భారతదేశంలో ఎందరో మహనీయులు జన్మించారు. అందులో సాధువులు, సత్పురుషులు, కవులు, తాత్త్వికులు, గాయకులు, సిద్ధులు, యోగులు, మత సిద్ధాంతకర్తలు ఎందరో ఉన్నారు. ఆదిశంకరుడు, మధ్వ, నింబార్కుడు, గౌతమబుద్ధుడు, నానక్, కబీరు, మీరాబాయి, వీరబ్రహ్మేంద్ర స్వామి, వేమన, బసవేశ్వరుడు, తిరువల్లువర్ వంటివాళ్లను పేర్కొనవచ్చు.

అన్నమయ్య, బ్రహ్మంగారు, వేమన... ముగ్గురూ మన తెలుగులో సంస్కరణా సాహిత్యం అందించినవారే. అన్నమాచార్యులు 32వేల కీర్తనలకు పైగా మనకు అందిస్తే, బ్రహ్మంగారు కాలజ్ఞాన తత్త్వాలు , కాళికాంబ శతకం అందించారు.

 వేమన కవీశ్వరుడు దాదాపు 5వేల పద్యాలు తెలుగువారి కందించారు. తత్త్వం, వేదాంతం, జ్ఞానం, యోగం, మతం, సాధన, నీతి, ధర్మం- ఇలా అనేక విషయాలు వేమన తన పద్యాల్లో విస్తృతంగా చర్చించారు. అలతి అలతి పదాలలో ఆటవెలది ఛందస్సులో సత్య దర్శనం చేసారు వేమన. బహుశా! వేమన పద్యం రాని, ఆఖరకు వేమన పద్యం తెలియని తెలుగువారుండరు! అంటే ఆశ్చర్యపోవలసిందే.

ఆ.వె కల్లగరుడు గట్టు కర్మచయంబులు
        మధ్యగురుడు గట్టు మంత్రచయము
        ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యంబు
        విశ్వదాభిరామ వినురవేమ

(అబద్ధపు గురువు కర్మ పాశంలో చిక్కుకునే విధంగా, మధ్యగురుడు మంత్ర సంబంధమైన మార్గంలో, ఉత్తమ గురువు యోగమార్గంలో వెళతాడు అనేది ఈ పద్య సారాంశం)

హైందవ ధర్మశాస్త్రం గురువుకు విశేష ప్రాధాన్యతనిచ్చింది. ‘గు’ అనేది అంధకారమని, ‘రు’ కారము ఆ అంధకారాన్ని నివారించే అక్షరమని ‘గురు’ శబ్దానికి అర్థం అనగా అంధకారాన్ని తెంపి, వెలుగునిచ్చే పరంజ్యోతి అనే విషయం స్పష్టవౌతున్నది. 

గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురువే బ్రహ్మ, గురవే విష్ణువు, గురువే మహేశ్వరు అని మాత్రమే అర్థం చెబుతుంటాం పై శ్లోకానికి. కాని ‘గురుర్దేవో’ అంటే గురువే ‘దవి’ అనే అర్థాన్ని కూడా సాధించారు దేవీ భక్తులు. 

గురువు, పరమాత్మ ఇద్దరూ ఒకేసారి దర్శనమిస్తే మొదట నేను గురువుకే నమస్కరిస్తాను అంటాడు భక్తకబీర్. అధమ కులం గురువని సంత్ రయిదాసును ఎంతమంది అసహ్యించుకున్నా మీరాబాయి అతణ్ణి వదలలేదు. 

రమణమహర్షి లాంటి వాళ్లకు గురవే లేడంటారు. ‘గురువు లేని విద్య గుడ్డి విద్య’ అంటారు పెద్దలు. గురువును నిందిస్తే సచేల స్నానం చేయాలంటారు శాస్తక్రారులు. గురునింద మహాపాపం అని కూడా గురుగీత తెలియజేస్తుంది. 

విష్ణువు అవతారాలు ఎత్తి ప్రజలను రక్షిస్తే, శివుడు గురురూపమెత్తుతాడు అంటారు మహాత్ములు. 

మొదటి యోగశాస్తమ్రైన హిరణ్యగర్భయోగం యాజ్ఞవల్క్యుడు గార్గేయకి ఉపదేశించాడు. శివుడు పార్వతికి హఠయోగం బోధించాడు. 

‘వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం’ అన్నట్లు సమస్త శాస్త్రాలకు మూలపురుషుడైన వ్యాసుని పేరనే (వ్యాసపూర్ణిమ) గురుపూర్ణిమ జరుపుకుంటాం. 

కల్లగురువు అంటే నకిలీ గురువు. అబద్ధపు గురువు. అధమ గురువు అని అర్థం. 

ఈ అధమ గురువు ఎక్కువగా భౌతిక విషయాలకే ప్రాధాన్యతనిస్తారు. 

కర్మబంధాల్లో చిక్కుకునే సాధనలు చేస్తాడు. 

మధ్యమ గురువు అంటే కొంతదూరం ఆధ్యాత్మిక అనే్వషణకు బయలుదేరి మధ్యలో తనకు లభించిన శిష్యపరివారం, ధన కనక వస్తు వాహనాలు, గౌరవ మర్యాదలతో సరిపెట్టుకుంటాడు. 

ఉత్తమ గురువు అంటేనే ఈయన ఉత్తమ మార్గాన్ని ఎంచుకున్నవారు. 

ఏమిటీ ఉత్తమ మార్గం? భగవదనే్వషణ మార్గం. సాయుజ్యాన్ని స్వాధీనం చేసుకొనే మార్గం అదే యోగమార్గం. *

*********************************************
✍ డాక్టర్‌. పి. భాస్కర యోగి
ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి