"ఆత్మశుధ్ధి లేని ఆచారమది యేల
భాండశుద్ధి లేని పాకమేల
చిత్తశుద్ధి లేని శివపూజలేలరా!
విశ్వదాభిరామ వినురవేమ!"
అని వేమన ఏ ముహూర్తంలో అన్నాడు కాని, మనం తు.చ తప్పకుండా చిత్తశుద్ధిలేని పూజలే చేస్తున్నాం అనిపిస్తుంది.
-ఏదో కొన్ని తప్పులో, పాపాలో చేసేసి వాటికి విరుగుడుగా ఓసారి గుడికి వెళ్తే చాలు అనుకొనేవారు కొందరు.
- అపరిమితమైన కోర్కెలు కోరుకొని, వాటిని నెరవేరిస్తే లాభంలో పావువంతు దేవునికిద్దామని గుడికెళ్ళే బాపతు ఇంకొందరు.
- ఇంట్లో ఉంటే మనశ్శాంతి లేదు. అలా గుడికెళ్తే నలుగురితోపాటు నారాయణ, అందరితోపాటు గోవింద కొట్టొచ్చని గుడికెళ్ళేవారు మరికొందరు.
- వారానికొక్కసారైనా గుడికి వెళ్లాలనే ధర్మనిష్ఠగలవారు కొందరు.
- కొత్త కోర్కెలు కోరేవారు - పాత కోర్కెలు తీరాక నైవేద్యం సమర్పించేవారు.
ఇలా దేవాలయాలకు వెళ్ళేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కానీ దేవాలయ దర్శనం అంతరార్థం తెలుసుకోరు. ఎలా దేవాలయ దర్శనం చెయ్యాలో ఆలోచించరు.
మ్రొక్కుబడిగా మ్రొక్కుకొని వస్తున్నారు. అక్కడే మన చిత్తశుద్ధి చెత్తగా మారిపోతుంది. దానికితోడు దేవాలయాల వ్యాపారీకరణ- అది దేవాదాయ శాఖ కావచ్చు.
ఎవరో గుంపు కలిసి కట్టిన ఆలయం కావచ్చు. అంతటా వ్యాపార ధోరణే. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే మనదంతా యాంత్రిక యంత్ర దర్శనమే అవుతుందనేది నిజం!
దేవుణ్ణి దర్శించటానికి స్నానం చేసి, వారి వారి సంప్రదాయానుసారం తిలకధారణచేసి, మొదట క్షేత్ర పాలకుణ్ణి దర్శించాలి.
పుష్పాలు, నారికేళం, కర్పూరం- ఇతర పూజాద్రవ్యాలు తీసుకొని భగవన్నామ జపంతో ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించాలి.
సింహద్వారానికి నమస్కరించి, లోపలికి వెళ్లి ధ్వజస్తంభాన్ని దర్శించాలి. ధ్వజస్తంభాన్ని ఆనుకొని ఉన్న బలిపీఠాన్ని దర్శించి, మనలోని పశుత్వాన్ని బలిచేసుకున్నట్లు భావించాలి.
దేవుని ముందు సాష్టాంగ ప్రణామం చేసి, ఆలయ ప్రాంగణంలోని తిలకం, గంధం, విభూతి- ఏదైనా ధరించాలి. ఘంటానాదంతో దేవుణ్ణి ప్రసన్నం చేసుకొని మహామంటప, అర్ధమంటప, ముఖ మంటపాలను దాటి దేవుని సన్నిధికి చేరాలి.
దైవసన్నిధిలోని అఖండ దీపం వెలుగులో జ్ఞాన తత్త్వమూర్తిని దర్శించాలి. కర్పూర నీరాజన దీపాన్ని కళ్లకు అద్దుకోవాలి. ఆ కర్పూర హారతిలో మనలోని విషయ వాంఛలను భస్మం చేయాలి. కొబ్బరికాయను సమర్పించి, శఠారి తీసుకోవాలి.
సుగంధ పరిమళాల మధ్య అఖండ దీపం వెలుగుల మధ్య పుష్ప, వస్త్ర అలంకరణచేత అలంకరింపబడ్డ దేవతా స్వరూపాన్ని దర్శించి, రూపాన్ని అంతరాత్మలో నిలుపుకోవాలి.
*********************************************
✍ డాక్టర్. పి. భాస్కర యోగి
ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి