"ఆచార్యాత్ పాదమాదత్తే పాదం
శిష్య స్వమేధయా!
పాదం సబ్రహ్మచారిభ్యః పాదం
కాలక్రమేణచ"

ఆచార్యునివల్ల ఒక పాదం (భాగం) స్వంత మేధతో ఒక పాదం (భాగం) ఒక పాదం (భాగం) తన తోటివారివల్ల, ఇంకో పాదం (భాగం) కాలక్రమంలో నేర్చుకొంటారని ఈ శ్లోకార్థం.
పూర్వీకులు ‘విద్యాభ్యాసం’ గురించి చెప్పిన శ్లోకం. 

శిష్యుడు ఆచార్యుని ద్వారా ఒక భాగం మాత్రమే నేర్చుకొంటాడు. 

అధ్యాపకుడు / గురువు ఎంత చెప్పినా విద్యార్థికి మొత్తంమీద ఆ చెప్పిన దాంట్లో ఒక భాగం మాత్రమే అందుతుంది. 

గురువు ఎంతో ప్రతిభ గలవాడైతే తప్ప ఇంకొంచెం ఎక్కువ విద్యార్థికి అందే అవకాశం ఉంది. 

అలా ఎక్కువ అందించగలిగితే గురువులోని ‘అసమాన ప్రతిభే’ కారణం అవుతుంది.

పూర్వం నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాల్లోకి విద్యార్థి వస్తే వెంటనే చేర్చుకునేవారు కాదట. 

కొన్ని నెలలపాటు ఆ విద్యార్థి ప్రధాన ద్వారం దగ్గరే నిలబడేవాడు. 

ఆచార్యులు లోపలికి వెళ్తూ, బయటకు వస్తూ విద్యార్థి శ్రద్ధను గమనించి విద్యాలయంలో చేర్చుకునేవారట. 

ఆ చేర్చుకొన్నవారికి సంవత్సరాల తరబడి ఒకే పని చెప్పేవారట. 

ఉదాహరణకు ఒక విద్యర్థి వ్యాయామ విద్యలో చేరాడంటే ఓ రెండు సంవత్సరాల పాటు బావిలో నీళ్లు చేదడానికో, ఊడ్చడానికో ఉపయోగించేవారట. తద్వారా వాడి శరీరం ఆ వ్యాయామ విద్యకు సిద్ధమవుతుంది. పైకి చూస్తే వాడికి పని చెప్పినట్టు కనిపిస్తుంది. కాని గురువులు భవిష్యత్‌లో నేర్చుకోబోయే విద్యకు సిద్ధం చేసేవారు. సరే! గురువు ఎన్ని చెప్పినా ఒక భాగం మాత్రమే శిష్యుడు నేర్చుకొంటాడు.

ఇంకో భాగం శిష్యుడు తన స్వంత మేధతో నేర్చుకొంటాడు. తాను లోకంలో ఎన్నో చూస్తాడు. గురువుల ద్వారా గ్రంథ పఠనం ద్వారా ఇతరుల ద్వారా ఎన్నో గ్రహిస్తాడు. అనుభవాల ద్వారా ఇంకొన్ని గ్రహిస్తాడు. ఇలా తాను అనేక విధాలుగా సంపాదించిన జ్ఞానాన్ని స్వంత మేధతో, వివేచనతో విశే్లషిస్తాడు. అందులోని సారాన్ని గ్రహిస్తాడు. ఇక్కడ తన వివేచన పనిచేస్తుంది. వివేకం అక్కరకు వస్తుంది. అలాగే తన తోటివారివల్ల అంటే తనతోపాటు చదువుకొనేవారివల్ల కొంత జ్ఞానాన్ని సంపాదిస్తాడు. తాను నిత్యం వారితో మాట్లాడే మాటల్లో, చర్చల్లో, అనుభవాల్లో తనకు కావలసిన విషయాన్ని వెతుక్కుంటాడు. అలా తనకు కావలసిన విషయాన్ని ఒక భాగం తోటివారివల్ల నేర్చుకొంటాడు.

 చివరిగా ఇంకో భాగం కాలక్రమంలో నేర్చుకొంటాడు. గురువు తల్లిదండ్రులు, తోటి స్నేహితులు తన విచణక్షతో తాను నేర్చుకొన్న అనుభవాల్ని రంగరించి కాలక్రమంగా ఇంకొంత నేర్చుకొంటాడు.

*************************************************
✍ డాక్టర్‌. పి. భాస్కర యోగి
ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి