ఒక ఊళ్లో ఓ మనిషి చనిపోయాడు. మృతుడి ఇంటివాళ్లను పలకరించడానికి ఓ వ్యక్తి వచ్చాడు. ‘అ య్యో! ఈయన ఎలా చనిపోయాడు’? అని ప్రశ్నించగా- ‘పాము కరిచింది’ అని ఇంటివాళ్లు చెప్పారు. వెంటనే ‘ఎక్కడ కరిచింది?’ అని ఆ వ్యక్తి అన్నాడు. ‘కన్నుకు పైభాగంలో’ అని ఇంటివాళ్లు సమాధానం ఇచ్చారు. ‘అరే..! కొంచెం అయితే కంట్లో కరిచేది కదా.. కనే్న పోయేది కదా?’ అన్నాడట. మనిషే చచ్చిపోతే కన్ను గురించి మాట్లాడటం తెలివితక్కువతనం కాదా?- ఈ పిట్టకథ దానం నాగేందర్ తెరాసలో చేరినపుడు సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ నాయకుడు జైపాల్‌రెడ్డిని గురించి చమత్కారంగా చెప్పినది.
ఈ నాలుగేళ్లు మాట్లాడినదానికన్నా ఇటీవలి సభలో కేసీఆర్ చాలా ఆత్మవిశ్వాసంతో మాట్లాడి కాంగ్రెస్ వాళ్లను ఆత్మరక్షణలో పడేసాడు. అభివృద్ధి విషయంలో సిద్ధిపేటను అగ్రస్థానంలో కేసీఆర్ నిలిపాడు. తాను ఎన్నడూ ఓటమి చెందలేదని చెబుతూ, ‘పూర్వపు మెదక్ జిల్లాలో పశ్చిమ భాగంలో బాగారెడ్డి, తూర్పు భాగంలో నేనూ నిరంతరం గెలుస్తూ వచ్చాం’ అన్నాడు. ఇలా మితిమీరిన వ్యూహంతో మాట్లాడి శత్రుపక్షాన్ని నిరుత్తరులను చేయడంలో కేసీఆర్ దిట్ట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వంద స్థానాల్లో గెలవబోతున్నామని ఇంకో మాట చెప్పి రాజకీయ వర్గాల్లో క్రొత్త ఆలోచనను రేకెత్తించాడు. ఆయన ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చినప్పటినుండి ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలకు తెరలేచింది. కాంగ్రెస్ వాళ్లు ఎక్కువ మాట్లాడితే ఎన్నికలకు వెళ్తానని కూడా కెసిఆర్ ప్రకటించడంతో రాష్ట్రంలో చర్చ మొదలైంది. జైపాల్‌రెడ్డిని టార్గెట్ చేసి ఆయన విమర్శనాస్త్రాలు సంధించాడు.
ఇటీవల కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలకు జైపాల్‌రెడ్డి కారణమని కెసిఆర్ భావించవచ్చు. ఇక్కడి కాంగ్రెస్ ఆనుపానులన్నీ కెసిఆర్‌కు బాగా తెలుసు. రేపుకాంగ్రెస్ యవనికపై ముఖ్యభూమిక పోషించే రేవంత్ రెడ్డి వెనుక జైపాల్ స్థైర్యం వుందని కూడా ఆయనకు తెలుసు. కెసిఆర్ ఎప్పుడూ బయటకు వచ్చి అనవసరంగా మాట్లాడడు. సభలు, సమావేశాలు జరిగినపుడు సరైన ‘పంచ్’లతో, సామెతలతో, అవతలివారి ఆలోచనలను తలదనే్న విధంగా ‘ప్రిపేర్’ అయి వస్తాడు. కెసిఆర్ మాటల్లో ఎంత సూటిదనం, సరళతరం వుంటుందో వ్యూహం కూడా అంతే వుంటుంది. ఇపుడున్న రాష్ట్ర ప్రభుత్వాధినేతల్లో కెసిఆర్ లాంటి వక్త, వ్యూహకర్త ఎవరూ లేకపోవచ్చు. అదే చంద్రబాబు మాట్లాడితే క్లాసులో పాఠం విన్నట్లుగా ‘డ్రై’గా వుంటుంది. అదీ ఎకనామిక్స్ క్లాసులో కూర్చున్న ఫీలింగ్ ఉంటుంది. ప్రతిరోజూ బాబు మాట్లాడడం కూడా బోర్‌గా వుంటుంది. కెసిఆర్ తనకు కావలసిన వ్యక్తులకు సరైన స్థానం ఇచ్చి వారిని శత్రుపక్షంపై విరుచుకుపడేట్లు చేస్తాడు. ఏ వర్గం వారు తమపై దాడి చేస్తే అదే వర్గంపై ఎదురుదాడి చేయిస్తాడు. బహుశా.. వాళ్లకు ఇలా మాట్లాడమని ఆయననేమీ చెప్పకపోవచ్చు.
ఉద్యమంలో పనిచేసినందున వాళ్లలో ఆ బలం నిర్మాణమై ఉండవచ్చు. ఇదంతా ఎందుకంటే- దాదాపు10 నెలలకు ముందే ఎన్నికలకు వెళ్లడానికి కెసిఆర్ ఇచ్చిన సంకేతాలను తెరాస పార్టీ శ్రేణులు అందుకొంటున్నాయని చె ప్పడానికే.
బీసీ జనాభా గణన సరిగ్గా లేదని హైకోర్టు పం చాయతీ ఎన్నికలను వాయి దా వేయడం ఊహించని పరిణామం కాదు. పంచాయతీ ఎన్నికల కన్నా ముందే సాధారణ ఎన్నికలు జరగాలని తెరాస కోరుకొంటోంది. ఎందుకంటే 2014కు కాస్త అటూ ఇటూగా గ్రామ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు ఎక్కువ మంది తెరాసలో చేరి ఉన్నారు. కాంగ్రెస్, తెదేపా నుండి ఎందరో తెరాస ప్రభంజనంలో కలిసిపోయారు. మొదట పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే గ్రామాల్లోని వ్యక్తులు తలా ఓ పార్టీలోకి చేరిపోతారు. గెలిచినా, ఓడినా వాళ్లు వర్గ శత్రువులుగా మారిపోయి ఒకరికొకరు వ్యతిరేకంగా పనిచేస్తారు. దాంతో అసెంబ్లీ ఎన్నికలకు ఇతర పార్టీలకు లేని కార్యకర్తలను, ఓటు బ్యాంకును మనమే అందించినవాళ్లం అవుతాం అని తెరాసాలోని క్రింది స్థాయి కార్యకర్తల్లో బలంగా అభిప్రాయం ఉంది. కానీ కెసిఆర్ ఎక్కువ ఆత్మవిశ్వాసంతోనే కన్పించారు. ఈలోపు కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్లు కాంగ్రెస్ పార్టీ బీసీ గణనపై కోర్టుకెక్కింది. ఇపుడు కెసిఆర్ వ్యూహానికి మార్గం మరింత సుగమమైంది. రాష్ట్రంలో లెఫ్ట్, రైట్ అన్నీ కెసిఆర్ నడిపిస్తున్నందువల్ల కమ్యూనిస్టులకు ఇక్కడ పనిలేకుండా పోయింది. తెలంగాణ భాజపా నేతలకు కెసిఆర్‌తో శత్రుత్వం కన్నా పరోక్ష ప్రేమనే ఉందని విశే్లషకుల అంచనా. తెరాస, భాజపాలకు- ‘కాంగ్రెస్‌ను కదలకుండా చేయడమే’ ముఖ్యమైన పని.
బీసీ జనాభా గణన సరిగ్గా లేదని హైకోర్టు పం చాయతీ ఎన్నికలను వాయి దా వేయడం ఊహించని పరిణామం కాదు. పంచాయతీ ఎన్నికల కన్నా ముందే సాధారణ ఎన్నికలు జరగాలని తెరాస కోరుకొంటోంది. ఎందుకంటే 2014కు కాస్త అటూ ఇటూగా గ్రామ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు ఎక్కువ మంది తెరాసలో చేరి ఉన్నారు. కాంగ్రెస్, తెదేపా నుండి ఎందరో తెరాస ప్రభంజనంలో కలిసిపోయారు. మొదట పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే గ్రామాల్లోని వ్యక్తులు తలా ఓ పార్టీలోకి చేరిపోతారు. గెలిచినా, ఓడినా వాళ్లు వర్గ శత్రువులుగా మారిపోయి ఒకరికొకరు వ్యతిరేకంగా పనిచేస్తారు. దాంతో అసెంబ్లీ ఎన్నికలకు ఇతర పార్టీలకు లేని కార్యకర్తలను, ఓటు బ్యాంకును మనమే అందించినవాళ్లం అవుతాం అని తెరాసాలోని క్రింది స్థాయి కార్యకర్తల్లో బలంగా అభిప్రాయం ఉంది. కానీ కెసిఆర్ ఎక్కువ ఆత్మవిశ్వాసంతోనే కన్పించారు. ఈలోపు కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్లు కాంగ్రెస్ పార్టీ బీసీ గణనపై కోర్టుకెక్కింది. ఇపుడు కెసిఆర్ వ్యూహానికి మార్గం మరింత సుగమమైంది. రాష్ట్రంలో లెఫ్ట్, రైట్ అన్నీ కెసిఆర్ నడిపిస్తున్నందువల్ల కమ్యూనిస్టులకు ఇక్కడ పనిలేకుండా పోయింది. తెలంగాణ భాజపా నేతలకు కెసిఆర్‌తో శత్రుత్వం కన్నా పరోక్ష ప్రేమనే ఉందని విశే్లషకుల అంచనా. తెరాస, భాజపాలకు- ‘కాంగ్రెస్‌ను కదలకుండా చేయడమే’ ముఖ్యమైన పని.
ఇక కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎన్నికల వేడిని పుట్టించే నిర్ణయాలను అత్యంత వేగంగా తీసుకున్నారు. రంజాన్ మాసంలో కాల్పుల విరమణ తర్వాత జరిగిన అనేక పరిణామాల పేరుతో కాశ్మీర్‌లో మెహబూబా ముఫ్తీ ప్రభుత్వానికి భాజపా మద్దతు ఉపసంహరించుకొంది. కర్ణాటకలో ‘తగుదునమ్మా..’ అని పీఠమెక్కేందుకు సిద్ధపడిన కుమారస్వామిని సీఎంగా చేసి, లోలోపల కుమిలిపోతూ బయటకు బ్రహ్మానందాన్ని ప్రదర్శించిన కాంగ్రెస్ కాశ్మీర్ విషయంలో అడుగు ముందుకు వేయలేకపోయింది.
మోదీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలనూ ఏకం చేస్తామని దేశమంతా డప్పుకొట్టి చెబుతున్న కాంగ్రెస్ కాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపిలను కలిపి ఎందుకు ప్రభుత్వం ఏర్పాటుచేయించలేకపోయింది?! ఎన్నికల వేళ కాశ్మీర్‌పై మోదీ తీసుకొనే ప్రతి నిర్ణయం దేశ ప్రజలపై పడుతుందని మోదీకి తెలుసు. జింకను వేటాడే పులి మొదట రెండడుగులు వెనక్కి వేసినట్టు రంజాన్ మాసంలో కాల్పుల విరమణ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఫ్తీ దుర్నీతిని పసిగట్టింది. అందుకే భాజపా నేత రాం మాధవ్ చేత మద్దతు ఉపసంహరించుకొంటున్నామని చెప్పించి ప్రభుత్వం నుండి బయటకు వచ్చేసింది. నిజానికి భాజపాకు కాశ్మీర్ విషయంలో పెద్ద కమిట్‌మెంటే వుంది. ముఖ్యంగా 370 ఆర్టికల్ అక్కడి మతోన్మాద శక్తులకు ఊతంగా మారింది. మన సైన్యంపై రాళ్లు రువ్వుతూ వేర్పాటువాదులు, ఉగ్రవాదుల మద్దతుదారులు సహనానికి సవాల్ విసురుతున్నారు. భాజపా తాను పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తే 370 ఆర్టికల్ రద్దుచేస్తామని చెప్పింది. కాశ్మీర్ కోసమే నాటి జనసంఘ్ నాయకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ ప్రాణాలు వదలిపెట్టాడు. ఈ పోరాటంలో ఎందరో జాతీయవాదులు ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ క్షుణ్ణంగా తెలిసిన మోదీ పాకిస్తాన్‌లో నవాజ్ షరీఫ్ ఇంటికి ఆకస్మిక అతిథిగా వెళ్లడం, పిడిపితో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పరడం, హురియత్ నేతల దగ్గరకు చర్చలకు పంపడం వంటి సామరస్య పరిష్కారాలు చేశారు. శాంతి ప్రయత్నాలు చేయలేదని భవిష్యత్తులో ప్రతిపక్షాలు ఆరోపణలు చేయకుండా ఉండడానికే మోదీ ఇవన్నీ చేశారు. ఈ మధ్యలో సర్జికల్ స్ట్రైక్‌తో పాక్ సైన్యంపై భారత్‌దే పైచేయి అని చెప్పారు. దౌత్యపరంగా పాకిస్తాన్‌పై పెద్ద విజయమే సాధించారు.
నాలుగు రోజుల క్రితం లక్నోలో సాధుసంతులు నృత్యగోపాల్ దాస్ మహంత్ జయంతి ఉత్సవం జరిపి అందులో రామ మందిర నిర్మాణ ఉద్యమం గురించి మోదీ ప్రస్తావించారు. అతిథిగా వచ్చిన యోగి ఆదిత్యనాథ్ మనం రాజ్యాంగ సంస్థలను గౌరవించాలని చెప్పారు. నిజానికి మోదీ ప్రభుత్వం డా.సుబ్రహ్మణ్యస్వామి ద్వారా సుప్రీం కోర్టులో అయోధ్య కేసును ముందుకు తెచ్చే ప్రయత్నం చేసింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నిజాయితీపరుడైన, నిఖార్సయిన వ్యక్తని అందరికీ తెలుసు. ఆయన ఈ ఏడాది చివర్లో పదవీ విరమణ చేయబోతున్నాడు. కాబట్టి సుబ్రహ్మణ్యస్వామి అయోధ్య కేసును ఈయనతో పరిష్కరించాలని ఆశించారు. కానీ కాంగ్రెస్ ఇతర సూడో సెక్యులర్ పార్టీలు దీపక్ మిశ్రాపై అభిశంసన తీర్మానం పెడితే ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు అయోధ్య అంశం కూడా కీలకం కాబోతున్నది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ట్రిపుల్ తలాక్ బిల్లు చర్చకు రాబోతున్నది. దానికి అనుబంధంగా ఉమ్మడి పౌర స్మృతిపై దేశమంతా పరోక్ష చర్చ జరగవచ్చు. ఇలా అనేక అంశాలు ఎన్నిక వేళ సందడి చేయనున్నాయి.
మరోవైపు ప్రతిపక్షాలన్నీ ఒకవైపు, భాజపా ఒక్కటే మరోవైపు కదనరంగంలోకి దూకనున్నాయి. బెంగాల్‌లో సిపిఎం-తృణమూల్, కేరళలో సిపిఎం- కాంగ్రెస్, ఏపిలో టిడిపి-కాంగ్రెస్, యూపిలో ఎస్పీ-బిఎస్పీ-కాంగ్రెస్ వంటి పార్టీల తీరుతెన్నులపై ఎన్నికల ఫలితాలుంటాయి. వీళ్లంతా విడిగా ఎన్నికల్లో కొట్లాడి మొన్న కర్ణాటకలో ఏకమైనట్లు ఏకమవుతారా? లేదా? అన్నది చూడాలి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఆ పార్టీలో చెప్పుకోదగిన మార్పు ఏమీ లేదు. మోదీ విదేశీ విధానంలో దూసుకుపోతూ నిజాయితీ విషయంలో ఉన్నత స్థాయిలో ఉన్నారు. కానీ పెద్దనోట్ల రద్దు, పెట్రో ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అవగాహన కల్పించి ఏటిఎంలను సరిచేయాలి. లేదంటే ఎన్నికల వేళ బ్యాంక్ ఉద్యోగుల సంఘాల వాళ్లతో కలిపి కుట్ర జరిగే అవకాశం వుంది. ఎన్నికల కోడ్ వస్తే బ్యాంకర్లను నియంత్రించడం కేంద్రానికి కష్టంగా ఉంటుంది. జిఎస్టీ వల్ల పెరిగిన ఆదాయాన్ని పేదల కోసం ఎలా ఖర్చుపెడుతున్నారో వివరించాలి. హద్దులుమీరిన ఆర్థిక క్రమశిక్షణ పాటించి సామాన్యులకు ఇబ్బంది కల్గించవద్దు అనే సూత్రం తక్షణ కర్తవ్యంగా చేపట్టాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో భాజపా ఆత్మరక్షణలో పడకుండా వ్యూహం రచించాలి. టిడిపిని ఆత్మరక్షణలో పడేస్తేనే అక్కడి చీకటి మబ్బులు తొలగిపోతాయి.
ఇక ఏపీలో ఈసారి చంద్రబాబు గెలుపు నల్లేరుమీద నడకేం కాదు. మోదీని, భాజపాను ఏపి ప్రజల ముందు చంద్రబాబు విలన్‌గా నిలబెట్టడంలో ఈ మూడు నెలల్లో సక్సెస్ అయ్యాడు. పాదయాత్ర చేస్తున్న వై.ఎస్.జగన్ పట్ల జనంలో ఇమేజ్ పెరుగుతోంది. భాజపాలోని అదృశ్య శక్తులను ప్రక్కనబెట్టి, పనిచేసే వాళ్లకు స్వేచ్ఛ ఇస్తే చంద్రబాబుకు నిద్ర లేకుండా చేస్తారు. ఇప్పటికీ భాజపాలోని ఒక వర్గం నిశ్శబ్ద వౌనం పాటిస్తూ చంద్రబాబు విషయంలో వినయం ప్రదర్శిస్తోంది. పెద్దనోట్ల రద్దు సలహా తానే ఇచ్చానని చెప్పిన బాబు ఇపుడు నోట్లరద్దు తప్పుడు నిర్ణయం అంటున్నాడు. ప్రత్యేక ప్యాకేజీని మించిన స్వర్గం లేదన్న వ్యక్తి మళ్లీ ఏపీకి ప్రత్యేక హోదా కావాలి అంటున్నాడు. ఈ ద్వంద్వ వైఖరి ప్రజలకు అర్థం కావాలి.
ఏపీలో చంద్రబాబు, భాజపా కలిసి ఉన్నంతవరకు కమ్యూనిస్టులు ఉద్యమాలు చేశారు. ఇపుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో కలిసి చంద్రబాబు గెలుపుకోసం శల్య సారథ్యం మొదలుపెట్టారు. ఏపీలో పనిలేని బి.వి.రాఘవులు, నారాయణ తెలంగాణలో కెసిఆర్‌ను రెచ్చగొడుతున్నారు. ఎంతసేపూ అమరావతి నిర్మాణం అనే బూచిని తలకు ఎత్తుకున్న చంద్రబాబు ఉత్తరాంధ్రను, రాయలసీమను నిర్లక్ష్యం చేస్తున్నారని జనం భావిస్తున్నారు. అందుకే ఇటీవల పవన్ ఉత్తరాంధ్రలో పర్యటిస్తే స్పందన బాగా ఉందని తెలిసాకే టిడిపి అతనిపై ఎదురుదాడికి దిగింది. విశేషం ఏమిటంటే పవన్‌కళ్యాణ్, కోదండరాం- ఇద్దరూ తమ పార్టీలను కమ్యూనిస్టు ఛాయల్లో నడుపుతున్నారు. కాబట్టి వీరిద్దరూ భవిష్యత్తులో ‘కాగితం పులులే’! ఆ నీడలోంచి బయటకొస్తే తప్ప పార్టీగా ఎస్టాబ్లిష్ కాలేరు. జస్టిస్ పార్టీ ‘అవశేషాలు’గా ఉన్నవారు ఏపీ కమ్యూనిస్టు పార్టీల్లో పెత్తనం చేస్తున్నారు. వారికి చంద్రబాబు అధికారంలో ఉండడమే కావాలి! ఈ జస్టిస్ పార్టీ ‘అవశేషం’ భాజపాలోనూ గుప్తంగా పనిచేస్తుంది. ఇన్నాళ్లు భాజపా ఎదగకపోవడానికి అదే కారణం అని విశే్లషకుల అంచనా. మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీలు క్రొత్త ఆలోచనలతో వేడిని పుట్టిస్తాయి. దాని వెనుక ఉన్న పరమార్థాలను ప్రజలు గ్రహించకపోతే పాత సారాను కొత్త సీసాలో పోయడమే!
***********************************************
డాక్టర్. పి. భాస్కర యోగి
Published : Andhrabhoomi
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి