‘‘మానవజాతి భవితవ్యాన్ని నిర్ణయించడానికి ఇంతవరకు కారణాలయినటువంటివి; ఇకమీద కారణాలు కాకున్నట్టివి అయిన మూలశక్తులన్నింటిలో కూడా మత రూపంలో కనబడేదాన్ని మించింది మరోటి లేదు’’ అన్నాడు స్వామి వివేకానందుడు. వందేళ్ళ క్రితం లండన్ నగరంలో మతావశ్యకత గురించి చెప్పిన సందర్భంలోని అమృతవాక్కులు మనం అవలోకనం చేసుకోవాలి.
మతం అంటే మార్గం. ఆలోచనాపథం. ఎవరికి నచ్చిన మార్గంలో వాళ్లు నడిచే త్రోవ. అందుకే ‘వాడి మతం వాడిదే’ అన్నమాట లోకోక్తిగా మారిపోయింది. ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. మన భారతదేశంలో ప్రాచీనమైన మతాలుగా చెప్పబడే శైవ, శాక్తేయ, గాణాపత్య, కాపాలిక, సౌర, వైష్ణవాలు కాగా, మధ్యలో వచ్చిన జైన, బౌద్ధాలు, సిక్కు.. ఆ తర్వాత రాజకీయ అధికారంతో ప్రవేశించిన ఇస్లాం, క్రైస్తవాలు.. ప్రధానమైనవి. ముందు చెప్పిన షణ్మతాలే ఇవాళ హిందూ ధర్మానికి పునాదులుగా నిలబడగా, జైన, బౌద్ధ, సిక్కుమతాలు హిందూ ధర్మ అనుయాయమతాలుగా, అంతర్భాగాలుగా స్థిరీకృతమయ్యాయి.
హిందుత్వను మతం అనవద్దని, ధర్మం అని పిలవాలని పండితులు చెప్తారు. ఎందుకంటే ఎన్నో మతాలను ఇముడ్చుకొనే శక్తి దీనికున్నది. నదులన్నీ సాగరాన్ని చేరినట్టుగా పరమాత్మను చేరే వివిధ మార్గాలను ఈ మతం ప్రబోధించింది.
అలాగే హిందూ ధర్మం ఒక వ్యక్తి చేత స్థాపించబడలేదు. ప్రత్యేకమైన ప్రవక్త దీనికి లేడు. అట్లాగే హిందూత్వను సనాతన మతం అనీ ఆర్యమతమనీ, వైదిక మతమనే పేర్లతో పిలుస్తారు. ఇదొక జీవన విధానం. ఈ విషయం సుప్రీంకోర్టు కూడా నిర్థారించింది. అవిచ్ఛిన్నంగా అమృతధారగా కొనసాగుతూ తత్త్వజ్ఞానానికి భాండాగారంగా నిలిచింది.
‘‘మతాలన్నీ మానవత్వాన్ని ప్రబోదించడానికే ఏర్పడ్డాయి’’ అని భావించే సంస్కృతి హిందువులది. మానవత్వం ఉండాల్సిన స్థాయికన్నా ఎక్కువై అది స్వేచ్ఛగా రూపాంతరం చెందింది. ఆ స్వేచ్ఛ ఈ రోజు పరమత సహనం రూపంలో దేశానికి, ధర్మానికి ఏం జరిగినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే దుస్థితికి దిగజారింది.
ఇటీవలికాలంలో కుహనా మేధావులు విదేశీ శక్తులతో కలిసి, కుట్రపూరిత సిద్ధాంతాలను వల్లెవేస్తూ హిందుత్వంపై విషం చిమ్ముతున్నారు. అందులో ప్రధానంగా ఆర్య ద్రావిడ సిద్ధాంతం ఒకటి. ‘ఆర్య’ శబ్దం గొప్పవారు అనే అర్థం సూచించేదే కాని మరోటి కాదు.
దళితవాదం పేరిట ఇటీవల కొందరు పదవులకోసం, పదిమందిలో పేరుకోసం పడరాని పాట్లు పడుతున్నారు. బలిచక్రవర్తి, రావణుడు, నరకుడు ‘మావాళ్లు’ అనీ, హిందూ దేవీదేవతలు వాళ్ళను చంపి పండగలు చేస్తున్నారని అజ్ఞానపు రాతలు రాస్తున్నారు. పురాణం ముఖం చూడని ఇలాంటి రాతలవల్ల జాతిని చీల్చాలన్నదే వారి కుట్ర.
‘కులమొక కుట్ర - దాని పడగొట్ర’ అన్న సిద్దాంతం చేయాల్సిన విద్యావంతులు కులం పేరుతో సమాజాన్ని చీల్చివేస్తున్నారు. ఆత్మాభిమానం కలిగిస్తున్నామనుకొనే ఈ మేధావులు జాతిని ముక్కలు చేయాలనే విదేశీ శక్తుల సంకల్పానికి ఊపిరిని అందిస్తున్నారు.
అరవై ఏళ్ళ క్రితం రాసుకొన్న రాజ్యాంగానికి నేటికి 112 సవరణలు చేసుకొన్నాం. వేలయేళ్లనాడు రాసిన మనుస్మృతి చదివిన హిందులు ఎంతమంది? భక్తి, జ్ఞాన, యోగాలకు తత్త్వభూమిక అయిన భగవద్గీతనే చదివే తీరిక లేని హిందువులు మనుస్మృతి చదివి ఇతరజాతులపై యుద్ధాలు చేస్తున్నారా? ఎంత మూర్ఖపువాదన..!
హిందూత్వం అనగానే బ్రాహ్మణిజం అంటూ మండిపడే మరోవర్గం, దేశంలో ఎప్పుడూ చైతన్యంగానే పనిచేస్తున్నది. హిందువులు కేవలం బ్రాహ్మణులా! బ్రాహ్మణుల సంప్రదాయాలా? వీళ్ళలో స్పష్టత లేదు. అసలు బ్రహ్మశబ్దానికే అర్థం తెలియని సెక్యులర్ రాక్షసులు బ్రాహ్మణ కులతత్వాన్ని హిందూత్వగా ప్రచారం చేస్తూ, వీళ్లు అనుకొనే, సంబోధించే నిమ్నకులాలను హిందుత్వం నుండి దూరం చేయాలని చూస్తున్నారు.
ఈ దేశంలో భౌతికంగా ఇస్లామిక్ తీవ్రవాదం, మావోవాదం ప్రత్యక్షంగా యుద్ధం చేస్తున్నాయి. ఈ రెండూ కొనసాగడానికి పాకిస్తాన్, చైనా ప్రోద్భలం వుంది. ఇతర ఖండాల్లో క్రైస్తవం పప్పులు ఉడకడంలేదు.
హిందూమతంలో ఎన్నో కళలున్నాయి. భారతదేశ సాంస్కృతిక సంపద, సంగీతం, సాహిత్యం, చిత్రం, శిల్పం- ఇలా అన్నీ మన సొంతమే. అలాగే మన శాస్త్రాల్లో యోగశాస్త్రం, అతీంద్రియ జ్ఞానానికి సంబంధించినది. ఇందులో సమాధి, యోగనిష్ఠ, అనుభూతి.. అనే కొన్ని మనసుకు అతీతమైన విషయాలు చెప్పబడ్డాయి.
ఇన్ని జరుగుతున్నా ఈ దేశంలోని 85 శాతం హిందువులు నిశ్శబ్దంగా గమనిస్తున్నారు. ఈ దేశాన్ని ముక్కలు చేసే కుటిలయత్నం రకరకాలుగా జరుగుతూనే వుంది. పరమేశ్వరా! ఈ దేశాన్ని నాయకులనుండి, అజ్ఞానుల నుండి అనామకుల నుండి రక్షించే బాధ్యత నీదే!
*
*************************************************
✍ డాక్టర్. పి. భాస్కర యోగి
ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి