‘‘ఏకోధేవ కేశోవోవా శివోవా, ఏకోవాస పట్టణంవావనంవా
ఏకోమిత్ర భూపతిర్వా యతిర్వా ఏకనారీ సుందరీవా దరీవా"

తా విష్ణువైనా, శివుడైనా ఒక్కడే దేవుడని నమ్మాలి. పట్టణమైనా, వనమైనా ఒక్కటే నివాసయోగ్యంగా భావించాలి. రాజుతోనైనా, సన్యాసితోనైనా స్నేహం చేయాలి. సౌందర్యంగల భార్యతో కూడినాగాని అవసరమైనపుడు గుహలో కూడా నివసించగలగాలి.

ఈ శ్లోకం ఎక్కడిదోగాని నీతి శాస్త్రంలో చెప్పబడింది. పూర్వం శైవ, వైష్ణవ భేదం చాలామందిలో ఉండేది. కర్ణాటకలో పుట్టిన వీరశైవం, తమిళ దేశంలో పుట్టిన వీరవైష్ణవం, కొట్టుక చచ్చింది మాత్రం తెలుగు ప్రాంతంలో! ఎందుకు మనకు ఈ పిచ్చి!

"శివాయ విష్ణురూపాయ శివరూపాయే విష్ణవే
శివస్య హృదయం విష్ణుర్విష్ణోహృదయం శివః"

శివుని రూపమే విష్ణువు- విష్ణువు రూపమే శివుడు. శివుని హృదయమే విష్ణువు. విష్ణువు హృదయమే శివుడని స్కంధోపనిషత్తు తెలియజేస్తుంది. ఆ రెండు తత్త్వాలు రెండు వేర్వేరు కార్యక్రమాలకు నియమించబడ్డ సస్వరూపాలు. ఏకమూర్తి త్రయోభాగః బ్రహ్మవిష్ణు మహేశ్వరః- ఒకే మూర్తి బ్రహ్మ, విష్ణువు, మహేశ్వర- స్వరూపాలుగా విడిపోయి ఈ సృష్టి కార్యక్రమ నిర్వహణ చేస్తున్నట్లు తెలుస్తున్నది.

శ్రీ శంకర పీఠాధిపతులు అసుర సంధ్యవేళ చంద్రవౌళీశ్వర స్వామిని, శ్రీ చక్రాన్ని అర్చించి, ‘నారాయణా, నారాయణా’ అని నామోచ్ఛారణ చేస్తారు. శివకేశవులకు భేదం పాటించరు. తిక్కన మహాకవి ఈ శివకేశవ భేద భావం తొలగించానికి హరిహరాద్వైతం అనే గొప్ప ప్రతిపాదన చేశారు.

"హరిశంకరయోర్మధ్యే బ్రహ్మణశ్చా పియోనరః
భేదకృన్నరకం భక్తే యావదాచంద్రతారకమ్"

శ్రీమన్నారాయణుని గాని, శ్రీ పరమేశ్వరునిగాని, శ్రీ బ్రహ్మదేవునిగాని భేదభావంతో చూసేవాళ్లు చంద్ర నక్షత్రాలున్నంతవరకు నరకం అనుభవిస్తారని శాస్త్రాలే చెబుతున్నాయి. కాబట్టి ఈ భేదభావం పాటించడం అసంబద్ధమని శాస్తక్రారుడు చెబుతున్నాడు.


*******************************************
*✍ డాక్టర్‌. పి. భాస్కర యోగి*
*ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ*


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి