు ప్రారంభం అయ్యాయి. ఒసామాబిన్ లాడెన్ ‘ముస్లిం ప్రపంచంలో భారతదేశం ఒక అసమగ్ర అధ్యాయం మాత్రమే’ అని ప్రకటన చేసినప్పటినుండి ఈ పరిశోధనలకు మరింత ప్రాధాన్యం పెరిగింది. కేవలం ఇరాన్ దేశాన్ని 15 సంవత్సరాలు ముస్లింలు పాలిస్తేనే అది ముస్లిం దేశంగా మారిపోయింది. ఇరాక్‌ను 17 సంవత్సరాలు, ఈజిప్ట్‌ను 21 సంవత్సరాలు ముస్లిం పాలకులు పరిపాలిస్తే  అవి నూరు శాతం ఇస్లామిక్ దేశాలు (దారుల్ - ఇస్లాం) గా మారిపోయాయి. అలాగే యూరప్ ఖండాన్ని 50 సంవత్సరాలు క్రైస్తవులు పరిపాలిస్తే ఆ ఖండం మొత్తం క్రైస్తవ ఖండంగా మారింది... మరి 800 సంవత్సరాలు ముస్లింలు, 200 సం॥లు క్రైస్తవులు భారతదేశాన్ని పాలించినా భారత్  ముస్లిం దేశంగా, క్రైస్తవ దేశంగా మారలేదు అన్నదే పైన పేర్కొన్న పరిశోధకుల మెదడును తొలుస్తున్న ప్రశ్న. మనతాత్విక, ఆధ్యాత్మిక పునాదుల గట్టిదనం అలాంటిది. ఆ పునాదుల మీదనే మన సామాజిక భవనం నిర్మాణమైనది. హిందుత్వ జీవన విధానానికి అనుగుణంగా ఏర్పడ్డ సూత్రాలతో ఈ పునాదులు నిర్మాణమయ్యాయి. 

ఓ మర్రిచెట్టు పైభాగానికి ఓ తీగ వచ్చి -నేను ఎంత ఎత్తుగా ఉన్నానో చూశావా? అని మర్రి చెట్టును వెక్కిరించిందట..! ఇలాంటి తీగలు ఆ చెట్టు జీవితంలో చాలా వస్తున్నాయి, పోతున్నాయి. అయితే ఆ చెట్టు  అలాగే పెరుగుతున్నది. ఆ మర్రిచెట్టే హిందూధర్మం. ఈ తీగలన్నీ ఇతర మతాలు. మర్రిచెట్టులాంటి హైందవధర్మానికి తత్వము, ఆధ్యాత్మికము, సామాజికము అనే గట్టి వేర్లున్నాయి.  పండుగలు మనకు ఖగోళ, సామాజిక, ఆధ్యాత్మిక, తాత్విక దృక్పథాన్ని కలిగిస్తాయి. పంచాంగకర్తలు ధర్మసింధు, నిర్ణయ సింధు ఆధారంగా మన పండుగలను నిర్ణయిస్తారు. దానికి ఆధారం మన ఖగోళ, జ్యోతిష విజ్ఞానం. ఖగోళంలో జరిగే పరిణామం పర్వంతో సమ్మిళితం అయ్యింది. అలాగే ప్రతి పండగకూ ఓ జ్యోతిష్య విజ్ఞానం ఉంటుంది. తిథులకు, వారాలకు, గ్రహ, నక్షత్రాలకు ఖగోళంతో సంబంధం ఉండి, మన శాస్త్రాలను మనతో కలిపే ప్రయత్నం మన ఋషులు చేశారు. పేదవాని నుండి ధనవంతుల వరకూ ఒకే విధంగా పండుగలు జరుపుకోవడం ఇందులోని సామాజిక సూత్రం. ఇందులోని చిన్నచిన్న భేదాలు ప్రక్రియా పరమైనవే కాని మౌలికమైనవి కాదు. ప్రతి పండుగలో, ఆచారంలో మనం వాడే వస్తు సంస్కృతి మంగళకరమైనది. శరీరానికి భౌతికంగా ఆనందం కలిగిస్తే మనస్సుకు ఆంతరికమైన చైతన్యాన్ని కలి గిస్తుంది. ఉదాహరణకు మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మామిడి తోరణాలు కడుతుంటాం. ఆ అలంకరణ చూపరులకు ఆనందం కలిగిస్తుంది. వైద్యపరమైన, ప్రకృతిపరమైన ఉపయోగంతో భౌతికంగా మనల్ని కట్టి పడేస్తే, ఆచరణోని సంతృప్తి మన మనస్సును తాకుతుంది. అలాగే ప్రతి పండుగ మనకు తాత్విక దృక్పథాన్ని కల్గిస్తుంది. ఆలోచిస్తే ప్రతి పండుగ అంతే భావ చైతన్యాన్ని మనలో నింపుతుంది.

హైందవ ధర్మానికి ఆలంబనగా నిలిచే గొప్ప గ్రంథాలున్నాయి. ఇవన్నీ సంస్కృత భాషలో ఉన్నాయి. పాణిని రచించిన అష్టాధ్యాయి సంస్కృత భాషకు మరో ఆయువుపట్టు. పాణిని మహర్షిని పాశ్చాత్యులే ‘ప్రపంచ భాషా పితామహుడు’గా గుర్తించారు. 102 మిలియన్, 78 కోట్ల 50లక్షల శబ్దాలు సంస్కృత భాషలో ఉండడం విశేషం. వేదాలు వైదిక సంస్కృత భాషలో ఉండగా, రామాయణ, భారత, భాగవతాలు, అష్టాదశ పురాణాలు, కావ్యాలను లౌకిక సంస్కృతంలో రచించారు. సంస్కృత భాషలో రచించిన ఆయుర్వేదం, చతుష్షష్టి కళలు, తర్క, మీమాంశాది శాస్త్రాలు, వైజ్ఞానిక శాస్త్రాలు ఇలా ఎన్నో శాస్త్రాలు హైందవ ధర్మానికి శోభను చేకూర్చుతున్నాయి. అలాగే స్తోత్రాలు, పూజలు, అర్చనలు సంస్కృత భాషలో ఉండి ఆసేతు హిమాచలం హిందువుల సంప్రదాయాలు ఏకీకృతంగా ఉన్నట్లు ఋజువు చేస్తున్నాయి.

  సంవత్సరానికి 365 రోజులు ఉంటాయని క్రీ.శ.5వ శతాబ్దంలోనే భాస్కరాచార్యుడు చెప్పాడు. ఆర్యభట్టు శూన్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. చరకుడు ఆయుర్వేదం చెప్పగా, శుశ్రుతుడు శస్త్ర చికిత్సను మొదటగా నిర్వహించి నిరూపించాడు. బి.సి.700లోనే  మనదేశంలో తక్షశిల విశ్వవిద్యాలయోం 10,500 విద్యార్థులు చదువుకొన్నారు. అందులో గ్రీకు తదితర విదేశీ విద్యార్థులు కూడా ఉన్నారు. అంతగొప్ప విద్యా వ్యవస్థ విదేశీయుల పాలనలో ధ్వంసం అయిపోయింది. మన సంస్కృతి ప్రతి విషయంలో శుభాన్ని కోరు కునేదిగా ఉంటుంది. మన ఆశీస్సులు దీర్ఘాయుష్మాన్‌భవ, దీర్ఘ సుమంగళీ భవ, శుభం భవతు, సమస్త సన్మంగళాని భవంతు... అంటూ నిరంతరం లోకానికి అనేక మంగళాశాసనాలు చేసింది మన ధర్మం. “కౌసల్యా సుప్రజారామా పూర్వా సంధ్యా ప్రవర్తతే! ఉత్తిష్ఠోతిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాన్త త్రైలోక్యం మంగళం కురు”  ఈ ముల్లోకాలకు శుభాన్ని చేకూర్చడానికి నీవు నిద్రలేవాలి స్వామీ, అని దైవ ప్రార్థన చేసే సంప్రదాయం మనది. అలాగే మనకు గొప్ప వేదాంతం ఉంది.

మనిషి తన వయస్సు మళ్ళగానే వైరాగ్యం అవలంబించ మన్నది భగవద్గీత. ‘నేను’ అన్న అహంకారంలో కులం, ధనం, బలం, గర్వం, ప్రాంతం, భాష.... ఇలా అన్నీ ఉన్నాయి. అలాంటి ‘నేను’ను వదలమని మన శాస్త్రాల సారం. చతుర్విధ పురుషార్థాలు సాధించాలంటే పురుషునికి స్త్రీ తోడు అవసరం. అందుకే వివాహ మంత్రాల్లో ‘నాతిచరామి’ అనే మంత్ర ప్రమాణం చేస్తాడు. ఏడు అడుగులు, మూడు ముళ్లతో పెనవేసుకొన్న మన బంధం ఏడుజన్మల వరకు ఉంటుంది. ఇద్దరు త్యాగమూర్తుల కలయిక  మన వివాహ బంధంలో ఉంటుంది. లోకహితం కొరకు భర్తకే త్యాగబుద్ధిని నేర్పించిన స్త్రీ మూర్తులు ఈ దేశంలో కన్పిస్తారు. ఉదాహరణకు దేవతలు రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలికినప్పుడు మొదట వచ్చిన హాలహలాన్ని లోకహితం కోసం తాగమని పార్వతి తన భర్తను కోరిన ఘట్టం అద్భుతం. గొప్ప వేదాంత సూత్రాలు, నీతిశ్లోకాలు, ధర్మ విషయాలు విజ్ఞులను మాత్రమేగాక బాలలు పాడే గేయాలు కూడా వారిని ఆ స్థాయిలో అలరించాయి. వారు తమ అస్తిత్వాన్ని మరచిపోకుండా కాపాడాయి. పరాయి పాలనలో భారత, రామాయణాలను తమ అధికారమదంతో అణచివేస్తే జానపదులు యక్షగానాలు, బుర్రకథలు, ఒగ్గు కథల రూపంలో  జన జీవితంలోకి  ఇతిహాసాలను తీసుకెళ్లారు. 

   వేయి సంవత్సరాలకు పైగా జరిగిన పరాయి పాలన అంతానికి ఈ నేల రక్త తర్పణాలతో, వీరుల నినాదాలతో మారుమ్రోగింది. సోమనాథ్, అయోధ్య, మథుర, కాశీ దేవాలయాలను పరాయి మూకలు అపవిత్రం చేస్తుంటే ఎదురు నిల్చిన వీరులకు ఈ దేశంలో కొదవేం లేదు. పాకిస్తాన్ కవ్వింపు చర్యల్ని కార్గిల్‌లో ఎదుర్కొన్న యువసైనిక వీరకిశోరాల శరీ రాల నుండి చిందిన రక్తబిందువుల త్యాగపు గుర్తులు ఇంకా మనం మరచిపోలేదు. 32 ఏళ్ల జీవితంలో కాలడి నుండి కాశ్మీర్ వరకు కాలినడకన పయనించి  హైందవ జాతి కీర్తి పతాకను ఎగురేసిన ఆదిశంకరుడికి ఇచ్చిన ప్రాధాన్యాన్నే అగ్ని పరీక్ష నెదుర్కొని హరిదర్శనం చేసిన నిమ్న కులస్థుడైన నందనార్‌కు ఇచ్చింది ఈ ధర్మమే. ఖండ ఖండాంతరాలలో హైందవ వేదాంత డింఢిమము మ్రోగించిన వివేకా నంద స్వామిని అక్కున జేర్చుకొన్న ఈ ధర్మం, భార తీయుల ఆర్యత్వాన్ని తట్టిలేపి ‘వేదాలలోకి తిరిగి తీసు కెళ్లిన’ దయానందుని ముందు నతమస్తకమై నిల బడింది. ఆదిశంకరుడి నుండి మలయాళ స్వామి వరకు ఎందరో మహానుభావులకు జన్మనిచ్చిన ఈ నేల పరమ పవిత్రంగా తన సంస్కృతిని కాపాడుకొంటువస్తున్నది.

కటికవాడైన ధర్మవ్యాధుడు, బ్రాహ్మణుడైన కౌశికుడికి ధర్మోపదేశం చేయడం హిందూ పురాణాల్లో చూస్తాం. విశిష్టాద్వుతై సిద్ధాంతంలో ప్రముఖంగా వినిపించే పేర్లలో యామునాచార్యుడొకరు. ఆయనకు పెరియనంటి అనే బ్రాహ్మణ శిష్యునితో బాటు, మార్నేరు నంబి అనే నిమ్నకులస్థుడు కూడా శిష్యుడుగా ఉన్నాడు. ఇద్దరికీ విద్యాదానం చేసిన ఘనత ఆ ఆచార్యులది. మార్నేరు నంబి కోరికపై పెరియ నంబి తన సహాధ్యాయుడి అంత్యక్రియలను నిర్వ హించడం హైందవ ధర్మ విశేషం. వేద సూక్తాలను ప్రవచించిన స్త్రీలు మనకు కనిపిస్తారు. యమ ధర్మరాజు పాశాన్ని అదలించిన పతివ్రతా మూర్తులు ఈ నేలను పావనం చేశారు. హైందవ ధర్మాన్ని ఈ భూమిపై నుండి ఎవరూ ఆవలకు త్రోసివేయలేరు. సూర్యచంద్రులతో ముడిపడి ఉన్నది ఈ ధర్మం. సూర్యచంద్రులనే తనలో విలీనం చేసుకోగల్గిన పరమాత్మలా ఇది శాశ్వతం.. సనాతనం... ఈ జాతిపై సైద్ధాంతిక దాడులు, భౌతిక దాడులు ఎన్ని జరిగినా, పుటం పెట్టిన బంగారంలా హైందవ ధర్మం మహా తేజోవంతమై పైకి లేవడం చరిత్ర చెబుతున్న సత్యం.

 ******************************************
ॐ డాక్టర్. పి. భాస్కర యోగి 

卐 ఆధ్యాత్మిక వ్యాసం


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి